20, మే 2020, బుధవారం
వేసారిన వలస బతుకులు...!!
కన్నవారిని
పురిటిగడ్డను వదలి
కూలి కోసం
కూటి కోసమీ వలస బతుకులు
ఆకలయినా
దాహమయినా ఓర్చుకుంటూ
కాసుల కోసం
చెమట చుక్కలనమ్ముకునే శ్రమజీవులు
మమకారమయినా
మాలిన్యమైనా మనసుకంటక
పరుల కోసం
ప్రాణాలనొడ్డే పారిశుద్ధ్య కార్మికులు
ప్రకృతి విలయాలకు
చెట్టుకొకరై పుట్టకొకరైపోయినా
అయినవారిని చేరలేక
ఆకలిదప్పులతో అలమటించే అన్నార్తులెందరో
కలోగంజో కలిసి తాగుదామంటూ
కాలినడకననైనా కష్టనష్టాలకోర్చి
సొంతగూటికి చేరాలనుకునే
సాయమందని బడుగుజీవులెందరో
కాలరక్కసి కరోనా రూపంలో
కాటు వేయాలంటు కోరలు చాస్తుంటే
చావయినా బతుకయినా
పేగు తెంచుకున్న గడ్డ మీదేనంటూ పయనమయ్యారిప్పుడు...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి