30, ఆగస్టు 2022, మంగళవారం

అర్హత..!!

నేస్తం

          అందలం ఎక్కాలన్నా, అధఃపాతాళానికి పడిపోవాలన్నా మనకు ఉండాల్సింది ఏముటన్నది తెలుసుకోవాలి ముందు. ప్రపంచంలో గుర్తింపుకైనా అర్హత అవసరమే. వ్యవస్థకు కావాల్సింది వ్యక్తిత్వమూ కాదు, విలువలు కాదు. వ్యక్తిగా గుర్తింపు అర్హతతోనే వస్తుంది. అర్హత ఇప్పుడు అధికారం, డబ్బు అనే వాటితో బలంగా ముడిబడి పోయింది. భజనకు పెద్ద పీట వేయడం, వారినే సంఘ సేవకులుగా గుర్తించడం, దశాబ్దాల తరబడి వారినే అందలాలు ఎక్కించడం, అధికారం మారినా అనుయాయుల పేర్లు మారకపోవడం అందరు గమనించదగ్గ విషయం

            మన సమాజంలో వున్న వ్యవస్థను తీసుకున్నా నిజమైన ప్రతిభకు గుర్తింపు తక్కువనే చెప్పాలి. మొన్నటికి మెున్న మా టివి వారి సూపర్ సింగర్ జూనియర్స్ లో ఫినాలే చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు బహుమతి మీకు నచ్చినవారికి ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయండి. దానిలో ఆక్షేపణలేం వుండవు. కాలంనాడు బాలు గారి పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో కూడా ఒకసారి ఇలానే మాకనిపించింది బ్లాగులో రాస్తే, తర్వాత ఎపిసోడ్లా లో ఆయన మమ్మల్ని తిట్టారు, కాని తర్వాత మరెప్పుడు ఆయనను వేలెత్తో చూపాల్సిన అవసరం ఎవరికి రాలేదు. ఫినాలే లో అందరికి ఒకే పాట ఇచ్చి వారు పాడిన దానిని బట్టి విజేతను నిర్ణయించవచ్చు కదా! నాకు కనీసం పాట పాడిన పిల్లవాడి పేరు కూడా గుర్తులేదు, కాని వాడు పాట పాడిన విధానం అంతా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే వుంది. నా మాట అబద్ధమనుకుంటే మీరూ పాటని విని అప్పుడు చెప్పండి. “ తాళికట్టు శుభవేళపాట

లాస్ట్ రౌండ్ లో పిల్లలకు వారిచ్చిన పాటలను బట్టే విజేత ఎవరో మనకు తెలిసిపోతుంది

         సంగీతమైనా, సాహిత్యమైనా, రాజకీయమైనా మరే ఇతర వ్యవహారాలైనా, విజేతలు ఎవరన్నది ఎంత పారదర్శకంగా వుంటుందో కొత్తగా మనమిప్పుడు చర్చించుకోవాల్సిన విషయమేం కాదు. మనకు తెలిసిన వాస్తవాలు అన్నీ. డాక్టరేట్లకు, పురస్కారాలకు ఉండాల్సి అర్హతలు మనకు తేటతెల్లమే కదా


https://youtu.be/P5W_RaHFN0Y





24, ఆగస్టు 2022, బుధవారం

ఏక్ తారలు..!!

​1.   మనసెరిగిన అక్షరాలు కదా_బరువైనా భారమైనా తమదేనంటూ..!!

1.  మరువలేని గతంలో నీవున్నావు_జ్ఞాపకాలతో మనసు అరలను నింపేసి..!!

3.   మాయా ప్రపంచమిది_ వంచనతో మంచితనం అద్దేస్తూ..!!

4.  కథలకు అనువైనవే_కాలపు చిత్తరువులన్నీ..!!

5.  మింటి కంట ముత్యాల సరాలు_మగువ మనసు రాతలుగా..!!

6.   మతి తప్పిన మనిషి_మా(మ)ర్చే కాలమెప్పుడో..!!

7.   రెప్పల చివరన ఓ చినుకు_చెక్కిలిని ముద్దాడిన నెచ్చెలిగా..!!

8.  శూన్యాన్ని అడుగుతున్నా_ఏ బంధానిదెంత బుుణమోనని..!!

9.  మనసుకు చెబుతున్నా_ఏ మౌనంలో ఏ మాటుందో తెలుసుకోమని..!!

10.  మనసుని చూడగలిగాను_అందుకే మౌనమై మిగిలానేమో..!!

11.  అర్ఘ్యము అర్హత గల వారికే ఇవ్వాలి_అది  అక్షరమైనా బాధ్యతైనా..!!

12.  అక్షరాలు అందరివి_భావాలే కొందరివి..!!

13.  అంతర్యానం అలవాటైంది_అనుబంధాల అవధులు తెలిసాక..!!

14.   కథ రాయాలన్న ఉబలాటమెక్కువే_కథనం మనది కానప్పుడు..!!

15.  వద్దని వారిస్తావెందుకు?_మనోసంద్రాన్ని దాటాలని నేననుకుంటుంటే..!!

16.  రారాజు కలయిక_రేరాజుని చేరి..!!

17.  కొన్ని బంధాలంతే_కలిసున్నా కడు దూరమే..!!

18.   బంధాన్ని అల్లుకున్నా నీతో_బాధ్యతను గుర్తు చేయాలనే..!!

19.   తేల్చాల్సిన లెక్కలు మిగిలే వున్నాయి_కాలపు కొనకు వ్రేలాడుతూ..!!

20.  మనసే కదా అని ఇవ్వకు_మారకానికి కుదరదని తెలుసుకో..!!

21.   అలికిడి తెలిసిన అక్షరాలివి_పరమపద సోపానానికి పదపదమంటూ..!!

22.  కాలానికవే కొరుకుడు పడనివి_మరలింపు నెరుగని నిక్కచ్చితాలుగా..!!

23.   కథలన్నీ విశేషాలే_కా(క)లాలను కూడగట్టుకుంటూ..!!

24.   అమ్మతనమంతేనేమో_ఆయువుకు నిచ్చెనౌతూ..!!

25.  బంధానికి బాధ్యతెక్కువే మరి_ఉసులు తీసే యత్నాలకు అడ్డంకిగా మారుతూ..!!

26.   ఆంతర్యంతో స్నేహం అలవాటే మదికి_చీకటి చుట్టానికి వెలుగద్దుతూ..!!

27.  పొడిబారిన మనసే జతగా_గతపు గురుతులను చెరపలేక..!!

28.  మరలి రావాలని వుంది_మనసుకు నచ్చిన బాల్యానికి మరోసారి..!!

29.   గాలికి నాలా అసహనమెక్కువే_ఓ క్షణంలో ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకుంటూ..!!

30.   ఎగసిపడిందో మిడిసిపాటు_ 

లోయలోకి జారే గ్రహపాటుందని మరచి..!!

23, ఆగస్టు 2022, మంగళవారం

ఏ తీరెవరిదో..!!

దాహం దాహం

ధనదాహం

తీరదెన్నటికి కొందరికి


కారం కారం

అహంకారం

వీడదెన్నటికి కొందరికి


రాగం రాగం

అనురాగం

అర్థం కాదెప్పటికి కొందరికి


మానం మానం

అభిమానం

ఉండదెప్పటికి కొందరికి


క్షణం క్షణం

ప్రతిక్షణం

ఆరాటమెప్పటికి కొందరికి


బంధం బంధం

అనుబంధం

అవసరానికి కొందరికి


పాశం పాశం

రక్తపాశం

తుంచుకోవడానికి కొందరికి


మితం మితం

పరిమితం

జీవితమని తెలిసేదెన్నటికో అందరికి..!!



20, ఆగస్టు 2022, శనివారం

ఎందుకు?

        నేను కాలం వెంబడి కలం రాయడం అనుకోకుండా జరిగింది. పవన్ అడిగితే పుస్తకాల కబుర్లు మాత్రమే రాద్దామనుకున్నా. కాని కాసిని మంచి చెడులు రాసేసాను. ముఖ్యంగా అమెరికా అనుభవాలు నేను తక్కువగా రాద్దామనుకుంటే రాజశేఖర్ చప్పిడి గారు వివరంగా రాయమన్నారు. నాకు తెలిసి నేను రాసినంత వరకు అమెరికాలో నా అనుభవాలు మాత్రమే రాసాను. చివరిలో కూడా చెప్పినట్టు గుర్తు అందరికి ఇలానే జరగాలనేం లేదని కూడా. నాకెదురైన మనుషులు, పరిస్థితులు అలాంటివి. ఎవరి అవసరాలు వారివి. చేతనైనంత వరకు ఉపయోగించుకుని తర్వాత ముఖం చాటేసినవారు బోలెడుమంది. కనీసం ఎలా ఉన్నామని కూడా పలకరించరు ఈరోజు. నేను రాసింది ఓ వంతు మాత్రమే. 

       పోగొట్టుకున్న చోటనే వెదుక్కోవాలన్న ప్రయత్నం బావుంటుంది. అది ఎంత వరకు విజయం సాధిస్తుందన్నది కాలానికి వదిలేస్తున్నా. నా రాతలు సరిగ్గా చదవండి. సగం సగం చదివి నేనేదో అందరిని అమెరికా వెళ్లవద్దని చెప్పానని కొందరు ఫీల్ అయ్యి నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు. ముందు తెలుగు సరిగా చదవడం, రాసినది అర్థం చేసుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను అమెరికా వెళ్లవద్దని ఎప్పుడైనా చెప్పానా? నా కొడుకుని అమెరికా పంపడానికి మీరేమైనా సాయం చేసారా? నా అనుభవాలు రాసింది మరొకరు ఇబ్బంది పడకుండా ఉంటారని. వయసు రాగానే సరికాదు. కాస్త వివేకం, విజ్ఞత నేర్చుకోండి. అమెరికా వెళ్లిన అందరు ఊరికినే మిలియనీర్లు అయిపోరు. ప్రతి పెన్నీ కష్టపడితేనే వస్తుంది. ఇక మిలియనీర్లు, బిలియనీర్లు అవడమనేది వారి వారి అదృష్టంపై ఆధారపడి వుంటుంది. 

        మొత్తానికి నా “ కాలం వెంబడి కలం “ పుస్తకం చాలామందికి ఏదోకటి నేర్పిందని అర్థం అయ్యింది. శత్రువులకు థాంక్స్ ఈ విషయంలో😊. మీ ప్రేమ మూలంగానే జనవరి 2022 నుండి ఆగస్టు 2022 వరకు 4 పుస్తకాలు తేగలిగాను. 😊

19, ఆగస్టు 2022, శుక్రవారం

జీవన మంజూష సెప్టెంబరు22

నేస్తం,

         మన సమాజంలో తప్పొప్పుల పట్టి చిన్నదేమీ కాదు. మనం పెరిగిన వాతావరణం, పరిసరాలు, పరిస్థితులను బట్టి మన వ్యక్తిత్వాలు, ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మనకు మంచి అనిపించినది ఇతరులకు చెడు అనిపించవచ్చు. దానికి అనేక ఇతర కారణాలతో పాటుగా పైన చెప్పిన కారణాలు కూడా కావచ్చు. ఇదే ధోరణి సాహిత్యంలో కూడా బాగా కనబుడుతోంది. మనం రాసే రాతలు అందరికి నచ్చాలనేం లేదు. అలానే ఎదుటివాడి రాతలను తప్పుబట్టే ముందు మన రాతలను మనం తరచి చూసుకోవాలి. మనిషికయినా, రాతలకయినా ఒకటే న్యాయం వర్తిస్తుంది

           తల్లిదండ్రులయినా బిడ్డల బాగు కోరుకుంటారు.బిడ్డలు తప్పు చేసినప్పుడు ప్రేమతో దండించాలి కాని నిరంకుశంగా ప్రవర్తిస్తే వారిని తల్లిదండ్రులనరు. ఏమంటారన్నది మీ అందరికి తెలుసు. ఎవరి తప్పులైనా ఎత్తి చూపే ముందు మనమేంటన్నది మన మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది. అహం మనకుంటే ఆత్మాభిమానం ఎదుటివారికుంటుంది. మన మాటే శాసనమని ఎగిరిపడితే ఏకాకి బతుకే మనకు మిగులుతుంది. బంధానికి, అనుబంధానికి అర్థం తెలియని వారికి మాటల అవసరం కూడా లేదు. పాశాలను అల్లుకోవాలి కాని తుంచుకోకూడదు. మాట జారితే మన బాధలాంటిదే ఎవరిదయినా. బాధకు చిన్నా పెద్దా తేడా వుండదు. పెద్దరికం వయసుతో రాదు విజ్ఞతతో వస్తుంది. బంధానికి విలువనివ్వని వారికి అనుబంధం గురించి చెప్పడం వృధాప్రయాసే అవుతుంది.

             ఏదైనా రాసేటప్పుడు మనం తీసుకున్న వస్తువును మనం చూసే దృక్కోణంలోనే అందరు చూడరు. ఎవరి ఆలోచనలు, అభివ్యక్తులు, శైలి వారికుంటాయి. కాకపోతే ఇతర కులమత సంప్రదాయాలను హేళన చేయడమే సహింపరాని విషయం. వర్ణన విషయానికి వచ్చినా ఇవే భిన్నాభిప్రాయాలు వున్నాయి. కొందరు మగవారు స్త్రీని అంగాంగ వర్ణన చేస్తారు. కొందరు ఆడవారు కూడా అదే పంథాలో రాస్తారు. సున్నితమైన వర్ణన చదువరులకు ఇంపుగా వుంటుంది. వికృతమైన వర్ణన జుగుప్సాకరంగా వుంటుంది. ప్రబంధాలలో రాసారు, మహా మహా రచయితలు, రచయిత్రులు కూడా అంగాంగ వర్ణన చేసారు. మేము రాస్తే తప్పేంటి? అనే ప్రశ్నకు సమాధానం మీ వద్దనే వుంది. భావి తరాలకు మీరిచ్చే విలువైన సంపద మీ రాతలు, మీ నడవడిమీచే రాయబడి అచ్చయ్యే ప్రతి అక్షరం  చరిత్రగా రూపుదిద్దుకుని రేపటి తరాలకు తప్పక అందుతుంది. మెుగ్గల్లాంటి ఆ పసిగుండెలపై మీరేది రాస్తే అదే అచ్చులా ఒదుగుతుంది. మరి మీరు ఏమి రాయాలో అవి ఎలా ఉండాలో, ఎలా ఉంటే రేపటితరం ఉన్నతమార్గం వైపు పయనిస్తుందో అవి ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి..!

     


18, ఆగస్టు 2022, గురువారం

సంకల్పం..!!

ఏడవకండేడవకండి

కష్టాలు కన్నీళ్లు 

నాకింకా మిగిలే వున్నాయ్


ఇంటా బయటా

ప్రపంచంలో ఎక్కడయినా

మార్పు లేని మెుండి బతుకే ఎప్పుడూ


పోయిన చోటే వెదుక్కుందామన్నా

పోగొట్టుకున్న కాలాన్ని

వెనక్కి తేలేని చేతగానితనమే నాది


కాలం వెంబడి కలాన్ని 

పరుగులు పెట్టించింది

నలుగురికి మంచి చెడు తెలియాలనే


మనసు గోడు వెళబోయలేక

మాటను మౌనంగా మార్చుకున్నా 

ఆక్షపణలే అన్నింటా


ఎగసిపడే కెరటాలను 

ఆపే ప్రయత్నం చేస్తే

తీరాన్ని చేరాలన్న సంకల్పాన్ని అడ్డుకోలేము..!!

17, ఆగస్టు 2022, బుధవారం

రాతిరి చుక్కలు ఆవిష్కరణ..!!

విజయ వాణి మంజు ల “ రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు “ ఆవిష్కరణ….😊


థాంక్యూ ఇద్దరు మౌర్యలకు, శౌర్యకు, అమ్మకు, అమ్మమ్మకు..


మరో మాట…నా రాతలకు మెుదటి పాఠకురాలు మా అమ్మమ్మ😍 



ఏ తీరమెవరిది?

ఏ దూరానిదే తీరమైనా

భారమింతేనేమో

మనసునంతా స్వరపరిచి

గొంతుకప్పగించిన గుండెకు 

మాటలు కరువేమో


మనిషి కనబడకున్నా 

ఆకలిని సైతం మరిచి

వినికిడిలో మమతలేరుకోవడానికి

ఆత్రపడిన రోజులు 

ఇంకా గురుతులుగానే వున్నాయి


అడ్డాలనాడు గడ్డాలనాడు 

బిడ్డలు మనవారనుకునే క్షణాలు

మాయమైపోతున్న నేటి కాలంలో

పసితనమును వీడక 

అమ్మ కొంగు పట్టుకు తిరిగే పసివాళ్ళే కొందరు


బంధాలను అడ్డుపెట్టుకుని

అనుబంధాలతో ఆటలాడుతూ

తాము పైకెదగడానికి పాశాలను

ధనవాహకాలుగా మార్చుకుంటూ

దూరపు కొండల నునుపు చూసేవారే అందరు


ప్రాయానికి నడిమి వయసుకు మధ్యన

అహానికి ఆత్మీయతకు నడుమనున్న

అభిమానమే అసలైన సంపదని

విలువెరిగిన వ్యక్తిత్వానికి వన్నెలు తెచ్చేవి

మమకారపు మనిషితనాలని తెలిసే క్షణాలెప్పుడో..!!

13, ఆగస్టు 2022, శనివారం

​చిటారు కొమ్మన..!!

మ(త)న పదంలోనే

పరిమితం బాంధవ్యం


మదిలోని భావాలకు

రూపం తెలియదని నటన


పాశాలకు బద్దులమంటూనే

లచ్చిందేవికి మాత్రమే ఆహ్వానమంటారు


వినబడని స్వరాలు

లోపల గుసగులాడుతూనే వుంటాయి 


కనబడని నుదుటిరాతను

చదివేసామన్న అహంకారం మ(త)నది


ఊరవతల ఊడల మర్రిచెట్టుకి వ్రేళాడుతున్న

గతపు ఊయలలో నిద్దరోదామన్న యత్నం


చిటారు కొమ్మన మిఠాయి పొట్లానికి 

ప్రయత్నం మంచిదే


ఏదోక రోజున చేతలలో చిక్కుబడతారు

కాలం వేసే గాలానికి..!!

11, ఆగస్టు 2022, గురువారం

స్వాతంత్ర్యమా నీవెక్కడా..!!

ఇలలో కలలో

కనిపించని స్వేచ్ఛావాయువును

స్వతంత్రమందామా!


వ్యక్తులుగా మనలేని

భవితకు పునాది వేస్తున్న

అధికారానికి స్వతంత్రమెుచ్చిందందామా!


భరతమాతను వివస్త్రను చేస్తూ

స్త్రీని అధఃపాతాళానికి తొక్కేస్తున్న

కాముకులకు స్వతంత్రమిచ్చామందామా!


కొలువు నెలవులకు వెంపర్లాడే 

సామాన్యుని బతుకుని దుర్భరం చేస్తున్న

ఓటుకు స్వతంత్రం కల్పించామందామా!


నిత్యావసరాలను ఆకాశమందుంచుతున్న

పన్నుల పంగనామాలకు సంతసిస్తూ

మాటల మాయల స్వతంత్రానికి స్వాగతమందామా!


ఆర్థికాభివృద్ధి మనదని గర్వపడుతూ

ప్రగతి పథంలో మన పయనమెటో తెలియని స్థితిలో 

మనల్ని వుంచిన స్వతంత్రానికి వందనమందామా!


ఏదేమైనా 

ఎదురులేని బెదురులేని ఎక్కడి గొంగళి అక్కడే వున్న

ఏడునర్ర దశాబ్దాల మన స్వాతంత్ర్యానికి శుభాకాంక్షలు…!!

1, ఆగస్టు 2022, సోమవారం

జీవన మంజూష ఆగస్టు 2022

నేస్తం,

         రుచులు పలురకాలు అన్నట్టుగా మన సమాజంలో మనిషి నడవడి కూడా అలాగే తయారైంది. బాధ్యతలు, బంధాలు అంటూ కొందరు పాకులాడుతుంటే, మరికొందరేమో తమ స్వార్థం తాము చూసుకుంటూ ఎందరున్నా ఎవరు లేని ఏకాకుల్లా బతికేస్తున్నారు. ఈనాటి సమాజంలో మనిషి నైతిక విలువలు మరిచిపోయాడనం కన్నా మనిషితనం నుండి దిగజారి పోయాడనటమే సబబు. వింత పోకడల ప్రపంచంలో మనిషో విచిత్రజీవిగా మారిపోతున్నాడు ఆధునికత ముసుగులో.

          పిల్లలకు ఇంగ్లీషు చదువులు నేర్పిస్తున్నామని గొప్పలు పోతున్నాం కాని మనం కోల్పోతున్న ఆత్మీయపు స్పర్శను గుర్తెరగలేకున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని మన వారసులకు అందిస్తున్నామన్న భ్రమలో పడి వారి ప్రపంచం నుండి మనల్ని తరిమేస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోతున్నాం. డబ్బుతో కొనగలిగిన చదువులను పిల్లలకు సునాయాసంగా అందించేస్తూ, వారిని అసలైన విద్యకు దూరం చేస్తున్నామని మర్చిపోతున్నాం. పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలని నానాగడ్డి మనం తింటూ కోట్లకొలది సొమ్ము వెనకేయడం కాదు మనం చేయాల్సింది. నేను నా అన్న గిరిలోనుండి మనమన్న బంధాలకు దగ్గర చేయడం. అదే వారికి మనమిచ్చే విలువైన ఆస్తి.

             ఉత్తమమైన మానవజన్మకు సార్థకతను సమకూర్చడం మనిషిగా మన కర్తవ్యం. కాని అది మరచి నేడు నేను మాత్రమే బావుండాలన్న సంకుచితత్వం పెరిగిపోయింది. రక్త సంబంధాల నడుమననే అంతరాలు ఏర్పడిపోయాయి. నటించే నైజాలు వారి నటనకు మెరుగులు దిద్దుకుంటూ యదేచ్ఛగా మన చుట్టూనే సంచరిస్తున్నారు. ఒకప్పుడు ఇల్లు చిన్నదైనా ఇరుకనిపించని జీవితాల్లో, నేడు విశాలమైన భవనాల్లో ఎందరున్నా ఒంటరితనమే తారాడుతోంది. మనందరికి ఇవన్నీ తెలిసినా మనకెందుకు అని సరిపెట్టుకుంటూ సర్దుకుపోతూ బతికేద్దాం..ఏమంటారు?


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner