శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.
శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా.... అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడం లో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శతక రచనా ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అవచ్చిన్నంగా కొన సాసుతూనే వున్నది. ఇక తెలుగుకు సజాతీయములైన కన్నడ, తమిళము, మళయాళము భాషలలో వెలువడిన శతకముల సంఖ్య అతి తక్కువ. కన్నడ భాషలో శతక రచన తెలుగు భాష కంటే ముందు ప్రారంభ మైనను ఆ భాషలో శతక సాహిత్యానికి ప్రాధాన్యత ఎంత మాత్రము లేదు. తెలుగుకు మాతృక యైన సంస్కృతమున కూడ ఇన్ని శతకములు లేవు. తెలుగులో మాత్రమే శతక సాహిత్యము ప్రత్యేకతను చాటుకున్నది.
శతకం లక్షణాలు
శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని మకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకము నకు మకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకము నకు మకుటము, అలాగే వేంకటేశ్వరా, దాశరథీ అనునవి ఇతర ఉదాహరణములు.సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.
మిగిలిన సాహిత్య ప్రక్రియలకున్న అలంకారిక, లాక్షణిక నియమాలు అనే బంధాలు శతక సాహిత్యానికి లేవు. ఛందస్సుకు అనుగుణంగా ఉంటే చాలు. విషయాన్ని ఒక పద్యంలో వెళ్ళగ్రక్కవచ్చును. లేదా 10 పద్యాలలో విస్తరింప వచ్చును. కథ చెప్పాలనీ, ముగింపు ఉండాలనీ నియమం లేదు. కనుక కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజులతరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్కపద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును.
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
- 1. సంఖ్యా నియమము
- 2.మకుట నియమము.
- 3.వృత్తనియమము
- 4.రసనియమము
- 5.భాషా నియమము
శతక వాఙ్మయము ప్రగతి
మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారము శతక వాఙ్మయమునకు ఆద్యముగా చెప్పవచ్చును. పాల్కురికి సోమన (క్రీ.శ.1300) వృషాధిప శతకము మొట్టమొదటి సంపూర్ణ శతకము. సుమారు ఈ కాలములోనే బద్దెన సుమతీ శతకము, యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వెలువడ్డాయి. వీటి ఒరవడిలోనే తెలుగులోను, కన్నడములోను శతక వాఙ్మయము చాలాకాలం కొనసాగింది.తరువాత తెలుగులో ఎన్ని వేల శతకాలు వచ్చాయో చెప్పడం కష్టం. ఎందరో పండితులు, కవులు, ఔత్సాహిక రచయితలు వేర్వేరు అంశాలలో శతకాలు రచించారు. భక్తి (కృష్ణ శతకము), శృంగారము (భర్తృహరి), తత్వము, వేదాంతము (బమ్మెర పోతన - నారాయణ శతకము), నీతి (సుమతీ శతకము), పొగడటం, తిట్టటం, పొగడినట్టు తిట్టడం, తిట్టినట్టు పొగడడం, వర్ణించడం, బోధించడం - అన్ని విషయాలలోనూ శతకాలు వ్రాశారు. వీటిలో చాలావరకు ముద్రణకు నోచుకొనబడలేదు.
తెలుగు వాగ్మయమున మొట్టమొదట వెలసిన శతకములన్నియి శైవమత సంప్రదాయకములు. దీనిని బట్టి తెలుగున శతక సాహిత్య ప్రక్రియకు ఆద్యులు శివ కవులే నని రూడిగా చెప్పవచ్చు.
బహుశా అప్పటి సాహితీ ప్రక్రియలలో ఒక్క శతకసాహిత్యమే సంఘంలోని ఆచారాలను నిశితంగా విమర్శించడానికి ఉపయోగపడింది. వీటిల్లో వేమన శతకము ఎప్పటికీ అగ్రగామి. మూడు పంక్తులలో ముప్ఫై పేజీలకు సరిపోయే భావాన్ని ఇమిడ్చిన మేధావి, తత్వ వేత్త. అందరూ అనుకొన్నదానికి కూడా నిక్కచ్చిగా ఎదురు నిలచిన మహానుభావుడు వేమన.
శతక సాహిత్యంలో ముప్ఫైకి పైగా ముస్లిం కవులు వ్రాసిన శతకాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాగే క్రైస్తవ భక్తిపరం గా కూడా చాలా శతకాలున్నాయి.
మన తెలుగులో ఇప్పటికి చెప్పుకోవాలంటే శతకాలు సుందరంగా రాస్తున్న ఎందఱో మహానుభావులు ఉన్నారు... భాషను బ్రతికిస్తున్న వారందరికి మన తెలుగు జాతి తరపున వందనాలు
మచ్చుకి కొన్ని శతక నామాలు ... ఆ కవుల పేర్లు
- అంతర్మథనము - కోవెల సంపత్కుమారాచార్య
- అఘవినాశ శతకము - దాసరి అంజదాసు
- అచ్యుతానంత గోవింద శతకములు - అద్దంకి తిరుమల సమయోద్దండకోలాహల లక్ష్మీనరసింహకుమార తిరువేంగడతాత దేశికాచార్యులు
- అధర్మానుతాప శతకము - వేమూరి నృసింహశాస్త్రి
- అనుగుబాల నీతి శతకము - ముహమ్మద్ హుస్సేన్
- అన్యాపదేశ శతకము - కొమాండూరు కృష్ణమాచార్యులు
- అభినవ వేమన శతకము - బత్తలపల్లి నరసింగరావు
- అభినవ సుమతి శతకము - దుర్భా సుబ్రహ్మణ్యశర్మ
- అల్లా మాలిక్ శతకము - షేక్ దావూద్
- అశ్వత్థేశ త్రిశతి - కలుగోడు అశ్వత్థరావు
మధురమైన మన తెలుగు సాహిత్యపు నుడికారాలను, అందచందాలను ఇలా మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది... నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సాహితీ సేవకు కృతజ్ఞతలు...
సేకరణ : వికీపీడియా నుండి...
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
>శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
మకుట నియమం తెలుగు శతకాలదే. సంస్కృత'శతి' సంప్రదాయానికి వర్తించదు. నూరో అంతకన్నా కొంచెం ఎక్కువో ఉన్నా వాటిని శతి అని పిలవని సందర్భాలూ ఉంటాయి. ఉదా॥ సౌందర్యలహరి. నూరుపద్యాల చాదస్తం లేదు సంస్కృతంలో. అద్భుతమైన ముకుందమాలలో ఏబదిమూడే శ్లోకాలు. (సంస్కృతంలో పద్యాలు అనం. అవి శ్లోకాలనే వ్యవహరిస్తారు.)
mi vivaranaku dhanyavaadaalu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి