2, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా..8

పార్ట్ 8...!!

        అన్నయ్య నాకు అమెరికన్ యాక్సెంట్ అర్థం కావడానికి టి వి చూడమని చెప్తూ, జీరోని ఓ(O) అంటారని, Z ని జీ అంటారని, పదంలో సెకెండ్ లెటర్ని సాగదీస్తారని ఇలా కొన్ని చిట్కాలు చెప్పాడు. అన్నయ్య ఇంకో మాట కూడా చెప్పాడు. అమెరికాలో కాలేజ్ ని స్కూల్ అంటారని కూడా. నాకు అమెరికాలో ఇళ్ళు చూస్తే భలే ఆశ్చర్యం వేసేది. గోడలకు రాళ్ళ(ఇటుకలు) కన్నా ఎక్కువ అద్దాలు ఉండేవి. నాకు ఓ పేద్ద అనుమానం వచ్చి వదినని అడిగాను. వదినా దొంగలకు గోడలు పగలగొట్టడం కన్నా గ్లాసులు పగలగొట్టడం తేలిక కదా అని. వదిన నవ్వి ఇక్కడ గ్లాసెస్ పగలగొడితే చాలా పెద్ద క్రైమ్ అని చెప్పింది. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నా. అలా నా యక్ష ప్రశ్నలతో అందరిని కాస్త విసిగిస్తూ ఉండేదాన్ని. 
        బెల్ ఎయిర్ లో అన్నయ్యా వాళ్ళింట్లో ఉన్నప్పుడు స్నో కొద్దిగా పడితేనే అదో వింతలా చూసిన నేను..చికాగోలో ఫ్లైట్ దిగిన రోజు 6 అడుగుల స్నో బయటంతా. విపరీతమైన చలి. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ నుండి అరోరా HNC Solutions కంపెని గెస్ట్ హౌస్ కి రావడానికి కాబ్ మాట్లాడుకుని నా లగేజ్ వేసుకుని బయలుదేరాను. పాపం కాబ్ డ్రైవర్ చాలా మంచోడు. అడ్రస్ కనుక్కుని మరీ నన్ను సేఫ్ గా చేర్చడమే కాకుండా నా లగేజ్ రెండు పెద్ద సూట్కేస్ లు కూడా తెచ్చి గుమ్మం ముందు అదేలెండి తలుపు ముందు పెట్టి వెళ్ళాడు. మీటర్ ఛార్జ్ ఎంతయ్యిందో గుర్తులేదిప్పుడు. ఓ 140 డాలర్లు అయ్యిందనుకుంటా. కాలింగ్ బెల్ కొట్టగానే వినయ్ గారి వైఫ్ తలుపు తీసారు. లగేజ్ పైన రూమ్ లో పెట్టాను. వినయ్ గారు ఆఫీస్ నుండి వచ్చి కాసేపు మాట్లాడారు. అప్పుడు వాళ్ళకు నెలల బాబు సత్య కూడా ఉన్నాడు. వినయ్ గారి ఫ్రెండ్ బ్రహ్మయ్య కూడా పరిచయమయ్యారు. నేనున్న గెస్ట్ హౌస్ కి కాస్త దగ్గరలోనే మరొక గెస్ట్ హౌస్ లో కొందరు అబ్బాయిలున్నారు. మా అందరికి పీపుల్ సాఫ్ట్ క్లాసులు మెుదలయ్యాయి. నాతో కలిపి ఐదుగురు అనుకుంటా మా బాచ్. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. కొత్తది నేర్చుకోవడం బానే ఉంది. మాలో మూర్తికి ముందే పీపుల్ సాఫ్ట్ వచ్చు. మాతోపాటుగా మరి కొందరికి ఒరాకిల్ ఫైనాన్షియల్, జావా లాంటి కోర్సులు కూడా నేర్పించారు. ఆ టైమ్ లోనే ఒకబ్బాయి ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి మారిపోయాడు. అదో పెద్ద గొడవ అప్పుడు. నేను వినయ్ గారి కుటుంబంతో కలిసి భోజనం చేసేదాన్ని. ఆవిడ పేరు కూడా మంజునే. ఆవిడే వంట చేసేవారు ఎక్కువగా. ఓ రోజు పారాడైమ్ కంపెనీ అతను ఫోన్ చేసి ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఉంది వచ్చేయండి అన్నాడు. నాకు మాట్లాడటం రాదని వాళ్ళు వేసుకున్న జోక్స్ నాకు బాగా గుర్తున్నాయి. నేను అంతలా బాధ పడటానికి కారణం వీళ్ళు కూడా. అందుకే రానని ఖచ్చితంగా చెప్పేసాను. వినయ్ గారు ఎవరు ఫోన్ అని అడిగితే విషయం చెప్పాను. బాబ్ కి ఇష్టం ఉండవు ఇలాంటి విషయాలు, వాళ్ళతో చెప్పేయండి ఫోన్ చేయవద్దని అని అంటే చెప్పేసానండి అని చెప్పాను. 
           HNC Solutions కంపెనీ CEO రఘుబాబు పోతిని. బాబ్ అన్న పేరుతో అమెరికాలో చలామణి అవుతున్నారన్నమాట. ఓ నార్త్ ఇండియన్ ఆమె, ఈయన కలిసి ఉంటున్నారని సూచాయగా అందరికి తెలుసు. ఆమె కూడా కంపెనీ వ్యవహారాలన్ని చూస్తుండేది. మాతో కాస్త కలివిడిగా మాట్లాడేది. బాబ్ సీరియస్ గా ఉండేవాడు. నా పర్సనల్ విషయాలు అడిగితే సూర్యవంశం టైప్ స్టోరి, కాకపోతే నేను కలక్టర్ ని కాదు అని చెప్తే నవ్వేసి, అంతకన్నా ఎక్కువే అంది. అన్నట్టు ఆమెకు తెలుగు రాదండోయ్. మనకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనాయే. అయినా కమ్యూనికేషన్ కి ఏం ప్రోబ్లం ఉండేది కాదు. మహానటి సినిమాలో సావిత్రి అన్నట్టు భాషదేం ఉంది..భావం ముఖ్యమన్నట్టుగా. 
           వేరే కోర్సుల కోసం మిగతావారు కూడా రావడంతో వినయ్ గారు వేరే ఇంటికి మారాలనుకున్నారు. కైలాష్, షన్ముఖ్ ఇంకా 4,5 అమ్మాయిలు గెస్ట్ హౌస్ కి వచ్చారు. పగలంతా ట్రైనింగ్ క్లాసులతో సరిపోయేది. వచ్చాక తిండి, చదువుకోవడం, నిద్ర టైమ్ కుదిరినప్పుడు ఇంటికి ఫోన్ చేయడం, క్షేమ సమాచారాల కబుర్లతో కాలం జరిగిపోతోంది. చికాగో వచ్చినప్పటి నుండి కళ్యాణ్ వాళ్ళు కొనిచ్చిన కంఫర్టర్ నాలో ఒక భాగమైపోయింది మళ్ళీ నేను అమెరికా వదిలి వచ్చేవరకూ. 
          మేము ఆఫీస్ కి వెళ్ళే దారిలోనే అరోరా వేంకటేశ్వరస్వామి గుడి ఉండేది. శుక్ర, శని, ఆదివారాల్లో కుదిరినప్పుడు టెంపుల్ కి వెళ్ళి, అక్కడ విష్ణు సహస్ర నామావళిలో మేమూ పాల్గొంటూ
ఉండేవారం. చాలా ప్రశాంతంగా ఉండేది అక్కడి వాతావరణం. అమెరికాలో మెుదటి న్యూ ఇయర్ పార్టీ జరిగింది. వినయ్ గారు పొద్దున్నే కూర్చోబెట్టి మంచిమాటలు చెప్పి, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించారు. తర్వాత వాళ్ళు ఇల్లు మారిపోయారు. 

మళ్ళీ కలుద్దాం.. 
             

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner