ముఖ పుస్తక పరిచయమే అయినా మనసున్న మహోన్నత వ్యకిత్వం ఆలి గారిది. కవితలు, కథలుగా తన భావాలను చదువరులకు పరిచయం చేస్తూ, సమయానుకూలంగా ప్రతి ఒక్కరికి తనదైన శైలిలో స్పందించడం వారి ఉన్నతమైన మనసుకు తార్కాణం. ఎప్పటినుంచో సాహిత్యంలో, రచనా వ్యాసంగంలో నిష్ణాతులయినా నిగర్విగానే మాకు పరిచయం.
ఆలీ గారి ఏ కవితలోని భావాన్ని తీసుకున్నా నాకు ఇలానే అనిపించినా నేనెందుకు ఇలా రాయలేదని అనిపించేది కాదు కాదు అనిపిస్తుంది ఎవరికైనా. అది ఆయన కవితా భావాల్లో దాగిన గొప్పదనం. చాలా సున్నితంగా, సరళంగా నాజూకైన భావాలు పండించడం, సాధారణ సందర్భాన్నే అద్భుతంగా ఆవిష్కరించడం అదీ అలతి పదాల్లో అందించడం ఆలీ గారి ప్రత్యేకత.
** ఎంత నిశబ్ధంగా వెళ్లిపోయావు నేస్తమా ... **
నక్షత్రాలను లెక్కపెడుతూ ఉండు మళ్ళీ వస్తానని
నిష్క్రమించే విషయాన్ని ఎంత సున్నితంగా చెప్పావు
నాది అమాయకత్వమో .. నీమీద విశ్వాసమో
ఇప్పటి వరకు నీ నిరీక్షణలో ఉంటున్నాను... ఎంత చక్కని అనుభూతి. ఈ భావాన్ని వర్ణించడానికి నాకైతే తెలుగు భాషలోనే కాదు మారె భాషలోనూ పదాలు దొరకవు. అత్యద్భుతం అనడం తప్ప. ఇలాంటి మధురమైన కవితలెన్నో " నాలోని నీకు " కవితా సంపుటిలో దాగున్నాయి. చదివిన ప్రతి ఒక్కరికి తమ జ్ఞాపకాలు లేదా తీయని అనుభవాలు గుర్తురాక మానవు అంటే అతిశయోక్తి కాదు.
నా పుస్తకానికి మాటలు రాసినప్పుడు నా అక్షరాలకు అభిమానిని అని చెప్పారు ఆలీ గారు. వారి భావాలకు బందీలం మేము అని సగర్వంగా విన్నవిస్తున్నాను.
ఇంత గొప్ప పుస్తకానికి ఓ నాలుగు మాటలు రాసే అదృష్టాన్ని నాకు అందించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మంజు యనమదల
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి