నేస్తం,
మన సమాజంలో తప్పొప్పుల పట్టి చిన్నదేమీ కాదు. మనం పెరిగిన వాతావరణం, పరిసరాలు, పరిస్థితులను బట్టి మన వ్యక్తిత్వాలు, ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మనకు మంచి అనిపించినది ఇతరులకు చెడు అనిపించవచ్చు. దానికి అనేక ఇతర కారణాలతో పాటుగా పైన చెప్పిన కారణాలు కూడా కావచ్చు. ఇదే ధోరణి సాహిత్యంలో కూడా బాగా కనబుడుతోంది. మనం రాసే రాతలు అందరికి నచ్చాలనేం లేదు. అలానే ఎదుటివాడి రాతలను తప్పుబట్టే ముందు మన రాతలను మనం తరచి చూసుకోవాలి. మనిషికయినా, రాతలకయినా ఒకటే న్యాయం వర్తిస్తుంది.
ఏ తల్లిదండ్రులయినా బిడ్డల బాగు కోరుకుంటారు.బిడ్డలు తప్పు చేసినప్పుడు ప్రేమతో దండించాలి కాని నిరంకుశంగా ప్రవర్తిస్తే వారిని తల్లిదండ్రులనరు. ఏమంటారన్నది మీ అందరికి తెలుసు. ఎవరి తప్పులైనా ఎత్తి చూపే ముందు మనమేంటన్నది మన మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది. అహం మనకుంటే ఆత్మాభిమానం ఎదుటివారికుంటుంది. మన మాటే శాసనమని ఎగిరిపడితే ఏకాకి బతుకే మనకు మిగులుతుంది. బంధానికి, అనుబంధానికి అర్థం తెలియని వారికి ఈ మాటల అవసరం కూడా లేదు. పాశాలను అల్లుకోవాలి కాని తుంచుకోకూడదు. మాట జారితే మన బాధలాంటిదే ఎవరిదయినా. బాధకు చిన్నా పెద్దా తేడా వుండదు. పెద్దరికం వయసుతో రాదు విజ్ఞతతో వస్తుంది. బంధానికి విలువనివ్వని వారికి అనుబంధం గురించి చెప్పడం వృధాప్రయాసే అవుతుంది.
ఏదైనా రాసేటప్పుడు మనం తీసుకున్న వస్తువును మనం చూసే దృక్కోణంలోనే అందరు చూడరు. ఎవరి ఆలోచనలు, అభివ్యక్తులు, శైలి వారికుంటాయి. కాకపోతే ఇతర కులమత సంప్రదాయాలను హేళన చేయడమే సహింపరాని విషయం. వర్ణన విషయానికి వచ్చినా ఇవే భిన్నాభిప్రాయాలు వున్నాయి. కొందరు మగవారు స్త్రీని అంగాంగ వర్ణన చేస్తారు. కొందరు ఆడవారు కూడా అదే పంథాలో రాస్తారు. సున్నితమైన వర్ణన చదువరులకు ఇంపుగా వుంటుంది. వికృతమైన వర్ణన జుగుప్సాకరంగా వుంటుంది. ప్రబంధాలలో రాసారు, మహా మహా రచయితలు, రచయిత్రులు కూడా అంగాంగ వర్ణన చేసారు. మేము రాస్తే తప్పేంటి? అనే ప్రశ్నకు సమాధానం మీ వద్దనే వుంది. భావి తరాలకు మీరిచ్చే విలువైన సంపద మీ రాతలు, మీ నడవడి. మీచే రాయబడి అచ్చయ్యే ప్రతి అక్షరం చరిత్రగా రూపుదిద్దుకుని రేపటి తరాలకు తప్పక అందుతుంది. మెుగ్గల్లాంటి ఆ పసిగుండెలపై మీరేది రాస్తే అదే అచ్చులా ఒదుగుతుంది. మరి మీరు ఏమి రాయాలో అవి ఎలా ఉండాలో, ఎలా ఉంటే రేపటితరం ఉన్నతమార్గం వైపు పయనిస్తుందో అవి ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి..!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి