26, అక్టోబర్ 2020, సోమవారం
కాలం వెంబడి కలం...25
మద్రాస్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే మా మామయ్య కూతురికి పుట్టుకలోనే హార్ట్ లో మూడు హోల్స్ ఉండటంతో మద్రాస్ రామచంద్రా మెడికల్ హాస్పిటల్ లో నాన్న చూపించారు. 7వ నెలలో పాపను హాస్పిటల్ లో జాయిన్ చేస్తే ఓ నెల తర్వాత ఆపరేషన్ చేసారు. అమ్మావాళ్ళు హాస్పిటల్ కి, చిన్న బాబాయి వాళ్ళింటికి తిరుగుతూ ఉండేవారు. నేను కూడా హాస్పిటల్ కి వస్తూ, పోతూ ఉండేదాన్ని. పాపకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఓ నెగెటివ్ బ్లడ్ అవసరమైతే చిన్న బాబాయి ఇచ్చారు.
పూర్ణచంద్రరావు గారికి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అమెరికా వెళ్ళడానికి పనికి వచ్చారు కాని నేను అమెరికా వెళ్ళడానికి పనికిరానని చెప్పి నాన్నతో గొడవ పెట్టుకున్నాడు. అది నాకు తెలియదు. బెంగుళూరులో ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళి రమ్మన్నారు. వెళ్ళి వీళ్ళ చుట్టాలైన జైపాల్ గారిని కలిసి, మా ఇంజనీరింగ్ రూమ్మేట్ శారదకి పాప పుడితే తనని చూసి మళ్ళీ మద్రాస్ వచ్చాక కాని నాకు అసలు విషయం తెలియలేదు.
పూర్ణచంద్రరావు అల్లుడు అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ కంపెని CEO క్రిష్ కి ఫోన్ చేసి విషయం చెప్పి ఓ 1500 వదిలించుకోవడం తప్ప మరేం ఉపయెాగం లేకుండా పోయింది. ఈ విషయాలేవి మా రాధ పెదనాన్నకు చెప్పలేదు. వెంటనే జాబ్ వెదకడంలో పడ్డాను. నాన్న కూడా చూసి HIETవాళ్ళ KCG Electronics లో నెలకి 5000కి జాయిన్ అయ్యాను. ఓ నెల ట్రైనింగ్ అన్నారు. రెండు బాచ్లుండేవి. మాది మార్నింగ్ షిఫ్ట్. 8 నుండి 2.30 వరకు. అమ్మావాళ్ళు,మేము మాంగాడుతల్లి గుడికి వెళ్ళి, దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు పాపను తీసుకుని ఊరు వెళిపోయారు. నేను హాస్టల్ ఖాళీ చేసి వడపళని బాబాయి వాళ్ళింట్లో ఉండి రెండు బస్ లు మారి ఆఫీస్ కి వెళుతుండేదాన్ని. అద్దెఇల్లు చూడమని బాబాయితో చెప్పాను. మా ఆఫీస్ లో నాతోపాటు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ సుబ్బారెడ్డి కూడా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ రోజు తనే గుర్తుపట్టాడు నన్ను. మాతోపాటుగా అక్కడే పరిచయమైన రాజగోపాల్ కూడా సొంత తమ్ముడిలా ఉండేవాడు. ఎక్కువ అందరు తమిళియన్స్ ఉండేవారు. రాజగోపాల్ కి తమిళ్ కూడా వచ్చు. షరా మామూలే మా బాచ్ లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మా ముందు బాచ్ లో రెంజు, యాస్మిన్ నాకు మంచి ఫ్రెండ్స్. AS/400 వర్కంతా ఇక్కడే నేర్చుకున్నా. చాలా సరదాగా గడిచిపోయేది ఆఫీస్ వర్క్. కాకపోతే రెండు బస్ లు మారి రావడం బాగా కష్టంగా ఉండేది. బస్ లు బాగా రష్ గా ఉండేవి.
శ్రావణ మాసంలో నోము నోచుకోమని రాణి అక్క(మద్రాస్ చిన్న బాబాయి వైఫ్) అంటే, నాకు ఇష్టం లేకపోయినా మా ఆడపడుచుని అడిగితే, నీ అవసరాలన్నీ తీర్చుకుంటున్నావని అంది. ఇదే మాట రాణి అక్కకి ముందే చెప్పానిలా అంటుందని. అన్నా కూడా మామయ్య పూజ చేసుకోమని చెప్పారు. అమ్మావాళ్ళను పిలిచాను. మా భారతి అమ్మమ్మ, పసి అక్క, అమ్మా వాళ్ళు వచ్చారు. పూజ బాగా జరిగింది. రాఘవేంద్ర వాళ్ళ బావగారిని నేను మామయ్య అనే అనేదాన్ని. ఆయన ఫోటోలు కూడా తీయించారు. పూజ అయ్యాక అమ్మ బట్టలు తేలేదని వాళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వబోతే, కూలి ఇస్తున్నారా అని గొడవ పెట్టుకున్నారు. అమ్మ బాధ పడుతూ వెళిపోయింది. తర్వాత నేను మద్రాస్ వెళిపోయాను.
మళ్లీ ఆఫీస్, వర్క్ మామూలే. రోజూ ఆ బస్ లలో వెళ్ళి రావడం బాగా ఇబ్బందిగా ఉండేది. తట్టుకోలేక ఓ రోజు రాజగోపాల్ మీద బాగా అరిచేసాను ఇల్లు చూస్తారా లేదా అని. మెుత్తానికి ఇల్లు ఆఫీస్ కి కాస్త దూరంగా దొరికింది. బస్ ఎక్కనక్కర్లేదు. బాబాయ్ వాళ్ళింట్లో ఉన్నప్పుడే అమ్మ కూడా వచ్చింది. రాఘవేంద్ర కూడా వచ్చి ఇల్లు చూసాక వస్తానని చెప్పి వెళ్ళాడు. అప్పటికి మా పెళ్ళి జరిగి సంవత్సరం. మౌర్య కడుపున పడ్డాడు. అప్పటికే బాగా సన్నగా ఉండేదాన్ని. దానికి తోడు బాగా నీర్సం. ఆ కోపంలో రాజగోపాల్, సుబ్బారెడ్డి ల మీద అరిచేసాను. పాపం వెంటనే ఇల్లు చూసేసారు. అమ్మా నేను కొత్తింటికి వచ్చాము. తర్వాత బాగా నీర్సం వచ్చి ఓ రోజు రాత్రంతా సెలైన్ పెట్టాల్సి వచ్చింది. నాన్న కూడా అప్పుడు నా దగ్గరే ఉన్నారు. బాబాయ్ వచ్చి చూసి వెళ్ళారు. డాక్టర్ నాన్న ఫ్రెండ్ వైఫ్.
ఇదుగో ఇల్లు చూడండి, వచ్చేస్తాను అని వెళ్ళిన మనిషి అడ్రస్ లేడు. మధ్యలో నాలుగవ నెలలో వర్షాలు బాగా పడ్డాయని, రాఘవేంద్ర వాళ్ళ అక్కాబావలకు జ్వరాలు వచ్చాయని తెలిసి చూడటానికి వెళ్ళాను. అమ్మానాన్న ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఓ పది రోజులు నాతో బాగా గొడవ పెట్టుకున్నారు. నన్నంట మా అమ్మకన్నా చాలా బాగా చూసుకుంటారట, జాబ్ మానేయాలట నేను. అప్పటి వరకు ఆవిడ ఎన్ని మాటలన్నా నేను ఎదురు తిరిగి ఏమీ అనలేదు. అప్పుడు కూడా మామయ్యతో అన్నాను. నాది, పిల్లల బాధ్యత మీరు తీసుకుంటానంటే జాబ్ మానేస్తానని. ఆయన వీళ్ళు ఇలాగే అంటారు, నువ్వు జాబ్ చేసుకోమ్మా అని చెప్పారు. అప్పటి వరకు ఆవిడ నన్ను చేసినవన్నీ అడిగేసానని ఆవిడ కోపంతో నన్ను ఇంట్లో నుండి వెళిపొమ్మంది. ఆయనేమెా ఇది నీ ఇల్లు నువ్వెప్పుడయినా రావచ్చని అన్నారు. నాకు అప్పటికి నాలుగో నెల. వాంతులు మెుదలయ్యాయి. ఆ పది రోజులు తిండి సరిగా లేదు. పక్కింటి ఉమక్క వాళ్ళు ఏదోకటి తినమనేవారు. ఈయన ఏం మాట్లాడకుండా అమ్మని వచ్చి తీసుకువెళ్ళమని చెప్పాడు. అమ్మానాన్న, నేను మద్రాస్ వెళిపోయాం. నాన్న వస్తూ, వెళుతూ ఉండేవారు. అప్పటి నుండి రాఘవేంద్ర రోజూ ఫోన్ చేయడం, డైవోర్స్ పేపర్స్ పంపిస్తాను, సంతకాలు చేసి పంపు అని చెప్పడం జరుగుతోంది.
మా ఇంటి పక్కనావిడ ముస్లిం. మనకా హింది అంతంత మాత్రమేనాయే. అమ్మ,ఆవిడ బానే మాట్లాడుకుంటూ ఉండేవారు. సాయంత్రం వచ్చాక మీ అమ్మ మాట్లాడింది నాకేం అర్థం కాలేదనేది. అమ్మ హింది బానే మాట్లాడేది. మా ఇంటివారు తమిళియన్స్. ఆయన పోలిసాఫీసర్. అప్పట్లో ఫోన్ ఇంటివాళ్ళదే లాండ్ లైన్ మాకు కూడా. ఈయన రోజూ ఫోన్ చేయడం, మేం మాట్లాడటం చూస్తూ వాళ్ళకి మన తెలుగు అర్థం కాకపోయినా, భావం అర్థం అయ్యేది. మా పక్కింటావిడకి మా ఆయన రాలేదని రోజూ క్యూరియాసిటి. అలా నాకు ఏడవ నెల వచ్చే వరకు రోజు ఇదే మాట ఫోన్ లో. ఓ రోజు అమ్మకు బాగా కోపం వచ్చి, పంపించు, సంతకం పెడుతుంది. దాని జీవితం నాశనమయ్యింది ఇంకేముందిలే అంటే, ఆ తర్వాత రోజు హైదరాబాదు నుండి ఫ్లైట్ లో దిగారు అయ్యవారు. మా ఇంటాయన పిలిచి అమ్మాయి చాలా మంచిది బాగా చూసుకో, కంటనీరు పెట్టించకు అని చెప్పారు.
పెళ్ళైన ఆరు నెలలకే ఓ అరవై ఏళ్ళ జీవితానుభవం వచ్చేయడం ఓ విశేషమే మరి.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి