18, ఏప్రిల్ 2020, శనివారం
భూతల స్వర్గమేనా...పార్ట్ 6...!!
కళ్యాణ్ వాళ్ళింట్లో ఆ రాత్రి భోజనాలయ్యాక మా కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ, ఆ మాటల్లోనే నా పెళ్ళి కబుర్లు చెప్తే, అంతా విని కళ్యాణ్ బాధ పడుతుంటే వాళ్ళావిడ వింతగా చూస్తుంటే...తనకేమీ తెలియదు, మేమందరం బాగా చూసుకునేవాళ్ళం, చాలా అమాయకురాలని కళ్యాణ్ చెప్పడం..ఇలా ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాం చాలాసేపు. మరుసటి రోజు జమ్ షో ఉందని చూద్దామని వెళ్ళాం. అక్కడికే ఫణి వాళ్ళు కూడా వచ్చారు. నేను ఏమీ కొనలేదు. నాకు షాపింగ్ చేయడం పెద్దగా ఇష్టం కూడా ఉండదు. అలా వీకెండ్ గడిచిపోయింది. నన్ను మళ్ళీ గెస్ట్ హౌస్ లో దించేసారు. మరో వారం మెుదలయ్యింది.
నాతోపాటు గెస్ట్ హౌస్ లో మరొక తెలుగావిడ ఉంది. హైదరాబాదు ఆమెది. తన ఫామిలి వేరే చోట ఉన్నారు. ఆవిడ అమెరికా వచ్చి చాలా రోజులయింది. ఆమెను మార్కెటింగ్ చేయడం మెుదలుపెట్టారు పారాడైమ్ కంపెనీ వాళ్ళు. ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి ఆమెకు, లేదా ఆమె ఫోన్ లో బిజీగా ఉండేది. నాకు ఫోన్, కంప్యూటర్ కూడా సరిగా ఇచ్చేది కాదు. ఆవిడ దయదలచి ఇస్తేనేనన్న మాట. ఆవిడ మంచి మాటకారి, గడసరి కూడానూ.
ఈలోపల మరొక కన్నడ ఫామిలీ పరమేశ్వరన్ వాళ్ళు ఇండియా నుండి వచ్చారు. కాస్త సందడిగానే ఉంది నాకు. పరమేశ్వరన్ వాళ్ళ ఫ్రెండ్ సీతారాం తన వైఫ్ శిరీషతో వీళ్ళని కలవడానికి వచ్చి నాకు కూడా బాగా దగ్గరైపోయారు. వీకెండ్ వాళ్ళింటికి మమ్మల్ని ముగ్గురిని భోజనానికి పిలిచారు. హైదరాబాదు ఆవిడ రాలేదు. అలా శిరీష నాకు బాగా దగ్గరైంది. తర్వాత పరమేశ్వరన్ కు జాబ్ వచ్చి వేరే చోటికి వెళిపోయారు. ఈవిడ నన్ను బాగా టార్చర్ పెడుతూనే ఉంది. సతీష్ ఫోన్ చేసినా మాట్లాడటానికి వీలయ్యేది కాదు. ఆమెకు సెల్ ఫోన్ ఉన్నా కూడా లాండ్ లైన్ ఇచ్చేది కాదు. అప్పట్లో కంప్యూటర్ లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే ఉండేది.
నరసరాజు అంకుల్ ఫోన్ చేసినప్పుడు డబ్బుల గురించి అడిగారు. ఉన్నాయి నా దగ్గర అంటే ఎంత తెచ్చుకున్నావన్నారు. చెప్తే వెంటనే అడ్రస్ తీసుకుని 1000 డాలర్స్ పంపించారు. ఇంతలో థాంక్స్ గివింగ్ వచ్చింది. నరసరాజు అంకుల్ ఫోన్ చేసి రాజగోపాలరావు వాళ్ళింటికి వెళుతున్నావా అంటే అన్నయ్య పండగ గురించి ఇంకా ఫోన్ చేయలేదని చెప్పాను. టికెట్ బుక్ చేస్తాను సెంట్ లూయీస్ రమ్మంటే, శిరీష ఫోన్ చేసి వాళ్ళింటికి రమ్మందని చెప్పాను. సరే నీ ఇష్టమన్నారు. నేను శిరీష వాళ్ళింటికి బయలుదేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడు. అమ్మాయ్ నేను వస్తున్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి అని. నేను చెప్పాను, శిరీష వాళ్ళింటికి వెళుతున్నానని. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన సీతారాంతో మాట్లాడి, వాళ్ళింటికి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు అన్నయ్య. టర్కీని చూడటం అప్పుడే. వదినని ఇదేంటని అడిగితే టర్కీ అని చెప్తూ, అమెరికన్స్ కు టైమ్ ఉండదు కదా అందుకే సంవత్సరంలో ఓ రోజు దేవుడికి థాంక్స్ చెప్పడానికి ఈ థాంక్స్ గివింగ్ ని కేటాయించారని చెప్పింది. అన్నయ్య వాళ్ళిల్లంతా ఫ్రెండ్స్ తో నిండిపోయింది. అందరు తలొక వంటా చేసుకుని వచ్చారు. సందడిగా థాంక్స్ గివింగ్ అమెరికాలో మెుదటి పండగ గడిచిపోయింది.
మళ్ళీ కలుద్దాం..
వర్గము
ప్రయాణం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి