5, నవంబర్ 2021, శుక్రవారం

రెక్కలు

1.  వెతలు
అందరివి
వెలుతురు
కొందరిదే

జీవితపు
తీరుతెన్నులంతే..!!

2.   వెలుతురు కాగితాలపై
పువ్వుల తారలు
కలల చిత్రాలకు
కన్నీటి మరకలు

నిజాల ఛాయలకు
చీకటి సంతకాలు..!!

3.   చేవ్రాలు
చెరిగిపోతుంది
గతాన్ని
కాలం దాచేస్తుంది

మారని రాత
మరకగానో మెరుపుగానో మిగిలిపోతుంది..!!

4.   వెలుగు రవ్వల
కాగితపు పువ్వులు
కన్నీటి గువ్వలు
కనుల నిండుగా

మెుండి ధైర్యం
మనసుది..!!

5.  గాయం
పాతదే
గమనమే
కొత్తది

మనసుకి లేపనం
మనసాక్షరాలే..!!

6.   తప్పని
పయనం
ఆగని
కాలం

నిన్నానేడులకు
అనుసంధానంగా రేపంటూ..!!

7.   చీకటి 
సంతకానికి
వెన్నెల
రాయితీలు

అప్పుడప్పుడు ఆకాశంలో
మెరిసే నక్షత్రాలు..!!

8.  ఊహ 
వాస్తవమైతే సంతోషం
అబద్ధం
నిజమైతే దుఃఖం

గెలవడంలో
నిజాయితీ ముఖ్యం..!!

9.   ఊహలు
అపరిమితం
అనుభవాలు
యదార్థం

నిర్థిష్ట పరిమితినెరిగినదే
జీవితం..!!

10.   అంగీకరించడం
ఆక్షేపించడం
మనిషి
నడవడిని బట్టి

మంచి చెడు విశ్లేషణ
మనసు కెరుక..!!

11.  కథలన్నీ
గతానివే
కథనాలన్నీ
నిదర్శనాలే

వెంబడించేది
వాస్తవమే..!!

12.  ప్రతికూలత
నువ్వేంటో నీకు చెప్తుంది
అనుకూలత
అందరు నీవాళ్ళేనంటుంది

అవసరం
అయినవారెవరో తెలుపుతుంది..!!

13.  తలపుకు రాని
క్షణాలెక్కడా
తలంపులన్నీ
జ్ఞాపకాలైతే

అక్షరాలకూ అక్కరే
చరితగా కాకున్నా చెంతనేనని..!!

14.  పలకరింపు లేకున్నా
పరిచయమే 
అక్షరం కలిపిన
అనుబంధం

ఏ బంధం ఎందుకన్నది
విధి నిర్ణయం..!!

15.   మెలకువలో
కల
నిదురలో
కల’వరం

సేద దీర్చే
సుషుప్తావస్థ..!!

16.  మాటలు 
నేర్చాయి
మనసులను
ముక్కలు చేస్తూ

కపటమెరుగని ప్రేమలను
గాలికొదిలేస్తూ..!!

17.  ఆత్మీయతకై
పరితపించింది
అనుభవరాహిత్యం
శాపమైంది

ఓ తార
మధ్యలోనే రాలిపోయింది..!!

18.   ప్రేమ మైకం
గెలిచింది
బంధానికి
కట్టుబడింది

తారాపథం
తాత్కాలికమైపోయింది..!!

19.   ముసుగులు
తప్పని జీవితాలు
వెలుతురులో
కనబడలేక

ఎదుటివారి బలహీనతే
వజ్రాయుధం..!!

20.   కనుమాయ
కనబడదు
మనసు మాట
వినబడదు

నిజానిజాలు
నిలకడ మీద తెలుస్తాయి..!!

21.   కొరుకుడు పడని
మనస్తత్వాలు కొన్ని
కలుపుకుపోయే 
బంధాలు ఇంకొన్ని

కాలం నడకలో
శాశ్వతం కాదేవి..!!

22.   కొలమానంతో
కొలవగలమా
అభిమానాన్ని
లెక్కల తక్కెడలో

బంధం భారం
మనసు మాలిమిదే..!!

23.  ఎదురుదెబ్బలు
పరిపాటే
ఆత్మాభిమానం
పెట్టనికోట

చివరికి మిగిలేదేంటో
తెలిపేది కాలమే..!!

24.   అవధి లేనిది
అనంతమైనది
మనసెరిగిన
మమకారం

లోతుపాతులెరగని
అనుబంధమది..!!

25.   పంపకాల
తేడాలు
అంపశయ్యల
అంపకాలు

ఓ గొడ్డలి
గుండెపోటు..!!

26.   ఇచ్చట
లెక్కలు సరిచేయబడును
అచ్చట
అవసరాలు తీర్చబడును

ఏ బంధమైనా ఒకటే
పీఠాన్ని ఎక్కడానికి..!!

27.   నటించే
అనుబంధాలే అన్నీ
నాటకాలను
కనిపెట్టనంత వరకు

చరమాంకానికి
తెర తీయనంత కాలం..!!

28.   ఆలి
అడ్డు
అక్రమం
ముద్దు

ప్రశ్నిస్తే
మగ అహంకారం నిద్ర లేవడం..!!

29.   గూడు చెదిరినా
గుండె దిటవు చేసుకోవాలి
అలసట తీరే
మార్గం తెలుసుకోవాలి

నిర్ణయం నీదైనప్పుడు
గమనం సుళువే..!!

30.   బాధ్యతలు
అందరివి
బంధాలు 
పంచుకునేది కొన్నే

విలువ తెలియని
బతుకులు..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner