అక్షర విహంగాలు-జీవన సత్యాలు
ఆమె మనసు ఎల్లప్పుడూ ఉవ్వెత్తున
ఎగసిపడే ఓ భావతరంగం..
ఆమె ఓ అక్షర తపస్విని..
ఆమె అక్షర సహవాసం చేస్తూ
భావాల పంట పండిస్తూ
మనకు అద్భుతమైన జీవన సత్యాలను అందిస్తుంటారు.
ఉన్నత చదువులు చదివి, తెలుగు భాష గొప్ప దనాన్ని
నలుదిశలా వ్యాపింపచేయడానికి నిత్యం వాడుక భాషలో
ఉన్న పదాలతోనే కొత్త కొత్త ప్రయోగాలతో ఎన్నో మంచి
రచనలు చేస్తూ తెలుగు భాషకు ఎనలేని సేవలు చేస్తున్నారు.
ప్రస్తుతం రెక్కలు అనే మరో ప్రక్రియలో "అక్షర విహంగాలు"
సంపుటిని ముద్రింపచేశారు.వారి పదాలు అక్షర తూటాలు, సున్నితంగా
మనసుని కోసేస్తూ అంతర్లీనంగా నిక్షిప్తమౌతాయి.ఉన్నదున్నట్లు చెప్పే
ముక్కు సూటితత్వం,నిక్కచ్చితనం వారి రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
1.గొప్పోళ్ళందరూ
మనకి తెలుసు
మనమెంత మందికి
తెలుసో మరి
మాటలు కోటలు దాటడం
నిజమేగా..!!
2.ఘనత
ఎవరిదైనా
గొప్పతనం
నాదే
వదిలేసిన విలువలే
ఘనకార్యాలిప్పుడు..!!
నిజమైన సాహిత్యం గూర్చి వారు రాసిన అద్భుతమైన రెక్కలు
1.క్లిష్టమైన
పదాలు అందమేమో
వాడుక భాష
వద్దకు చేరుతుంది త్వరగా
అక్షరం అక్కరకు రావడమే
నిజమైన సాహిత్యం..!!
2.భాష
సహకరిస్తుంది
అక్షరం
అల్లుకుంటుంది
జనిస్తుంది
సుస్వరాల సాహిత్యం..!!
అక్షరాలపై వారికున్న మమకారం తెలిపే రెక్కలు..
1.అపహాస్యాలు
వినబడినా
అవరోధాలు
వెన్నంటినా
వెరవని మొండి తనం
ఈ అక్షరాలది..!!
2.రాయడం తెలియని
కలము కాదు
అమరికనెరుగని
అక్షరాలు కావు
మనసును సాంత్వన పరిచే
మనో విహంగాలివి..!!
అక్షరాలతోనే వారి సాన్నిహిత్యం, సహవాసం.అక్షరాలే వారి నేస్తాలని
మనకు చెప్పకనే చెప్పే రెక్కలు.
1.జ్ఞాపకాలే
జీవితం
అక్షరాలే
సన్మిత్రులు
శూన్యంతో సహవాసమైనా
మదినిండా సంతోషమే..!!
2.జీవితం
ఇమిడి పోయింది
అక్షరంతో
సహవాసం చేస్తూ
సన్నిహితమే
ఏ అనుబంధమైనా..!!
బంధాలు అనుబంధాల గూర్చి,అనురాగాలు ఆత్మీయతలు,గూర్చి
మమకారాలు మాధుర్యాల గూర్చి, కనుమరుగౌతున్న బాధ్యతల పై,సమాజంలో పెచ్చు మీరుతున్న హింస,అవినీతి ఇలా ప్రతి ఒక్క అంశంపై ఎక్కుపెట్టి వదిలిన బాణాలెన్నో
సూటిగా గుచ్చుకుని ఎవరికి వారిని భుజాలు తడముకునేలా చేస్తాయి.
ఇలా ఎన్నో ఎన్నెన్నో భావాల అల్లికలు వారి రచనల నిండా. అందుకే వారి రచనలు
తప్పక చదివి తీరవలసిందే.
ఇంతకీ ఇంత అద్భుతమైన రచయిత్రి ఎవరో చెప్పలేదు కదా.
ఇంకెవరండీ మనందరికీ ఆత్మీయురాలు శ్రీమతి మంజు యనమదల గారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అవడానికి ఇద్దరం దివిసీమ బిడ్డలమైనా
మా పరిచయం మాత్రం ఓ విచిత్రమే.మాటా మంతీ భయంతో మొదలైనా
తొందరగానే ఆత్మీయ తీరం చేరిందనే చెప్పాలి.
వారి రచనల నిత్య పఠన ప్రభావంతో ఏక్తారలు
అనే ప్రక్రియను నేనూ రాయడం నేర్చుకున్నాను.
వారి రచనా విధానం చాలా పొందికగా చదువరులకు ఇట్టే
అర్థం అయ్యే రీతిలో ఎంతో భావయుక్తంగా,సందేశాత్మకంగా ఉంటాయి.
వారి రచనల గూర్చి రాయడమంటే నేను చేసిన అతి పెద్ద సాహసమనే
చెప్పాలి.నేను చేసిన ఈ సాహసాన్ని మీరూ చదివి సాహిత్యం పట్ల అందరూ
మక్కువ చూపుతారని ఆశిస్తూ మంజుగారి "అక్షర విహంగాలు"పుస్తకావిష్కరణకై ఎదురుచూద్దాం.
మంజూ మీ నుంచి మరిన్ని మంచి సందేశాత్మక రచనలను ఆశిస్తూ..
ఆత్మీయ నేస్తానికి
భావాల రాక్షసికి (ప్రేమతో)
శుభాభినందనలు మరియు శుభాకాంక్షలతో
@పద్మజ సబ్బినేని@
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి