25, సెప్టెంబర్ 2019, బుధవారం

రెప్పచాటు రాగం...సమీక్ష...!!

                              "  మది నిశ్శబ్ద రాగమే ఈ రెప్పచాటు రాగం..."
         గుప్పెడు గుండె సవ్వడులను, మౌనం చెప్పిన మనసు భావాలను రెప్పల చాటుగా దాచి మనకందించిన అక్షర సరాగమే లక్ష్మి కందిమళ్ళ రచించిన ఈ " రెప్పచాటు రాగం.. "  స్త్రీ తత్వపు సున్నితమైన లక్షణాలను, సహజత్వాన్ని అందంగా అక్షరాలకు అద్ది ఎన్నో భావాలను, ముచ్చట్లను తనదైన శైలిలో చక్కని అలతి పదాలతో అందించిన మనసు మౌనరాగమే ఈ " రెప్పచాటు రాగం.."
          వేదనాభరితమైన జ్ఞాపకాలు గుండె గాయపు గురుతులుగా మౌనాలాపన చేస్తున్నాయని అంటూనే మళ్ళీ కొత్తగా చిగురించాలన్న ఆశావహ దృక్పధంతో వేదన కవితకు ముగింపునివ్వడం కవయిత్రికున్న ఆశాభావాన్ని చెప్తుంది. " ఉనికిని తెలుపని కలలు ఉహలకే భారమై.." అంటూ " చితికిన బతుకులో వెలుగులు నింపని ఉషోదయం.. " అని బాధను కూడా అందంగా కరిగిపోతున్న కలలు కవితలో చెప్తారు. సుడిగుండాలు, మనిషి ఆశలే మనిషికి శాపమా, మనసు కష్టాన్ని, ఆకలికి దొంగిలించిన దొంగకు వేసిన శిక్షకు తల్లడిల్లి మానవత్వ మూలాలను ప్రశ్నిస్తారు. ఏకాంతంలో నిశ్శబ్ద శబ్దంలా హృదయరాగాలను పలికిస్తూ, శిలని శిల్పంలా మలుస్తూ, అక్షర దీపికలు వెన్నెల వసంతంలా చేరాయంటారు. ఆరాధనను ఆవేదనలో హృద్యంగా చూపిస్తారు. ఆశల తీరాలను, మనోభావాలను, నిజాన్ని, ఆశయాన్ని, అన్ని ఉండాలని నాకై నేనులో ఈ పాదం దివ్య పాదాల పదమై చిరు కాంతిగా మిగిలిపోవాలని కోరుకుంటారు. అహానిదే రాజ్యమైనప్పుడు ఇక బంధానికి తావెక్కడ అని ప్రశ్నిస్తారు అహం కవితలో. ఎంత ఆశో అంట నమ్మకమంటూ, నిశ్శబ్ద చెలిమి స్పర్శని నిశ్శబ్దంగా రెప్పల తడిని స్పృశించే హృదయాన్ని నిశ్శబ్ద రాగంగా వినిపిస్తూ, ఆకలి ఓ మొండి చుట్టమనడం ఆమెకే చెల్లింది. లాలనలో నిరీక్షణను, ఆశల గువ్వలు చిక్కుబడిపోవడాన్ని, అలసిన మనసును, స్పర్శలో స్మృతులు మిగిల్చిన మాధుర్యపు మమకారాన్ని, దుఃఖ దీవితో పాటుగా పంచమనాదాన్ని పలకరిస్తూ, మనోజ్ఞ దృశ్యాలను, ఆత్మీయరాగాన్ని అక్షరాల్లో అందిపుచ్చుకుంటూ, మధు కలశంతో నీకై ప్రతిక్షణం ఎదురుచూస్తున్నానంటూ తన ప్రేమను, ఆరాధనను సున్నితంగా అక్షరాల్లో ఇమిడ్చి చక్కని, చిక్కని భావాలు ఈ కవితల్లో కూర్చారు. ఒక రాత్రి తాకిన అడవిమల్లి మధుర పరిమళాన్ని, ఉహల ఊసులను, అనుభూతుల అనుభవాలను, ఓ పలకరింపు ఊపిరిగా ఎలా మారుతుందో వివరిస్తూ, నా నీడగా చైతన్య మంత్రమెలా ఉంటుందో చూడమంటూ, ద్విపద సుమాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో భావాలను  సరళ పదాల్లో చదువరుల మనసులకు హత్తుకునేటట్లుగా చెప్పడంలో లక్ష్మి కందిమళ్ళ పరిణితిని సాధించారు.
     " అలిగిన రాత్రిని
        పున్నమిగా మారుస్తూ
        లాలిస్తుంటావు.." (నా నీవై నాకై నువ్వుగా )
         ఎంత లలితమైన భావన ఇది.
శూన్యం మాటలను మౌనంతో బంధించాక నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దానౌతున్నా అంటారు. నీకు నీవే ఓ ప్రశ్నలా మిగిలిపోతున్నావంటారు మరో కవితలో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ని రాకతో నాలోని నిశ్చలత్వం కవిత్వమై కడలి హోరును, తూరుపు సిందూరాన్ని, వసంతపు అందాలను, కాలం చేసి అద్భుతాలను, ఏకాంత వేళ మౌన నిరీక్షణను, వెన్నెలపూవులను తనదైన శైలిలో వర్ణిస్తూ మనల్ని ఆకట్టుకుంటారు.  జీవితం కడిగిన ముత్యమై మెరవాలంటారు. ఒక సవ్వడిని ఎద సవ్వడిగా వినిపిస్తారు. ఎండమావిని బంధించాలంటారు. నిరంతరం మనసు పలికే మధుర భావాలు ఏమిటో తెలియకున్నా ఒక దేనితో ఒకటి ఎలా ముడిబడి ఉంటాయో అంటూ మనసు, మానవత్వం, ఆహ్లాదం, తొలిపొద్దు ఇలా ప్రతి చర్య ఒకదానితో ఒకటి ముడిబడే ఉంటాయన్న సత్యాన్ని చాలా గొప్పగా చెప్తారు. ప్రకృతితో మనసు మమేకమైనప్పుడు ప్రతి రేయి వెన్నెల వసంతమేనంటారు. ఓ స్పర్శ భరోసానిచ్చే ఆత్మీయ ఆలంబన కావాలంటారు. ప్రతిదీ అపురూపమే అయినా, ష్.. అలికిడి చేయకుండా నిన్నటి గురుతుల్లో కాసిన్ని హాసాలు చిలకరించమని చమత్కరిస్తూ, నీలోని నీవును తెలుసుకోమని తాత్వికతను జోడిస్తూ జీవనతృష్ణను చెప్పడం చాలా బావుంది.
      కొత్త గుభాళింపులను, నిశ్శబ్ద ఏకాంతాలను, హృదయరాగాన్ని, ఓ నిశ్చలత్వపు నిరీక్షణను, భరోసాని, సందిగ్ధావస్తను, జ్ఞాపకాల గుభాళింపును, పులా అంతరంగాన్ని, మనసును, పచ్చని చెట్టును, నీ రాకకై ఆమె జాబిల్లి కోసం కలల దీవిలో కౌముదిగా వేచి ఉండటాన్ని, మధుర రహస్యాలను, ఇంతే అంటూ ఒకే ఊపిరిగా మారిన ఇరు మనసుల సాన్నిహిత్యాన్ని, కవి అక్షరం ఎప్పుడు సూర్య, చంద్రులకు ప్రతికేనంటూ చక్కని పద ప్రయోగాలతో భావాలను ఒలికించారు.
    చివరిగా ఆటను వేసిన ముద్రలను, చీకటిని నింపుకు వస్తున్న విషాదాన్ని, ఆమె పొదివి పట్టుకుని, నిశ్శబ్దంగా దీపమై ప్రజ్వలిస్తూ ఉంటుంది అని నిశ్శబ్ద దీపం కవితలో అంటారు. ఎంతో లోతైన భావమిది. నాకు చాలా నచ్చిన కవిత కూడా. చాలా చిన్న కవితే కాని సముద్రమంత విషాదం నిండి ఉంది ఈ కవితలో.
    ఎన్నో నిశ్శబ్దాల చప్పుళ్ళను, ఓ మానవత్వపు మనిషి మనసు రాగాలను చక్కని వాడుక పదాల్లో పలికిస్తూ, తన భావాలను చిక్కని, చాలా వరకు నిడివి తక్కువ కవితలుగా లక్ష్మి కందిమళ్ళ రాసినా, వాటిలోనున్న లోతైన, అర్థవంతమైన భావాలు చదువరులను ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న కవితలతో మొదలైన తన అక్షర ప్రస్థానం నేడు చక్కని కవితలుగా పలువురి ప్రశంసలు అందుకుంటూ, వన్నెలు సంతరించుకున్నాయి. మరిన్ని భావ వీచికలు లక్ష్మి కందిమళ్ళ కలం నుండి జాలువారాలని, తెలుగు సాహిత్యంలో తనదైన శైలిని ముద్ర వేయాలని కోరుకుంటూ... మనసు రాగమై అలరించిన రెప్పచాటు రాగానికి హృదయపూర్వక శుభాభినందనలు.

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

మనోలోకం..!!

పాత సామాన్ల గదిలో
భోషాణం పెట్టె మీద
మనసయ్యిందెందుకో

ఊతంగా గోడ పట్టుకుంటూ
డాబా మెట్లు ఎక్కలేకున్నా
తడిమిన జ్ఞాపకాలు నిలువనీయలేదు

వయసుడిగిన శరీరానికి
వచ్చి చేరిన వార్ధక్యపు వాసనలానే
మంజూషానికీి అవే పాతకాలపు సువాసనలు

చీదరింపులు చీత్కారాల నడుమ
చెమత్కారాల నవ్వుల కోసం మెుదలైన
ఈ వెదుకులాట మనోలోకపు రహదారిగా మారింది

రెండు పసితనాల మధ్యన
మిగిలిన అనుబంధాల ఆనవాళ్ళలో
జీవిత పుటలన్నీ మళ్ళీ చదవాలనే ఈ పయనం...!!

19, సెప్టెంబర్ 2019, గురువారం

బుద్ధయానం సమీక్ష ..!!

                                           " ఆత్మయానం ఈ బుద్ధయానం..."
      తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయి, వస్తున్నాయి. కొందరు లఘు కవితా ప్రక్రియలను ఆదరిస్తున్నారు. మరి కొందరు విమర్శిస్తున్నారు. మెచ్చుకోలు, విమర్శ అన్నవి ఏ రంగంలోనైనా సహజమే. మన తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు పద్య సాహిత్యానికి పెద్ద పీట వేశారు. రాను రాను కాలానుగుణంగా ఎన్నో మార్పులు సాహిత్యంలో చోటు చేసుకున్న సందర్భాల్లో దీర్ఘ కవిత్వాలు, ప్రాకృత సంబంధిత సాహిత్యమూ వెనుకబడుతూ వచన సాహిత్యం ముందుకొచ్చింది అదీ వాడుక భాషలో. ఈ ఒరవడిలో మొదలైనదే లఘు కవితా ప్రక్రియ. దీనిలో నానీలు, హైకూలు, రెక్కలు, ఏక్ తారలు, ద్విపద మాలికలు, త్రిపదలు ఇలా ఎన్నో రూపాలు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్య భాషల నుండి వచ్చిన ప్రక్రియలను ఆదరించే మనవాళ్ళు మన భాషలో ఎవరైనా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుడితే ప్రోత్సహించడం పక్కనబెడితే విమర్శించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. భాష, భావం రెండూ మనుషులకు, మనసులకు త్వరగా చేరడానికి ఏ ప్రక్రియైనా ఒకటే.
        ఈ లఘు కవితా ప్రక్రియల్లో ఒకటైన రెక్కల గురించి నాలుగు మాటలు చెప్పి తరువాత బుద్ధయానం సమీక్ష చూద్దాం. తేలికగా అలతి పదాలతో నాలుగు పాదాలు వాటికీ జతగా కొసమెరుపుగా మరో రెండు పాదాలు కలిపితే ఓ రెక్క.  ఈ రెక్కల సృష్టికర్త యం కె సుగం బాబు గారు. వారి తోలి రెక్క
" మట్టిని ప్రేమించేవాడు
మనిషినీ
మనిషిని ప్రేమించేవాడు
మట్టినీ ప్రేమిస్తాడు -

అమ్మానాన్న
మట్టి మనుషులు ! "  మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు అదీ అలతి పదాల్లో.
ఇదీ రెక్కల రూపకల్పన.
        డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి గురించి తెలియని వారు దివిసీమ సాహిత్యకారుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. వారి నాన్నగారి నుండి సంక్రమించిన పద్య కవిత్వాన్ని అందిపుచ్చుకుని ఎన్నో బాల సాహిత్యం పుస్తకాలూ, గేయాలు రచించి, మరెన్నో శతక పుస్తకాలు, దివిసీమ మీద అపారమైన ప్రేమతో దివిసీమ గురించి, ఆ  దివిసీమ సాహిత్యకారులు గురించి లోతైన అధ్యయనం చేసి వాటికీ పుస్తక రూపమివ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. విష్ణుప్రసాద్ గారు నిత్య సాహిత్య కృషీవలుడు. తనకెంతో మక్కువైన పద్య సాహిత్యం నుండి వచన సాహిత్యానికి అదీ ఈ రెక్కల వైపు మొగ్గు చూపి తొలుతగా కృష్ణాజిల్లాలో పుస్తకం తేవడం అభినందనీయం.
       తన మనసు చెప్పిన భావాలకు రెక్కల రూపాన్ని అందంగా దిద్ది మన ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే ఈ " బుద్ధయానం ". తోలి రెక్క అధికారం ఉన్నా లేకున్నా కాలగమనంలో తేడా ఉండదు, అన్నింటికన్నా మానవసేవే అమూల్యమైనది అంటూ చక్కని మాట చెప్తారు. మరో రెక్కలొ సేవకు రెండు, హ్యాండు ఉండదు, శాంతి మార్గమే బుద్ధయానం అంటూ శాంతి సందేశం వినిపిస్తారు. వేదం నుండి వేదన పుట్టింది, తరాల ఆస్థి అంతరంగం అంటారు మరో చోట. బాల్యమూ, వార్ధక్యమూ రెండు ఒకటే చేయి పట్టుకు నడిపించాల్సిన దశలని చెప్పడం చాలా బావుంది. చెరగని ముద్ర చరిత్ర మరక నిన్నైనా నేదైనా రేపైనా అంటారు మరో రెక్కలొ. బ్రతుకు గీత, కన్నీరు, పన్నీరు వెదురు పలికే వేణువు అంటూ చక్కని జీవిత సత్యాన్ని చెప్పడం, పెరట్లో మొక్కలు విరిసిన అక్షర కుసుమాలు పరిమళించేదే కవిత్వ పుస్తకమంటూ కవిత్వాన్ని సింహాసనంపై కూర్చోబెట్టారు. సంసారమంటే సరాగము విరాగము కాదు, సాధితేనే సుగంధం అంటారు. నేలమ్మ సహనాన్ని, విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని, రక్త సంబంధాలను, పలకరింపులు పరమౌషధాలని ఇలా సమాజంలోని ప్రతి చిన్న విషయాన్ని అర్థవంతమైన పదాలతో చక్కని రెక్కలుగా మనముందుకు తెచ్చిన ఈ బుద్ధయానంలో ఎన్నో కనిపిస్తాయి. ఇది చూడండి ఎంత బావుందో.
" ఒణుకుడు
   రోగికి
  చలి
 ఒక లెక్కా -

వరదనీరు... 
చేపపిల్ల ! "
ఇలాంటి జీవిత సత్యాల రెక్కలు వందకుపైగా పొందుపరచి మనకు అందించిన అపురూప అక్షర తూణీరం ఈ  " బుద్ధయానం ". అందరు చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.



కల కనుమరుగౌతోందా...!!

జ్ఞాపకాన్ని 
కనుమరుగు చేద్దామనుకున్నా
గాయం గతాన్ని గుర్తుచేస్తోంది

హృదయాన్ని
ఊసులతో ఊపేద్దామనుకున్నా 
ఏ స్మ్రతికి తావీయక నిర్లిప్తత కమ్మేసింది 

మౌనాన్ని
మాటల్లో పెట్టేద్దామనుకున్నా
పలకరింతలే వద్దంటూ పారిపోయింది

నవ్వులన్నీ 
దోసిట్లో దాచేద్దామనుకున్నా
అలిగిన మెాము చిన్నబోయింది

కన్నీళ్ళన్నీ
కనురెప్పలతో స్నేహం చేస్తున్నా
చెక్కిలిని తాకిన చెమ్మ కనబడకుంది

బాధ్యతలన్నీ
బంధాలకు కట్టుబడి భారమైపోతున్నా
అనుబంధాల ఆసరా కానరాకుంది

కలలన్నీ
ఇంకిపోయి కలతలనాహ్వానిస్తున్నా
కాదనలేని జీవితమైపోయింది

కాలాలన్నీ
క్షణాల గుప్పిట్లో బంధించబడున్నా
రేపటిపై ఆశే ఆయువౌతోంది ..!!





  






17, సెప్టెంబర్ 2019, మంగళవారం

జీవన 'మంజూ'ష (అక్టోబర్)..!!

నేస్తం,
         వ్యవస్థ మారాలనుకుంటాం కాని ఆ వ్యవస్థలో భాగమయిన మనం మారాలని ప్రయత్నించమెందుకో. చట్టం, న్యాయం అని పాకులాడతాం కాని అవి మన అవసరానికి అక్కరకు రావని, అధికారానికి, డబ్బుకు మాత్రమే కొమ్ము కాస్తాయని తెలిసి కూడా న్యాయం కోసం వాటిని ఆశ్రయించడమంత బుద్ధితక్కువ పని మరొకటి లేదని అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు, సమాజంలో మార్పు కల్ల అని అర్థం అవుతుంది.
        తెల్లకోటు, నల్లకోటు, ఖాకీచొక్కాలు దోచుకుంటున్నంత రాజకీయ నాయకులు కూడ దోచుకోవడం లేదేమెా. సమాజం మెుత్తం కార్పొరేట్ కాళ్ళ కింద తొక్కబడిపోయింది. వారికి రాజకీయ పార్టీల అండదండలు సంపూర్ణంగా ఉండడంతో వ్యవస్థ మెుత్తం ఈ కార్పొరేట్ చేతుల్లో పడి బయటకు రాలేని పరిస్థితి ఇప్పుడు. మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయి సామాన్యుల బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. 
        ఇక కుటుంబాల విషయానికి వస్తే, అనుబంధాలు, అభిమానాలు అరకొరగానే అగుపిస్తున్నాయి. ఒక్కోతరం అంతరించి పోతున్నట్లే, కుటుంబ విలువలతోపాటు, వాటికి మూలమైన బంధాలు కూడ పలుచనయి పోతున్నాయి. చావు పుట్టుకలు ప్రతి ఇంటికి సహజమన్న నిజాన్ని మరిచి, మనం అన్న మాటను కనుమరుగు చేసుకుంటూ...నేను అన్న అహం ఆభరణంగా మన జీవితాలు గడిచిపోవడం ఎంత విచారకరమెా ఊహించలేక పోతున్నాం ఈనాడు. గతాన్ని, జ్ఞాపకాలను మన మనసుల నుండి తొలగించేస్తూ, మనిషిగా మన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకోవడం ఎంత వరకు సబబో మరి..?                   
       ఓ చావుని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలా అని ఆలోచన చేసే స్థాయికి ఇప్పుడు మనం ఎదిగినందుకు సంతోషపడాలేమెా. వ్యక్తిగత జీవితాలను ఆ మనుషుల బతికుండగా మన అవసరాల కోసం వారిని పార్వతీపరమేశ్వరులని పొగుడుతాం. అదే నోటితో వారు కాలం చేసాక తప్పుడు వాగుడు వాగుతాం. కనీసం వారు బతికున్నప్పుడు ఓ పలకరింపు కాని, మాట సాయం కాని చేయలేము. అయినా మన నైజం ఊరుకోదు కదా. సాహిత్యమైనా, రాజకీయమైనా శవ రాజకీయాలంటే మక్కువ ఎక్కువైన మనకు తన మన బేధం లేదులే. మరి ఈ వికృతపు మనస్తత్వాలు మారేదెన్నడో...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner