24, ఆగస్టు 2022, బుధవారం

ఏక్ తారలు..!!

​1.   మనసెరిగిన అక్షరాలు కదా_బరువైనా భారమైనా తమదేనంటూ..!!

1.  మరువలేని గతంలో నీవున్నావు_జ్ఞాపకాలతో మనసు అరలను నింపేసి..!!

3.   మాయా ప్రపంచమిది_ వంచనతో మంచితనం అద్దేస్తూ..!!

4.  కథలకు అనువైనవే_కాలపు చిత్తరువులన్నీ..!!

5.  మింటి కంట ముత్యాల సరాలు_మగువ మనసు రాతలుగా..!!

6.   మతి తప్పిన మనిషి_మా(మ)ర్చే కాలమెప్పుడో..!!

7.   రెప్పల చివరన ఓ చినుకు_చెక్కిలిని ముద్దాడిన నెచ్చెలిగా..!!

8.  శూన్యాన్ని అడుగుతున్నా_ఏ బంధానిదెంత బుుణమోనని..!!

9.  మనసుకు చెబుతున్నా_ఏ మౌనంలో ఏ మాటుందో తెలుసుకోమని..!!

10.  మనసుని చూడగలిగాను_అందుకే మౌనమై మిగిలానేమో..!!

11.  అర్ఘ్యము అర్హత గల వారికే ఇవ్వాలి_అది  అక్షరమైనా బాధ్యతైనా..!!

12.  అక్షరాలు అందరివి_భావాలే కొందరివి..!!

13.  అంతర్యానం అలవాటైంది_అనుబంధాల అవధులు తెలిసాక..!!

14.   కథ రాయాలన్న ఉబలాటమెక్కువే_కథనం మనది కానప్పుడు..!!

15.  వద్దని వారిస్తావెందుకు?_మనోసంద్రాన్ని దాటాలని నేననుకుంటుంటే..!!

16.  రారాజు కలయిక_రేరాజుని చేరి..!!

17.  కొన్ని బంధాలంతే_కలిసున్నా కడు దూరమే..!!

18.   బంధాన్ని అల్లుకున్నా నీతో_బాధ్యతను గుర్తు చేయాలనే..!!

19.   తేల్చాల్సిన లెక్కలు మిగిలే వున్నాయి_కాలపు కొనకు వ్రేలాడుతూ..!!

20.  మనసే కదా అని ఇవ్వకు_మారకానికి కుదరదని తెలుసుకో..!!

21.   అలికిడి తెలిసిన అక్షరాలివి_పరమపద సోపానానికి పదపదమంటూ..!!

22.  కాలానికవే కొరుకుడు పడనివి_మరలింపు నెరుగని నిక్కచ్చితాలుగా..!!

23.   కథలన్నీ విశేషాలే_కా(క)లాలను కూడగట్టుకుంటూ..!!

24.   అమ్మతనమంతేనేమో_ఆయువుకు నిచ్చెనౌతూ..!!

25.  బంధానికి బాధ్యతెక్కువే మరి_ఉసులు తీసే యత్నాలకు అడ్డంకిగా మారుతూ..!!

26.   ఆంతర్యంతో స్నేహం అలవాటే మదికి_చీకటి చుట్టానికి వెలుగద్దుతూ..!!

27.  పొడిబారిన మనసే జతగా_గతపు గురుతులను చెరపలేక..!!

28.  మరలి రావాలని వుంది_మనసుకు నచ్చిన బాల్యానికి మరోసారి..!!

29.   గాలికి నాలా అసహనమెక్కువే_ఓ క్షణంలో ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకుంటూ..!!

30.   ఎగసిపడిందో మిడిసిపాటు_ 

లోయలోకి జారే గ్రహపాటుందని మరచి..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner