అమ్మమ్మ ఊరు అనగానే ముందు గుర్తుకు వచ్చేది మన పుట్టుక. అమ్మని కన్న అమ్మ చేతిలో మొదటగా కళ్ళు తెరిచిన ఆ క్షణాలు మనకు గుర్తు లేకపోయినా అప్పటి తరాలకు తీపి గురుతులే. ఇప్పటిలా ఆసుపత్రుల్లో పురుళ్ళు పోసుకోవడాలు ఆ కాలంలో లేవు. అమ్మమ్మలు, జేజేమ్మల చేతుల మీదుగా పురుళ్ళు జరిగేవి. ఇప్పుడంతా కార్పొరేట్ జననాలు మాత్రమే చూస్తున్నాం.
నేను పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే. పెరిగింది కూడా అమ్మమ్మ దగ్గరే. మాది 50 ఏళ్ల ఉమ్మడి కుటుంబం. పసితనం నుండి అందరి మధ్యలో పెరగడం వలన అమ్మానాన్నకు ఒక్కదాన్నైనా ఎప్పుడు ఒంటరితనం అనిపించలేదు. అప్పట్లో పల్లెటూర్లలో అందరు కలిసిమెలసి ఉండేవారు. చుట్టరికాలు లేకపోయినా చాలా దగ్గరగా ఉండేవారు. బంధుత్వాల వరుసలతో పిలుచుకునేవారు. కష్టానికి, సుఖానికి తోడుగా ఉండేవారు. మా ఇల్లయితే ఎప్పుడు చుట్టుపక్కల జనాలతో కళకళలాడుతూ సందడిగా ఉండేది. మా ఇంటికి దగ్గరలో చెరువు ఉండేది. పగలు ఇళ్లలో పని అయిన తరువాత నలుగురు మా ఇంటి అరుగుల మీదకు చేరేవారు. అందరి ఇళ్లకు అరుగులు ఉండేవి. బియ్యంలో మట్టి గెడ్డలు, రాళ్ళు ఏరుతూ, పాచికలతో పచ్చిసు ఆడేవారు. అరుగులపై మేకా పులి, దాడి ఆటలు గీసి ఉండేవి. గడపకు రెండు పక్కలా జామచెట్లు, నేరేడు చెట్టు, సీతాఫలం చెట్టు ఉండేవి. ఏ కాలంలో ఆ పూల మొక్కలు ఉండేవి. సన్నజాలులు, విరజాజులు, మల్లి, కనకాంబరం, చామంతి, గులాబీ, బంతి ... ఇలా రకరకాల పూల మొక్కలు ఉండేవి. పండగలకు వాకిళ్ళు ఊకతో మెత్తి, పేడ, మట్టి కలిపి అలికి బియ్యం రుబ్బి ఆ పిండితో ముగ్గులు వేసేవాళ్ళు. చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. వినాయక చవితికి తామరపూలు, కలువపూలు కోయడానికి చెరువులు,కాలవల్లో దూకడాలు, పత్రీ కోయడాలు, వాయినాలు ఇవ్వడాలు, సాయంత్రం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండ్రాళ్ళు విసిరి వారి దగ్గర నుండి ప్రసాదాలు తీసుకోవడాలు, ఇవ్వని వారికి దురదగుండ ఆకు పులమడం,
దసరాకు సందడి, దీపావళికి మందు సామాన్లు ఎండబెట్టడాలు, మతాబులు, పూల పొట్లాలు తయారు చేయడాలు, చేతులు కాల్చుకోవడాలు, తద్దులకు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాల ఊగడం, కార్తీక మాసపు ఏటిలో స్నానాలు, ఉపవాసాలు, శివాలయంలో దీపాలు, వత్తులు వెలిగించి పూజలు చేయడం, రెండు మైళ్ళ దూరంలో టూరింగ్ టాకిస్కు నడిచి వెళ్లి ఒక టికెట్ కు రెండు సినిమాలు చూడటం, సంక్రాతి, ఉగాది, శ్రీరామ నవమి ఇలా అన్ని పండుగలకు ఎంత సందడిగా ఉండేదో తల్చుకుంటే ఇప్పటికి మల్లి ఆ రోజుల్లోకి వెళిపోతే ఎంత బావుండు అనిపిస్తుంది. తేగలు ఊరబెట్టడం, తాటిపండు కాల్చుకోవడం, బొగ్గుల మీద మొక్కజొన్న కండెలు కాల్చుకు తినడం, ఈత కాయలు ముగ్గ వేయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్ని సంతోషాలు ఇప్పటి తరాలు కోల్పోతున్నాయో తల్చుకుంటే చాలా బాధగా ఉంటోంది.
మనం అన్న వ్యవస్థ నుండి నేను నా అన్న పరిమితిలోనికి మన కుటుంబాలు వచ్చేసాయి. అమ్మమ్మ, తాతయ్యలను వారు చెప్పే చందమామ కతలను మన పిల్లలు ఎంతగా కోల్పోతున్నారో, అనుబంధాలకు వారధులుగా ఉండాల్సిన తరాలు ఎంత అంతరాల తారతమ్యంలో మిగిలిపోతున్నాయో చూస్తుంటే రేపటి తరానికి అమ్మ కూడా చెప్పుకోవడానికి ఓ బొమ్మగా ఉండిపోతుందనడంలో సందేహం ఏమి లేదు.
ఇంతకీ ఇన్ని సంతోషాలు నాకందించిన మా అమ్మమ్మ గారి ఊరి పేరు చెప్పనే లేదు కదూ ...దివితాలుకా అవనిగడ్డ దగ్గర జయపురం. చూడటానికి చాలా బావుంటుంది.
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగుంది. మా అమ్మమ్మ ఊరు గుర్తుకొచ్చింది.
Thank u andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి