3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ద్విపదలు..!!

1.   జ్ఞాపకాలలా పలకరిస్తుంటాయి
కాలాన్ని వెనక్కి మళ్ళించి వేయాలనుకుంటూ..!!

2.  పలకరింపుని పరిచయం చేసింది
పిలుపు తెలియని మనసుకు...!!

3.   కొత్తదనమైనా కలికిచిలుకే మరి
పసితనం వదలని ముగ్ధత్వమైనందుకేమెా..!!

4.   పట్టుకుంది వదిలేయడానికి కాదు నేస్తం
మరుజన్మకైనా నీతోనే అని చెప్పడానికి...!!

5.   నేనొక చివరిలేఖ రాయాలి
కాసిని జ్ఞాపకాలనిలా పంపవూ...!!

6.   నీలో నేనేగా
జ్ఞాపకంగానో గాయంగానో..!!

7.   ఓరిమిగా వేచి చూస్తుంది మనసు
కోల్పోయిన క్షణాలను జ్ఞాపకాల్లో దాయాలనుకుంటూ..!!

8.   గురుతులు పదిలమేనంటూ ఏమారుస్తున్నావు
అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని..!!

9.  వేళ కాని వేళ అడుగుతావేంటిలా
నా ఊపిరే నీతో ఉండిపోతే..!!

10.   దాగేదెప్పుడూ నీవేగా
గురుతుగానో జ్ఞాపకంగానో...!!

11.  మెాయలేని మౌనమిది
మాటలకు అలవాటు పడ్డ మనసుకు..!!

12.   వియెాగం వరమౌతుంది మనసుకి
నీ జ్ఞాపకాలతో ఊసులాడుతూ..!!

13.   స్పందించే మనసుంటేనే కదా
అక్షరం కదిలించడమైనా కరిగించడమైనా..!!

14.   ఇహము పరమూ నీవేగా
విరహవేదనలు జ్ఞాపకాల పరమయ్యాయందుకే...!!

15.   మరుపెలా సాధ్యమసలు
ఊహకందని జ్ఞాపకమై నువ్వు చేరితే..!!

16.   మనసు మాటిన్నాను
అక్షరాల కదలికల్లో...!!

17.   అక్షరాలు కొన్నే
భావాలు అనంతం..!!

18.   చితి మంటలు ఆరనేలేదు
వెలుగులో చీకటికి తోడనుకుంటా...!!

19.   సలహాలేమి ఇవ్వడం లేదు
మన మధ్యన సర్దుబాట్లెందుకని...!!

20.   అందరి స్వామిభక్తి అలాంటిదే
నమ్మిన నమ్మకానికి తిరుగులేదంటూ..!!

21.   అవమానాలను అందిపుచ్చుకుంటారు కొందరు
బంధాలను బాధ్యతలను వదులుకోలేక..!!

22.   మనసు మేలిమి ముత్యమట
అక్షరాలందుకే స్వచ్ఛంగా పలకరిస్తున్నాయలా...!!

23.    కొన్ని ముళ్ళంతే
గుచ్చిన గురుతులను వదిలెళ్ళి పోతాయలా...!!

24.   కాలం ఆగలేదెందుకో
తనతో పరుగులు పెట్టలేక వెనుకబడ్డానన్న జాలి లేక..!!

25.   నిశ్శబ్ధమే మేలంటున్నా
మౌనంలోనైనా నీతో మాట్లాడే వీలుంటుందేమెానని..!!

26.   మనసునే మర్చిపోయా
నీవున్న క్షణాల్లో నే మిగిలిపోయి...!!

27.   ఏకాగ్రత కుదరనీయడం లేదు
ధ్యానంలోనూ నీవే చేరికై...!!

28.   మాటల్లో తేనె చినుకులు
చేతల్లో వెకిలి చేష్టలు..!!

29.   నిజమెప్పుడూ అబద్ధమే
మనసుకు నచ్చనప్పుడు...!!

30.   వ్యాపకమనుకున్నా ఇన్నాళ్ళు 
వ్యసనమైపోయావని తెలియక...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner