30, అక్టోబర్ 2013, బుధవారం

నిశబ్దానికేం తెలుసు...!!

ఎంత ఆశగా చూస్తోందో చూడు నిశబ్ధం
మన మధ్యకు ఎప్పుడెప్పుడు వచ్చి
వాలదామా అని...!!

అయినా  దానికెందుకో అంత తొందర
చోటివ్వక పోయినా చేరువగా చేరాలని
ఎలా చూస్తోందో చూడు...!!

నేనే ఉన్నాను అనుకుంటోందో ఏమో
వచ్చి వాలిపోవడానికి ఏ అడ్డంకి
లేదని సంబరపడుతూ...!!

నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు
నాతోనే ఉన్నాయని మన మధ్య చోటే లేదని
దానికేం తెలుసు పాపం...!! 

29, అక్టోబర్ 2013, మంగళవారం

రాతిరి తెరలే.....!!

మనసు మధనం మనిషి చలనం
హృదయ గమనం కాల చక్రం
పురుడు పోసుకున్న అక్షర కవనం

జ్వలించే జ్వలనం ప్రజ్వలనం
దహించే రూపం శాపం
వేధించే జ్ఞాపకాలు చిరపరిచితం

గుచ్చుకుంటున్న గాయాలకు లేపనం
మరపు మందుని సైతం
దగ్గరగా రానీయని అలసత్వం

చెదిరి పోయిన కధల కలలు
విడిచి పోయిన నిట్టూర్పుల నిరాశలు
పోగు చేసుకున్న జీవితాలు

చీకటిలో రంగుల లోకం
చూడాలనుకునే అమాయకత్వం
కాల రాస్తున్న పాషాణ హృదయాలు

అద్దంలో చూసుకున్న ప్రతిబింబం
వెలుగుల జిలుగుల్లో విరజిమ్మే కాంతి రేఖలు
ఒక్కసారికే తట్టుకోలేని అసహాయత్వం

చెంతన లేని చెలిమి చెప్పిన స్వాంతన
దూరంగా ఉన్నా చేరువగా అనిపించే తలపు 
రెప్ప పడక పోయినా రాతిరి తెరలే బావున్నాయి..

26, అక్టోబర్ 2013, శనివారం

లోపం ఎక్కడ...!!

అత్యాధునిక ఆ...భాగ్యనగరంలోనే నిర్భయ...అభయ... రేపు మరో పేరు మార్పు ....ఆధునికంగా ఎదిగిన అమ్మాయిలకు రక్షణ కరువైతే ఇక మాములు అమ్మాయిల సంగతి ఏంటి...?? చూస్తూ ఉంటే ఏమి తెలియని చిన్న చిన్న పల్లెలోనే అమ్మాయిలు  కాస్తయినా భద్రంగా బతకగలుగుతున్నారేమో అనిపించక మానదు. మనం ఆకాశంలో ఇల్లు కట్టుకుని ఉండగలిగినా కూడా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా జరుగుతున్న ఈ అమానుషాలను రూపుమాపాలంటే....?? వ్యవస్థలో మార్పు రావాలా లేక మన చట్టాల్లో మార్పు తేవాలా...!! మనలో మార్పు రావాలా...!! లోపం ఎక్కడ...!!
నేరం చేసినప్పుడు కొన్ని నేరాలను సాక్ష్యాధారాలతో నిరూపించలేని పరిస్థితి ఉంటే నేరం జరగనట్టే అని తీర్పు చెప్పే న్యాయస్థానం ఎంత వరకు న్యాయాన్ని కాపాడినట్లు...?? మహిళలకు జరుగుతున్న ఈ అన్యాయాలకు సాక్ష్యాలు, విచారణలు అవసరం అనుకుంటే ఎన్ని యుగాలు మారినా ఈ అమానుషాలు ఆగవు...అక్కడికక్కడే కఠిన శిక్షలు అమలు జరిగితే తప్ప ఈ నేరాలు ఆగవు..మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి చెడు రెండు ఉంటున్నాయి కాని చెడు వెళ్ళినంత తొందరగా మంచి జనంలో చేరలేదు...కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్టు ఇది కూడా అంతే...!!
నేర ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండొచ్చు...మనం పెరిగిన వాతావరణం ఒక కారణం కావచ్చు...మనకు జరిగిన అన్యాయానికి మనలో దాగిన కసి కావచ్చు... పుట్టే ప్రతి బిడ్డ భూమి మీద పడేటప్పుడు నేరస్తులు కారు...ప్రతి తల్లి తన బిడ్డ గొప్పగా ఎదగాలని మంచి పేరు తెచ్చుకోవాలని కళలు కంటూనే ఉంటుంది...తన రాతను మార్చుకోలేక పోయినా బిడ్డలా రాతలు బావుండాలనే అనుకుంటుంది...మరో జీవితానికి శోకం అవుతారనుకుంటే పురిటిలోనే సమాధి చేయడానికి సిద్దపడుతుంది తల్లి మనసు...!! ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు...టి వి ప్రసారాలు... వేషధారణల్లో వచ్చిన మార్పులు...సాంకేతిక పరిజ్ఞానం...ఇలా చాలా కారణాలు నేరాలకు..అమానుష కృత్యాలకు దోహదం చేస్తున్నాయి...ప్రతి ఒక్కరు తమలోని చెడుని వదిలేస్తూ మంచికి నాంది తమ ఇంటి నుంచే మొదలు పెడితే కొన్నాళ్ళకు మంచి మానవత్వంతో మన సమాజం కళ కళలాడుతూ కనులకు ఇంపుగా ఉంటుంది...!!

25, అక్టోబర్ 2013, శుక్రవారం

సర్దుకు పోతున్నాం....!!

జీవితం అంటేనే సర్దుకుపోవడం....ఇలా అనుకుంటూనే జీవితం చివరి వరకు గడిపేస్తూ సరిపెట్టేసుకుంటూ బతికేస్తున్నాం...మూడు సర్దుబాట్లు ఆరు దిద్దుబాట్లుగా...!! కాకపొతే సరిపుచ్చుకునే వాళ్ళు సరిపెట్టుకుంటుంటే అది వాళ్ళ ఖర్మ... చాతగానితనం అనుకుంటూ...మన రాజయోగం మనదే అని మురిసిపోతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు...ఆ రాజి పడటంలో ఎన్ని సంఘర్షణలు..సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమౌతున్నారో ఆలోచించరు. మొదటి నుంచి చివరి వరకు సర్దుకోవాలి అంటూనే ఉంటే చిన్న చిన్న సంతోషాలను కూడా నష్టపోవడమే తప్ప ఇక అంతం అనేది లేకుండా పోతోంది ఈ సర్దుబాటు జీవితాలకి....!!
సరదాగా సర్దుకు పోదాం పోయేదేం ఉందిలే అనుకుంటాం మొదట్లో .... రాను రాను  అలానే సరిపెట్టుకుంటూ ప్రతి దానిలోనూ రాజి పడిపోతూ ఒక రకమైన నిరాసక్తకి లోనై పోతాం...మనని మనం మరిచిపోయి....!! అలా అని అన్ని విషయాల్లోనూ మన పంతమే నెగ్గాలని చూడకూడదు ఎదుటి వారి వ్యక్తిత్వానికి విలువ ఇస్తూ సర్దుకోవడమో సర్ది చెప్పుకోవడమో చేస్తే కాస్త బావుంటుంది. సర్దుకున్న ప్రతిసారి మరో కష్టానికో ... నష్టానికో తెర తీస్తూ ఉంటే సరిపెట్టుకోవడంలో అర్ధమే లేదు...!! సున్నితమైన బంధాలను మంచితనం ముసుగులో కఠినంగా బాధిస్తుంటే ఎంత కాలం ఆ సున్నితత్వం ఉంటుంది..?? ఓ వైపు తెగేదాకా లాగుతూ మరో వైపు నటిస్తూ ఉంటే ఎన్నాళ్ళు తట్టుకోగలుగుతుంది బంధం తెగిపోకుండా....!! మనం చేసిందే మనకు తిరిగి వస్తే భరించలేక పోతున్నామెందుకు...?? మనం  చేసింది తప్పు కానప్పుడు ఎదుటివారు మనకు చేసింది కూడా సబబే అని అనుకోలేక పొతున్నామెందుకు..?? జీవం నింపిన బతుకుని జీవశ్చవాలుగా చేసుకుంటే నష్టం ఎవరికి...?? చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ గాలికి తిరిగేస్తూ అన్నం పెట్టిన చేతిని కూడా దారుణంగా తిట్టే మన సంస్కారం ఎంత ఉన్నతమైనదో...!! ఎంత చక్కని పద్దతిలో పెరిగామో...!! రూపాయి కోసం అమ్మని నాన్నని విడదీసే గొప్ప మనసు ఒకరిది....అహంకారాన్ని ఆత్మ గౌరవమని అనుకుంటూ ఏకాకిలా నియంత ఒకరు....ఎవరు ఎలా పొతే నాకేంటి నేను బాగున్నానా లేదా నాకు కావాల్సిన వాటికోసం ఎంత మందినైనా మార్చేస్తాను నాకేంటి...అని ఒకరు....ఇలా స్వార్ధం మనస్సులో గూడు కట్టుకుని పోతుంటే....ఒక నిర్భయ ఏంటి...అభయ కాదు...ఆయేషా కాదు మరెన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి...మన పని మనం చేసుకు పోతూనే ఉంటాం...మన సమస్యలే మనకి పెద్దగా కనిపిస్తూ వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఇలానే జీవితాలని ముగిస్తూ ఉంటాం....!! 

23, అక్టోబర్ 2013, బుధవారం

మనఃపూర్వక వందనాలు....!!

నా అక్షరాలు చెరగని శిలాక్షరాలుగా నిలిచిపోవానన్నంత ఆశ లేదు కాని శిధిలాక్షరాలుగా మాత్రం మిగిలి పోవాలని అనుకోలేదు...
నాకు అనిపించిన భావానికి అక్షర రూపాన్ని ఇవ్వగలను కాని నేను రాయాలనుకున్నది రాయలేను ...ఏదైనా రాయడమే కదా పెద్ద తేడా ఏముంది అని మీకు అనిపించవచ్చు కాని నాతొ రాయించేది మనసు.....మొదలు...ముగింపు రెండు నా చేతిలో ఉండవు...మనసు చెప్పిందే రాస్తాను కాని నేను రాయాలనుకుని రాయలేను.... అందుకేనేమో చాలా మంది నా టపాలు చూసి మా మనసులోని మాటలే మీరు రాశారు...అంటూ ఉంటారు అలా అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను రాసే టపాలు నా సంతోషమే కావచ్చు .... బాధే  కావచ్చు ... నేను చూసిన సంఘటనలకు మనసు స్పందనల అక్షర రూపమే కావచ్చు...భావావేశమే కావచ్చు.... అది ఏదైనా కానివ్వండి రాయాలనుకుంటే రాయలేను...రాయాలనిపించింది రాయగలను అదే రాస్తున్నాను....నా రాతలను వాటిలోని భావాలను ఆదరిస్తున్న...అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక వందనాలు

నీలోనే ఉండిపోయిన.....!!

జన్మ జన్మల జత కలిసిన తరుణం
యుగాల ఊసులు అన్ని ఒక్క రోజులో
క్షణాల కాలం తరగని సమయంలా
నీ ప్రేమ వెల్లువ పరవళ్ళ గోదారిలా....!!

చెప్పని కబురుల చిలక పలుకులు
అంతలోనే అలిగిన అలకల ఉలుకులు
నీటి మీద రాతలైన కోపాలు తాపాలు
మౌన మందారాలే మనసు బంధాలు మన మధ్య...!!

పెదవి దాటని ప్రణయం ప్రేమ కావ్యమైన
మధురాక్షరాల శిశిర వసంతం నులి వెచ్చగా
నీ ఆలంబనలో అందిన ఆనందం
స్నేహానికి...చెప్పనలవి కాని ఇష్టానికి తార్కాణం...!!

చెదరని శిలాక్షరానికి చలనం ఉందని
శిధిలాల్లో కూడా జీవం పోసుకుంటుందని
చెక్కు చెదరని జ్ఞాపకంగా నీలో నిలిచి పోతుందని
ఊహకైనా అందని నీ ప్రేమతో నిరూపించావు...!! 

21, అక్టోబర్ 2013, సోమవారం

మనసు జార్చిన ఈ కన్నీటి కావ్యం ...!!

వేదన లో జారిన అక్షరం
చిరునవ్వు చాటున దాగుండి
మదిని తడిమిన చెమ్మతో
కరిగిన కన్నీటి చెలమ
వెలువరించిన రుధిరం
పొంగుతున్న ఆవేశం
ఉరకలేస్తున్న ఉప్పెనలా
ముంచుకొస్తున్న మరణ తరంగం
శాసిస్తున్న శాసనం
అపహాస్యపు హాహాకారం
వినిపిస్తున్న కర్ణ కఠోరపు 
యముని మహిషపు లోహపు గంటల
భీకర విన్యాసపు విలయ తాండవం
తెంచుకోలేని అనుబంధాల నడుమ
విల విలలాడుతున్న మనసు కష్టం
తెలిసినా తెలియనట్లు నాటకం
జగన్నాధ రధచక్ర జీవిత యాత్ర
విధి ఆడుతున్న వింత చదరంగం
వినోదంలా చూస్తున్న వీధి దేవుళ్ళు
విపరీతార్ధాల వింత పోకళ్ళు
కూలుతున్న కాపురాలు
కుళ్ళబొడుస్తున్న మానవ మృగాలు
ఆరంభమే కాని అంతం లేని ప్రయాణం
ఎక్కడికో  తెలియని ఈ గమ్యం...!!

13, అక్టోబర్ 2013, ఆదివారం

విజయదశమి శుభాకాంక్షలు....!!

చిన్నప్పుడు దసరా అంటే అమ్మ పెట్టించిన బొమ్మల కొలువులు...అందరిని పిలిచి చూపించిన జ్ఞాపకాలు...బొమ్మలు అమ్మ అందంగా అమరిస్తే చూసుకుని మురిసి పోవడం...దసరా శెలవల్లో చిన్ననాటి నేస్తాలతో ఆడుకున్న ఆటలు...చేసిన హంగామాలు ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు జ్ఞాపకాల గురుతుల సందడులు....ఊరంతా మన చుట్టాలే అన్నట్టు అందరి పలకరింపులు...  వేళాకోలాల హాస్యపు జల్లులు...మధ్యలో హడావిడిగా నేను ఉన్నా అంటూ పలకరించే వర్షాల హర్షాలు ఓ వైపు ... పచ్చని పొలాల అందాలు మరో వైపు...బురదలో కూడా పడి లేచిన ఆ జ్ఞాపకాలు...పిండి వంటల ఘుమఘుమలు....గుళ్ళో బోలెడు ప్రసాదాలు...ఆ తొమ్మిది రోజులు ... ఎంత బావుండేవి ఆ రోజులు...!!
ప్రకృతికి కూడా మన మీద కోపం వచ్చి ప్రళయ తాండవాన్ని...విలయ విధ్వంసాన్ని సృష్టించింది ఇప్పుడు...ఎంతో మంది ఏ దారి తోచక బిక్కు బిక్కు మంటూ ఉంటే...కొందరేమో విష జ్వరాల కోరల్లో చిక్కుకుని కొట్టుకుంటూ ఉంటే...బతుకమ్మల కోలాహలం సందడి తెలంగాణా ప్రాంతపు ఆనందహేల...సమైక్యమంటూ ఉద్యమాల పోరు సీమాంధ్రలో.... విరుచుకు పడిన ఫైలిన్ పడగ ఉత్తరాంధ్రలో... ఓ కంట కన్నీరు.. ఓ కంట పన్నీరు అన్నట్టు ఈ విజయదశమి....సంతోషమయినా బాధ అయినా పండుగ పండుగే కాబట్టి అందరు బావుండాలని....అందరికి అన్ని శుభాలు కలగాలని...కోరుకుంటూ అందరికి విజయదశమి శుభాకాంక్షలు 

12, అక్టోబర్ 2013, శనివారం

మనసు జీవితం మనిషిలో.....!!

అందని అలల  కలల తీరం
ఆశల  విహంగాల ఆరాటం
మనసు పొరల విచలిత సమరం
రెక్కలు విప్పిన ఊహల ఆంతర్యం
అంబరాన చుక్కల నంటిన సంబరం 
ఎందుకో ఈ ఆశల ఆట విడుపుల ఆనందం
అలవి కాని అనుబంధపు అనురాగం
నిజాల అబద్దాల సమతౌల్యం
జీవిత పరిణామ క్రమాల ఆహార్యం
కోపాల తాపాల కోరికల కోసం
మోసాల ద్వేషాల మతాల మారణహోమం
రగులుతున్న రావణ కాష్టాల దర్పణం
మరుగుతున్న మరలుతున్న మానవత్వం
మసిబారుతున్న మానవ బంధాల మరో రూపం
ఇదేనా నేటి మన జన జీవితం....!!

10, అక్టోబర్ 2013, గురువారం

ఇంకా నాతోనే ఉందని....!!

నాలోనే కరిగి నాతోనే ఉండి ఇన్నాళ్ళు...
ఇక నను వదలి పోయావనుకున్నా....!!

నాలోని సంతోషాన్ని బాధని
ఒక్కటిగానే నీతో పంచుకున్నా....!!

వేదనలో జారిపోయే కన్నీటి భాష్పాన్ని
సంతోషంలో స్రవించే అశ్రు ధారని నీలోనే చూసుకున్నా...!!

విసిగి వెళ్ళి పోయావనుకున్నా
వదలలేక నాతోనే ఉండి పోయావనుకోలేదు...!!

నాలో ఉండలేక బయటికి రాలేక
కంటిని తడుముతూ బుగ్గలపై జారిన నీ మనసు....!! 

చేతికి తగిలిన చెమ్మ చెప్పింది
నీ ఉనికి ఇంకా నాతోనే ఉందని....!!

8, అక్టోబర్ 2013, మంగళవారం

నాకు అనిపించిన నిజాలు...!!

 నేను రాసిన జీవితమే లేని స్త్రీ మూర్తి కవితకు ముఖ పుస్తకంలో
వచ్చిన స్పందనలు చూసి నేనే కాస్త పాతకాలంలో
ఆలోచించానేమో అనుకున్నా...కాని ఎన్నో నిజాల కధల వ్యధల రూపమే ఆ కవిత...!! ఇప్పటి రోజుల్లో ఆధునికంగా ఉంటున్నారు మహిళలు కాదనడం లేదు.. కాని బంధాల కోసం...అనుబంధాలను వదులుకోలేక జీవశ్చవాలుగా మారి జీవితంలో భరించే వాడు భర్త అని...మోసపోయి బాధించే వాడు భర్త అని అర్ధాన్ని మార్చుకుని.... చావలేక...రాజీపడుతూ..చిన్న ఆలంబన కోసం ఆశగా తపించే ఎందఱో తల్లులు ఉన్నారు ఇప్పటికి...!! బాధలు పడుతూ కలిసి ఉండటం ఎందుకు..?? ఈ త్యాగాలు ఎవరి కోసం...?? ఇది రాతి యుగం కాదు....అలా అని పురాణాల ఇతిహాసాల పతివ్రతల కస్టాలు పడమని చెప్పడం లేదు....తనకంటూ ఓ జీవితం లేకుండా ఉండటం ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు...!! కస్టాలు ఇప్పుడు అమ్మాయిలకు ఏం లేవు...అబ్బాయిలకే అన్ని అని అంటున్నారు మరికొందరు...!!
యుగాలు ఎన్ని మారినా ఆధునికంగా ఎంత ముందుకు వెళ్ళినా బంధాలను భాద్యతలను వదులుకోలేని ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పదు....అది ఆడ అయినా మగ అయినా ఒక్కటే....!! ఇక్కడ ఓ చిన్న సంగతి గుర్తు వచ్చింది నాకు..చిన్నప్పుడు మేము ఆరు చదివేటప్పుడు కొత్తగా ఆర్ధిక శాస్త్రం పెట్టారు అప్పుడే...దానిలో డిమాండ్ సప్లై నాకు గుర్తు వస్తోంది....మీకు అర్ధం అయ్యే ఉంటుంది ఇది ఎందుకు చెప్పానో...!! ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలకు తనకు ఏం కావాలో ఎలా కావాలో...తను ఎలా ఉండాలనుకుంటుందో...చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటోంది..అంతే  కాని...నింగి కెగిరినా...ప్రపంచాన్ని చుట్టివచ్చినా....ఈ విశ్వాన్ని ఏలినా...ఇలా ఏం చేసినా...ఎంత ముందు ఉన్నా....ఆడవాళ్ళ రాతలు మారిపోయాయి అనుకుంటే పొరబాటే అది...!! ఏమి చేయలేక నిర్వికారంలో నిశ్చలంగా బతికే వాళ్ళు ఉన్నారు....ఆకాశం హద్దుగా ఆనందాన్ని అందుకునే వాళ్ళు ఉన్నారు...!! ఇప్పటికి మారనిది ఒక్కటే అమ్మాయిల మీద అఘాయిత్యాలు, యాసిడ్ దాడులు చూస్తున్నాము కాని అబ్బాయిల మీద ఇలాంటివి జరగడం చూస్తున్నామా...!! 1900 అయినా 2013 కాని 2020 అయినా మారని నిజాల్ని ఒప్పుకోవాలి మనం...కాదంటారా...!!

7, అక్టోబర్ 2013, సోమవారం

జ్ఞాపకం గుండెల్లోనే....!!

చిరునామా చెదరి పోయిందా....
సంతకం చెరిగి పోయిందా....
చిత్రమే కనుమరుగైందా ...
జ్ఞాపకం గుండెల్లోనే దాగుందా...!!

వెతికి వెతికి వేసారి పోయాను
అలజడితో అతలాకుతలం అయ్యాను
చిరునామాల చిత్రంలో ఎక్కడైనా
నీ సంతకంతో చేరిన జ్ఞాపకాన్ని చూద్దామని...!!

సమీపంలోనే ఉన్నా చెప్పలేని సుదూరం
ఆంతర్యాల అహం పరదాల చాటున
అలికిడి లేకుండా అడ్డుగా ఉండి తొలగకుండా
సాన్నిహిత్యాన్ని చేరువ కానివ్వడం లేదెందుకో...!!

అక్షరాల ప్రవాహంలో ఊసుల వెల్లువలు
మౌన సమీరాల్లో మోహ సుగంధాలు
అన్ని కలిపి చెప్పిన భాషలేని భావన
నీ స్నేహ పరిమళాల అనుభూతిలోని ఆస్వాదననే...!! 

5, అక్టోబర్ 2013, శనివారం

జీవితమే లేని స్త్రీ మూర్తి...!!

ఎప్పుడు ఎవరో ఒకరి అండతోనే బతకాలి
చీదరింపుల నీడలో సేద తీరాలి
నాన్న ఆసరాతోనో అన్నదమ్ముల అండ దండలలోనో
తెలిసి తెలియని ప్రాయాన్ని గడిపి
తనను తాను తెలుసుకునే సమయంలో.... 
ఓ అయ్య చేతిలో పెట్టి భారాన్ని
తీర్చుకున్నామనుకునే కన్నవారు
సేవలు చేయించుకుంటూనే...
ఉద్దరించాను నీ జీవితాన్ని....
కష్టాలన్ని నావే అంటూ.... 
మోయలేని బరువుని మోస్తున్నాననుకునే
అజమాయిషీలో అహాన్ని చూపించే భర్త గారు...
అదే వారసత్వాన్ని అందుకున్న బిడ్డలు....
అందరి కోసమే జీవిస్తూ తనకి ఉనికే లేకుండా
తనకంటూ ఓ జీవితమే లేని స్త్రీ మూర్తి...!!
అన్ని భరిస్తూ ....సహిస్తూ....
ఏమి చేసుకోలేని నిస్సహాయతో...
నిర్వికారమో...నిశ్చలత్వమో...!!

4, అక్టోబర్ 2013, శుక్రవారం

ఏది తెలియని లోకంలో.....!!

భాష రాక భావం మూగదైనా...
మాటలు రాక మౌనాన్ని ఆశ్రయించినా...
పలుకరించ లేదని అలుకలు బోయినా...
కనుల నిండిన మనసు తలపులు
చెప్పే కమనీయ కావ్యాలు అర్ధం చేసుకోవూ...!!
భాష్ప ధారలు స్రవించే అశ్రు నయనాలు
పలికించే కధలు వినలేవూ...!!
చలించే గమనంలో చెదరని జ్ఞాపకంగా
నింగికెగసిపోయే నీలాకాశంలో...
నిరంతరం నీ ధ్యానంలో
నన్ను నేనే మరిచా...!!
నీతో నేను లేను అన్న తలపే...
తెలియని లోకంలో నీకోసమే....!!

3, అక్టోబర్ 2013, గురువారం

బయట పడాలని...!!





కోకిల గీతంలో ఫోటోకి నా చిన్న కవిత

2, అక్టోబర్ 2013, బుధవారం

సమాధానం దొరకని ప్రశ్నలా.....!!

నీకోసం మార్చుకున్న తలరాతను
మరణ శాసనంగా మార్చి.... 
నీకు బతుకునిచ్చిన పాపానికి
బతుకంతా శాపంగా చేసి.... 
అందమైన అనుబంధాన్ని
పెంచుకున్న మమకారాన్ని.... 
పేగు బంధంలో బంధించి
ఆ చిరునవ్వుల సందడిలో... 
మసకబారిన జీవితంలో
వెలుగుల  చిరునామా కోసం
ఆత్రంగా ఎదురుచూస్తూ....
మార్చలేని విధి రాతను
మౌనంగా భరిస్తూ....
జారుతున్న ప్రతి కన్నీటి చుక్కకి
సమాధానం దొరకని ప్రశ్నలా.....
ఇలా ఈ జీవితం ఇంకెన్నాళ్ళొ....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner