నేస్తం,
రుచులు పలురకాలు అన్నట్టుగా మన సమాజంలో మనిషి నడవడి కూడా అలాగే తయారైంది. బాధ్యతలు, బంధాలు అంటూ కొందరు పాకులాడుతుంటే, మరికొందరేమో తమ స్వార్థం తాము చూసుకుంటూ ఎందరున్నా ఎవరు లేని ఏకాకుల్లా బతికేస్తున్నారు. ఈనాటి సమాజంలో మనిషి నైతిక విలువలు మరిచిపోయాడనం కన్నా మనిషితనం నుండి దిగజారి పోయాడనటమే సబబు. వింత పోకడల ప్రపంచంలో మనిషో విచిత్రజీవిగా మారిపోతున్నాడు ఆధునికత ముసుగులో.
పిల్లలకు ఇంగ్లీషు చదువులు నేర్పిస్తున్నామని గొప్పలు పోతున్నాం కాని మనం కోల్పోతున్న ఆత్మీయపు స్పర్శను గుర్తెరగలేకున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని మన వారసులకు అందిస్తున్నామన్న భ్రమలో పడి వారి ప్రపంచం నుండి మనల్ని తరిమేస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోతున్నాం. డబ్బుతో కొనగలిగిన చదువులను పిల్లలకు సునాయాసంగా అందించేస్తూ, వారిని అసలైన విద్యకు దూరం చేస్తున్నామని మర్చిపోతున్నాం. పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలని నానాగడ్డి మనం తింటూ కోట్లకొలది సొమ్ము వెనకేయడం కాదు మనం చేయాల్సింది. నేను నా అన్న గిరిలోనుండి మనమన్న బంధాలకు దగ్గర చేయడం. అదే వారికి మనమిచ్చే విలువైన ఆస్తి.
ఉత్తమమైన మానవజన్మకు సార్థకతను సమకూర్చడం మనిషిగా మన కర్తవ్యం. కాని అది మరచి నేడు నేను మాత్రమే బావుండాలన్న సంకుచితత్వం పెరిగిపోయింది. రక్త సంబంధాల నడుమననే అంతరాలు ఏర్పడిపోయాయి. నటించే నైజాలు వారి నటనకు మెరుగులు దిద్దుకుంటూ యదేచ్ఛగా మన చుట్టూనే సంచరిస్తున్నారు. ఒకప్పుడు ఇల్లు చిన్నదైనా ఇరుకనిపించని జీవితాల్లో, నేడు విశాలమైన భవనాల్లో ఎందరున్నా ఒంటరితనమే తారాడుతోంది. మనందరికి ఇవన్నీ తెలిసినా మనకెందుకు అని సరిపెట్టుకుంటూ సర్దుకుపోతూ బతికేద్దాం..ఏమంటారు?
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి