ఏ దూరానిదే తీరమైనా
భారమింతేనేమో
మనసునంతా స్వరపరిచి
గొంతుకప్పగించిన గుండెకు
మాటలు కరువేమో
మనిషి కనబడకున్నా
ఆకలిని సైతం మరిచి
వినికిడిలో మమతలేరుకోవడానికి
ఆత్రపడిన రోజులు
ఇంకా గురుతులుగానే వున్నాయి
అడ్డాలనాడు గడ్డాలనాడు
బిడ్డలు మనవారనుకునే క్షణాలు
మాయమైపోతున్న నేటి కాలంలో
పసితనమును వీడక
అమ్మ కొంగు పట్టుకు తిరిగే పసివాళ్ళే కొందరు
బంధాలను అడ్డుపెట్టుకుని
అనుబంధాలతో ఆటలాడుతూ
తాము పైకెదగడానికి పాశాలను
ధనవాహకాలుగా మార్చుకుంటూ
దూరపు కొండల నునుపు చూసేవారే అందరు
ప్రాయానికి నడిమి వయసుకు మధ్యన
అహానికి ఆత్మీయతకు నడుమనున్న
అభిమానమే అసలైన సంపదని
విలువెరిగిన వ్యక్తిత్వానికి వన్నెలు తెచ్చేవి
మమకారపు మనిషితనాలని తెలిసే క్షణాలెప్పుడో..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి