9, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా..!! పార్ట్ 9

పార్ట్ 9...!!
       న్యూ ఇయర్ పార్టీ బాగానే జరిగింది. మనకేమెా అమెరికన్ ఫుడ్ ఏదీ తెలియదు. పేర్లు కూడా తెలియవాయే. పీజా పేరు తెలుసంతే. నాతో ఉండే పిల్లలు ఎవరో ఒకరు ఆర్డర్ చేసేవారు. కైలాష్ ఓసారి చికాగోలోని దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు వీకెండ్. మరో చార్మినార్ చౌరస్తాలా ఉంటుంది, పాన్ ఉమ్ములు, గుట్టలు గుట్టలుగా జనాలు, పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ దొరకనంత బిజీగా ఉంది దీవాన్ స్ట్రీట్. దోశలు వేయడానికి మినప్పిండి(ఉరద్ ఫ్లోర్)అక్కడే మెుదట చూడటం. 4 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినప్పిండి అంట. తర్వాత అలానే కలిపి దోశలు వేసి చూపించాడు కైలాష్. కావాల్సిన గ్రోసరీస్ కొనుక్కుని సాయంత్రానికి గెస్ట్ హౌస్ కి వచ్చేసాము. కైలాష్ కి ప్రాజెక్ట్ అయిపోయి గెస్ట్ హౌస్ కి వచ్చాడు. ఒరాకిల్ ఫైనాన్షియల్ ట్రైనింగ్ కోసం. అది ఇంజనీరింగ్ లో మా సీనియర్ తిరుమలరెడ్డి చెప్పారు. కైలాష్ నా గురించి చెప్తే వచ్చి కలిసి మాట్లాడి, మా సీనియర్ అక్కా వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు చెప్పి వెళ్ళారు. అలా మా సీనియర్స్ కొందరు కూడా టచ్ లోకి వచ్చారన్న మాట కైలాష్ పుణ్యమా అని.
         కైలాష్, ఇంకా కొంతమంది పిల్లలతో గెస్ట్ హౌస్ సందడిగానే ఉండేది. ఈలోపల నా పుట్టినరోజు వచ్చేసింది. అందరు కలిసి కేక్ తీసుకువచ్చి నాకు సర్ప్రయిజ్ ఇచ్చారు ఆ రాత్రి 12 గంటలకి. మరుసటిరోజు బాబ్ కూడా కాల్ చేసి విష్ చేసారు. వినయ్ గారు, నా ఫ్రెండ్స్ అందరు విష్ చేసారు. అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు కూడా  5 నిమిషాలయినా రోజూ లేదంటే రోజు విడిచి రోజయినా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. పాపం అన్నయ్యకు నా మూలంగా ఫోన్ బిల్ ఎక్కువే వచ్చి ఉంటుంది. అయినా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. చికాగో వచ్చాక నరసరాజు అంకుల్ ముందు ఓ నెంబర్ ఇచ్చారు ఇండియాకి కాల్ చేసుకో అని. ఉమలు ఇద్దరు, సతీష్ కూడా కాలింగ్ కార్డ్స్ ఇచ్చారు. రోజూ ఇంటికి ఏదొక టైమ్ లో ఫోన్ మాట్లాడుతునే ఉండేదాన్ని. సంవత్సరంనర్ర కొడుకుని వదిలి దేశం కాని దేశం ఒంటరిగా వచ్చాను కదా. ఫోన్ లో మాట్లాడుతూ బెంగ తీర్చుకోవడమే. 
         ట్రైనింగ్ అయ్యాకా అమ్మాయిలందరు వెళిపోయారు. వాళ్ళంతా H4 డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్లు. H1B కి డిపెండెంట్ ను H4 వీసాగా పరిగణిస్తారు. వీళ్ళు H4 వీసాతో జాబ్ చేయకూడదు. H1B గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా డిపెండెంట్ వీసా మీద వచ్చిన చాలామంది MS లో జాయిన్ అవుతారు. అమెరికాలో ఉండటానికి వీసా స్టేటస్ చాలా ముఖ్యం. అమ్మాయిలు వెళ్ళిన కొన్ని రోజులకే కైలాష్ కూడా వెళిపోయాడు. ఒక ఫామిలి గెస్ట్ హౌస్ కి వచ్చారు. వాళ్ళు వచ్చిన రెండు మూడు రోజులలోనే నాకు VC++ లో ప్రాజెక్ట్ ఉందని బాబ్, వినయ్ గారు చెప్పారు. జనవరి చివరిలో నాకు జాబ్ కార్సన్ సిటిలో వచ్చింది. కైలాష్ కి, నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికేమెా రోజూ చేస్తూనే ఉన్నా. కార్సన్ సిటికి బయలుదేరే ముందురోజు షన్ముఖ్ మా గెస్ట్ హౌస్ కి కాస్త వాకబుల్ డిస్టెన్స్ లో వాల్ మార్ట్  అనుకుంటా సరిగా గుర్తు లేదు షాప్ కి తీసుకువెళ్ళి కావాల్సినవి చెప్తే కొనుక్కున్నాను. మౌత్ ఫ్రెషనర్, సోప్స్, డియడరెంట్స్ లాంటివన్న మాట. ఎయిర్ టికెట్ కంపెనీ వాళ్ళు బుక్ చేసారు. నా చేతికి 400ల డాలర్లు కూడా ఇచ్చారు. మరుసటిరోజు చికాగో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కి కాబ్ బుక్ చేసుకున్నా. కార్సన్ సిటిలో బాబ్ వాళ్ళ బాబాయి వెంకట్ అని ఆయన కంపెనీ వాళ్ళు నలుగురు నేను పని చేయాల్సిన ప్రాజెక్ట్ లోనే ఉన్నారు. వాళ్ళలో ఒకతని ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చారు. తన దగ్గరకి వెళ్ళి కలవమని. సాయంత్రం నా ఫ్లైట్. ఆరోజు ఉదయం నుండి జ్వరంతో ఉన్నా. నాతో గెస్ట్ హౌస్ లో ఉన్నామె ముందురోజు తను ప్రాజెక్ట్ నుండి ఎందుకు త్వరగా బయటకు వచ్చేసిందో, తన బాధల గాథలు చెప్పింది. మానేజర్ పార్టీకి రమ్మని పిలిచారు, వెళ్ళలేదని, అందుకే జాబ్ నుండి తీసేసారని చెప్పింది. విని ఊరుకున్నా. జ్వరంతో ఏమీ తినలేదని నూడిల్స్ చేసింది. నాకసలు పడవవి. కొద్దిగా తిని నా సూట్కేస్లు రెండు, హాండ్ లగేజ్, హాండ్ బాగ్తో కార్సన్ సిటికి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి కాబ్ లో బయలుదేరా. దారిలో బాగా వామిటింగ్ అయ్యింది. వర్షం కూడా మెుదలయ్యింది. అలాగే ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకుని గేట్ దగ్గరకి వెళ్ళాను. ఫ్లైట్ లేట్ అన్నారు. వెదర్ బాలేదని వేరే రూట్లో పంపించారు. కెనడాలోని  ఓంటారియెా మీదుగా వెళ్ళాలి. ఓంటారియెాలో ఫ్లైట్ మారాలి. మా ఫ్లైట్ ఓంటారియెా వెళ్ళేసరికి కనక్టివ్ ఫ్లైట్ మిస్ అయ్యింది. రేపు మార్నింగ్ వరకు ఫ్లైట్స్ లేవన్నారు. వాళ్ళే ఓ రూమ్ ఇచ్చారు. నాకేమెా బాగా ఆకలి వేస్తోంది. రిసెప్షన్ కి కాల్ చేస్తే, రూమ్ బాయ్ ని పంపారు. మనకేమెా తినడానికి ఏం చెప్పాలో తెలియదు. బాయ్ ని అడిగా.. ఫుడ్ 20 డాలర్ల వరకు వాళ్ళే ఇస్తారట. సరేనని మనకి తెలిసిన ఒక్క పేరు పీజా చెప్పి ఓన్లీ వెజిటేరియన్ అని చెప్పా. ఓ పెద్ద పీజా తెచ్చిచ్చాడు. ఒకేవొక్క పీస్ తినేసరికి ఆకలి తీరిపోయింది. కార్సన్ సిటిలో కంపెనీవాళ్ళిచ్చిన నంబర్ కి కాల్ చేసి పరిస్థితి చెప్పాను. ఉమకి కాల్ చేసి చెప్పా పలానా చోట ఉన్నాను అని. అది నవ్వి నువ్వే నయం వీసా లేకుండా కెనడా వెళ్ళావంది. అది చెప్పే వరకు నాకు నేనున్నది కెనడా అని తెలియదులెండి. భయంభయంగా హోటల్ రూమ్లో ఆ రాత్రి గడిచింది. పొద్దున్నే 8 కి రెనో కి ఫ్లైట్ ఉందని చెప్పారుగా. మరో విమానంలో కార్సన్ సిటికి వెళ్ళడానికి రెనో బయలుదేరాను. 


మళ్ళీ కలుద్దాం... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner