23, ఏప్రిల్ 2022, శనివారం

గుర్తుకొస్తున్నాయి పుస్తక సమీక్ష..!!

మా ప్రసాద్ బాబాయ్ పుస్తకం “ గుర్తుకొస్తున్నాయి ” ఆవిష్కరణ సందర్భంగా నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు రాసుకున్నా. కాని అక్కడ అప్పటికి అనిపించిన మాటలే చెప్పేసాను…నేను మాట్లాడటం చాలా తక్కువ. సాగర్ శ్రీరామ కవచం అంకుల్ యాతన పుస్తకానికి, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంకుల్ వాకిలి తెరవని వాన పుస్తకానికి నాలుగు మాటలు మాట్లాడాను. పుస్తక సమీక్ష చేయడం ఇదే మెుదటిసారి…

నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు ఇక్కడ మీ అందరి కోసం…

సభకు నమస్కారం.

ముఖ పుస్తకం ఎవరెవరికి ఏమేమి చేస్తోందో నాకు తెలియదు కాని నా వరకు నాకు ఎందరినో ఆత్మీయులను, ఆత్మబంధువులను ఇచ్చింది. అలాంటి ఆత్మబంధువులలో ఒకరు మా డాక్టర్ ప్రసాద్ బాబాయి. నా రాతలను సదా ప్రోత్సహిస్తూనే వుంటారు. వారి పుస్తకాన్ని సమీక్షించడం నా శక్తికి మించిన పనే. అయినా శ్రీమతి రావి శారద గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇలా మీ అందరి ముందుకు వచ్చాను.


“ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం గురించి నాలుగు మాటలు…..

       శూన్యంతో సహవాసమూ మంచిదే అని చెప్పడానికి ఓ గొప్ప సాక్ష్యమే డాక్టర్ డి ప్రసాద్ గారు రాసిన “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం. 

182 పేజీలతో 101 భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం గురించి చెప్పడానికి నాకున్న అర్హత సరిపోదు, కాని ఈ పుస్తకాన్ని చాలాసార్లు చదివిన అనుభవంతో ఓ నాలుగు మాటలు మీ అందరితో చెప్పాలనే ఈ చిన్న ప్రయత్నం. 

అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్తమమైనదని మన పెద్దలు చెప్పిన మాట. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనం మన డాక్టర్ ప్రసాద్ గారు. తన చిన్నతనం నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో రాసారు. 

     ప్రతి మనిషికి మంచో చెడో ఏదైనా కానివ్వండి జ్ఞాపకాలన్నవి సహజమే. కొందరు వాటిని అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు ఏదోక సమయంలో నలుగురితో చెప్పేస్తారు. ఆ ఒకానొక సమయమే కరోనా రూపంలో ప్రసాద్ గారితో శూన్యంతో స్నేహం చేయించి, పాత కాలంనాటి మనకు తెలియని ఎన్నో సంఘటనలను మన కళ్ళ ముందుంచింది “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకంగా.

     నిదురలో తాతయ్య కలతో మెుదలైన చిన్ననాటి జ్ఞాపకాల కబుర్ల నుండి చదువు, ఆటలు, పాటలు, నాటకాలు, గురువుల నుండి నేర్చుకున్న మంచి సంగతులు, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నాన్న చేసిన ప్రయత్నాలు, మారిన ఊర్లు, తమ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అమ్మానాన్న చేతుల మీదుగా వేడుకగా జరగాల్సిన సీతారాముల కళ్యాణం, నాన్న హఠాన్మరణంతో మోపలేని దుఃఖంతో సొంత ఊరికి పయనం, అదే సమయంలో వ్యాపారంలో నాన్న స్నేహితుని మోసం ఇలా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు మన మనసులను తడుతూ, మన జ్ఞాపకాలనూ గుర్తు చేస్తాయి. పొలాలు, పంటలు, చెరువు, కాలువలు, గేదలు ఇలా చిన్ననాటి తీపి జ్ఞాపకాల గుభాళింపులు బోలెడు ఈ పుస్తకంలో ఉన్నాయి. వేరుసెనగ మెుక్కలను కాయలతో కాల్చి, ఆ కాయలు తినడమనే అనుభూతి, అలా తిన్నవాళ్ళకే తెలుసు. ఇలా సహజసిద్ధమైన పల్లెటూరి తినుబండారాలు అన్నీ గుర్తుకొచ్చాయి ఈ పుస్తకం ద్వారా. 

       హైస్కూల్ చదువు, విహారయాత్ర విశేషాలు, తర్వాత లయోలా కాలేజ్ లో చదవడం, తర్వాత తనకిష్టమైన వెటర్నరీ డాక్టర్ కోర్సు కోసం తిరుపతిలో అప్లై చేయడం, చదవడం, స్నేహితులతో సరదాలు, టూర్లు, స్నేహితుడి పెళ్లికి వెళ్తూ, జేబులో డబ్బులు పోగొట్టుకోవడం వంటి కబుర్లు, తాను కలిసిన పెద్దల వివరాలు, చరిత్రలోని గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి వంటి పెద్దలు, ఇందిరాగాంధీ గారి జీవిత విశేషాలు, ఆమె చివరి ప్రసంగ వివరాలు, ఆమె మరణం గురించి, కాకాని వెంకటరత్నం గారు, వావిరాల గోపాల కృష్ణయ్య గారు, పిన్నమనేని కోటేశ్వరరావు రావు గారు, ప్రసిద్ధ రచయిత మో గారు ఇంకా తాను కలిసిన  ఇతర రాజకీయ నాయకుల గురించి చాలా బాగా రాసారు. ఉద్యోగ అనుభవాలు, నిజాయితీకి దక్కిన గౌరవాలు, ట్రాన్స్ఫర్ల మీద తిరిగిన ఊళ్లు, పిల్లల చదువులలో ఒకే సంవత్సరం మారిన నాలుగు స్కూల్స్, కోళ్ళఫారమ్ లో కోళ్ళు మాయమవటానికి అక్కడి కాపలా అతను అనుకుని అతనిని ఉద్యోగం నుండి తీసేయబోతే, అతని మీద నమ్మకంతో కోళ్ళు మాయమవడానికి ఎలుకలు కారణమని కనిపెట్టి, వారి కుటుంబానికి అండగా నిలబడటం, వెనుక వీరి “ కనబడేదంతా నిజమూ కాదు, ఒప్పుకున్నదంతా వాస్తవమూ కాదన్న నమ్మకమే. ఉప్పెన సమయంలో చేసిన సహ్య కార్యక్రమాలు, నోరు లేని జీవాల కోసం హాస్పిటల్స్ కట్టించడంలో తన వంతుగా సహాయ సహకారాలు అందించడం, వాటికి మంచి వైద్యం అందడం కోసం పడిన తాపత్రయం ఇలా చెప్పుకుంటూపోతే డాక్టర్ గారి మంచి పనులు బోలెడు ఈ పుస్తకం నిండా మనకు కనిపిస్తాయి. నీతి నిజాయితీలకు మరో రూపం డాక్టర్ ప్రసాద్ గారు.

       ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా పశు వైద్య సంబంధిత సందేహాలకు సమాధానాలు, రైతుల కోసం ఈనాడులో రాయడం వంటి రచనా వ్యాసంగాలతోపాటు అనేక కార్యక్రమాలు చేయడం, విజయ డైరీ మిల్క్ యూనియన్ లో పని చేయడం కూడా చేసారు. ఆత్మీయుల మరణ వార్త విని సొంత ఊరు వెళ్ళి వస్తూ గత జ్ఞాపకాలనెన్నంటినో పలకరించి వచ్చారు. 

“ మన ఊరు, మన మట్టి, మన గాలి అలాగే ఉంటాయి. మనమే వస్తుంటాం…పోతుంటాం. “. ఎం త నిజం ఈ మాట. 

      వీరి అబ్బాయికి పూణే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ కోసం వెళ్ళి అక్కడ తండ్రి లేని మరొకరికి ఇవ్వడం, తర్వాత మద్రాసుతో లో జాయిన్ చేయడం, అక్కడ మరో తమిళ్ డాక్టర్ గణేశ్ గారి పరిచయం, వారితో అనుబంధం వీరి మంచి మనసును తెలియజేస్తాయి. ఇక స్నేహం విషయానికి వస్తే వీరి స్నేహనుబంధం షష్టిపూర్తి దిశగా పయనిస్తోంది. యూరపు, అమెరికా, కెనడా దేశాలను సందర్శించి అక్కడ తాను చూసిన ప్రదేశాలను,అనుభూతులను కూడా చాలా బాగా వివరించారు ఈ పుస్తకంలో. 

          అనుబంధాలకు, అభిమానాలకు ఆనాటి తాతల తరం నుండి ఈనాటి మనుమల తరం వరకు వీరి కుటుంబ సంబంధాలే సాక్ష్యం. చాలా సాదా సీదాగా కనిపించే డాక్టర్ ప్రసాద్ గారు శూన్యాన్ని చైతన్యవంతం చేసేసి  తన జీవిత అనుభవ సారాన్ని, సమాజ పోకడలను, పరిసరాలను, పరిస్థితులను కూలంకషంగా ఈ పుస్తకంలో వివరించారు. ఎన్ని ఒడిదుడుకులెదురైనా మెుక్కవోని ఆత్మవిశ్వాసంతో మూగజీవాల కోసం నిరంతరం శ్రమించారు. వీరి కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి అనడం కన్నా ఆ అవార్డులకే వన్నె వచ్చిందనడం సబబు. 

         ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివితే మన జ్ఞాపకాలను కూడా మరోసారి వెమరువేసుకోకుండా ఉండలేము. మా హింది టీచర్ రత్నకుమారి గారు అన్నట్టు “ ఓ చెడు ఓ మంచి కోసమే “ అని మరోసారి నిరూపితమైంది ఈ “ గుర్తుకొస్తున్నాయి “ పుస్తకం ద్వారా. ఇంత బాగా రాసిన డాక్టర్ ప్రసాద్ గారికి శుభాభినందనలు. ఈ పుస్తకం వెలుగులోనికి రావడానికి సహకరించిన తెర వెనుక పెద్దలు రావి దంపతులు జయలక్ష్మి నారాయణ. శారద గార్లకు మనఃపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ సదవకాశమిచ్చిన శ్రీమతి రావి శారద గారికి కృతజ్ఞతలు. 

        

ఫోటోలు తీసి వెంటనే పంపిన వసుధారాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner