2, అక్టోబర్ 2023, సోమవారం

మ’రణం అంటే..!!


మనం 

కనబడకుండా 

పోవడమా


మనిషిగా

మిగలని

నైజమా


జీవమున్న

జీవచ్ఛవాలుగా

బతకడమా


అనుబంధాల

యుద్ధంలో

ఓడిపోవడమా


జీవితానికి

రాజీనామా

చేయడమా


బతికున్నా

బతుకులేని

అభాగ్యమే మ’రణమంటే..!!


1, అక్టోబర్ 2023, ఆదివారం

కొన్ని క్షణాలు..!!

         కొన్ని సంతోషాలను ఆస్వాదించడమే కాని మాటలు వుండవు. దాదాపు నా చిన్నప్పటి నుండి నాతో వున్న నేస్తాలను నాకు గుర్తున్నంత వరకు వదులుకోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మీయతలను పంచుకోవడమే తెలుసు. 

   బంధాలనేవి మనం పెంచుకుంటే పెరగవు. తుంచుకుంటే పోవు. కాసులకు వెంపర్లాడుతున్న నేటి రక్త సంబంధాలు పలకరింపులకు కూడా దూరంగా వుంటున్నాయి. పక్కనే వున్నా దూరమెక్కువై పోతోంది మాటకు కూడా నోచుకోకుండా. ఇవి మన నేటి రక్త సంబంధాలు.

    ఆరేళ్ళ వయసులో మెుదలైన స్నేహం ఒకటి, పన్నెండేళ్ళ వయసులో దగ్గరైన అనుబంధం మరొకటి, ఇంజనీరింగ్ లోని ఆత్మీయత ఇంకొకటి. ఇలా ఈ మూడు నెయ్యాలు ఈ మధ్యకాలంలో కాసేపు పలకరించి ప్రేమను పంచాయిలా…

అవనిగడ్డ, విజయనగరం, అమెరికా….

థాంక్యూ సోమచ్ శ్రీలక్ష్మి, రమణి, అరవింద్,


30, సెప్టెంబర్ 2023, శనివారం

ఎన్నుకోండి..!!


ఎన్నుకోండి ఎన్నుకోండి

ముద్దులిచ్చే మారాజులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

భస్మాసుర హస్తాలను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

కూల్చివేతల పురోభివృద్ధిని ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

ఆర్థిక నేరగాళ్లను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

రక్తపు మరకల రంగురాళ్ళును ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

రక్తపాశాలను వెలివేసిన వాళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

మాతృభాషను మృతభాషగా మార్చినోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

శవాల పక్కన చిరునవ్వులు చిందించేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

కుతంత్రాల కుక్షులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

పాలనెరుగని ఏలిముద్రగాళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

ఆంధకారాన్ని అందించేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

అమ్మామెుగుళ్ళలనేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

పార్టీలు మారే ఊసరవెల్లులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

దైవా(దెయ్యా)న్ని ఎన్నుకోండి


పడండి పడండి

బాగా బాగు పడండి..!!

27, సెప్టెంబర్ 2023, బుధవారం

కొన్ని రాతలు..!!

కంటికి కనిపించినంత మేరా

నీలి రంగుల ప్రతిబింబాలే

సముద్రమెుడ్డున నిలబడినప్పుడు


అందినట్లున్న ఆకాశం

అందకుండా కవ్విస్తుంటుంది

నన్నందుకోలేవన్నట్టుగా


ఎగసిపడే అలలు 

ఆటలాడుతుంటాయి

తీరంతో పోటీపడుతూ


కొట్టుకొస్తున్న గవ్వల్లో

దాగిన జ్ఞాపకాలను 

గుప్పెట దాయాలన్నంత ఇష్టం


సైకతపు రాతలు

చెరపడానికి కష్టపడనక్కర్లేదు

కాని మనసుపై ముద్రను మాపలేం కదా..!!



రెక్కలు

 1.  వాయిదాల మీద

బతికేవాడొకడు

వద్దనేవాడు

ఒకడు


న్యాయం

ఎటువైపో..!!

2.  అత్యంత కీలకం

అభియోగం

నిరాధారమైనది

సాక్ష్యం


ఇదే

నేటి న్యాయం..!!

3.  మంతనాలు

ముగింపుకు రాలేదు

వాయిదాల పర్వం

కొనసాగింపు


అభియోగాలది

ఎంత గొప్పతనమో..!!

4.  వేల కొలది

పేజీలు

వందల కొద్దీ

అభియోగాలు


తీర్పులకు

సమయమెక్కడా..!!

5.  చీ’కటి బతుకులే

మనవి

వెలుతురు వాకిలి

తెరిచున్నా


ధిక్కారస్వరం

వినిపించలేనప్పుడు..!!

6.  బతుకు భయమే

ఎప్పుడూ

బాధ్యతలకు

బంధీలుగా


జీవన(వి)చిత్రం

ముఖచిత్రంగా..!!

7.  ఇష్టపడి చేయడంలో

ఆనందం

నిర్భందించి చేయించుకోవడంలో

అహం 


ఏదైనా

చరిత్రే..!!

8.  చదువుకున్న

విజ్ఞత

చదువు’కొన్న

మూర్ఖత్వం


ప్రపంచం

తెలుసుకుంటోంది..!!

9.  వాయిదాలు

రిజర్వులు

కాలయాపనే

కర్తవ్యం


ఇప్పటి

రాజ్యాంగమిది..!!

10.  మనసు

సముద్రం

మనిషి

జీవిత సంచారి


సృష్టి

వి’చిత్రం..!!

11.  అహంకారం

మానవత్వాన్ని మరిచింది

మనిషితనం

ఆత్మీయతను పంచింది


శాశ్వతానికి అశాశ్వతానికి

అక్షరమే తేడా..!!

12.  మాట

కఱకు

మనసు

బరువు


మృష్టాన్నం

బాగు బాగు..!!

13.  కరిగిన కాలానికి 

జ్ఞాపకాల అలంకరణలు

మలి పలకరింపుల 

చిరునగవులు


గుప్పెట దాచిన

అనుభూతుల జాడలు..!!

14.  రాక

పోక తప్పదు

మాజీ

తాజా మారకమే


నడిమధ్యదే

ఈ జగ’న్నాటకం..!!

15.  బాధ్యత

బరువు

బంధం

అరువు


అబద్ధం

అందమైనది..!!

16.  అరకొర

ఆనవాళ్ళు

ఆశ ఛావని

బతుకులు


నిజం

మారదు..!!

17.  న్యాయం

మారదు

అన్వయం

అవసరాల్ని బట్టి


భగవద్గీత

ఒక్కటే..!!

18.  పోటాపోటీగా

(వి)గ్రహాలు

(తే)నీటి

కావ్యాలు


గతుల

నిర్దేశం..!!

19.  దూరంగా వుంటే

ఓ పలకరింపు

దగ్గరలో వుంటే

ఓ ఆత్మీయ కలయిక


గడిచిన క్షణం

తిరిగిరాదు..!!

20.  తెగింపుతో

తేలుతుంది

ముగింపు

ఏమిటో


గెలుపే

లక్ష్యం..!!

21.  అక్షరాల

అమరిక

అతివ

అందం


కొందరికి

పైత్యం..!!

22.  వేడుకోలు

అప్పుడప్పుడు

వీడుకోలు

తప్పనిసరి


పయనం

కాలంతో..!!

23.  ఆకాశంలో 

సముద్రం 

మోడైన 

ఒంటరితనం  

కలవని తీరాలు 

కలల విహంగాలు..!!

24.  అర్థం

కావడం

వ్యర్థం

అవడం


ప్రకృతి

సహజం..!!

25.  బంధాల్లేని

చుట్టరికాలు

అనుబంధాల్లేని

రక్త సంబంధాలు


కాలం చెప్పే

కథలే ఇవి..!!

26.  ఎదుగుదల

మంచిదే

ఏకాకితనానికి

అర్థం తెలిస్తే


బంధం

నిలబడుతుంది..!!

27.  సంతకం

విలువైనదే

బంధం

బలమైనది


అవసరాన్ని బట్టి

విలువల మార్పు..!!

28.  ఏ ఆటైనా 

ఆడించేది వాడే 

ఫలితాన్ని 

నిర్దేశించేది వాడే


చతురుడు

పైవాడు..!!

29.  విద్య

ఉండాలి

వైవిధ్యం

తెలియాలంటే


గుర్తింపు

గొప్పదనం..!!

30.  వెలితి

పడటం

కలత

చెందడం


మనసుకు

తప్పనిసరి..!!





Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner