3, ఏప్రిల్ 2020, శుక్రవారం

ద్విపదలు...!!

1.   వద్దని వారిస్తావెందుకు
ఉండిపోతానని నేనంటుంటే..!!

2.  ఏదో వెదుకులాట
గతజన్మ బంధాన్ని గుర్తు పట్టాలనేమెా...!!

3.   అక్కరకు రానంటూ బెట్టు చేసింది
యుగాల నిరీక్షణ తనకర్థం కానట్టుగా...!!

4.  వెదికినా దొరకని సాక్ష్యాలేనన్ని
మనసు రోదన తెలియనప్పుడు...!!

5.  అక్షరాలకెప్పుడూ పండగే
మనసులోని భావాలనొంపడానికి...!!

6.  మనసెప్పుడూ మౌనబుుషే
మాటలు మనిషికొదిలేస్తూ...!!

7.  మనిషితనం సిగ్గుపడుతూనే ఉంటుందెప్పుడూ
నరునిలో తన ఉనికిని ప్రశ్నించుకుంటున్న ప్రతి క్షణం...!!

8.  అంపకాల పంపకాలంతే
శుభానికి అశుభానికి మధ్యన ఎటూ తేలని లెక్కల్లా...!!

9.  చినుకుల సందడి వినిపిస్తోంది
మెరుపుల వెలుగుల్లో కనిపిస్తూ...!!

10.   కొన్ని పలకరింతలంతే
బంధాలను తలపిస్తూ...!!

11.  పునఃసమీకరణ చేసుకోవడమంటే
నువ్వు మరుపు వశమైనట్లే కదా..!!

12.  మాటలక్కర్లేదంది మనసు
తలపులకు తలుపులతో పని లేకుండా..!!

13.   అనుబంధమెప్పుడూ అడ్డంకి కాదు
అర్థం చేసుకుని మెసలమంటుందంతే...!!

14.  చిలకరించి పోయింది సిరా
పేర్చుకోవడమిక నీ వంతే..!!

15.  మాగన్నుగా నిద్ర పడుతున్నప్పుడే అనుకున్నా
కలల చుట్టానికి ఆహ్వానం పలకడానికని...!!

16.  మనిషినేమార్చడం సుళువే
మనసుని మాయ చేయడం కన్నా..!!

17.  జ్ఞాపకాలే గురుతులు
గతాన్ని పలకరిస్తూ...!!

18.   అలకలెలా తీర్చాలో
అలిగిన మనసుకు..!!

19.   అలనాటి విఫల గాథలే
ఈనాటికీ అజరామర ప్రేమకావ్యాలుగా...!!

20.  దీపం ఒంటరిదే
పంచే వెలుగు సమస్త విశ్వానికి..!!

21.  గుండె గదుల్లో గురుతులు
గుప్పెడు అక్షరాల్లో గువ్వల్లా...!!

22.   అక్షరం ఘర్షణ పడతూనే ఉంటుందెప్పుడూ
మనసుకు మాటకు సమన్వయం కుదర్చడంలో...!!

23.   చిన్న మాటే
రాజ్యాలు కోల్పోయేంత...!!

24.   మనసు వినబడుతుంది
మౌనం మాటల్లో...!!

25.  తీరమేదైనా ఆనందమే
ఆస్వాదించే మనసుండాలంతే...!!

26.   మనుష్యులను దూరం చేసుకోవడం కాదు
మనసులకు చేరువ కావడం తెలియాలంతే..!!

27.   భగవంతుని లీలది
ఆటలో గెలుపోటములను మనకలవాటు చేయాలనుకుంటూ...!!

28.   అనుభవాల దొంతర్లు
జీవితపు పుటలన్నీ...!!

29.   మమతలను మరవడమెంత సేపూ
ఆత్మీయతను కూడా అంగడి సరుకులు అనుకునే రోజులివైతే.. .!!

30.  కొన్ని కథలంతే
ఎప్పటికి సశేషాలుగానే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner