18, మే 2020, సోమవారం

కాలం వెంబడి కలం.. 2

         పుస్తకాలు చదవడం అన్న అలవాటు నాతో పాటుగా పెరుగుతూనే వచ్చింది. దానికి మరో కారణం నేను చదువుకున్న స్కూల్ కూడా. శ్రీ గద్దే వేంకట సత్యన్నారాయణ శిశు విద్యామందిరం, అవనిగడ్డ. మా స్కూల్ లో మాకు మెుదటి నుండి కూడా చదువు ఒక్కటే కాకుండా, పద్యాలు, పాటలు, ఆటలు ఇలా అన్నీ నేర్పించేవారు. మీరు నమ్మలేరేమెా కాని 1977, 78 ఆ టైమ్ లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం 3వ తరగతిలోనే నేర్పించారు. రోజూ ప్రార్థన అయ్యాక, ఓ సంస్కృత శ్లోకం చెప్పి దానికి తెలుగు అర్థం కూడా చెప్పాలి. (3వ తరగతి నుండి 6వ తరగతి వరకు నేను నా ఫ్రెండ్ ప్రార్థన చెప్పేవారము.) ఆరోజు వార్తలు కూడ చదివించేవారు. ఇక సాయంత్రం హనుమాన్ చాలీసా, భగవద్గీత చదివించేవారు. రోజూ వ్యాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించేవారు. మాది గురుకుల పాఠశాల అప్పట్లో. ఆర్ ఎస్ ఎస్ భావాలు బాగా ఉండేవి. నేను ఆ స్కూల్ లో 2వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివాను. విలువలు, మంచి నడవడి, చదువు నేర్పిన దేవాలయమది. 

            అమ్మమ్మ మా దగ్గర ఉండి చదివించేది. అమ్మ వాళ్ళు మా ఊరిలో ఉండేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మమ్మ నన్ను కోప్పడినా, ఏమైనా అన్నా వెంటనే పుస్తకంలో రాసేదాన్నట. నాకు గుర్తు లేదది. మా పక్కన ఉండే అక్కవాళ్ళు చెప్పేవారు. అన్ని రాసి అమ్మ వచ్చినప్పుడు చెప్పేదాన్నట. బహుశా ఇలా రాయడం కూడా అప్పటి అలవాటేనేమెా మరి. నాకు తెలిసి 6వ తరగతిలో మా స్నేహితుల మధ్యన గొడవలు జరిగినప్పుడు వెంటనే అది కథలా రాసి మా పిన్నికి చూపించడం, తను మీ విషయాన్నే కథగా రాశావా అనడం నాకిప్పటికి గుర్తే.
            2వ తరగతిలో రాధాకృష్ణ సీరియల్ తో మెుదలైన నా పుస్తక పఠనం అంచెలంచెలుగా చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి వగైరాలతో ఆగకుండా, దినదిన ప్రవర్ధమానమై ఆంధ్రభూమిలో తులసిదళం, తులసి, ప్రార్థన, కాష్మోరా అంటూ బాగా విస్తరించింది. నేను ఈ పుస్తకాల పురుగునే అని నాకు చదువు రాదనుకోకండి... మా క్లాస్ లో సెకెండ్ నేనేనండి. టీచర్స్ అందరికి నా పుస్తకాల పిచ్చి తెలుసు. డిబేట్లలో కూడా ముందు ఉండేదాన్ని అప్పట్లో. ఇప్పుడు మాటలు రావులెండి... 😊

మరిన్ని కబుర్లతో  వచ్చే వారం... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner