10, ఏప్రిల్ 2018, మంగళవారం
నాంది పలుకుదాం...!!
నేస్తాలు,
నా రాతలకు, నా వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఎవరి భావనైనా చూసినప్పుడు నాకనిపించిన భావాన్ని అది నాదే అన్నట్లుగా అక్షరాల్లో అమర్చడం లేదా ఏదైనా సంఘటనను చూసినప్పుడు నాకు అనిపించిన అనుభూతిని అక్షరాలతో పంచుకోవడం చేస్తున్నాను. దీనికి నేనేదో బాధలో ఉన్నాననో లేదా మరొకటో అనుకోవడం మీకు తగదు.రాసే ప్రతి అక్షరం మనసు నుంచి వచ్చేదే కాని దానికి జీవితాలకి ముడి పెట్టకండి దయచేసి. రచయిత, కవి ఎవరైనా సరే ఒక భావాన్ని రాయడానికి ఎంత ఆలోచిస్తారో, ఎంత మధనానికి గురి అవుతారో తెలిస్తే ఎవరి రాతలను చులకన చేసి మాట్లాడరు. కోపమైనా, ప్రేమైనా, బాధైనా మరేదైనా రచయిత పంచుకునేది అక్షరాలతోనే. నాకు 6,7 ఏళ్ళ వయసు నుండి పుస్తకాలు అనేకంటే కనిపించిన ఏ అచ్చు కాగితమైనా చదవడానికి ప్రయత్నించేదాన్ని. ఆ చదవడమే ఇప్పుడు ఇలా నాలుగు మాటలు రాసేటట్లు చేసిందేమో. నన్నేదో పొగడాలని, అభినందించాలని అని కానీ నేనీ రాతలు రాయడం లేదు. నా అనుభవాలను, ఆలోచనలను, నా స్పందనలను ఇలా ప్రతి దానిని అక్షరాలతో పంచుకోవడం నాకు అలవాటుగా మారిపోయింది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు నా భావాలకు ప్రతి రూపంగా మారి సంతోషాలకు, బాధలకు, విమర్శలకు ఇలా అన్ని అనుభూతులకు నిలయమైపోయింది. నా రాతలు నచ్చకపోతే చదవకండి అంతేకాని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు దయచేసి మానుకోండి. మనకు రాయడం చేతకానప్పుడు పక్కవాళ్ళు రాస్తే కాస్త ప్రోత్సాహాన్నివ్వండి, మీ మంచి మనసుని చాటుకోండి. అంతేకాని వెటకారాలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేసి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి. మరో విషయం నాకు సంబంధం లేని మీ వ్యక్తిగత భావాలు, ఫోటోలు నాకు ట్యాగ్ చేయవద్దు. చాటింగ్ లో సమాధానం కోసం చూసే స్నేహం మీదయితే నా స్నేహాన్ని విరమించుకోండి. ఎందుకు చాటింగ్ చేయరు అని నన్ను అడగవద్దు దాని కోసం చూసే ఎంతోమంది మీకు ఈ ముఖపుస్తకంలో ఉన్నారు. నాతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దయచేసి అన్యధా భావించక నా మానాన నన్ను వదిలేయండి. నాకు నా కుటుంబం తరువాతే ఏదైనా. ఎవరో మారాలి అనుకోవడం కంటే మనలో లోపాలు తెలుసుకుని మనల్ని మనం సరిదిద్దుకుంటే చాలు. పెళ్ళై పెళ్ళాం/మొగుడు, పిల్లలుండి ప్రేమ దోమా అంటూ అర్ధం పర్థంలేని అనుబంధాలకు వేదికగా మారిన ఇప్పటి వ్యవస్థకు క్రమ సంబంధాల విలువలు తెలియ చేస్తూ కాస్త నైతికతను మర్చిపోకుండా చేయడానికి మన బాధ్యతను గుర్తు చేసుకుందాం. చక్కని సమాజానికి, విలువలున్న సాహిత్యానికి మనవంతుగా మానసిక రుగ్మతలు, సాహిత్యపు అసమానతలు లేని నవ శకానికి నాంది పలుకుదాం.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి