30, ఏప్రిల్ 2020, గురువారం
అక్షరాలు..!!
అల్లరి చేసే వయసులో
ఆకతాయితనంగా మారాము చేస్తూ
బలవంతంగా నేర్చిన అఆలు
మెలికలు తిరిగే
ఒంపుల సొగసులు చేతికి చిక్కక
దెబ్బలు తిన్న వైనాలు
కూడబలుక్కుంటూ పలక మీద దిద్దిన
ఓనామాల జతలతో
గుణింతాలు నేర్చిన గుర్తులు
అమ్మ ఆవు ఇల్లు ఈగంటూ
పుస్తకాల్లో బొమ్మలు చూస్తూ
పదాల పదనిసలతో పాట్లు పసితనంలో
అక్కరకు రాని అనుబంధాలను మరువలేక
మనసు గాయాలకు లేపనాలద్దే
వైద్యమెరిగిన ధన్వంతరి
రక్త సంబంధాలకన్నా మిన్నగా
ప్రాణాధారమైన జీవనాడుల
ఉనికికి ఆలంబనీ అక్షరమాల
ఒంటరన్న భావన కలుగనీయక
ఆర్తిగా అక్కున చేర్చుకునే
అమృత హృదయమీ అక్షరాలమ్మది
బాధలో ఓదార్పునిస్తూ
గమనంలో గమ్యాన్ని సూచిస్తూ
ఓటమిలో గెలుపును పరిచయం చేసేదీ అక్షరాలే
నేనంటూ రేపు లేకున్నా
నన్ను నన్నుగా మిగిల్చేదీ
నాకంటూ మిగిలేదీ అక్షరధనమే
అక్షరాల అలికిడిలోనే
బతుకును వెదుక్కునే
ఆత్మానుబంధమీనాడు పెనవేసుకుందిలా...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి