24, మే 2020, ఆదివారం
రత్నారెడ్డి యేరువ...!!
అక్షరాల్లో రాలిన " జ్ఞాపకాల గవ్వలు "
న్యాయవాద వృత్తిలో ఉండి, తెలుగు సాహిత్యంలో నేను సైతం అంటూ చక్కని భావ కవిత్వాన్ని రాస్తున్నవారిలో యేరువ రాజ రత్నారెడ్డి ఒకరు. కవిత్వమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ కి కథలు, మాటలు కూడ రాస్తున్నారు. జ్ఞాపకాల గవ్వలు పేరుతో ఈయన కవితలు ముఖపుస్తకంలో అందరికి సుపరిచితమే. గోదావరి వంటి పలు పత్రికలలో కవితలు ప్రచురితమయ్యాయి.
రత్నారెడ్డి గారు వెలువరించిన " జ్ఞాపకాల గవ్వలు " తొలి కవితాసంపుటిలో అమ్మ, నాన్న, పండుటాకు, ఇరానీ కేఫ్, బస్ స్టాప్, ప్రేమ, ప్రయాణంలో అనుభవాన్ని ఓ చక్కని భావంతో వచనంలో చెప్పడం, ప్రేయసిపై అనురాగాన్ని అందంగా వ్యక్తీకరించడం, కవిత్వం తెలియదంటూనే చక్కని భావుకత్వాన్ని ఈ కవితాసంపుటి నిండా పొందుపరిచారు. చూసిన ప్రతి చిన్న విషయాన్ని, అలానే ప్రతి ఆనందపు అనుభూతిని తన కవితలలో అందరికి పంచారు. విరహాన్ని, వేదనను సున్నితంగా స్పృశించారు. ఈ కవితాసంపుటి చదువుతుంటే మన జీవితంలో నిత్యం మనకు తారసపడే ఎన్నో అనుభవాలే కవితలుగా మనకు దర్శనమిస్తాయి.
ఆఖరి అక్షరం కవితలో...
" నా ప్రతి రాతకి మొదటి అక్షరం నీవే,
మరి చివరి అక్షరం కూడా నీవే....." అంటూ స్ఫూర్తి ప్రధాతను స్మరించారు.
నేస్తానికి తన మనసును నివేదిస్తూ విసిరేసిన జ్ఞాపకాల గవ్వలనిలా ఏరుకున్నారు..
" కొన్ని నిశ్శబ్దాలంతే
కావాలనుకున్నప్పుడు శబ్దించవు,
కలలతోనే మాట్లాడుతాయవి
కన్నుల భాష అర్థం కాక.." ఎంత చక్కని భావుకత ఇది.
మరో కవితలో ప్రేమలోని ఆరాధనను ఎంత ఆర్ద్రతతో చెప్పారో మీరే చూడండి.
" అది ఆఖరి క్షణమైనా సరే,
ఆపి చెప్పాలని వుంది,
గుండె విప్పాలని వుంది,
గురుతులన్నీ విడమరిచి చూపాలని వుంది.." ఆ అవకాశం ఇమ్మని, ఆఖరి అడుగు కలిసి వేద్దామని వేడుకోవడంలోని విరహ యాతన అద్భుతంగా ఉంది.
ప్రేమలోనే కాదు దేవుని వేడుకోవడంలో కూడ దిట్టనే అని తన అక్షరాల మాయతో ఆ భగవంతునికి విన్నవించే ప్రయత్నం చేసారు.
" నేనన్న రూపమే,నాదన్న ఈ జీవిత సర్వమే
నీదని ఆలస్యంగా గుర్తించాను,
నీవేమిచ్చావని అడగను ఇకనుంచీ,
నీకేమిచ్చానో అనుకుంటూ జీవిస్తాను.." తాత్విక చింతన కనిపిస్తుంది ఈ కవితలో.
కొన్ని నిదురలేని రాత్రులలో తన అనుభవాలు జ్ఞప్తికి వచ్చి భావాలుగా మారి కవిత్వపు అక్షర సుమాలుగా విరిసి ఆ పరిమళాలు ఆజన్మాంతమూ వెంటాడుతాయని చెప్తారు. అక్షరాలను పేర్చుకుంటూ, మాట వినని గుండె చప్పుళ్లలో ప్రేయసిని వెదకడం కొత్తగా లేదూ. ఇలాంటి భావ కవితలతో పాటు మరెన్నో సామాజిక అంశాలను కూడా వస్తువులుగా తీసుకుని చక్కని, చిక్కని కవితలతో పలువురి ప్రశంసలతో పాటు, చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు రత్నారెడ్డి యేరువ. తన కవితల్లో ఎక్కువగా జ్ఞాపకాల గుభాళింపులే కనబడతాయి. వీరి కవిత్వంలో కొన్నిచోట్ల అక్షరాలు అలిగినట్లు, భావాలు బుంగమూతి పెట్టి, ఆ ఉక్రోషమంతా మనకు తారసపడుతుంది. మనసులోని భావాలను అక్షరీకరించడంలో నిజాయితీ కనబడుతుంది. సన్మానాలు, గుర్తింపులు తన కవిత్వానికి అక్కరలేదంటూ, ముఖపుస్తకమే తన భావాలకు వేదికంటారు. వద్దని వారించినా పురస్కారాలు, సన్మానాలు ఎన్ని లభించాయెా మీరే చూడండి.
వీరికి లభించిన పురస్కారాలు, సన్మానాలు బోలెడు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి ప్రతిష్టాత్మక సంకలనం "తొలిపొద్దు" లో చోటు,వివిధ సావనీర్లలో ముద్రితమైన రచనలు,
జైనీ ఇంటర్నేషనల్ వారిచే "సినీవాలి" పురస్కార ప్రధానం,
గజల్ లోగిలి, సుచిత్ర ఫౌండేషన్ వారి పురస్కార ప్రధానం,
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభల్లో నగదు బహుమతితో పాటు పురస్కార ప్రధానం, క్రియేటివ్ ప్లానెట్ ముంబే వారిచే కొనకంచి స్మారక పురస్కారం ,
గిడుగు రామమూర్తి ఫౌండేషన్ వారిచి "గిడుగు" పురస్కార ప్రధానం..
తెలుగు సాహితీ ప్రస్థానంలో మరిన్ని కవితా సంపుటాలు వెలువరించాలని కోరుకుంటూ ... హృదయపూర్వక అభినందనలు.
మంజు యనమదల
విజయవాడ
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి