21, అక్టోబర్ 2020, బుధవారం
శ్రీ శ్రీ కళావేదికలో నా పరిచయం
శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారి సారధ్యం లో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న కవి తో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీకోసం...
యత్రనార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మన భారతీయ సంస్కృతి.ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ నేపథ్య కుటుంబం లో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి కష్టాలను అవరోధాలను అధిగమించి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మలచుకుని తనను తానుగా మలచుకున్న ఆమె తీరు అమోఘం అద్బుతం. అలుపెరగని ఆదర్శమూర్తి.
ఆమె జీవిత మజిలీలో అక్షరమే తన ఊపిరి అంటున్న
" శ్రీమతి మంజు యనమదల" గారు.... జీవితం.కవితాప్రస్థానం ఈ రోజు ఆమె మాటలలో......
రమావతి: మేడమ్ మీ కుటుంబ నేపథ్యం. మీ విద్యాభ్యాసం వివరాలు చెప్పండి
మంజు : కృష్ణా జిల్లా జయపురం అనే పల్లెటూరు అమ్మమ్మ గారింట్లో పుట్టాను.నాన్నగారు యనమదల సుబ్బారావు గారు, టీచర్ గా పనిచేస్తూ రిజైన్ చేసి, వ్యవసాయం మీద మక్కువ తో వ్యవసాయం చేసేవారు.అమ్మ సామ్రాజ్యం గృహిణి. అవనిగడ్డ లో నేను2 నుండి 6వరకు చదువుకున్నాను. తరువాత వ్యవసాయరీత్యా విజయనగరం జిల్లాకు వెళ్ళిపోయాం అక్కడ జొన్నవలస గ్రామంలో పదవతరగతి వరకు గవర్నమెంట్ హైస్కూల్ లో, తర్వాత ఇంటరు మహరాజా కళాశాలలో విద్యనభ్యసించి బళ్ళారి విజయ్ నగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసాను.
నేను ఏకైక సంతానం.
రమావతి: మీ వైవాహిక జీవితం వృత్తి వివరాలు చెప్పండి.
మంజు : నా భర్తగారు యార్లగడ్డ రాఘవేంద్రరావు. ఇద్దరు కుమారులు 1.మౌర్య చంద్ర.(ఆర్కిటెక్చర్)
2.శౌర్యచంద్ర.(ఇంటర్)
నా ఇంజనీరింగ్ అయిపోయాక బెంగుళూరు లో C.M.C లో AS/400 కోర్స్ చేసాను. మద్రాసు లో 2సంవత్సరాలు Software జాబ్ చేసా తరువాత బాబు పుట్టాక అవనిగడ్డ Polytechnic కాలేజీ లో లెక్చరర్ గా చేసాను. తరువాత అమెరికా లో దాదాపు 8సంవత్సరాలు సాఫ్ట్ వేర్ మరియు వివిధరకాల ఉద్యోగాలు చేసాను.మళ్ళీ ఇండియా కి తిరిగి వచ్చి హైదరాబాద్ లో అమెరికా కు చెందిన కంపెనీలో project quality manager గా చేసి కుటుంబ బాధ్యతలతో ఉద్యోగం మానేసా.తరువాత మళ్ళీ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఆరోగ్యం బాగోక మానేశాను.
రమావతి : మేడమ్ కవిత్వం అంటే ఎలా ఉండాలి .వర్థమాన కవులకు మీరిచ్చే సలహాలు చెప్పండి( అంటే ఎంత నిగర్వంగా సమాదానం చెప్పారో )
మంజు: నాకు పెద్దగా సాహిత్యపు లక్షణాలు తెలియవు మూలాలు కూడా తెలియదు కేవలం రాయాలనే కోరిక తప్ప, మనసులోని భావాలను,గత జ్ఞాపకాలు, మౌన సంఘర్షణలే అక్షర రూపాలు. నాకు ఆరోగ్యం బాగోలేనపుడు నేను ఆనందంగానే ఉన్నాను అని ముసుగు వేసుకోవడానికి కూడా నా రచనలు ఉపయోగపడ్డాయి.కొత్తవారికి నేనిచ్చే సలహా ఎవరిని అనుకరించకండి మీ మనసులో ఉన్నది కాగితం మీద అక్షర రూపంలో పెట్టేయండి. మన కవితలు వేరే వారిని ఇబ్బంది పెట్టకుండా, సమాజం లో మార్పు తేలేకపోయినా హాని చేయకుండా ఉండాలి.
రమావతి: మేడమ్ మీకు కవితలు రాయడానికి ఎవరు స్పూర్తి మీ కవితా ప్రస్థానం వివరాలు చెప్తారా!
మంజు: నాకు 2వ తరగతి నుండి పుస్తకాలు చదపడం అంటే చాలా ఇష్టం.నేను 10 thలో చిన్న చిన్న కవితలు రాస్తూ ఉండేదాన్ని.నేను ఇంజనీరింగ్ లో ఉండగా నా స్నేహితులు నాకు తెలియకుండా ఆహ్వానం అనే సాహితీ పత్రికకు మౌనం అనే కవితను పంపించారు అది బహుమతి తెచ్చి 25/పారితోషకం కూడా ఇచ్చారు (నవ్వుతూ) అక్కడ నుండి నా రచనా వ్యాసంగాలు మొదలయ్యాయి. మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు రాయడం. నాకు ఆరోగ్యం బాగోలేనపుడు రచనలతోనే సేదతీరుతున్నానని అందరూ ఆహ్వానించారు. నేను అమెరికా నుంచి వచ్చాక పేదరికం తో చదువుకోలేని పిల్లలకోసం నా సన్నిహితుల సహకారంతో ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను. దానికోసం ఒక బ్లాగ్ ఓపెన్ చేసాను. సలహాలు-చిట్కాలు, కబుర్లు కాకరకాయలూ అనే బ్లాగ్స్ కూడా ప్రారంభించాను.మెల్లగా ఫేస్ బుక్ లో నా కవితా ప్రస్థానం మొదలయింది.
రమావతి: ఇంతవరకు మీరు రాసిన పుస్తకాలు వ్యాసాలు గురించి వివరించండి
మంజు:
1. అక్షర సాక్షిగా నేను ఓడిపోలేదు.
2.చెదరని శి(థి)లాక్షరాలు
3.అక్షర స(వి)సన్యాసం అనే కవితాసంపుటాలు
4.నా స్నేహితురాలు వాణి తో కలిసి గుప్పెడు గుండె సవ్వడులు అనే కవితాసంపుటి
5.సడిచేయని (అ)ముద్రితాక్షరాలు అంతర్లోచనాలు అను వ్యాస సంపుటాలు
6.ఏ'కాంతాక్షరాలు అనే లఘు కవితాప్రక్రియ 28 అక్షరాలను రెండు వ్యాక్యాలుగా చేసే ప్రక్రియ
ఇవి ముద్రితమైన పుస్తకాలు.
ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ అని నా అమెరికా అనుభవాలను ప్రచురిస్తున్నారు
రమావతి:శ్రీ శ్రీ గారి సాహిత్యం పై మీ అభిప్రాయం
మంజు: నా చిన్నప్పుడు నుంచి ఆయన సాహిత్యం చదివేదాన్ని ఆయనే నాకు ఇన్సిపిరేషన్. ఆయన కవితలు చదువుతుంటే మనకు తెలియకుండానే మనసు ఉత్తేజితమౌతుంది. శ్రీ శ్రీ గారి భావపదజాలం ఉత్ప్రేరకం లాగా సమాజం పై మన భాద్యతను తెలియజేస్తుంది.
రమావతి:సాహిత్యం లో ఇటీవల వస్తున్న నూతన ప్రక్రియలవలన ఏమైనా ఉపయోగం ఉందంటారా!
మంజు: ఉందండి అనేక ప్రక్రియలలో వివిధరకాల కవితలు రాయడానికి ప్రతి ఒకరు ప్రయత్నిస్తున్నారు. ఏ ప్రక్రియలోనైనా మంచినే తీసుకోవాలి. మరుగున పడిపోయిన సాహితీవేత్తలు కొత్తగా రాసే కవులు అందరూ ముందుకు వస్తున్నారు.
రమావతి: మేడం మీకొచ్చిన పురస్కారాలు అవార్డులు చెపుతారా!
మంజూ: నాకు అవార్డులు తీసుకోవడం ఇష్టం ఉండదు. నా ఆరోగ్యరీత్యా నేను ఎక్కడకు వెళ్ళలేను తప్పక మూడు అవార్డులు హైదరాబాద్ లో తీసుకోవలసివచ్చింది. గిడుగు రామమూర్తి గారి పౌండేషన్ ద్వారా ఒక అవార్డు వచ్చింది. సుధీక్షన్ ఫౌండేషన్ వారు, కవితాలయం గౌరవ పురస్కారం ఇచ్చారు. 2021 కి గాను ఐడియల్ ఉమన్ అవార్డ్ లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ వారు ఎంపిక చేసారు.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
// “మనసులోని భావాలను,గత జ్ఞాపకాలు, మౌన సంఘర్షణలే అక్షర రూపాలు“ //
బాగా చెప్పారు. ఆ రకం గానే గంభీరమైన రచనలు వస్తాయి.
మీ ఇంటర్వ్యూ జరిగిన విధానం బాగుందండి. మీరు చెప్పిన “శ్రీశ్రీ కళావేదిక” ఏ ఊళ్ళో ఉందండి?
నెల్లూరు అనుకుంటానండి... ఫేస్ బుక్ గ్రూప్ ఇది. ధన్యవాదాలు మీ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి