26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఎవరు స్ట్రాంగ్...!!

మొన్న ఒకరోజు దోమల్ని చంపుదామని మొదలు పెట్టి పాపం అవి రోజు మమ్మల్ని కుడుతున్నాయని మేము వాటిని చంపడం....మా ఇంట్లో గత ఐదు ఆరు నెలల నుంచి రోజు జరిగే దినచర్య...సినిమా చూస్తూ ఎందుకో అనుకోకుండా అప్పటికప్పుడు బాట్ పట్టుకుని గదిలోకి వెళ్లాను...కొన్నిటిని చంపాను...అవి మరి బాగా తిట్టేసుకుని ఉంటాయి...మంచం మీద నుంచి మరి కాలు ఎలా జారిందో తెలియలేదు మొత్తానికి మోకాళ్ళ మీదకి పడి నుదురు ఒక పక్క గోడకి ఎంత బాగా కొట్టుకుందంటే గోడకి తడి అలా ఉండి పోయింది నుదురు బొప్పి అంతే ఉన్ది..!! కాని గోడ పగలలేదు నా నుదురు పగలలేదు...కాళ్ళు విరగలేదు...మొత్తానికి గోడ నేను రెండూ గట్టే...!!




23, ఫిబ్రవరి 2013, శనివారం

బంగారం కన్నా విలువైన....!!

ఒక వారం క్రిందట సాయంత్రం మా ఇంటికి నా చిన్ననాటి స్నేహితుడు 27 ఏళ్ళ తరువాత....వైజాగ్ నుంచి ఇక్కడ పెళ్ళి ఉండి వచ్చి...చాలా సంవత్సరాలు అయిందని చూసి వెళదామని వచ్చాడు...తనతో వచ్చిన ఫ్రెండ్స్ కి అప్పటి మా చదువుల గురించి...స్కూలు గురించి...స్నేహితుల గురించి కబుర్లు చెప్తూఉంటే మళ్ళి ఒక్కసారిగా ఆ చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళినట్లుగా అనిపించింది....!!
చేసిన అల్లరి...చదివిన పుస్తకాలు(క్లాసు పుస్తకాలు కాదండోయ్) నాకు రెండో తరగతి నుంచే వారపత్రికలు కూడా చదివే అలవాటు ఉందని అందరికి తెలుసు...!! -:)....తిన్న దెబ్బలు ఒక్కసారే లెండి నేను దెబ్బ తింది...పాఠం చెప్పకుండా ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఎలా చెప్తామేంటి....?? డెబ్బై మంది వరకు ఉండి ఉంటారు క్లాసులో ఒక్కరూ మాట్లాడలేదు అందరూ దెబ్బలు తింటున్నారు...నన్ను కొట్టారు అప్పారావు మాస్టారు. నేనేమో దెబ్బలు అస్సలు తినను ఎప్పుడు...అంతకు ముందు కూడా రెండు సార్లే తిన్నాను ఒకసారి ఐ రాయడం రాక చాలా చిన్నప్పుడు కాని బాగా గుర్తు...ఇంకోసారి జనవరి 1 కి ఇంగ్లీష్ తొందరగా చదవలేదని....అస్సలు సంగతి అది కాదులెండి ఆపిల్స్ ఇవ్వలేదని హెడ్ మాష్టారు రత్నారావు గారు ఆ రోజు కూడా అందరిని కొట్టారు...అయ్యో అసలు విష్యం చెప్పడం మర్చిపోతున్నాను....కొట్టారు కదా దెబ్బ బాగా తగిలింది...వేసింది ఒక్క దెబ్బే అయినా అలవాటు లేదుగా...అరచెయ్యి బొటనవ్రేలి కింద వాచిపోయింది...బాగా కోపం వచ్చేసింది...నొప్పి ఒక పక్కనా...ఆయనకు కాస్త మతి కూడా సరిగా ఉండేది కాదులెండి...ఎవ్వరు ఏం మాట్లాడకుండా దెబ్బలు తింటూనే ఉన్నారు..నేను ఆ స్కూల్ కి వెళ్ళింది ఏడో తరగతి లో...ఆ సంవత్సరమే కొత్తగా..!! దెబ్బ చూసుకుంటే ఏడుపు కోపం రెండు వచ్చేసాయి...వెంటనే ఏంటండి మీరు పాఠం చెప్పకుండా ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఎవరు చెప్తారు అని గట్టిగా అనేసాను....మళ్ళి మాట్లాడుతున్నావు అని కర్ర ఎత్తారు మాష్టారు....ఏ మళ్ళి కొదతారా...!! అని  గట్టిగా అనేసాను....ఏదైతే అదే అవుతుంది లెమ్మని...!!
క్లాసు మొత్తం ఎంత నిశ్శబ్దం గా అయిందంటే సూది పడితే వినిపిస్తుంది అన్నట్లు -:).
అది ప్రభుత్వ పాథశాల అందులోను విజయనగరం దగ్గర పల్లెటూరు...ఆడపిల్లలు ఎక్కువగా చదివేవారు కాదు అప్పట్లో....చదివినా చాలా తక్కువ మందే ఉండేవారు....!!  అదీను ఆడపిల్లలు ఎదురు తిరిగితే ఇంకేమైనా ఉందా...!!
ఆ తరువాత ఎప్పుడు దెబ్బలు తినలేదు నేను...!!
పదోతరగతి లో మా బాచ్లో ఏడుగురం పాస్ అయ్యాము..దానిలో నాలుగు ప్రధమ శ్రేణి... మూడు ద్వితీయ శ్రేణి.
అప్పుడే కాస్త తెలుగులో మార్కులు ఎక్కువ వేశారు...మా తెలుగు మాష్టారి అబ్బాయికే మాములుగా ఎక్కువ వచ్చేవి...నాకేమో కోపం నాకెందుకు రావడం లేదా అని....మొత్తానికి నాకే ఎక్కువ వచ్చాయిలెండి..ఆ తెలుగు మార్కులు చూసి అక్క వాళ్ళు అందరూ ఏం రాశావే అన్ని మార్కులు వచ్చాయి అని ఒకటే ఏడిపించడం.
ఏంటి ఎన్ని మార్కులు వచ్చేసాయో అనుకుంటున్నారా మరి 1986 లో తెలుగులో 81 అంటే గొప్ప కాదేంటి...!!
రామదాసు కీర్తనలు విన్నప్పుడల్లా నాకు మా తెలుగు పరీక్షే గుర్తు వస్తుంది...!! రామదాసు గురించి రాస్తూ సీతమ్మకు చెప్పే విన్నపాలు అన్ని రాసేసాను...స్నేహితురాలికి గ్రంధాలయాల ఉపయోగం గురించి ఉత్తరం  రాయమంటే ప్రాచీన గ్రంధాలయాల గురించి ఎక్కడ ఏమేం ఉన్నది వివరంగా రాసేసాను...అప్పటికే ఉత్తరాలు బాగా రాసేయడం అలవాటు కదా....!! మరి అందుకే అన్ని మార్కులు వేసి ఉంటారు...-:).
రేడియోలో వచ్చే లలిత సంగీతం, సాముహిక గేయాలు నేర్చుకోవడం, పాటలు, ఆటలు, అల్లరి, పోట్లాటలు, వనభోజనాలు, ఇలా ఎన్నో మరపురాని మధుర బాల్యానుభూతులు మళ్ళి మననం చేసుకుంటే ఎంత బావుందో...!!

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రేపటి రోజుల్లో....!!

పొద్దున్నే పదకొండుకి ముందు ఫోన్ వస్తే ఏంటబ్బా అనుకుంటూ ఫోన్ తీస్తే...ఏమే బతికే ఉన్నావా బాంబు పేలినా....!! అంటూ నా ఫ్రెండ్ శోభ పలకరింపు....!! బతికి లేక పొతే మాట్లాడను కదే అని ఎక్కడ ఏంటి అంటే నువ్వు ఉన్న చోట కూడా జరిగింది కాకపొతే బయట అన్నారు.... టి వి చూడటం లేదా న్యూయార్క్ లో..పెంటాగన్...పిట్స్ బర్గ్ లలో బాంబ్స్ పేలాయి...!! అంటూ విష్యం చెప్పింది...

నిన్న హైదరాబాద్ లోబాంబ్లు పేలిన తరువాత దృశ్యాలు టి వి లో చూస్తుంటే అప్పటి సంగతి గుర్తు వచ్చింది.
మనకు కోపం ఉంటె ఎవరి మీద కోపమో వాళ్ళ మీద తీర్చుకోవాలి అంతేకాని ఏమి తెలియని అమాయకుల మీద మన ప్రతాపం చూపడం కాదు....!! బాంబ్ పేల్చినంత బాగా పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా...!! ఉగ్రవాదులమంటూ చేసే ఈ అకృత్యాలు ఏం సాధించదానికి...?? అమాయకుల ఉసురు పోసుకోవడం తప్ప...!!
వందల మంది ప్రాణాలు తీసిన వారిని హాయిగా కూర్చోపెట్టి రాస మర్యాదలు చేస్తున్నారు...మన చట్టం కూడా మారాలి తప్పుకు వెంటనే శిక్ష అమలు చేయాలి...ఆ శిక్ష కూడా ఎవరు మళ్ళి తప్పు చేయాలన్నా భయపడేటట్లు ఉండాలి...!!

క్షమకు కూడా అర్ధాన్ని మార్చేస్తున్నాయి జరుగుతున్న సంఘటనలు...గోకుల్ చాట్...లుంబినిపార్క్...తాజ్ హోటల్స్ ...బెంగుళూరు ఇలా ఎన్ని జరుగుతున్నా కేసులు, సాక్ష్యాలు అంటూ తాత్సారం చేస్తూ...సాక్ష్యాలతో దొరికిన వాళ్ళని శిక్షలు వేసి కూడా అమలు చేయకుండా వాళ్ళని రాజాల్లా మేపుతూ మీన మేషాలు లెక్కేస్తుంటే రేపటి రోజుల్లో మరెన్ని దాడులు చూడాలో....!! చూడటానికి మనం ఉంటామో లేదో కూడా తెలియదు....!!

21, ఫిబ్రవరి 2013, గురువారం

మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు....!!

ఈరోజు ప్రపంచ మాతృభాషాదినోత్సవం కాబట్టి అమ్మను ఇష్టపడినట్లే మన మాతృభాషను ఇష్టంగా ఇష్టపడి అమ్మలా గౌరవిద్దాం....!! ప్రేమిద్దాం...!! అందరికీ వారి వారి మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు....!!

పరాయి భాషలో మాట్లాడితే గొప్పగా ఉంటుందని అనుకోకుండా అమ్మ భాషలో మాట్లాడి అమ్మను గౌరవించండి అందరూ....!!

అమ్మతో మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుందో అమ్మ భాషలో ఒక్కసారి మాట్లాడి చూడండి మీకే తెలుస్తుంది ఆ తీయదనము... ఆ హాయి....!!

20, ఫిబ్రవరి 2013, బుధవారం

నా ఉనికి నీలోనే...!!

ఏమి కాని నాపై అంత మక్కువ ఎందుకో....!!
వదలలేని మమకారం పెంచుకుంటే....!!

మనసు బంధం పెనవేసుకుంటుంది...!!
అలవికాని ఆశల సౌధాలు ఊరిస్తాయి...!!

పెనవేసుకున్న పాశం పిలుస్తుంటే....!!
వెళ్ళలేని నిస్సహాయత వెక్కిరిస్తుంది వంకరగా...!!

పంచుకోలేని మాటలకు మౌనమే సాక్ష్యం....!!
పెంచుకోలేని అనుబంధానికి వేదనే నిదర్శనం....!!

జారి పోతున్న కన్నీటి చుక్కలే  చెప్తున్నాయి...!!
నా ఉనికి నీలోనే...నీతోనే...ఉందని...!!

అర్ధాల్ని మార్చేస్తున్న పెళ్ళిళ్ళు....!!

హా...!! నా సొమ్మేం పోయింది పెళ్ళి చేస్తే చేసుకుంటాను...నాకు నచ్చక పొతే ఏమైంది..??  ఇంట్లో వాళ్ళ మాట కాదన్నానని నాకెందుకు పేరు...!! తరువాత నచ్చలేదని గొడవ చేస్తే సరిపోతుంది...!! అటు నా పని అవుతుంది...ఇటు ఇంట్లో వాళ్ళ దగ్గర నాకు మంచితనం ఉంటుంది...అన్ని మద్యలో సంబంధం చూసిన వాళ్ళ మీదకు నెట్టడంతో నాకు సమస్య తీరుతుంది ఇప్పటి వరకు అందరికి వాళ్ళ మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది....ఒక దెబ్బకు రెండు పిట్టలు....అని ఫోటో చూసి అమ్మానాన్న ఇష్టం అని చెప్పి అతి వినయంగా పెళ్ళిపీటల మీద కూర్చుని...పెళ్ళి అయిన క్షణం నుంచే ఇరు పక్షాల వాళ్లకి చుక్కలు చూపించి...పెళ్ళి పెటాకులు చేయడానికి చేయగలిగిన అన్ని పనులు చేసి...నాణానికి ఒక వైపు మాత్రమే చూపి అందరిని కళ్ళున్న గుడ్డివాళ్ళను చేసి డబ్బు హోదా కోసం మాత్రమే చూసుకుని అందరిని మోసం చేసి...మళ్ళి పెళ్ళి ఇంట్లో వాళ్ళతోనే చేయించుకుని దర్జాగా బతుకుతున్న అపర....నారీమణులున్న ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లకు కూడా పెళ్ళి కుదర్చాలంటే ఆలోచించాల్సిన విష్యమే...!!
పిల్లలైనా...పెద్దలైనా...ఒకరి కష్టాన్ని ఒకరు గుర్తించాలి అంతే కాని తమ సుఖం కోసం అందరిని మోసం చేసి అందలమెక్కడమే ధ్యేయంగా మాత్రమే చూసుకోకూడదు...!! ఇష్టం లేనప్పుడు చెప్పాలి...ఒప్పుకోక పొతే ఒప్పించే ప్రయత్నం చేయాలి...అంతే కానీ తము జీవితాన్ని నష్ట పోవడమో లేదా తమ వారిని కష్ట పెట్టి నష్ట పెట్టడమో చేయకూడదు...!! చాలా తెలివి...తమ సొంతం...అందం ఆభరణం అనుకుంటున్న ఎంతో మంది చేస్తున్న ఇలాంటి పనులు ఇంట్లో వారైనా....నమ్మకాన్ని పొగొడుతున్నారు...!! పెళ్ళి అనేది కూడా ఓ వ్యాపారమో...లేదా డబ్బు...హోదాని పెంచుకునే ఓ వ్యాపకంలా ఐపోతోంది. విజ్ఞత వివేకం మరుగున పడి పోతున్నాయి...ఇరు కుటుంబాలకు మధ్య ఆనందాన్ని పంచి...అనురాగాన్ని...అనుబంధాల్ని పెంచే పెళ్ళి మంత్రాలకు...పెళ్ళి తంతుకు అర్ధాన్ని మార్చాల్సిన రోజులకు తెర తీయాల్సిన రోజు దగ్గర లోనే ఉందేమో...!!
పెద్దలు....పిన్నలు...కాస్త ఆలోచించండి....ఓ సారి...ఈ విష్యాన్ని.....!!
 

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మన పెత్తనం....!!

ఎవరికి ఎవరి మీదైనా ఇష్టం కాని...కోపం కాని...దానంతట అదే రావాలి...అంతే కాని ఒకరు  చేప్తే వచ్చేది కాదు..ఇష్టం కోపం అనేది...మనసులో నుంచి రావాలి...!! పెద్దవాళ్ళం కదా అని పిల్లల మీద పెత్తనం చెలాయించాలంటే ఒకసారి రెండుసార్లు వీలౌతుంది...మూడోసారి ఎదురుతిరుగుతుంది...మన పెత్తనం.....!!
మనసులోని ఇష్టాన్ని, కోపాన్ని..మనం తుడిచివేయలేము బలవంతంగా...!! అన్ని మనకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటాము కాని మనతోనే ఉంటున్న మిగతావాళ్ళకి కనీసం కాస్త అయినా నచ్చాలని అనుకోము. ఎందుకో అందరమూ కొద్దిగానైనా హిట్లర్ స్వభావాన్ని ఆపాదించుకున్నామేమో అని అనిపిస్తోంది. 
తప్పులు వెదుక్కుంటూ పోతే అన్ని తప్పులే కనిపిస్తాయి ఎప్పుడూ....కాస్తయినా మంచి ఆలోచనలు చేస్తే ఎదుటి వాళ్ళలో మంచి కనిపిస్తుంది...అలా అని అందరు మంచి వాళ్ళే అని అనను కాని అందరు చెడ్డ వాళ్ళు కాదని మాత్రం చెప్పగలను....నా అనే స్వార్ధం ఉండటంలో తప్పు లేదు కాకపొతే అప్పుడప్పుడు మన అని కూడా అనుకుంటే బావుంటుంది...మనం బావుండాలి మనతోపాటుగా అందరూ బావుండాలి...!!

18, ఫిబ్రవరి 2013, సోమవారం

మన లెక్క... !!

ఎవరికి వాళ్ళం నేనే బాగా కష్టపడి పోతున్నాను...ఐనా నా కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు ఏంటో....!! అందరికి అన్ని చేసాను...నాకంటూ ఏమి చేసుకోలేదు...ఇలా ఇంకా చాలా అనుకుంటూ...మనని మనమే అందరికి దూరం చేసుకుంటున్నాము....ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు...కాకపొతే పొందిన సాయం గుర్తు ఉంచుకునే వారు చాలా తక్కువ ఈరోజుల్లో...!! ఎవరు ఏమి చేయకుండానే మనం ఈరోజు లేము కదా...!! మనకు తోచినది...మనం చేయగలిగినది మనం చేస్తూ ఉండటమే....!!
కాకపొతే మరీ మనకు సాయం చేసిన చేతిని నరికేంత మంచితనం మాత్రం పెంచుకోకండి....చేసిన సాయం గుర్తు ఉంచుకోక పోయినా పర్లేదు కానీ....మన స్వార్ధం కోసం అమ్మని నాన్నని కూడా విడదీసేంత మంచితనం ముసుగు వేసుకోకండి...దయచేసి....!!
మనవి మాత్రమే డబ్బులు కాదు ఎదుటివారివి కూడా డబ్బులే....ఎవరికీ ఊరికినె డబ్బులు రాలవు...మన సొమ్ము మనకి ఎంత జాగ్రత్తో అంతే జాగ్రత్తగా ఎదుటివారి కష్టాన్ని కూడా చూడాలి....మన అవసరం తీరిపోతే చాలు...వాళ్ళు ఎలా పొతే మనకెందుకు అనుకుంటే అదీ ఓ రకంగా ఈరోజుల్లో మంచితనమేమో...!!
అన్ని మనం అనుకున్నట్లుగా జరిగిపోతే....దేవుడు అనేవాడు మనకి గుర్తు ఉండడు...అంతా మన గొప్పే అనుకుంటాము....కాకపొతే మన మంచితనానికి లెక్క మన పైవాడి దగ్గర భద్రంగా ఉంటుంది....:)

13, ఫిబ్రవరి 2013, బుధవారం

లెక్కలో వేసుకోవాలా....!!

మెత్తగా ఉన్నాం కదా అని అందరు పెత్తనం చెలాయించే వాళ్ళే....హన్నా మరీ గాంధీ గారి లానో...మదర్ థెరీసానొ అనుకుంటే ఎలా కుదురుతుంది...!! గాంధి గారి సిద్దాంతాలలో కాని...వివేకానందుడి బోధనలలోనూ....రామకృష్ణ పరమహంస చెప్పిన మాటల్లోనూ....మదర్ థెరీసా ఓర్పులోనూ కాస్త కాస్త మాత్రమే ఒంటబట్టించుకోగలం...!! వాళ్ళు చెప్పినవి..చేసినవి..అన్నీ..మనం చేయలేము....!!
చెప్పింది చేయాలంటే ముందు మనం ఆచరించి తరువాత చెప్పాలి వాళ్ళలో నాకు నచ్చింది కూడా అదే....!!
అంతే కానీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే అంత సాదు స్వభావం లేదు...కాకపొతే కాస్త...సమయం...!!
అదే ఎదుటి వాళ్ళు చాతకానితనం అనుకుంటే అది వాళ్ళ ఖర్మ....దానికి మనమేం చేయగలం చెప్పండి...-:)....!!
వయసు పెరిగినా బుద్ది మారని వాళ్ళని ఎప్పటికి ఏం చేయలేము...పిల్లలు....చిన్నవాళ్ళు అని తప్పుగా ప్రవర్తించినా సరిపెట్టుకోకుండా పెద్దవాళ్ళే వెధవ  బుద్దులు చూపిస్తుంటే....వాళ్ళని ఎన్నిసార్లు పోనిలే అని వదిలేయాలి....!!
బంధాలతో...బాధ్యతలతో...పని లేకుండా ఒక్క  డబ్బు దాహాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని వయసుకు...తగినట్టుగా ప్రవర్తించక పోతున్న పెద్ద మనుష్యులను లెక్కలో వేసుకోవాలా....!!

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

నీకు తెలియని నువ్వు.....!!

నీ ఆనవాలు లేదని అనుకుంటున్నావా....!!
అది నా దగ్గరే ఉందని నీకు తెలియదు కదా....!!

నువ్వు అనుకుంటున్నావు ఏది వదల లేదని...
నువ్వే నా దగ్గరున్నావని నీకు తెలియడం లేదు....!!

నీ ఆలోచనలను వదిలేద్దామంటే...
నువ్వే...జ్ఞాపకమై చేరువనే ఉంటున్నావు...!!

 

9, ఫిబ్రవరి 2013, శనివారం

ఏమిటో ఈ అర్ధం లేని.....!!

నేను అందరికి కావాలి
నాకు నువ్వు కావాలి
నీకు అందరు కావాలి...!!
ఒక్క నేను తప్ప...!!
ఏమిటో ఈ బంధం...!!

దగ్గరే ఉంటూ...
దూరం జరిగి పోతున్నావు
చేరువనే ఉన్నా తెలియని..
అంతరమే...మన మధ్య !!
ఏమిటో ఈ అగాధం...!!

చేజారిపోతోంది జీవిత కాలం....
మనకు తెలియకుండానే...!!
చేయి జారిపోతోంది
మన జీవితం....!!
చివరి మజిలి చేరకుండానే....!!
ఏమిటో ఈ అర్ధం లేని ప్రయాణం...!!

జీవితానికి అర్ధం సార్ధకత
పరిణితి పరిపక్వత
బంధాలను బాధ్యతలను
ఆనంద విషాదాలను
కలిసి పంచుకుంటేనే...పరిపూర్ణత...!!
అదే ఈ విన్నపం...!! 

7, ఫిబ్రవరి 2013, గురువారం

నీకు తెలియని నేను....!!

నా మౌనం నీతో మాట్లాడుతుందంట...!!
మరి నీకు అర్ధం అవుతుందో లేదో....!!



మౌనం మాట తెలిసినా
మాటే మౌనమైంది ఎందుకో...!!

మనసుకు తెలుసు మౌనం మాటేమిటో...!!
మరి నీకెందుకు తెలియడం లేదు....??

అన్ని తెలిసిన నీకు
నేనెందుకు తెలియడం లేదు....??

అందుకేనేమో నీకు తెలియని నేను
నేను గానే ఉండిపోయాను...!!

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

తెలియకుండా పోతోంది....!!

కోపం వచ్చినా...బాధ కలిగినా...సంతోషం అనిపించినా...కోపం చూపించడానికి....బాధని...సంతోషాన్ని పంచుకోవడానికి...!!
కొన్ని సార్లు అందరూ ఉన్నా...అన్నీఉన్నా...మన అనుభూతిని పంచుకోవడానికి...మన అంటూ ఏది లేదు...ఎవరు లేరు అనిపిస్తే....!!
మనకున్న డబ్బు వీటిలో దేనిని తెచ్చి ఇవ్వలేదు...అర్ధంలేని స్నేహాలు...అరా కాణి  ప్రేమలు ఎందుకు కొరగావు...ఏదో మన టైంపాస్ కి తప్ప..!!
అనుబంధాలు...అనురాగాలు కూడా ధనం చుట్టూనే తిరుగుతున్నాయి....డబ్బు బంధాలై పోతున్నాయి...!!
మాటలు కూడా ఖరీదు గానే ఉంటున్నాయి...మనం ఏదైనా ఫంక్షన్ కి వెళితే...ఇంత ఖర్చు ఐనదంట ఈ ఫంక్షన్ కి... ఆవిడ చీర ఎంత ఖరీదో తెలుసా....ఆ నక్లెస్ ఎంత బావుందో....!! మీ అమ్మాయి అమెరికాలో ఉందంటగా...!! మా అబ్బాయి అక్కడే పేద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడులెండి...ఇలా ఉంటాయి కొన్ని...మరికొన్నేమో నా సాలరీ ఇంత....అంతా నేనే చూసుకుంటాను...అంటూ కాస్త హై..ఫై..ల్లో అస్సలు తెలుగే తెలియనట్లు మాటలు...!!
ఏంటో మరి వేసుకున్న నగలకి...చీరలకి...చేసే ఉద్యోగాలకి....ఇలా వీటికి మాత్రమే విలువలు ఇస్తూ పోతున్నారు...అంతా పై పై ప్రేమలు ఒలకపొయడమే....!! మనిషి వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుందో....!! ఏమో...!! 

4, ఫిబ్రవరి 2013, సోమవారం

ఎక్కడికో....!!

గమనం తెలియని గమ్యం
ఏ కడలిలో కలవనుందో...!!
ఏ తీరాన్ని చేరనుందో...!!
రాత రాసిన బ్రహ్మకెరుక...!!

చేరాలనుకున్న గమ్యం చేరువలో లేదు
చేరిన తీరం నన్ను కాదంటోంది....!!
మళ్ళి మొదటికే వచ్చింది...నా పయనం...!!
ఏమిటో ఈ అర్ధం కాని అయోమయం...!!

ఎండమావులు ఒయాసిస్సులని పరుగెత్తి
అలసిపోయిన బతుకు బండి...
ఆశ నిరాశల్లో  కొట్టుకుంటూ....
దూరంగా కనిపించి మురిపిస్తూ...
ఆశ పెడుతున్న.... 
ఒయాసిస్సుల కోసం మళ్ళి
పరుగు మొదలు....!!

అదేనేమో....రాబోయే క్షణం కోసం...ఆశా జీవితం....!!

2, ఫిబ్రవరి 2013, శనివారం

అమ్మకి అమ్మాయికి తేడా తెలియని....!!

మనకి భావ ప్రకటనా స్వేచ్చ ఉందని ఎదుటివారిని కించపరచే మాటలు మాట్లాడటం ఎంత వరకు సమంజసం...?? టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినా మన సంకుచిత భావాలు మాత్రం మనలానే అలానే ఉండి పోతున్నాయి...!! ఈ ఫేస్ బుక్ లు...ట్విట్ లు ఇలా ఎన్నో కొత్త కొత్త అనుసంధానాలు వస్తూ మనుష్యుల మధ్య అంతరాలు...అభిప్రాయ బేధాలు పుట్టిస్తూ రోజూ ఏదో ఒక గొడవ పుట్టిస్తూ రాజకీయ నాయకులతో పాటుగా ఇవీ ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి...మనకు తెలిసిన స్నేహితులు కలుస్తున్నారని సంతోషించాలో లేక ముక్కు మొహం తెలియని వారితో అడ్డమైన మాటలు అనిపించుకుంటున్నందుకు బాధ పడాలో తెలియకుండా పోతోంది...!!
వావి వరుసలు పక్కన పెడితే....కనీసం వయసు తారతమ్యాలు కూడా చూడకుండా ఏది పడితే అది వాగుతున్నారు...అలా వాగడం గొప్పగా అనుకుంటున్నారేమో....మరి...తెలియని అమ్మాయిని కాదు అమ్మని కూడా రమ్మని అడిగేంతగా మన ఈ నాటి యువత దిగజారిపోతోంది...!! వేలకు వేల జీతాలు తీసుకుంటూ ఇంత కుసంస్కారం అలవరచుకుంటున్న యువతతో రేపటి సమాజం ఎలా ఉండబోతోందో అని తలచుకుంటేనే భయంగా అనిపిస్తోంది...!! అందరూ ఇలా ఉంటున్నారని కాదు కొందరు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో చూస్తుంటే....రేపటి గురించే కాదు ఈ రోజు కూడా భయంకరంగానే అనిపిస్తోంది....!!
మనకు ఎంత భావ ప్రకటన స్వేచ్చ ఉంటే మాత్రం ఎదుటి వారిని బాధ పెట్టె హక్కు లేదని తెలుసుకుంటే బావుంటుంది... ఎవరైనా...!! నోటికి ఎంత వస్తే అంతా వాగకుండా పదాలు...మాటలు ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అందరికి...!!

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నా వాళ్ళెవరు....??

బంగారినో సింగారినో
బతుకు పయనంలో
ఒంటరి బాటసారిని...

అసంపూర్తి జీవితాన్ని
అర్ధం చేసుకోవడానికి
నిరంతరం శ్రమించే
శ్రమజీవిని...

జీవిత పాఠాల్లో 
అక్షరాలు నేర్చుకునే
క్రమంలో నిత్య విద్యార్ధిని...

సంతృప్తో అసంతృప్తో
తెలియని అయోమయంలో
అంతా నాదే...
అందరూ నావాళ్ళే...
అన్న భ్రమలో బతుకుతున్న
బడుగు జీవిని....

పైస లేని నాడు
ఎవరూ ఉండరు
పైసల్లో మునిగిన నాడు
అందరూ నీ...వాళ్ళే...!!

ఈ సత్యం తెలియక
ఎలాగోలా...బతికేద్దాం...
అని ప్రతి క్షణం
భంగ పడుతున్న
నిరాశాజీవిని...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner