31, జులై 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఎనిమిదవ భాగం....!!

ఇప్పటి వరకు నాకు తెలిసిన వృత్తాల గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న  వివరాలు మీకు అందించాను... వృత్తాలు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల అనే నాకు తెలుసు... అంతర్జాలంలో వెదికితే మరికొన్ని వృత్తాల గురించిన వివరాలు దొరికాయి.... వాటిలో తరళము, తరలి, మాలిని కొత్తగా కనిపించిన వృత్తాలు... ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి.... వాటి గురించి మళ్ళి వారం చూద్దాము... దిగితే కాని లోతు  తెలియదు... ఒడ్డున ఉండి రాళ్ళు వేసేవాడికేమి తెలుసు... అన్న సామెత ఎంత నిజమో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది... సాహిత్యానికి ప్రాణాధారమైన భాషను గురించి నాకు తెలిసిన అది మా తెలుగు మాష్టారు చెప్పింది... నాకు బాగా ఇష్టమైన అమ్మ భాష గురించి నాలుగు ముక్కలు చెప్పేద్దామని గబ గబా మొదలెట్టేసానా... సముద్రంలో ఓపికగా వెదికిన కొద్ది మరకతమణులు, మాణిక్యాలు దొరికినట్లు ఈ సాహితీ ముచ్చట్ల కోసం వెదికిన వెదుకులాటల్లో ఎన్ని మణి మాణిక్యాలు మీతోపాటుగా నాకు దొరుకుతున్నాయో.... ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన సాహితీ సేవకు వందనాలు.... ఇక ఈ వారం వృత్త వివరణలు చూద్దామా....
తరలము

    ఇది మత్తకోకిలకి జంట వృత్తము
    మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.

 లక్షణములు

    పాదాలు : నాలుగు
    ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
    యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
    ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

నడక

    మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
    తనన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

ఉదాహరణ 2

క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569

తరలి పద్య లక్షణములు

    వృత్తం రకానికి చెందినది
    ధృతి ఛందమునకు చెందిన 97247 వ వృత్తము.
    18 అక్షరములు ఉండును.
    23 మాత్రలు ఉండును.
    మాత్రా శ్రేణి: U I I - I I U - I I I - I U I - I I I - U I U
        త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I I I - U I - U
        చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - I I U - I U
        పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I I I U - I U
        షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I I I - U I U
        మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I I I - U I U
    4 పాదములు ఉండును.
    ప్రాస నియమం కలదు
    ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
    ప్రతి పాదమునందు భ , స , న , జ , న , ర గణములుండును.

ఉదాహరణ 1

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

మాలిని

సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.

లక్షణములు

    పాదాలు : 4
    ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
    యతి : 9వ అక్షరము
    ప్రాస: కలదు

నడక

    ననన ననన నానా | నాననా నాన నానా

ఉదాహరణ 1

దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!

భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!

ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!

ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!

తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
తరలము(ధ్రువకోకిల)----న-భ-ర-స-జ-జ-గ----యతి-12
తరళము------------7నగణములు+గురువు----యతి-13

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner