నేస్తం,
ఎవరి గురించో రాసేంత ధైర్యమున్న మనకు, మన గురించి రాసుకునేంత సమయం లేకపోవడం కడు సోచనీయం. ప్రాణంతో వున్నప్పుడు ఇచ్చిన విలువ, గౌరవం ఆ మనిషి చనిపోయిన తరువాత అత్యంత హేయమైన రాతలు కథలు కథలుగా రాయడానికి మనకున్న హక్కేంటి? మన ప్రేమలు, పెళ్లిళ్లు మాత్రమే పవిత్రమైనవి. ఇతరులవి ఉన్మాదాలు అనడంలోనే మన సంస్కారం బయటపడుతోంది. మన ఉనికి కోసం, పురస్కారాలు, పదవుల కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేసామో మనకు గుర్తు లేకున్నా, అందరికి తెలుసు.
మనిషి బతికున్నప్పుడు మన అవసరాల కోసం అమ్మా, అక్కా, గురువు, దైవం అంటూ వరుసలు కలిపి, అదే మనిషి చనిపోయాక మన అసలు నైజాలు బయటేసుకోవడం వెనుక ఆంతర్యాలు నలుగురు ఎరగనివేం కాదు. మన వ్యక్తిగతం రాసుకోవడం, రాసుకోకపోవడం అన్నది మన స్వవిషయం. మరొకరి గతాన్ని నలుగురి ముందు చులకన చేసే హక్కు మనకెక్కడ వుంది? ఇదేనా మన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులు మనకు నేర్పిన సంస్కారం? ఎటు పోతున్నాం మనం? ఏమైపోతున్నాం మనం? మనిషితనాన్ని మరిచిపోయి సంకుచితంగా ఎందుకు తయారౌతున్నాం? లోపం ఎక్కడ?
ఈమధ్యన కొంతమందికి ఇదో గొప్ప పనితనంగా అనిపిస్తోంది. ఎవరి వ్యక్తి’గతాలు వారికుంటాయి. పేరు కోసం, పదవుల కోసం పెద్దపెద్ద వారే దిగజారిపోతున్న ఈరోజుల్లో చనిపోయిన వారి గతాన్ని అత్యంత హేయంగా కథలు కథలుగా రాయడం, దానికి మహామహుల సమీక్షలు వరదల్లా రావడం. కనీసం ఆ నవల లేదా ఆ కథేంటి? దానిలోని అంశమేమిటి? అన్న ఆలోచన కూడా లేకుండా ఈ పొగడ్తలు దేనికోసం? మంచిని నలుగురికి పంచండి తప్పులేదు. వంచనని ఆకాశానికి ఎత్తకండి. రేపటి రోజున మీ గతి కూడా అధోగతి అవుతుందని గుర్తుంచుకోండి.
ముందు నీ గురించి నువ్వు రాసుకునే ధైర్యం చెయ్యి. ఆ తరువాత మిగతావారి ఆత్మకథలు, ఉన్మాద చరిత్రలు రాయవచ్చు. పనికిమాలిన వర్ణనలకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు లభించినంత మాత్రాన మనమేం సాహిత్య సింహాసనాలను అధిష్టించలేదు. సాహిత్యం అనేది నలుగురికి మంచిని పంచాలి, పెంచాలి. అంతేకానీ కులమతాలను, వ్యక్తి’గతాలను అవహేళన చేయకూడదన్న కనీస సంస్కారం లేని కొందరిని చూస్తూ, వారి గొప్పతనానికి చేతులెత్తి మెుక్కడం తప్ప మరేం చేయలేక పోతున్నాం.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి