30, ఏప్రిల్ 2018, సోమవారం

ద్విపదలు...!!

1.   శోకమెంత నెమ్మదించిందో
ఆలంబనై చేరిన నీ చెలిమికి...!!

2.  వెలుగు చిత్తరువుకై నిరీక్షణ
జీవితపు చీకటి కాన్వాసుపై....!!

3.   వెలుతురు వస్తానంటోంది
మరలిన స్నేహాన్ని మరల అందిస్తానంటూ..!!

4.  మనసు మౌనాన్ని వీడిందేమెా
జ్ఞాపకాల వేగాన్ని తట్టుకోలేక..!!

5.  శూన్యం పూరించే సందర్భం
నాతో నేనున్నప్పుడే సాధ్యమేమెా..!!

6.  మనమయ్యే క్షణాలే అన్నీ
దాయలేక అక్షరాలు అలసిపోతాయేమెా...!!

7.   అక్షరాలు పాతవే
భావాలే సరికొత్తవనుకుంటా...!!

8.   నా ఎరుకు ఇప్పుడే వచ్చాయి
ఏనాటివైనా ఎదనుతాకే నీ భావనలు....!!

9.   బందాలన్నీ అగమ్యమే
ఏ దారెటు పోతుందో తెలియక....!!

10.   వాస్తవమై వద్దనే ఉండు
కోల్పోయిన జీవితాన్ని అందిస్తూ...!!

11.  ఎప్పటి కష్టాలప్పుడే
ఎప్పటికి నిత్యనూతనంగా...!!

12.  కన్నీరు అంతే
కష్టాలను వదిలి ఉండలేదు ఎందుకో... !!

13.   కలవరాలతోనే కడవరకు
నట్టింట్లో నమ్మకం అపహాస్యం పాలయ్యాక...!!

14.  నీలోనే ఉన్నా
గుర్తెరిగినట్లు లేవు...!!

15.  చీకటి స్వప్నాలెన్ని దాగున్నాయో
వేకువ వెలుగుల మాటున...!!

16.   మనసుకెలా తెలుస్తుందో
మౌనంలో మాటలన్నీ...
!!

17.   ఆహ్వానించక తప్పలేదు కాలానికి
మార్పు అనివార్యమని తెలిసాక....!!

18.   అక్షరాలను ఆవహిస్తుంటావిలా
మనసు భావాలను తర్జుమా చేయడానికనుకుంటా...!!

19.  చెలిమి చెమరింతవే నువ్వు
గాయాలకు జ్ఞాపకాల లేపనమద్దుతూ....!!

20.   నీ జ్ఞాపకం
మనోసంద్రంలో మౌనపు అలల అలజడి...
!!

21.  నేనో క్షణాన్ని
నీ కాలపు లెక్కల లెక్కింపులో...!!

22.  నేనో భావాన్నే
అక్షరాల అల్లికలో అందంగా ఇమిడిపోతూ...!!

23.  నేనో గాయాన్ని
గతాన్ని జ్ఞాపకంగా మార్చే వాస్తవంలో....!!

24.   నేనో వ్యధాభరిత కథని
వాస్తవంలో ఇమడలేని గతాన్నై...!!

25.  ఘడియలు లెక్కించలేకున్నా
నీ జ్ఞాపకాల తాకిడిని తట్టుకోలేక...!!

26.   కబురంపాను కుశలమని
మనసు దోబూచులాటల్లో మరపుకు తావులేదంటూ...!!

27.   గడచిన దశాబ్దాలు రెండే
శతాబ్దాల చరితను వెంటేసుకుని..!!

28.   విస్తుపోయిన ఆ క్షణం
జ్ఞాపకమైనది సజీవమై నిలిస్తే....!!

29.   బంధమై మిగిలావు
బాధ్యతలన్నీ మెాస్తూ...!!

30.   ఏకాంతం..
మనిషితో మనసు మాట్లాడే క్షణాల సంగమం...!!

29, ఏప్రిల్ 2018, ఆదివారం

పాడుతా తీయగా.. !!

చాలా రోజుల తరువాత మళ్ళీ పాత రోజులు గుర్తు చేసింది "పాడుతా తీయగా"   "పాపగారు ఎందుకింత బాగున్నారు" పాటతో. నా చిన్నప్పుడు రేడియెాలో వస్తుంటే నేర్చుకున్న పాట.  ఆదివారం మధ్యాహ్నం నేర్పే సామూహిక గేయాల్లోనో, బుధవారం నేర్పే లలిత సంగీతంలోనో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి ప్రోగ్రామ్ లో నేర్చుకున్న పాట ఇది.  క్రిందటి ఆదివారం వినలేదు... అదే ఇప్పుడు చూడగానే ఎంత సంతోషం వేసిందో....

శుభాకాంక్షలు...!!

అనుబంధానికి, ఆప్యాయతకు మరోరూపం. ఈ 29 ఏళ్ళలో నాతో తిట్లు తింటూ కూడా నన్ను అభిమానించే తమ్ముడు రఘుకి....

నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాశీస్సులు...

26, ఏప్రిల్ 2018, గురువారం

శుభాకాంక్షలు....!!

అల్లరి ఆకతాయితనమూ 
కలిపేసిన కబుర్లతో
అమ్మ కొంగు వదలని బిడ్డలా
మాటలతో సరదాల సంతోషాలను
అందిస్తూ  అలకల కోపాలను
అరక్షణంలోనే మర్చిపోతూ
అందరికి ఆనందం పంచుతూ
నలుగురూ బావుండాలనుకునే
పసితనపు ఛాయలు వీడని
మౌర్యకి..
   పుట్టినరోజు శుభాకాంక్షలు....!!

24, ఏప్రిల్ 2018, మంగళవారం

వెలి వేయడమే సబబేమో...!!


నా కవితను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు....

వయసుడిగిన వారసత్వపు
వార్ధక్యం వెన్నంటి వచ్చేసినా
కాలం చేసిన కనికట్టులో
నూరేళ్ళ జీవితానికి
కలిపిన తోడును దూరం చేసినా
మిగిలిన అనుబంధాల
ఆంటీ ముట్టని ఆప్యాయతల్లో
కనపడని అభిమానం తల్చుకుంటూ
విస్తుపోతున్న మనసు సంఘర్షణల నడుమ
అందరిని అక్కున చేర్చుకున్న
ఆ చేతులకు చేదోడు కాలేని
రక్త సంబంధాలు సిగ్గుపడక
చేసే పూజలకు చెప్పే నీతులకు
కనీస న్యాయం చేయలేని
మరుగున పడిన మానవత్వపు
మకిలి పట్టిన మురికి మనుష్యులను
వెలి వేయడమే సబబేమో...!!  

అంతర్జాల కవిత్వం...!!

నా రాతలను ప్రచురిస్తున్న గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...

ఒకప్పుడు పుస్తకాల వరకే పరిమితమైన తెలుగు సాహిత్యం నేడు ఎన్నో మార్పులు, చేర్పులతో అంతర్జాలంలో కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరికే పరిమితమైన కవిత్వం ఇప్పుడు అందరికి నుపరిచితంగా మారిపోయింది. ఇది అందరు సంతోషించదగిన మార్పే అనడంలో ఎట్టి సందేహము లేదు. సామాజిక మాధ్యమాల్లో ఎందరో కవులు తమ సరికొత్త భావాలతో వచన కవిత్వాన్ని అందిస్తున్నారు. కవిత్వమంటే ప్రేమ, విరహం, నిరీక్షణ, ప్రేయసి వర్ణన అన్న నానుడికి వీడ్కోలు చెప్తూ సామాజిక, వ్యక్తిగత సమస్యలతో పాటుగా సమాజానికి హితమైన సాహిత్యాన్ని ఎందరో  వర్ధమాన కవులు అందిస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. దీనికి తగ్గట్టుగా ఎన్నో సాహిత్య, సామాజిక సంస్థలు శత, సహస్ర  కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ కవులను ప్రోత్సహించడం అన్నది ముదావహం.
                          తెలుగులో బ్లాగులతో మొదలైన తెలుగు అంతర్జాల సాహిత్యం అలా అలా ముఖపుస్తకానికి విస్తరించి ఎన్నో తెలుగు సమూహాలుగా ఏర్పడి కవిత్వాన్ని బతికిస్తూ, కొత్తవారికి సూచనలిస్తూ, కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు నిర్వహిస్తూ తమ వంతు కృషి చేస్తున్నారు. ఎవరో రావాలి ఎదో చేయాలని ఎదురు చూడకుండా ఎవరికి వారు సాహిత్య సమారాధన చేయడం నిజంగా అభినందించదగిన విషయం. సాహిత్యం సమాజ హితాన్ని కాంక్షించాలి, అక్షరానికి అణుకువతో పాటుగా అవసరమైతే ఆయుధమై నిలిచే సామర్ధ్యం కూడా ఉండాలి. అప్పుడే మనం ఉన్నా లేకపోయినా మన అక్షరం బతికి ఉంటుంది. చాలామంది అనుకోవచ్చు ఆఁ ఏముంది నాలుగు అక్షరాలు చదివితే జనాలు మారతారా, సమాజం బాగు పడిపోతుందా అని. మార్పు ఎక్కడో కాదు మనలోనే మనతోనే మొదలు కావాలి. ఒక్క చిన్న మాట లేదా ఆలోచన చాలు మంచి మార్పు కోసం.
                           తెలుగు సాహిత్యాన్ని కొందరికే పరిమితం చేయకుండా అందరిది అనుకునేటట్లుగా చేసే బాధ్యత సాహితీ పెద్దలకు ఉంది. నేటి కవులకు తగు సూచనలిస్తూ, సద్విమర్శలు అందించడం, తమకు నచ్చిన ఏ నలుగురికో అభినందనల ప్రోత్సాహాలను పరిమితం చేయకుండా ప్రతిభను వెలికి తీయాలని, తెలుగు సాహిత్యానికి ఈ వర్చ్యువల్ ప్రపంచంలో మహోన్నత స్థానాన్ని ఆశించను కానీ పది కాలాలు తెలుగు నిలబడాలని కోరుకునే ఎంతోమందిలో నేను ఒకదాన్ని. 

23, ఏప్రిల్ 2018, సోమవారం

మా అమ్మ...!!

           అమ్మ గురించి అందులోనూ మా అమ్మ గురించి చెప్పడానికి ఈ అక్షరాలు, పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదు. జన్మనిచ్చినా, లాలిపాటలతో జోల పాడినా, కథలు చదివి చెప్పినా, దండించినా, దగ్గరకు తీసుకున్నా అమ్మకు సాటి మరెవరూ రాలేరు. మా అమ్మే కాదు ఏ అమ్మ అయినా అంతే. ప్రపంచం అంతా నిన్ను ఒంటరిని చేసినా నీతోనే ఉండేది అమ్మ. నా మొదటి స్నేహితురాలు అమ్మ. నా జీవితంలోకి తొంగి చూస్తే అమ్మ నాతో లేని క్షణాలు లేవనే చెప్పొచ్చు. అమ్మకు కొన్నాళ్ళు దూరంగా ఉన్నా అమ్మను దూరం చేసుకున్న సమయమే లేదు.
            నా వరకు అమ్మ నేను పుట్టినప్పటి నుంచి నలుగురిలో నన్నో ప్రత్యేక గుర్తింపుతోనే పెంచింది. నాకు చదవడం రానప్పటి వయసు నుంచే ఇంటెడు చాకిరి చేసిన అమ్మ పక్కన పడుకుని అమ్మా ఈ కథ చదవవూ అంటే ఎంత చక్కగా కథ చదివి వినిపించేదో. అలా అమ్మ చదివే కథలు వింటూ నేను చదవడం త్వరగానే నేర్చేసుకున్నా. నా ఏడేళ్ళ వయసు నుంచే ఆంధ్రజ్యోతిలో సీరియల్ చదవడం అలవాటై పోయింది. ఈ అక్షరాలు ఇలా రాయగలుగుతున్నానంటే అది అమ్మ పెట్టిన అక్షర భిక్షే. అందుకే తొలి గురువు నాకు అమ్మే. నా ధైర్యం, నా బలం, బలహీనత, నా సంతోషం, నా బాధ, నా కోపం ఇలా నా అన్న ప్రతిదీ నాకు అమ్మే. ఇన్ని మాటలెందుకు నా జీవితమే అమ్మ. అమ్మ లేని జీవితం నాకు లేదు. ఈ ఐదు పదులకు దగ్గరౌతున్న జీవితయానంలో ఇప్పటికి అమ్మ చేతి ముద్దనే తినడం నా అదృష్టమనే చెప్పాలి. మా అమ్మ నా పిల్లలకూ అమ్మే. నాకిద్దరమ్మలున్నట్లే నా పిల్లలకూ  ఇద్దరమ్మలు. నేను అమ్మా, అమ్మమ్మల దగ్గరే పెరిగాను. ఇప్పటికి అమ్మమ్మ కూడా నాతోనే ఉంటుంది. నా కోసం తన సంతోషాలను వదులుకుని నా కోసమే నాకన్నీ తానైంది మా అమ్మ. అమ్మ నాకు లేకపోతే పెళ్లైన తరువాత ఈ ఇరవై ఏళ్ళ జీవితం ఎప్పుడో ముగిసిపోయేదేమో. మనుష్యులు మనసులతో ఆడిన జీవిత వైకుంఠపాళీలో పాములు మిగేయాలని చూస్తుంటే అనుక్షణం కావలి కాస్తూతానే ఓ నిచ్చెనగా మారి నా గెలుపుకు కారణమైన అమ్మకు నేనేమిచ్చినా ఋణం తీరదు.  
           

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

దూరాన కొండలు...!!

అందంగా అగుపిస్తూ 
ఆహ్లాదాన్ని పంచుతూ
ఆకాశాన్ని తాకినట్లనిపిస్తూ
ఆశలకు ఊపిరి పోస్తూ
నిరాశలను పారద్రోలుతూ
విరాగులకు విశ్రాంతి నిలయాలౌతూ
పట్టుదలకు పెట్టని గోడగా
దూరానున్న కొండలయినా
దగ్గరనే ఉన్న అనుభూతినిస్తూ
ఎత్తుపల్లాల జీవితాలను గుర్తుజేస్తూ
ఎదుట పడలేని నగ్న సత్యాలను ఎదలకందజేస్తూ
కనిపించే దూరపు కొండలెప్పుడూ నునుపే మరి....!!

నా అక్షరాలకు గౌరవాన్నిచ్చిన మన తెలుగు మన సంస్కృతికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు నా అక్షరాలకు విలువ, వన్నె తగ్గకుండా నన్ను హెచ్చరించే నాకున్న కొద్దిమంది ఆత్మీయు మిత్రులలో త్రినాధ్ గారు ఒకరు. నా సాహితీ ప్రయాణంలో లోటుపాట్లు చెప్పే మంచి మిత్రులు.  త్రినాధ్ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు. 

17, ఏప్రిల్ 2018, మంగళవారం

మరో మనీషి...!!

బంధానికి విలువిస్తావని
బాధ్యతలను పంచుకుంటావని
నమ్మిన నాటి నమ్మకం
నడిచింది నీతో జతగా
అయినవారిని కాదని
మాటల చాటున మాయను
అంతరంగపు అడ్డగోలుతనంతో
అహం చిమ్మిన క్రోధానికి
అమ్మతనం ఆక్రోశిస్తూ
బిడ్డలకై బానిసగా మారి
బతుకు భారాన్ని మెాస్తుంటే
అడుగడుగునా ఛీత్కారాలను
ఆభరణమైన చిరునవ్వులో దాచేస్తూ
నడి బజారులో నవ్వులపాలైనా
కన్నీటికి తావీయక
కలలను కలతలతో కలిపేస్తూ
ఆశగా భవితకై ఎదురు చూస్తోంది
మరో మనసు చచ్చిన మనీషి....!!

15, ఏప్రిల్ 2018, ఆదివారం

ఆత్మఘోష...!!

బంధాలను తెంచుకుని
బాధ్యతలను వదిలించుకుని
పాశాలన్నింటికీ దూరమైపోతూ

మాటలు అరుపులు ఆక్రోశాలు
మతాలు కులాలు కుతంత్రాలకతీతంగా
శవ రాజకీయాలకు తావీయవద్దంటూ

రాక్షసత్వానికి పరాకాష్ఠగా
రాతిబొమ్మలే సాక్ష్యాలుగా మిగిలితే
కన్నీరు సైతం  కంటతడి పెట్టిన వైనం

ఎక్కడికో ప్రయాణమై వెళుతున్నట్లు
పార్థివ శరీరం బయలుదేరింది
అంతిమ సంస్కారం కోసం

మరో ఆశ్రయానికై వెదుకులాటలో
భూమ్యాకాశాల మధ్యన తేలుతోంది
అన్ని తెలిసిన ఆత్మనే అశరీరం...!!

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

దేవుళ్ళకు విలువలు లేవట... !!

నేస్తం, 
          నమ్మిన దేవుడు ఎవరికైనా ఒకటే.  విలువలు,  మానవత్వం లేనిది మనిషిగా పుట్టిన మనకు.  దేవుడికి విలువ లేకపోవడం ఏంటో నాకర్ధం కావడం లేదు.  తప్పు ఎవరు చేసినా క్షమార్హులు కాదు అది ఏ మతము వారైనా, ఏ కులము వారైనా.  ఏ మతమూ తప్పు చేయమని చెప్పదు.  తప్పొప్పులు చేసేది మనిషి మాత్రమే. తప్పును ఖండించండి,  సాటి మనిషిగా మానవత్వం చూపండి. అంతే కాని మతాలకు,  దేవుళ్ళకు విలువలు లేవని అనకండి.  మీరందరూ విజ్ఞులు,  చాలా  పెద్ద మనసు కల దొడ్డ మనుజులు.  మీ ముందు మేము అల్పులమే....!!

నిజమేనా..!!

నేస్తం,
        సినిమాల్లో పల్లెటూరు చూసి,  పల్లెటూరి అమ్మాయి వేష భాషలు చూసి మనకు తెగ నచ్చేస్తుంటాయి. అదే నిజ జీవితంలో వాళ్ళని ఎంత చిన్నచూపు చూస్తామెా మనకు తెలియనిది కాదు.  రంగస్థలంలో కాని,  ఫిదాలో కాని మరేదైనా సినిమాలో కాని ఎంతగానో  మనకు నచ్చిన సన్నివేశాలు,  ప్రదేశాలు, వేష భాషలు,  పల్లెటూరి అమ్మాయిలు..... నిజంగా మనకు నచ్చినట్టేనా అని నాకో చిన్న అనుమానం మాత్రమే....😊

12, ఏప్రిల్ 2018, గురువారం

సూక్తి ముక్తావళి 2...!!

నేస్తం,
         మనం చేసే పూజలు, చెప్పే నీతులు ఎంత వరకు మనం పాటిస్తున్నామో ఒక్కసారయినా ఆలోచిస్తున్నామా. మనం ఒకరికి ఏమి ఇవ్వనప్పుడు వాళ్ళు మనకి అన్ని చేయాలని ఎలా అనుకుంటాం. శ్రీరంగ నీతులు వల్లిస్తూ దేవుడికి సేవలు చేసేస్తే సరిపోదు. మనం ఎంత వరకు నిజాయితీగా ఉంటున్నామన్నది ముఖ్యం. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా జనాల క్షేమ సమాచారాలు కనుక్కుంటుంటే సరిపోదు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచి నలుగురి దగ్గర మంచితనం నటిస్తే సరిపోతుందా. తేనేపూసిన మాటలు చెప్పేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలుసుకోలేని వాళ్ళు ఆ మాయలో పడి పోతున్నారు. ఎవరికైనా తనదాకా వస్తే కానీ తెలియదన్న నిజం నిజంగా నిజం. కొన్ని కాదు కాదు చాలా రక్త సంబంధాలు కానివ్వండి, స్నేహం నటించే అనుబంధాలు కానివ్వండి చూస్తుంటే తేళ్లు జెర్రులు పాకుతున్నట్లుగా ఉంటోంది. కష్టంలో ఓ మాటకు కూడా నోచుకోని ఈ స్వార్ధపు ప్రేమలు అవసరమంటారా. ఓ ముద్ద వేస్తేనే ఊరకుక్క కూడా విశ్వాసంగా పడి ఉంటుంది, కాని ఈ వంచకుల నైజం మాత్రం ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉంటుంది. మనకు పెట్టే గుణం లేనప్పుడు మరొకరి గురించి అనే హక్కు మనకెక్కడిది. మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. తిని మర్చిపోతే పుట్టగతులు లేకుండా పోతారు. రేపన్నది ఒకటుంది ప్రతి ఒక్కరికి. కుటుంబంలో బాధ్యతలను పంచుకొని మొగుడు / పెళ్ళాం బతికున్నా చచ్చినట్లే లెక్కకు వేసుకోవాలేమో. ఓ మనిషిని మానసికంగా హింసించే హక్కు, అధికారం మనకి లేదు. న్యాయస్థానంలో దీనికి శిక్ష లేక పోవచ్చు కానీ మనస్సాక్షి ఉంటేనో లేదా సూక్తి ముక్తావళి వల్లించే సూక్తి సుధలకు, అపర దైవ భక్తులకు ఆ దైవమైనా శిక్ష విధిస్తుందేమో చూడాలి. 

10, ఏప్రిల్ 2018, మంగళవారం

నాంది పలుకుదాం...!!

నేస్తాలు,
             నా రాతలకు, నా వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఎవరి భావనైనా చూసినప్పుడు నాకనిపించిన భావాన్ని అది నాదే అన్నట్లుగా అక్షరాల్లో అమర్చడం లేదా ఏదైనా సంఘటనను చూసినప్పుడు నాకు అనిపించిన అనుభూతిని అక్షరాలతో పంచుకోవడం చేస్తున్నాను. దీనికి నేనేదో బాధలో ఉన్నాననో లేదా మరొకటో అనుకోవడం మీకు తగదు.రాసే ప్రతి అక్షరం మనసు నుంచి వచ్చేదే కాని దానికి జీవితాలకి ముడి పెట్టకండి దయచేసి. రచయిత, కవి ఎవరైనా సరే ఒక భావాన్ని రాయడానికి ఎంత ఆలోచిస్తారో, ఎంత మధనానికి గురి అవుతారో తెలిస్తే ఎవరి రాతలను చులకన చేసి మాట్లాడరు.  కోపమైనా, ప్రేమైనా, బాధైనా మరేదైనా రచయిత పంచుకునేది అక్షరాలతోనే. నాకు 6,7 ఏళ్ళ వయసు నుండి పుస్తకాలు అనేకంటే కనిపించిన ఏ అచ్చు కాగితమైనా చదవడానికి ప్రయత్నించేదాన్ని. ఆ చదవడమే ఇప్పుడు ఇలా నాలుగు మాటలు రాసేటట్లు చేసిందేమో. నన్నేదో పొగడాలని, అభినందించాలని అని కానీ నేనీ రాతలు రాయడం లేదు. నా అనుభవాలను, ఆలోచనలను, నా స్పందనలను ఇలా ప్రతి దానిని అక్షరాలతో పంచుకోవడం నాకు అలవాటుగా మారిపోయింది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు నా భావాలకు ప్రతి రూపంగా మారి  సంతోషాలకు, బాధలకు, విమర్శలకు ఇలా అన్ని అనుభూతులకు నిలయమైపోయింది. నా రాతలు నచ్చకపోతే చదవకండి అంతేకాని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు దయచేసి మానుకోండి. మనకు రాయడం చేతకానప్పుడు పక్కవాళ్ళు రాస్తే కాస్త ప్రోత్సాహాన్నివ్వండి, మీ మంచి మనసుని చాటుకోండి. అంతేకాని వెటకారాలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేసి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి. మరో విషయం నాకు సంబంధం లేని మీ వ్యక్తిగత భావాలు, ఫోటోలు నాకు ట్యాగ్ చేయవద్దు. చాటింగ్ లో సమాధానం కోసం చూసే స్నేహం మీదయితే నా స్నేహాన్ని విరమించుకోండి.  ఎందుకు చాటింగ్ చేయరు అని నన్ను అడగవద్దు దాని కోసం చూసే ఎంతోమంది మీకు ఈ ముఖపుస్తకంలో ఉన్నారు. నాతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దయచేసి అన్యధా భావించక నా మానాన నన్ను వదిలేయండి. నాకు నా కుటుంబం తరువాతే ఏదైనా. ఎవరో మారాలి అనుకోవడం కంటే మనలో లోపాలు తెలుసుకుని మనల్ని మనం సరిదిద్దుకుంటే చాలు. పెళ్ళై పెళ్ళాం/మొగుడు, పిల్లలుండి ప్రేమ దోమా అంటూ అర్ధం పర్థంలేని అనుబంధాలకు వేదికగా మారిన ఇప్పటి వ్యవస్థకు క్రమ సంబంధాల విలువలు తెలియ చేస్తూ కాస్త నైతికతను మర్చిపోకుండా చేయడానికి మన  బాధ్యతను గుర్తు చేసుకుందాం. చక్కని సమాజానికి, విలువలున్న సాహిత్యానికి మనవంతుగా మానసిక రుగ్మతలు,  సాహిత్యపు అసమానతలు లేని నవ శకానికి నాంది పలుకుదాం.  

జీవన 'మంజూ'ష (7)..!!

నేస్తం,
        నాలుగు తరాల అనుభవాలను అందిపుచ్చుకున్న జీవితం కాసిన్ని అనుభూతులను పంచుకోమంటూ ఆహ్వానిస్తోంది. వడ్లు దంపుకు తిన్న ఆ రోజుల అనుభవాలు, గొప్పగా బ్రతకకపోయినా గుంభనంగా గుట్టువిప్పని అనుభూతులను, పంచుకున్న తాయిలాలను, పట్టుపరుపుల మీద పడుకోకున్నా పండువెన్నెల్లో పంచుకున్న బంధాలను, కష్టం వస్తే కలిసికట్టుగా పెనవేసుకున్న అనురాగాలను ఇలా ఎన్నెన్నో ఆనాటి కబుర్లను  అమ్మమ్మ కథలుగా చెప్తుంటే వింటూ.. 
      అమ్మ పక్కలో పడుకుని అమ్మ చదివే చందమామ కథలు వింటూ ఆరుబయట వెన్నెల చల్లదనాన్ని అందిపుచ్చుకుంటూ, ఆటలాడుతూ చదివిన చదువులను నెమరువేసుకుంటూ అందరి మధ్యలో పెరిగిన బాల్యాన్ని, చుట్టపు చూపుల చుట్టరికాల్ని పెంచుకుంటూ, చక్కని స్నేహాలను పంచుకుంటూ రెండు తరాల సంపదను కాపాడుకుంటూ బంధాలను, బాధ్యతలను మరువని మన తరాన్ని... 
   పండు వెన్నెలా తెలియదు, పలకరించే బాంధవ్యాలు పెద్దగా తెలియని మన పిల్లలు, మన వరకే పరిమితమైన కుటుంబాలు, మన ఆలోచనా విధానంలో మార్పులతో మొదలైన మానసిక దౌర్భాగ్యాలు తొలగించలేని దుర్భేద్యాలుగా మారి అనుబంధాలను తెంచేస్తుంటే ఏమి చేయలేక చూస్తూ మిగిలిపోతూ, బాల్యాన్ని బరువైన చదువుల బరువుతో నింపేస్తూ, నలుగురిలో మనమూ గొప్పగా కనబడాలనే తపనతో నైతిక విలువలను నేల కూల్చుతూ ఆధునిక తరాన్ని డబ్బు, విలాసాలకు బానిసలుగా చేస్తున్న మనకు తెలిసినా తెలియనట్లు నటిస్తున్న అటు ఇటూ కానీ తరంగా మిగిలిపోతున్నందుకు ఖేదపడుతూ బోలెడు అభివృద్ధిని నాదించేశామని పొంగిపోతున్న నేటి సమాజ సామాజిక జీవులం మనం...!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసం.... 

మరో పుట్టుక కోసం..!!


నా కవితను ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, అర్ధవంతమైన చిత్రాన్ని జత చేసిన కత్తిమండ ప్రతాప్ గారికి నా మన:పూర్వక ధన్యవాదాలు...

శూన్యం చుట్టమై చేరుతూ
పలకరించని మౌనాల నడుమ
దగ్గర కాలేని బాంధవ్యాలను
మాటలు కరవైన మనసుల మధ్యన
అంపశయ్యల పంపకాల అవకతవకల్లో
భరోసానివ్వలేని బతుకు భయంలో
చీకటి చుక్కల చీరను చుట్టుకున్న
అమ్మదనం ఆర్తనాదాన్ని వింటూ
దిగులు దుప్పటిని కప్పుకున్న
నిర్వికార చైతన్యం నిరోమయమై
మరణపు పయనాన్ని నిర్దేశించలేక
దీనంగా దిక్కుల వెంటబడుతూ
మరో పుట్టుక కోసం వెదుకులాడుతోంది...!!

రెక్కలు కావాలి కవితా సంపుటి సమీక్ష...!!

బి వి శివ ప్రసాద్ "రెక్కలు కావాలి" కవితా సంపుటిలో అభిలాషలో వృత్తిని, ప్రవృత్తిని కాసేపయినా హత్తుకోవడంలో
నా నుంచి మనంలోనికి, గతంలోకి అప్పుడప్పుడు ప్రయాణించడానికి కోరిక ఆవశ్యకతను వినిపించారు. ఆ రోజు రావాలి అంటూ కవిత్వాన్ని కూడా ఒక వృత్తిగా గుర్తించాలని ఓ కొత్త కవి హృదయాన్ని మనకు చూపించారు. తన తన బిడ్డల అవసరాలన్నీ అడగకుండానే చూసుకునే శ్రీమతికి బహుమతిగా ఏమివ్వగలను అంటూ పురస్కారం  కవితలో అక్షరాంజలి ఘటించారు. ఆకాంక్షలో కనుమూసే వరకు ఎలా బతకాలో, ఎరుకలో మానసికోల్లాసం కంటే మించినది మరేది లేదని, ఏ వైపుకి పయనంలో ఏ యుగంలో మనమున్నామని నైతికతను మర్చిపోతూ, కులాల కుమ్ములాటలకు బలౌతున్న అమాయకుల ఙివిత కథనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. దేహాన్ని దేవాలయంగా కీర్తించారు ఏమివ్వగలను కవితలో. ఒక నిష్క్రమణంలోంచి కవితలో అందరి జీవితాలకు అంతిమ సాఫల్యం ఏమిటనేది చక్కగా వివరించారు. కాలం ఒక ఇంద్రజాలం అంటూ కాలం కనికట్టులో వింతలను విశదీకరిస్తూ రూపం లేకపోయినా తన ఉనికిని ప్రకటించేది ఒక విలక్షణ యదార్ధ కాలమని చెప్పడంలో సరికొత్త ప్రయోగంగా అనిపించింది. క్షణభంగురంలో రెప్పపాటు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో వివరిస్తారు. చైతన్యంలో వికలాంగుల పట్ల ఎలా మెలగాలో, డేగల రాజ్యంలో వ్యవస్థలో మార్పు ఎక్కడ రావాలో, తీరని శాపంలో చిత్రసీమలో వారసత్వపు ఆంకాలను, వేషాల మోసాలను ప్రశ్నిస్తూ కళామతల్లి కళకళలాడేదెప్పుడని అడగడం, తెలుగు అక్షరంలో తెలుగు గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి వెనుకబాటు తనాన్ని చెప్తూ పూర్వ వైభవాన్ని మళ్ళీ తేవాలంటారు. ద్వైతంలో రెండు అస్తిత్వాల నడుమ పగలు రాతిరి జీవితపు ఆటను చాలా బాగా చెప్పారు. నందన వనంలో గత జ్జ్ఞాపకంగా మిగిలిన తన ఊరిని, నరుడు అమరుడిగాలో అవయవదానం గొప్పదనం గురించి, నిరంతరంలో మానవజన్మ సార్ధకతను, నివేదనలో అక్షరాల ఆలంబనతో అంతరంగ ఆలోచనలను పంచుకోవడం, నేనులో తానేంటో చెప్పడం, నేరము-శిక్షలో కీచకులకు వేయాల్సిన శిక్ష ఏంటో, పాలపుంతలో జీవితంలో కడవరకు మనవెంట ఉండే జ్ఞాపకాల నక్షత్రాల పాలపుంతలను, ప్రయోగశాలలో జీవితపు ఒడిదుడుకులను, ప్రస్థానంలో ఓ కవిత జననం గురించి, బలే బలే దీపావళి పండుగ గురించి, బాటమ్ లైన్ లో విజయానికి అద్భుత సూత్రం, భూతంలో ర్యాగింగ్ వికృత రూపాన్ని, మనం ఎలా ఉండాలనేది మనం కవితలో, మనో నేత్రాలు తెరవండిలో సమాజంలో జరుగుతున్న ఘోరాలకు స్పందన, మళ్ళీ బాల్యంలోకి లో చిన్ననాటి నలుపు తెలుపుల అద్భుత జీవిత మధుర జ్ఞాపకాలను తడమడం, మా ఊరులో ఊరి జ్ఞాపకాలు ఆయుష్షును పొడిగిస్తాయంటూ, మాట్లాడుకోవాలిలో సాహిత్యపు దూరాలను దగ్గర చేయడం గురించి, మామూలు మనిషి, ముఖచిత్రం, మౌన సంభాషణ, వాయిదా, వినిపించే దైవం, సాఫల్యం, స్పర్శ, హాహాకారం, హెచ్చరిక, అక్షరాలు-ఆయుధాలు, అదోరకం మనిషి, ఆత్మయానం, ఆర్త గీతం, కలం మళ్ళీ మారాలి, చివరకు మిగిలింది, ఉత్తమ మనుషులు, చైతన్య స్రవంతి, జీవ లక్షణం, మహాత్ముడు మళ్ళీ పుట్టాలి, మే వచ్చింది, మేలుకొలుపు, రైజింగ్ ఇన్ లవ్, వికర్షణ, సంధి, సమూహంలో ఒంటరి, సృష్టికర్తలు వంటి ఆలోచనాత్మక కవితలు, సమాజపు లోటుపాట్లు ఎత్తి చూపుతూ తనదైన శైలిలో చక్కని పద బంధాలతో వస్తు వైవిధ్యమైన కవితలను ఈ రెక్కలు కావాలి కవితా సంపుటిలో రెక్కలు ఎందుకు కావాలో రెక్కలు కావాలి కవితలో మనకందించారు.  జీవితంలోని విభిన్న కోణాలను ఓ కవి ఎలా చూడగలడో, ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందో బి వి శివ ప్రసాద్ రెక్కలు కావాలి కవితా సంపుటి మనకు తెలుపుతుంది.
ప్రతి ఒక్కరు చదవదగ్గ కవితా సంపుటి వెలువరించిన బి వి శివ ప్రసాద్ కి అభినందనలు.

9, ఏప్రిల్ 2018, సోమవారం

జీవన మంజూష(9)...!!( మే నెల )

నేస్తం,
          సమాజంలో మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చూస్తుంటే ఎటు పోతున్నామో అర్ధం కాని పరిస్థితి. ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే మన కుటుంబ వ్యవస్ధ ఈరోజున ఎంత హీనంగా, హేయంగా మారిపోయిందో తల్చుకుంటుంటే చెప్పలేని బాధ గుండెలను మెలిపెడుతోంది. సహజీవనాలంటూ కొందరు నాలుగు రోజులకొకరిని మారుస్తూ, వివాహేతర సంబంధాలను ప్రోత్సహిస్తూ మరికొందరు, ఒక్కరోజులో పేరు వచ్చేయాలన్న తాపత్రయంలో కొందరు జీవితాలను అల్లరిపాలు చేసుకుంటూ నైతిక విలువలు, వ్యక్తిత్వం లేని బతుకులు బతికేస్తూ ఇప్పటి డబ్బుకు అమ్ముడుపోయే కొన్ని పనికిమాలిన మీడియాలకు కాలక్షేపం కోసం అవాకులు చెవాకులు వాగేస్తూ అదే గొప్ప పేరని భ్రమలో పడి వారి జీవితాలకు వారే నిప్పంటించుకుంటున్నారు. మొగుడు/పెళ్ళాం, పిల్లలున్న ఎందరో ఈనాడు చిన్న చిన్న మాట పట్టింపులతో క్రమ సంబంధాలను వదలి ఎండమావులైన అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులౌతున్నారు.
          ప్రతి అనుబంధము డబ్బు లేదా అహాల మధ్యన నలుగుతోంది. ఇంటి సమస్యను వీధి సమస్యగా మార్చేస్తున్న అవకాశవాదులు ఉన్నంత కాలం నాలుగు గోడల మధ్యన ఉండవలసిన కాపురాలు నలుగురి నోళ్ళలో పడి నవ్వులపాలౌతున్నాయి. పెద్దలని చూస్తూ పిల్లల ఆలోచనలు పెడత్రోవ తొక్కుతున్నాయి. ఆధునికంగా ఎంతో ముందుకు అడుగు వేశామన్న మాయలో పడి మన తరువాతి తరాలకు చక్కని సంప్రదాయపు విలువలను అందించడంలో మనం ఘోరంగా విఫలమైయ్యామని ఒప్పుకొనక తప్పదు. స్నేహం ముసుగులో ఆడ,మగ స్నేహాల అనుబంధాలు ఈ అంతర్జాలపు ప్రపంచంలో క్రొత్త అర్ధాలను మనకు తెలుపుతున్నాయి. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో, పెళ్లి అయ్యాక మరో నలుగురితో ఆకర్షణ అనుబంధాలు, సాహిత్యపు రుగ్మతలు, మానసిక బంధాలంటూ మోసపు మాయలు ఇలా ఓ మనిషి సమాజంలో బతకడానికి, తన అవసరాలు, విశృంఖలమైన కోరికలు తీర్చుకోవడానికి ఇలా అడ్డ దారుల వెంట పడుతూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ, తన కుటుంబాన్ని, సమాజపు విలువలతో పాటు సహజ బంధాలను, సంప్రదాయాలను నట్టేట కలిపేస్తున్నారు. సాంకేతిక అనేది మానవ పురోగమనానికి నాది కావాలి కానీ నైతిక విలువల తిరోగమనానికి సాక్షిభూతంగా ఉండకూడదని నాలాంటి కొందరి కోరిక.
ఇప్పటికి ఈ చేదు ముచ్చట్లకు సశేషం....

5, ఏప్రిల్ 2018, గురువారం

మెహిది ఆలి గారి "నాలోని నువ్వు "..!!

 మహిది అలి గారు వెలువరిస్తున్న కవితా సంపుటి "నాలోని నువ్వు " కు ముందుగా శుభాభినందనలు.
ముఖ పుస్తక పరిచయమే అయినా మనసున్న మహోన్నత వ్యకిత్వం ఆలి గారిది. కవితలు, కథలుగా తన  భావాలను చదువరులకు పరిచయం చేస్తూ, సమయానుకూలంగా ప్రతి ఒక్కరికి తనదైన శైలిలో స్పందించడం వారి ఉన్నతమైన మనసుకు తార్కాణం. ఎప్పటినుంచో సాహిత్యంలో, రచనా వ్యాసంగంలో నిష్ణాతులయినా నిగర్విగానే మాకు పరిచయం.

ఆలీ గారి ఏ కవితలోని భావాన్ని తీసుకున్నా నాకు ఇలానే అనిపించినా నేనెందుకు ఇలా రాయలేదని అనిపించేది కాదు కాదు అనిపిస్తుంది ఎవరికైనా. అది ఆయన కవితా భావాల్లో దాగిన గొప్పదనం. చాలా సున్నితంగా, సరళంగా నాజూకైన భావాలు పండించడం, సాధారణ సందర్భాన్నే అద్భుతంగా ఆవిష్కరించడం అదీ అలతి పదాల్లో అందించడం ఆలీ గారి ప్రత్యేకత.
** ఎంత నిశబ్ధంగా వెళ్లిపోయావు నేస్తమా ... **
నక్షత్రాలను లెక్కపెడుతూ ఉండు మళ్ళీ వస్తానని
నిష్క్రమించే విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పావు
నాది అమాయకత్వమో .. నీమీద విశ్వాసమో
ఇప్పటి వరకు నీ నిరీక్షణలో ఉంటున్నాను...  ఎంత చక్కని అనుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి నాకైతే తెలుగు భాషలోనే కాదు మారె భాషలోనూ పదాలు దొరకవు. అత్యద్భుతం అనడం తప్ప. ఇలాంటి మధురమైన కవితలెన్నో " నాలోని నీకు " కవితా సంపుటిలో దాగున్నాయి. చదివిన ప్రతి ఒక్కరికి తమ జ్ఞాపకాలు లేదా తీయని అనుభవాలు గుర్తురాక మానవు అంటే అతిశయోక్తి కాదు. 

నా పుస్తకానికి మాటలు రాసినప్పుడు నా అక్షరాలకు అభిమానిని అని చెప్పారు ఆలీ గారు. వారి భావాలకు బందీలం మేము అని సగర్వంగా విన్నవిస్తున్నాను.
ఇంత గొప్ప పుస్తకానికి ఓ నాలుగు మాటలు రాసే అదృష్టాన్ని నాకు అందించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మంజు యనమదల

2, ఏప్రిల్ 2018, సోమవారం

అమ్మమ్మ ఊరు...!!

                                                    అమ్మమ్మ ఊరు...!!

                        అమ్మమ్మ ఊరు అనగానే ముందు గుర్తుకు వచ్చేది మన పుట్టుక. అమ్మని కన్న అమ్మ చేతిలో మొదటగా కళ్ళు తెరిచిన ఆ క్షణాలు మనకు గుర్తు లేకపోయినా అప్పటి తరాలకు తీపి గురుతులే. ఇప్పటిలా ఆసుపత్రుల్లో పురుళ్ళు పోసుకోవడాలు ఆ కాలంలో లేవు. అమ్మమ్మలు, జేజేమ్మల చేతుల మీదుగా పురుళ్ళు జరిగేవి. ఇప్పుడంతా కార్పొరేట్ జననాలు మాత్రమే చూస్తున్నాం.
                      నేను పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే. పెరిగింది కూడా అమ్మమ్మ దగ్గరే. మాది 50 ఏళ్ల ఉమ్మడి కుటుంబం. పసితనం నుండి అందరి మధ్యలో పెరగడం వలన అమ్మానాన్నకు ఒక్కదాన్నైనా ఎప్పుడు ఒంటరితనం అనిపించలేదు. అప్పట్లో పల్లెటూర్లలో అందరు కలిసిమెలసి ఉండేవారు. చుట్టరికాలు లేకపోయినా చాలా దగ్గరగా ఉండేవారు. బంధుత్వాల వరుసలతో పిలుచుకునేవారు. కష్టానికి, సుఖానికి తోడుగా ఉండేవారు. మా ఇల్లయితే ఎప్పుడు చుట్టుపక్కల జనాలతో కళకళలాడుతూ సందడిగా ఉండేది. మా ఇంటికి దగ్గరలో చెరువు ఉండేది. పగలు ఇళ్లలో పని అయిన తరువాత నలుగురు మా ఇంటి అరుగుల మీదకు చేరేవారు. అందరి ఇళ్లకు అరుగులు ఉండేవి. బియ్యంలో మట్టి గెడ్డలు, రాళ్ళు ఏరుతూ, పాచికలతో పచ్చిసు ఆడేవారు. అరుగులపై మేకా పులి, దాడి  ఆటలు  గీసి ఉండేవి. గడపకు రెండు పక్కలా జామచెట్లు, నేరేడు చెట్టు, సీతాఫలం చెట్టు ఉండేవి. ఏ కాలంలో ఆ పూల మొక్కలు  ఉండేవి. సన్నజాలులు, విరజాజులు, మల్లి, కనకాంబరం, చామంతి, గులాబీ, బంతి ... ఇలా రకరకాల పూల  మొక్కలు ఉండేవి. పండగలకు వాకిళ్ళు ఊకతో మెత్తి,  పేడ, మట్టి కలిపి అలికి బియ్యం రుబ్బి ఆ పిండితో ముగ్గులు వేసేవాళ్ళు. చూడటానికి రెండు కళ్ళు  సరిపోయేవి కాదు. వినాయక చవితికి తామరపూలు, కలువపూలు కోయడానికి  చెరువులు,కాలవల్లో  దూకడాలు, పత్రీ కోయడాలు, వాయినాలు ఇవ్వడాలు, సాయంత్రం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండ్రాళ్ళు విసిరి వారి దగ్గర నుండి ప్రసాదాలు తీసుకోవడాలు, ఇవ్వని వారికి దురదగుండ ఆకు పులమడం,
దసరాకు సందడి, దీపావళికి మందు సామాన్లు ఎండబెట్టడాలు, మతాబులు, పూల పొట్లాలు తయారు చేయడాలు, చేతులు కాల్చుకోవడాలు, తద్దులకు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాల ఊగడం, కార్తీక మాసపు ఏటిలో స్నానాలు, ఉపవాసాలు, శివాలయంలో దీపాలు, వత్తులు వెలిగించి పూజలు చేయడం, రెండు మైళ్ళ దూరంలో టూరింగ్ టాకిస్కు నడిచి వెళ్లి ఒక టికెట్ కు రెండు సినిమాలు చూడటం, సంక్రాతి, ఉగాది, శ్రీరామ నవమి ఇలా అన్ని పండుగలకు ఎంత సందడిగా ఉండేదో తల్చుకుంటే ఇప్పటికి మల్లి ఆ రోజుల్లోకి వెళిపోతే ఎంత బావుండు అనిపిస్తుంది. తేగలు ఊరబెట్టడం, తాటిపండు కాల్చుకోవడం, బొగ్గుల మీద మొక్కజొన్న కండెలు కాల్చుకు తినడం, ఈత కాయలు ముగ్గ వేయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్ని సంతోషాలు ఇప్పటి తరాలు కోల్పోతున్నాయో తల్చుకుంటే చాలా బాధగా ఉంటోంది.
    మనం అన్న వ్యవస్థ నుండి నేను నా అన్న పరిమితిలోనికి మన కుటుంబాలు వచ్చేసాయి. అమ్మమ్మ, తాతయ్యలను వారు చెప్పే చందమామ కతలను మన పిల్లలు ఎంతగా కోల్పోతున్నారో, అనుబంధాలకు వారధులుగా ఉండాల్సిన తరాలు ఎంత అంతరాల తారతమ్యంలో మిగిలిపోతున్నాయో చూస్తుంటే రేపటి తరానికి అమ్మ కూడా చెప్పుకోవడానికి ఓ బొమ్మగా ఉండిపోతుందనడంలో సందేహం ఏమి లేదు.
ఇంతకీ ఇన్ని సంతోషాలు నాకందించిన మా అమ్మమ్మ గారి ఊరి పేరు చెప్పనే లేదు కదూ ...దివితాలుకా అవనిగడ్డ దగ్గర జయపురం.  చూడటానికి చాలా బావుంటుంది. 

నైతిక విలువలు....!!

నేస్తం,
         చావు పుట్టుకలు ఎంత సహజమో ఈనాటి సమాజ పరిస్థితులు చెప్తున్నాయి. నిశ్చల స్థితో, నిర్వికారమో తెలియని అయోమయంలో మౌనమే సమాధానమైంది ఎన్నో ప్రశ్నలకి. దగ్గర బంధుత్వాలు కూడా చావుని దూరంగానే చూస్తూ చోద్యం చూస్తుంటే ఆ బాధని చెప్పలేని అశక్తత ఇలా అక్షరాల్లో ఒదిగిపోతోందేమో. నీతి, న్యాయం, దైవం, భక్తి అంటూ నిత్యం మనం వల్లె వేసే భజనలు, సూక్తులు ఎటు పోతున్నాయో కూడా అర్ధం కావడం లేదు. ఒకప్పుడు చావు అంచులకు వెళ్ళినప్పుడు కూడా ఇదే శూన్యాన్ని చూసినా తట్టుకున్న మనసు మళ్ళి ఎందుకో కాస్త బాధగానే అనిపిస్తోంది. చావు, పుట్టుకలు ప్రతి ఇంటిలోనూ ఉండేవే కానీ వాటిని కూడా బంధాలు, బంధుత్వాలు మరచిపోయి వ్యాపార ధోరణిలో చూడటాన్ని సహించడం కాస్త కష్టంగానే ఉంది. ఇప్పటి తరాలకు అలవాటుగా మారినా ఆ ఇప్పటి తరంలో లేనందుకు సంతోషించాలో, లేదా మరీ ఇంతగా దిగజారిపోతున్న మానవ సంబంధాలను చూస్తూ బాధ పడాలో తెలియకుండా ఉంది. మొక్కుబడి పరామర్శలు మనసులోని బాధను తగ్గించలేవు. ఈరోజు ఆ ఇంటి కష్టం రేపు మన ఇంటి సమస్యగా మారవచ్చు. నాకెందుకని మనం ఈరోజు దూరంగా ఉంటే రేపు మన గతి కూడా నలుగురు లేని పరిస్థితే అవుతుందని గుర్తెరిగితే చాలు. సంపాదన, డబ్బు అనేవి మనం బతకడానికే కానీ బంధాలను దగ్గర చేసుకోవడానికి కాదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఉద్యోగాలు, ఊళ్ళేలడాలు అందరు చేశాకే ఇప్పుడు మనం చేస్తున్నాం. మనిషిని చూసే తీరిక లేకపోయినా కనీసం పలకరించే వెసులుబాటు ఉన్న ఈరోజుల్లో కొందరు చదువుకున్న మూర్ఖులను చూస్తుంటే వీళ్లనా నావాళ్లు అనుకున్నదని మన మీద మనమే అసహ్యపడే దుస్థితి ఇప్పుడు. విజ్ఞానం విజ్ఞతని పెంచాలి కానీ విలువలను, వ్యక్తిత్వాన్ని కోల్పోయేటట్లు చేయకూడదు. 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner