18, నవంబర్ 2021, గురువారం
రెక్కలు
1. సాహిత్యం
అందరిది
రాహిత్యం
కొందరిదే
అనుభవసారమే
జీవితం..!!
2. బాధ
భరించాలి
దిగమింగడం
అలవాటు చేసుకుంటూ
బంధం
భారమని అనుకోలేం కదా..!!
3. వంకర నవ్వులు
సంకర బుద్ధులు
వెకిలి చేష్టలు
అనాగరిక భాష
ఇదే ఈనాటి
రాజకీయ అసెంబ్లీ..!!
4. ఆత్మీయత
అనుబంధానిది
అవసరం
అధములది
ఊరటనిచ్చేది
అక్షరాలేగా..!!
5. అనుభూతులన్నీ
మనసువే
భావాల పరంపర
అక్షరాలకు కరతలామలకమే
అతిశయాల అనుభవాల
సమ్మిళితమే జీవితం..!!
6. కాలం ఎప్పుడూ తన పని
తాను చేసుకుపోతుంటుంది
ఓడలు బళ్లు బళ్లు ఓడలు
అవుతుంటాయి
నిరంతర ప్రక్రియను
ఆపడం మన తరమా..!!
7. అలసిన మనసులకు
ఆశల హరివిల్లు
వెంబడించే బంధాలకు
మమతల పొదరిల్లు
పదిలంగా పొదుపుని
మోసే కుటుంబకావడి..!!
8. గమ్యం
తెలుసు
గమనం
సాగదు
సగటు మనిషి
సందిగ్ధజీవనం వాదనలోనే..!!
9. ఆలోచనలు
అనంతాలు
ఆచరణలు
అరకొరలు
వేదనను మిగిల్చిన
వాదనదే పై చేయి..!!
10. ఎడతెగని
గిల్లిగజ్జాలు
ఏమరుపాటున
ఏకాంతాలు
జీవిత రాదారిలో
రచ్చబండ పంచాయితీలు..!!
11. మనసెరుగని
మమత లేదు
మనిషికి తెలియని
మాయ లేదు
కలియుగ ధర్మమిది
కలికాలంలో..!!
12. మనసుల మధ్యన
అంతరం
మనుష్యుల నడుమ
బంధం
ఏ రెండిళ్ళకయినా
దూరమెుకటే..!!
13. అర్థమయిన
చేతలు
అడ్డు తొలగించనలవి కాని
అపార్థాలు
అహం ముడిబడిన
అడ్డదిడ్డమైన గీతలు..!!
14. బంధమంటే
బాధ్యత పంచుకునేది
ఇష్టమంటే
నిన్ను నిన్నుగా చూసేది
తొలి మలి అడుగులకు మధ్యన
మంజీరపు మంజూషాలు..!!
15. ఆభరణాలు
అందమే
నోటి మాట
మనసుదైనప్పుడు
సహజత్వం
అరుదైన వ్యక్తిత్వం..!!
16. బాధలు
బారెడు
ఆశలు
ఆకాశమంత
తూకం తేలని లెక్కలే
జీవితమంటే..!!
17. శూన్యానికి
చుట్టం
అంబరానికి
అందం
మబ్బుల్లో మసక వెలుతురు
జీవితపు సుఖసంతోషాలు..!!
18. వెతల కుంపటి
వాడుకోవాలి
చలిని
కాచుకోవడానికి
అవకాశాలను
అందిపుచ్చుకోవాలి గెలవాలంటే..!!
19. రెక్కల వంతెన
పరిచుంది
రెప్పల తేరుపై
కలల పయనానికి
నిద్రావస్థ
మనోవిహంగం..!!
20. మరలిన కాలం
మళ్లీ రాదు
చెదిరిన మనసు
కుదురుకోదు
జీవిత పుస్తకంలో
ఖాళీ పేజీలుండవు..!!
21. శూన్యంలో
అన్వేషణ మెుదలు
యుద్ధానికి
సిద్దమైన మనసుతో
మనిషి ఆరాటం ఎందుకన్న
ప్రశ్నకి అంకురం వెదుకుతూ..!!
22. వెలుతురుకై
వెతుకులాట
చీకటి చుట్టానికి
అక్షరాల తోవ చూపిస్తూ
మనసు
నిరంతరాన్వేషి..!!
23. కల(ల)వరాలన్నీ
కలబోసుకున్నాయి
మరలిన కాలాన్ని
మార్చలేమంటూ
మౌనం గమ్యానికి
మార్గాన్ని చూపెడుతుందొక్కోసారి..!!
24. ఇరుకున పడినవి
బంధాలు
ఇబ్బంది పెడుతున్నది
మనుష్యులు
సమాజ జీవనం
సహజ పంక్తి భోజనం..!!
25. బరువైనా భారమైనా
భరించాల్సిందే
బడబానలం
మదిని చుట్టుమట్టినప్పుడు
జీవితపు నిఘంటువుకి
సాటిరావేవి..!!
26. వెతుకులాట
తప్పనిసరి
ప్రయోజనం లేదని
తెలిసినా
ప్రాయోజితం
కొందరికని తెలుసు..!!
27. ఏకాకి జీవితానికి
నిర్వచనం
జగమంత కుటుంబానికి
అక్షర దర్పణం
గగనాన మెరిసిన
సినీవాలి..!!
28. రాయికి చూడచక్కని
రూపాన్నైతే ఇవ్వగలం
లేని మనసుని
ఆపాదించలేం
వింతైన పోకడలు
మనిషికే సొంతం..!!
29. గర్భగుడికి
గర్భస్థానానికి పొంతన
రాతికి
మనిషికి వున్న అనుబంధం
మనసుదే ప్రధమస్థానం
నమ్మకంలో…!!
30. ముంచాలనుకుంటే
ముంచగలమా
లేపాలనుకుంటే
లేపగలమా
ఎత్తుపల్లాలు వైపరీత్యాలు
ప్రకృతి సహజాలు..!!
వర్గము
రెక్కలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి