25, ఏప్రిల్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా...పార్ట్ 7..!!

               థాంక్స్ గివింగ్ కి అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వదిన అడిగింది జమ్ షో లో నువ్వేం కొనలేదా అని. నాకన్నీ పిచ్చి పూసలులా అనిపించాయి, నేనేం కొనలేదని చెప్పాను. అలాగే అనిపిస్తాయి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, జమ్ షో లోనే తక్కువకి వస్తాయని చెప్పింది. ఇంతకి జమ్ షో లో ఏముంటాయంటే రకరకాలు పూసలు, ఆ పూసలతో చుట్టిన గొలుసులు, 10 కారట్, 18 కారట్ గోల్డ్ ఆర్నమెంట్స్(నగలు) ఉంటాయన్న మాట. పూసలంటే పచ్చలు, కెంపులు, ముత్యాలు, నీలం, పగడం ఇలా నవరత్నాలన్నింటితో పాటుగా, రకరకాలైన రంగురంగుల ముత్యాలు, నల్లపూసలు, గాజులు, రింగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి. మనకు తిరునాళ్ళలో కొట్లు ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా మెాసాలు జరుగుతాయి. బేరాలు ఆడి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. 
          అమెరికాలో థాంక్స్ గివింగ్ పండుగకు ఫ్రెండ్స్, చుట్టాలు అందరు కలిసి ఎవరో ఒకరింటిలో కలుస్తారు. తలా ఓ వంటకం చేసుకు వస్తారు వీలైనంత వరకు. టర్కీ అని పెద్ద కోడి, దీనిని ఓవెన్ లో బేక్ చేసి అది కట్ చేయడంతో పండగ మెుదలవుతుంది. మనకు సంక్రాంతి పండగలా అన్నమాట. 
     థాంక్స్ గివింగ్ తర్వాత మళ్ళీ గెస్ట్ హౌస్ కి వచ్చేసాను. హైదరాబాదు మహారాణి గారు నన్ను యుదేచ్ఛగా ఏలేసుకుంటున్నారు. నేనేం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నా. శిరీష అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది. తను వచ్చినప్పుడే నాకు కాస్తంత సంతోషం. నా ఫ్రెండ్స్ ఉమలు ఇద్దరు, సతీష్.. మేడంగారు దయతలచి ఫోన్ ఇచ్చినప్పుడు పలకరిస్తూనే ఉంటూ, నాకవసరమైన పని.. ఇంటికి ఫోన్ చేసే కాలింగ్ కార్డ్స్ పంపిస్తున్నారు. 
     ఓ రోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది ఈవిడ టార్చర్ భరించలేక. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడ్చేసాను. అమ్మాయ్ నేను వస్తున్నా, నువ్వు బాధపడకు అంటూ... వెంటనే అన్నయ్య వచ్చేసాడు. ఆ టైమ్ లో రాణిగారు బయటకు వెళ్ళారు. అంతకు ముందు కూడా పారాడైమ్ మార్కెటింగ్ వాళ్ళకి ఈవిడ సంగతి చెప్పాను, కాని వాళ్ళు పట్టించుకోలేదు. నేను వెళుతూ ఫోన్ చేసి నా దగ్గర కీస్ లేవు. నేను అన్నయ్యతో వెళిపోతున్నాను, మీరు రండి అని చెప్పాను. మేము బయలుదేరే వరకు కూడా ఈవిడ కాని, వాళ్ళు కాని రాలేదు. హాల్ లో ఓ పక్క అంతా గ్లాస్ లే ఉండి వాటికి బ్లైండ్స్ ఉండేవి. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి, నేను ఈ గ్లాసెస్ ఓపెన్ వైపు నుండి వెళుతున్నాను. వచ్చి చూసుకోండి అని చెప్పి గ్లాసెస్ దగ్గరకు వేసి మేము బయలుదేరాము.  అన్నయ్య మాట్లాడుతూ... అమ్మాయ్ నీకు అలవాటు అవుతుందని, నువ్వు ఉంటానన్నావని ఇక్కడ ఉంచాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను నీ జాబ్ గురించి. నువ్వు ఇంట్లోనే ఉండి ఇంటర్వూలు అటెండ్ అవ్వు అని చెప్పాడు. మళ్ళీ సుమీ రూమ్ లో నా పడక. చదువుకోవడం, ఈ మెయిల్స్ చూసుకోవడమే అప్పట్లో పని. నేను గెస్ట్ హౌస్ నుండి  వచ్చిన మరుసటి రోజు పారాడైమ్ ఇన్ఫోటెక్ CEO శ్రీధర్ గారు ఫోన్ చేసి ఎందుకలా చెప్పకుండా వెళిపోయారంటే.. విషయం మెుత్తం ఆయనకు చెప్పాను. సరేనండి మీరు అక్కడి నుండే ప్రిపేర్ అవ్వండి, మార్కెటింగ్ చేస్తామని చెప్పారు. 
    నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పటి నా ఫ్రెండ్ వినీత న్యూజెర్సీ లో ఉండేవారు. నన్ను చూడటానికి తను, వాళ్ళాయన వచ్చారోరోజు. వీకెండ్ వస్తే వదిన వర్జీనియాలోని శివ విష్ణు టెంపుల్ లో ఫ్రీ సర్వీస్ చేసేవారు. అప్పుడప్పుడూ నన్ను తీసుకువెళుతుండేది. వీళ్ళే దోశలు, ఇడ్లీ ,ఇతర వంటలు చేసి అక్కడ గుడిలో ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు దేవుడికి ఇచ్చేసేవారు. అలాగే ఎవరింట్లోనైనా పూజ ఉండే చక్కగా అందరు తలోచెయ్యి వేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేవారు. ఇంతలో నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ రాజు ఫోన్ చేసి వేరే కంపెనీతో మాట్లాడాను, నువ్వు చికాగో వెళ్ళు, వాళ్ళు పీపుల్ సాఫ్ట్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో ప్లేస్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు మాట్లాడి చూడు అని చెప్పాడు. 
       వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. మీ H1B కూడా మేము మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, మీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని ట్రైనింగ్ క్లాసులు మెుదలవుతాయి. టికెట్ బుక్ చేస్తాము వచ్చేయండి అంటే సరేనని అన్నయ్యకు విషయం చెప్పాను. తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఇండియాలో చనిపోవడము, తను ఆ టైమ్ లో ఇండియా వెళ్ళలేక వర్జీనియాలోనే దశదినకర్మ చేయాలనుకోవడము జరిగిపోయింది. తెలిసిన ఫ్రెండ్స్ కి భోజనాలు ఏర్పాటు చేసాడు పదోరోజు. నాకు ఫోన్ చేసి 2 రోజులు వాళ్ళంట్లో ఉండమని, ఇద్దరూ అన్నయ్య వాళ్ళింటికి వచ్చి,అన్నయ్య పెంచిన పెద్ద కరివేపాకు మెుక్క నుండి కరివేపాకు తీసుకుని మళ్ళీ వాళ్ళింటికి నన్ను తీసుకువెళ్ళారు.  కార్యక్రమం అయిపోయాక మరుసటి రోజు షాపింగ్ కి తీసుకువెళ్ళి, నువ్వు వెళ్ళేది చికాగో, బాగా చల్లగా ఉంటుందని 20 డాలర్లు పెట్టి కంఫర్టర్ ఎంత వద్దంటున్నా వినక కొనిపెట్టారు. 
       నా ప్రయాణం దగ్గర పడేసరికి అన్నయ్య వాళ్ళ పిల్లలు సుమి, కృష్ణ ఇంట్లోనే ఉన్నారు. 
వాళ్ళు చీజ్ తో ఏదైనా చేసుకుంటే నాకా వాసన పడేది కాదు. ఏంటన్నయ్యా ఉప్పుచేప కాల్చిన వాసన అంటే అన్నయ్య నవ్వి, నీకు అలవాటు అవుతుందిలే అది చీజ్ వాసన అనేవాడు. 
సుమి షాపింగ్ కి వెళుతుంటే అన్నయ్య నన్ను కూడా తీసుకువెళ్ళి, ఏం కావాలో కొనిపెట్టమని చెప్పాడు. సుమితో షాపింగ్ కి వెళ్ళి ఓ చిన్న మఫ్లర్, చేతులకు గ్లౌజస్ ఇంకా కొన్ని అన్నీ కలిపి ఓ 50 డాలర్ల షాపింగ్ చేసా. అంతకు ముందు అన్నయ్య కొన్ని షాప్ లు చూపించి ఇంటికి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయని వివరాలు చెప్పాడు. వదిన కూడా బట్టల షాపింగ్ కి తీసుకువెళ్ళింది. 
       ఇక్కడ ఓ చిన్న సంఘటన చెప్పాలి. సుమితో షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది. మనకేమెా అదంటే కాస్త భయమప్పుడు. అప్పుడప్పుడే కదా కాస్త అలవాటు పడుతున్నా. అతి జాగ్రత్తగా, భయంగా ఎక్కి దిగుతుంటే సుమి నవ్వేసింది. మనం చేసింది మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం టైపులోనన్న మాట. ఈ సినిమా ఈ మధ్యనే వచ్చిందిలెండి. ఎస్కలేటర్ చూసినప్పుడల్లా ఇప్పటికి నవ్వుకుంటా అప్పటి నా భయాన్ని తల్చుకుని. 
  నా ప్రయాణం రోజు పిల్లలు ఇద్దరూ వచ్చి ఫ్లైట్ ఎక్కించారు. ఎలా అంటే పర్మిషన్ తీసుకుని ఫ్లైట్ గేట్ వరకు వచ్చి సెండాఫ్ చెప్పారు నవ్వుతూ. అలా అమెరికాలో మెుదటి విమాన ప్రయాణం చికాగోకి... 

మళ్ళీ కలుద్దాం.. 












0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner