5, అక్టోబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...22

        చల్లపల్లిలో బస్ దించి, అక్కడి నుండి కార్ లో రావివారిపాలెం తీసుకువెళ్ళాడు రాఘవేంద్ర. మా ఊరి నుండి పసి అక్క వచ్చింది. ఆ రాత్రిపూట పసి అక్క, నేను ఏదో మాట్లాడుకుంటుంటే, రాఘవేంద్ర ఏదో అన్నాడు. అమ్మావాళ్ళు గుర్తు వచ్చి ఏడ్చేసాను. పెళ్ళి ముందు రోజు మా హాస్టల్ ఫ్రెండ్స్ ఉష, విని వాళ్ళతో కలిసి ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీధర్ కూడా వచ్చారు. వీళ్ళని నాతో పాటు హాస్టల్ లో ఉండే మా చిన్నాడపడుచు తీసుకువచ్చింది. ఆ రాత్రి పక్కింటి ఉమక్క వాళ్ళింట్లో చేరి అందరం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నాం. నా అనుకున్న నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు పెళ్ళికి. పాపం వాళ్ళకి భయమేసి ఉంటుంది. అసలే గొడవ పెళ్ళి కదా. వారి మీదకు ఏమైనా వస్తుందని భయమేసి ఉంటుంది. ఆటోగ్రాఫ్ లు రాయడం కాదు. పాటించడం కూడా ఉండాలి కదా. 
      పెళ్ళిరోజుకి వాసు, బాలు, రాము, కంది శ్రీను వాళ్ళు విజయనగరం నుండి వచ్చారు. పావని, దుర్గ, పుష్ప వాళ్ళు హైదరాబాదు నుండి వచ్చారు. మా జయపురం పార్వతి అక్కవాళ్ళకు రాఘవేంద్రను చెప్పమంటే, వాళ్ళు కూడా వచ్చారు. నా చిన్ననాటి స్నేహితుడు లీలాకుమార్, మా పాతింటి దగ్గరి నా ఆత్మీయురాలు దేవి, తన చిన్న కూతురు నాకెంతో ఇష్టమైన నా బుల్లినేస్తం స్వాతి ఇంకా చాలామంది మా ఊరివాళ్ళు అందరు పెళ్ళికి వచ్చారు
       నేను చిన్నప్పటినుండి పెళ్ళి చేసుకోను, ఓ వేళ చేసుకున్నా ఎవరిని పిలువను, సంతకాల పెళ్ళి చేసుకుంటా అనేదాన్ని. మా మేనత్తలు, పిన్ని వాళ్ళు కొందరు ఆ మాటలు తల్చుకుని చాలా బాధ పడ్డాడట. మా నాన్న కోసం  మా వాళ్ళెవరూ పెళ్ళికి రాలేదు. మా నాన్న ఫ్రెండ్ రామ్మెాహనరావు పర్చూరి అంకుల్ కృష్ణాపురం నుండి వచ్చారు. 
        నా ఫ్రెండ్స్ ఉష, విని రడీ చేసారు. స్వాతి పాపిటచేరు తీసి దేవి నాకు పెట్టింది. రాఘవేంద్ర వాళ్ళ అక్క రాఘవమ్మ గారు పట్టుచీర తెచ్చింది. రాఘవేంద్ర వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, తమ్ముడి ఫ్రెండ్ లత వచ్చారు. లత కూడా మా హాస్టల్ లోనే ఉండేది. అప్పట్లో నాతో బావుండేది. రెండో అక్క హరిపురం నుండి వచ్చింది. 
        నేను అన్నట్టుగానే సంతకాల పెళ్ళిలా జరిగింది.  రాఘవేంద్ర వాళ్ళ బావగారు తనకు బాగా తెలిసిన పూజారితో ముహూర్తము పెట్టించారు పెళ్ళికి. ఆ టైమ్ కి తాళి కట్టించారు పూజారి గారు.   ఐదారుగురు మీటింగ్ చెప్పారు. రామ్మెాహన్ అంకుల్ చెప్పేటప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళు కారిపోయాయి. నేను ఆ టైమ్ లో ఊరిలో లేను, ఉంటే ఇలా జరిగుండేది కాదు అని చెప్పారు. కమ్యూనిష్టు పార్టీ పెళ్ళి కదా. ప్రమాణం పేపర్ మీద రాసి, అది చదవమన్నారు. నేను బానే చదివేసాను కాని రాఘవేంద్ర కాస్త తడబడ్డాడు. మా మేనత్త కమలక్కాయి నా కోసమే పెళ్ళికి వచ్చింది. తనకి కాస్త బాధనిపించిందట మనసులో చదువు గుర్తుకు వచ్చి.  లీలాకుమార్ కూడా కనబడకుండా బాధ పడ్డాడు. పెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి నాన్నను అడిగాడని తర్వాత అమ్మ చెప్పింది. రాఘవేంద్ర వాళ్ళ మేనమామ నాకు చీర పెట్టారు. మెట్లు కూడా తెచ్చారనుకుంటా. ఎవరు తెచ్చారో నాకు గుర్తు లేదు. మా పెద్జాడపడుచు ఉంగరం చేయించింది కాని అది నా బొటనవేలికి సరిపోయింది. మరుసటి రోజు తీసేసి ఆవిడకే ఇచ్చేసాను. ఏంటో బాగా దిగులుగా అనిపించింది. కాని బయటికి మాత్రం నవ్వుతూనే ఉన్నాను. అమ్మానాన్నలను వదిలి ఉండలేని నేను ఇలాంటి సంఘర్షణలతో కొత్త జీవితానికి ఏ ఆధారము లేకుండానే నాంది పలికేసాను. 
    కొందరికి రేపేమిటన్నది ప్రశ్న కావచ్చు. కాని నాకు మరుక్షణమేమిటన్నది ప్రశ్నగా మారిపోయింది అప్పటి నుండి ఇప్పటి వరకు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner