2, అక్టోబర్ 2026, శుక్రవారం

జీవన మంజూష 10/26 (నూరు నెలలు)

 


ఈ నెల నవ మల్లెతీగలో నేను రాసిన “నూర(100)వ వ్యాసాన్ని ప్రచురించిన నవ మల్లెతీగ సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు🙏




నేస్తం,

          పరమాణువు అణువుగా మారడం, కణంతో మెుదలై విశ్వానికే అంతుపట్టని అద్భుత రహస్యం జీవప్రక్రియ. ప్రకృతి జీవరాశులకు అందించిన జీవచైతన్యం. మానవ మేధస్సుకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతూనే, జీవక్రియల జీవితాలతో ఈ సృష్టిని నింపేసిన అద్భుత చిత్రాలలో మానవజన్మ ఉత్తమమైనదని మన పూర్వీకులు చెప్పారు. ఓ ప్రాణి మరో ప్రాణికి జన్మనివ్వడం అన్నది ఏ కొలమానానికి అందని లెక్క. మరణం ముంగిట నిలబడున్నా, మరో ప్రాణికి జీవానివ్వడంలో ఆనందాన్ని వెదుక్కుంటూ, చావుకు భయపడని ప్రాణి “అమ్మ”.

ఈ సృష్టిలో పర్యాయపదం లేని ఒకే ఒక్క పదం “అమ్మ”. 

            నడక నేర్పింది అమ్మ ఐతే నడిపించింది నాన్న. అక్షరాల్లో అచ్చులు, హల్లులు కలిస్తేనే పదం. పదం పదం జతకలిస్తే వాక్యం. వాక్యాల్లో జీవితం. జీవితంలో ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలు గెలుపు రుచి చూపిస్తాయి అన్నది సత్యం. గెలుపు ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తే ఓటమి నిన్ను నీకు తెలుపుతుంది. ఈ ప్రపంచంలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది మనల్ని మాత్రమే. తప్పొప్పుల బేరీజు మనల్ని మనం సరిగ్గా వేసుకున్న రోజు ఏ విమర్శకయినా మనం ఎదురునిలవగలం. అదే నీ గెలుపు అవుతుంది. ఎదుటివారిలో లోపాలు వెదకడం తగ్గించి, కాస్త మనిషితనం చూపించగలిగితే మానవజన్మకు కాస్తయినా సార్థకత లభిస్తుంది. 

               కొందరికి ఏకాంతాన్ని అందంగా మలుచుకోవడం కోసం అక్షరాల సాయం ఆసరా దొరికితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది! ఏకాంతాన్ని, ఏకాకితనాన్ని కూడా అక్షరాలకు అప్పజెప్పేసి, ఆ దారినే అక్షర రహదారిగా  మార్చేసిన జీవితాలు, చాలామందికి తమ తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవడానికి పనికివస్తాయి. ఆఁ ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలే కదా, అవేం ఉపయోగపడతాయి అని వదిలేస్తే..అమ్మ అక్షరాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరయినా వున్నారా! ఇక్కడ అక్షరం , చదువు ఒకటి కాదు. చదువులేని గొప్పవారిని కూడా వారిని కూడా ఈ ప్రపంచానికి తెలియజెప్పింది అక్షరమే. చరిత్రకు మూలమైన అక్షరాన్ని గౌరవించడం మన సంస్కారం. 

                 నా చిన్నప్పటి నుండి అమ్మతో మెుదలైన ఈ అక్షర ప్రయాణం నాన్నతో నడిచి, బుడిబుడి అడుగులతో కోపాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, బాధలు, సంతోషాలు..ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా నా మనసుకు అనిపించిన భావాలతో నాకోసం రాసుకున్న నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” నుండి ముఖపుస్తకానికి విస్తరించి, అనుకోకుండా అచ్చైన నా మెుదటి కవితల పుస్తకం “అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు” తో పరిచయమైన మల్లెతీగ పబ్లికేషన్స్ కలిమిశ్రీ గారి కుటుంబంతో నా అక్షరానుబంధం కొనసాగింది నేటివరకు. చిన్న చిన్న వ్యాసాలు రాసే నన్ను నవ మల్లెతీగలో నెలనెలా వ్యాసం రాయమంటే రాయగలనా అని భయపడితే, సాగర్ శ్రీరామ కవచం గారు, కలిమిశ్రీ గారు రాయగలనన్న భరోసానిచ్చారు. ఏది రాసినా ఎడిట్ చేయకుండాప్రచురించి, రచయిత భావాలకు విలువనిచ్చిన కలిమిశ్రీ గారికి, ఆదరించి అభిమానించిన పాఠకదేవుళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner