13, జనవరి 2014, సోమవారం

చివరి ప్రేమ లేఖ....!!

 నాలోని నీకా... లేక నీలోని నాకనాలేమో....!!
మొదటి లేఖ రాయాలనుకున్నా...చివరి లేఖో చిట్ట చివరి లేఖో ఇది నాకే తెలియడం లేదు...నాకు తెలియకుండానే ఇష్టపడ్డావు అదే ప్రేమనుకున్నావు..!! చెప్పకుండా నీ మనసులోనే దాచుకున్నావు...నీ ప్రేమ ఇష్టం నాకు తెలియకుండానే దూరం అయ్యావు...కలవని సమాంతర రేఖలు మన జీవితాలు...కలిసినా జత కలవని బంధాలు మనవి..బాధ్యతలకు బందీలుగా మనకున్న అనుబంధాలకు దూరం కాలేని సున్నిత మనసుతో చెప్పలేక పోయిన నీ ప్రేమ తెలిసినా... దూరంగానే ఉన్నా...నిన్ను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక...ప్రేమ మనసులో ఉంటే చాలు....మనసుకు మాత్రమే తెలిసిన ఈ మౌన తరంగం...మనసుల బంధం ఎప్పటికి మదిలో నిలిచి పోతుంది సజీవంగా...!! అందరిలా మనం కలిసి పంచుకున్న ఊసులు, ఊహలు లేవు...పలకరింపుల పరిచయాలు...ఆ పరిచయాల పరిమళాలు అసలే లేవు...అయినా మన పరిచయం ఇప్పటికి గుర్తుగానే ఉంది ఇద్దరికీ...ఇది నిజం కదూ...!! మనకి తెలియకుండానే ఒకరి గురించి ఒకరం వెదుకుతూనే ఉన్నాం...చూసుకున్నా మాటలు మరచి పోయిన ఆ క్షణాలు ఇంకా నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి...నిన్నో మొన్నో జరిగినట్టుగా...!! ఈ దోబూచులాటేనా ప్రేమంటే...!! మరి నీకు తెలిస్తే నాకు చెప్పాల్సింది అప్పుడే...!! చెప్పలేని నీ మొహమాటం మన మధ్య దూరం పెంచిందేమో...!! నీ అంతరంగాన్ని చదవలేని నా మనసుకు ఏ శిక్ష వేయాలో మరి...!! అయినా ఇలా నీ మనసులో ఉన్న నేను ఓ రకంగా అదృష్టవంతురాలినే అనుకోవాలి...!! ఇది నా ఊహకు అందనిదే అయినా ఇలా అనుకోవడం కూడా బావుంది నాకు...ప్రేమంటే కలిసి బతకడమే కాదు... ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇష్టమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండటమే...!! ఇష్టమైన ప్రేమను ఇష్టంగా తలచుకుంటూ మనను ఇష్టపడే వారితో కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ... నీ సుఖమే నే కోరుకున్నా... నిను వీడి అందుకే వెళుతున్నా... అని భారమైన మనసును బరువుగా మోసుకుంటూ జీవితాన్ని గడిపేయకుండా ప్రేమను బతికిస్తు ఓ జీవిత కాలపు ఆలస్యాన్ని మరో కొత్త జీవితానికి నాందిగా మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంటూ నీ జీవితాన్ని నందన వనం చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ..... ఎప్పటికి నీ ప్రియమైన నేస్తాన్నే....!!

( ఉత్తరాలు రాయడం మాత్రమే వచ్చిన నాకు ప్రేమ లేఖ అదీ చివరి ప్రేమ లేఖ రాయడం ఎలా వస్తుంది ..!! ప్రేమ లేఖ రాసే అవసరం నాకు ఎప్పుడు రాలేదు..అందుకేనేమో మొదటి చివరి లేఖ ఇదే అవుతుంది...మొత్తానికి నాకు కోకిల గీతం నిర్వహించిన ఈ చివరి ప్రేమలేఖల పోటిలో మూడవ బహుమతి వచ్చింది .... ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి, లక్ష్మి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు )

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

తెలియకుండానే ఒకరి గురించి ఒకరు వెదుకుతూ .... చూసుకున్న మాటలు మరచి పోయిన క్షణాలు గుర్తుండి....నిన్నో మొన్నో జరిగినట్టుగా.... దోబూచులాడటం ప్రేమేమో మరి.
ప్రేమంటే కలిసి బతకడమే కాదు .... ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇష్టమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండటమేమో...!!
ఎన్నో ప్రశ్నలకు తెరలేపుతూ చక్కని పోస్టింగ్
అభినందనలు మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

:) ధన్యవాదాలు చంద్ర గారు ..కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కదండీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner