నేస్తం,
కష్టం మనది కానప్పుడు మనమంతగా దాని గురించి పట్టించుకోము. అదే బాధ మనదైనప్పుడు ఎవరో రావాలి, సాయమందించాలని ఎదురుచూస్తాం. ఎదుటివాడి కష్టం మనకు చేరనప్పుడు మన బాధ వారెవరైనా తీర్చాలని అనుకోవడం సబబు కాదు కదా! రోజులెప్పుడూ ఒకేలా వుండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతూ వుంటాయి. మన పెద్దలు ఎప్పుడో చెప్పనే చెప్పారు కదా లక్ష్మీదేవి చంచల స్వభావురాలని. అందుకనే ఆవిడ ఓ చోట స్థిరంగా వుండదు ఎప్పుడూ. ఈరోజు మనింట్లో వుంటే రేపటి రోజున మరొకరింట్లో వుంటుంది. ఇప్పుడు మనతో లక్ష్మీదేవి వుంది కదా అని మనం మనిషితనాన్ని మర్చిపోతున్నాం.
పొదుపు, దుబారా వలన కొంతమంది మనుష్యులకు విలువనిస్తూ వుంటారు. నువ్వేదో పొదుపరివని, ఇతరులు ఖర్చుదారులని అనుకుంటే పొరబాటది. ఎవరి అవసరాల ప్రాముఖ్యత వారిది. నీకు నీ వరకు నీ కుటుంబం బావుంటే చాలనుకుంటే సరిపోదు. కుటుంబమంటే భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. వారితో అనుబంధమున్న పెద్దలు కూడా మన కుటుంబమే అని గుర్తుండాలి. ఈరోజు మనం సంపాదిస్తున్నామని అహం ప్రదర్శిస్తే, ఆ సంపాదన వెనుక మన అమ్మానాన్నల కష్టం ఎంతుందో గుర్తుకే రాదు. పిల్లలను పెద్దవారిని చేయడంలో అమ్మానాన్నల బాధ్యతెంతుందో, అపరవయసులో వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలకు అంతే వుంటుంది. రక్త సంబంధాలు కూడా అవసరాకు మాత్రమే అనుబంధాలుగా మారిపోయాయి ఈనాడు.
కొన్ని రోజులు అందలాలెక్కామని సంతోష పడితే సరపోదు. ఆ ఆనందం కలకాలం అలాగే వుండదని గుర్తెరగాలి. చాలామంది అనుకుంటారు తమ పెంపకం చాలా గొప్పదని. ఏ తల్లీదండ్రి తమ పిల్లలు తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవాలని కాని, ఇంటి నుండి పిల్లలు వెళిపోవాలని కోరుకోరు(ఇది తలిదండ్రులకు మాత్రమే వర్తిస్తుంది). ఈ విషయంలో ఎవరూ చెడ్డవాడు కాదు. వారి వారి చుట్టూ వున్న పరిస్థితుల ప్రభావం. ఈ సంఘటనలలో ఇతరులు తామేదో గొప్పవారన్నట్టుగా అనుకుంటూ, వీరిని హేళన చేస్తుంటారు. ఈరోజు ఆ ఇంటి సంఘటన రేపు మన ఇంటిదే కావచ్చునేమోనన్న ఆలోచన క్షణ మాత్రమైనా రాదు. ఉద్యోగాలు చేయండి. ఊళ్లు ఏలండి కాని కనీసం మనిషిగా ఆలోచించండి. నోరుంది కదాని మాట తూలకూడదు. మనకి పిల్లలున్నారుగా. అదే బాధ రేపు మన ఇంటి తలుపు తడితే మన స్థితి ఏమిటన్నది కాస్తయినా ఆలోచించాలి కదా. మనం పిల్లల్ని మాత్రమే కనగలం వారి నుదుటిరాతను రాయలేం.
తెలివిగలవారు తమ పిల్లలు తప్పు చేసినా సమర్థించుకోగలరు. కొందరు ఏమి లేకపోయినా కుటుంబాన్ని అల్లరి చేసుకుని, తామే అందరికి చులకన అయిపోతారు. మన అనుకున్నవారే హేళన చేయడంలో ముందుంటే, మనసు బాధను పంచుకోవడానికెవరు లేక మానసికంగా కుంగిపోతూ, శారీరక అనారోగ్యాల పాలౌతున్నారు ఎందరో. (అ)హింసావాదులూ, మానవతామూర్తులు మీకో విన్నపం. ఎదుటివారి కష్టంలో మీరు పాలుపంచుకోనకపోయినా పర్లేదు కాని వారిని మీ మాటలతో, చేతలతో మానసికంగా హింసించి బతికున్న శవాలుగా మార్చకండి. మీ బంధం డబ్బుతోనే ముడిబడిన వుందని అందరు అలానే వుండరు. డబుతోనే అన్నీ దొరుకుతాయన్న భ్రమను వీడండి. కాస్తయినా మనిషిగా ఆలోచించండి.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి