25, మే 2020, సోమవారం

కాలం వెంబడి కలం...3

          7వ తరగతి నుండి ఊరూ మారింది, స్కూలూ మారింది. బయటంతా కొత్త యాస, కొత్త మనుషులు. అది మరేటో కాదులెండి కృష్ణాజిల్లా నుండి విజయనగరం జిల్లాకి మారామన్న మాట. గవర్నమెంట్ హైస్కూల్ మా ఊరు పినవేమలికి రెండు మైళ్ళ దూరంలో జొన్నవలస అనే ఊరిలో ఉండేది. మా ఊరిలో చదువుకున్న వారు కాని, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు కాని చాలా తక్కువ. ఇక స్కూల్ లో అంతా చాలా కొత్త వాతావరణం. ఆడపిల్లలు చదివేవారు చాలా తక్కువ. మాటలు అసలు అర్థం అయ్యేవే కాదు. వాళ్ళంతా నా యాసను, భాషను ఎగతాళి చేస్తే, నేనూ వాళ్ళందరిని ఆట పట్టించేదాన్ని. త్వరలోనే అందరికి ఇష్టురాలిగా మారిపోయాను కూడా. చిన్న తెలుగు మాస్టారు, హింది టీచర్ గారు చాలా బాగా చెప్పేవారు. 8వ తరగతి నుండి లెక్కల మాస్టారు, పెద్ద తెలుగు మాస్టారు, మిగతా అన్ని సబ్జక్ట్స్ కి వేరే మాస్టర్లు వచ్చేవారు. 10వ తరగతిలో హెడ్ మాస్టారు ఇంగ్లీష్ చెప్పేవారు. స్కూల్ మెుత్తానికి మన సంగతి అదేనండి నా పుస్తకాల పిచ్చి సంగతి మాస్టర్లతో సహా అందరికి మనం ఆ స్కూల్ కి వెళ్ళిన వెంటనే తెలిసిపోయింది. బానే చదువుతాను కదా, అందుకని ఎవరు ఏమనేవారు కాదు నన్ను. మా హింది టీచర్ గారు ఆంధ్రజ్యోతి నేను తెప్పిస్తాను, మీరు ఆంధ్రభూమి తెప్పించండి అని అంటే, అలా పుస్తకాలు పంచుకున్నామన్న మాట. మా హింది టీచర్ గారు చదువు ఒక్కటే కాకుండా లోకజ్ఞానం గల చాలా విషయాలు కూడా చెప్పేవారు. మా చిన్న తెలుగు మాస్టారి వైఫ్ నాకు డిటెక్టివ్ పుస్తకాలు కూడ ఇచ్చేవారు. అలా నా పుస్తక పఠనం నిరంతరాయంగా సాగిపోతూనే ఉంది జిల్లాలు మారినా. 
        మనకేమెా స్నేహితులంటే బాగా ఇష్టమాయే. అవనిగడ్డ శిశువిద్యామందిరం నేస్తాలకు ఉత్తరాలు రాయడంతో నా రాతలు మెుదలయ్యాయి. ఈ రాతలకు మెుదటి అడుగు ఉత్తరాలతోనే పడింది. అప్పట్లో మనకు ఉత్తరాలే కదా సంబంధ బాంధవ్యాల మధ్య దగ్గరతనాన్ని పెంచింది...ఇప్పటిలా ప్రపంచం అరచేతిలో కనిపించేది కాదు కదా. చదువుతో పాటుగా పాటలు, ఆటలు, అల్లరితో బాల్యం హాయిగా గడిచిపోయింది. 10వ తరగతి శలవల్లో నా ఫ్రెండ్ దేవికి రాసే ఉత్తరాల్లో కవితలు రాయడం అలవాటైంది. అవి కవితలో కాదో కూడా తెలియదు. అనిపించిన భావాన్ని అలా అక్షరాల్లో పెట్టడం తెలిసిందంతే. మళ్ళీ ఇంటరు రెండేళ్ళు ఏమి రాయలేదు. పుస్తకాల వ్యాపకం మాత్రం పోలేదు. అప్పటికే యద్దనపూడి, యండమూరి, కొమ్మునాపల్లి, చందుసోంబాబు, మల్లిక్, మధుబాబు, కొమ్మూరి,వడ్డెర చండీదాస్ హిమజ్వాల, మాదిరెడ్డి, రావినూతల సువర్ణాకన్నన్, బలభద్రపాత్రుని రమణి, బొమ్మదేవర నాగకుమారి ఇలా అందరివి చదివేయడం, స్వాతి మాసపత్రికలో మాలతిచందూర్ గారి పాత కెరటాలు చదవడం బావుండేది.  సూర్యదేవర రామమెాహనరావు, చల్లా సుభ్రమణ్యం వీళ్ళిద్దరు నవలలు, సీరియల్స్ బాగా పరిశోధన చేసి రాసేవారు. అప్పట్లో అశ్వ భారతం, మెాడల్ బాగా పేరున్న నవలలు. ఇక అప్పట్లో యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల చదవని వారు లేరనే చెప్పవచ్చు. నాకు మాత్రం ఆనందోబ్రహ్మ బాగా నచ్చిన పుస్తకం. తర్వాత రమేశ్చంద్ర మహర్షి ఫోర్త్ డైమెన్షన్ కూడా బావుంటుంది. 

మరిన్ని కబుర్లతో వచ్చే వారం.. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner