మా బాబాయి మనసు మాటలు ..హృదయపూర్వక ధన్యవాదాలు బాబాయ్ 🙏
ఆమె కధ
.......
కోవిడ్ 19 లాక్డౌన్... పర్యవసానం గా చేస్తున్న విజయ డెయిరీ కన్సల్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయడం.... తప్పని గృహ నిర్భంధం.... వ్యాపకం కోసం కష్టపడి స్మార్ట్ ఫోన్ లో తెలుగు టైప్ చేయడం కొద్దిగా నేర్చుకుని వాట్సాప్ లు, ఫేస్బుక్ లు చూడటం.... వాటిలో కాలక్షేపం కోసం రాసిన రాతలు.... కోతలు చేస్తున్న నాకు అనుకోకుండా ఒక రోజు ముఖ చిత్ర పేజీలో కవితాలయం వారి లోగిలి లో ఒక పదహారణాల అచ్చ తెలుగమ్మాయి అద్భుతమైన రాతలు చదివే అరుదైన అవకాశం కలిగింది.
ప్రతి రోజూ ఆమె రచనల కోసం ఎదురు చూసే వేలాదిమంది అభిమానులలో నేనొకడిని.
దివిసీమ సాహితీ ప్రపంచానికి అందించిన గొప్ప ధృవతార ఆమె. జయపురం.. నరసింహపురం.. గ్రామాల ముద్దుబిడ్డ.జొన్నవలస..విజయనగరం...అవనిగడ్డ ... బళ్ళారి ల లో విద్యాభ్యాసం చేసి, ఒక ఇంజనీరుగా రూపాంతరం చెందినా
ప్రవృత్తి రీత్యా సృజనాత్మక రచనా వ్యాసంగాన్ని ఔపాసన పట్టిన జీవన మంజూష ఆమె. ఆమే... ప్రసిద్ధ రచయిత్రి "మంజు యనమదల"
చిన్నప్పట్నుంచీ ఇంటా బయటా ఎదుర్కొన్న కష్టాలు శిలపై ఉలి చేసిన గాయాల వలే ఒక గొప్ప కవితా శిల్పంగా మల్చటానికి దోహద పడినాయి.ఇండియా లోనూ అమెరికా లో ను మహిళా సాధికారత కోసం ఆమె పడిన పాట్లు .. అడుగడుగునా చేసిన ఒంటరి పోరాటం... బహుశా నభుతో నభవిష్యతి....
సామాన్యురాలిగా కనిపించే అసామాన్య సృజనాత్మక రచయిత్రి ఆమె. అక్షర దేవతని ఉపాసన చేసి విలక్షణ రచనా శైలిని వరంగా పొందిన ఆమె రచనలు మంజీర నాదాలు. ఆమె రచనలలో పాఠకులందరూ ఎక్కడో ఒకచోట తమ స్వానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటారు. తన వైవిధ్య జీవనతరంగాలను అలవోకగా అక్షరాలలో పొదిగే నేర్పరి ఆమె.
ఇంజనీరు అయివుండీ అక్షరాల మీద విశిష్టమైన పట్టు సాధించిన అరుదైన రచయిత్రి ఆమె.
మానసిక శారీరక సంక్షోభాలను కష్టాలను అక్షరాల ఆలంబనతో పోరాడుతూ విజయ పథంలో పయనిస్తున్న విదుషీమణి ఆమె.
ఆమెకు చేతకానివి కూడా కొన్ని ఉన్నాయి..... అబద్ధం ఆడటం చేతకాదు.... లౌక్యంగా ఉండటం చేతకాదు..
నిజాయితీ గా నిర్మొహమాటoగా వుండటం ఆమె నైజం. అవే ఆమె రచనలకు ప్రాణాలు. సరాసరిగా గుండెకు తగిలే భావాల శరాలు ఆమె అక్షర తూణీరాలు.
ఒక గ్రామీణ బాపు-రమణల తెలుగమ్మాయి బాల్యం ఆమె చిన్నప్పుడు జయపురం, జొన్నవలస ,విజయనగరం, అవనిగడ్డ ల లో గడిపిన అనుభవాక్షరాల లో దర్శిస్తాo. బళ్ళారి కాలేజీ అనుభవాలు -అల్లరి ఆమె అక్షరాలలో పొందిగ్గా ఒదిగి పోయాయి.
ఇక అమెరికాలో ఆమె పడిన కష్టాలు.. ఒంటరి పోరాటం... గురించిన అనుభవాలు అనుభూతులు ఉత్కంఠను రేకిస్తాయి.. ఒకోసారి కడుపులో దేవినట్లు గా బాధగా అనిపిస్తాయి.
చిన్న వయసులో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో చీకటిలో వెలుగు కోసం ఎదురు చూస్తూ చేసిన ఆమె జీవన యానం రచన "కాలం వెంబడి కలం " యువతకు కరదీపిక గా పనిచేస్తుoదనటం లో సందేహం లేదు.
...... డా. డి. ప్రసాద్.
4_11_2021

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి