14, అక్టోబర్ 2020, బుధవారం
ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు పుస్తక సమీక్ష
" తెలుగు సాహితీ లోకానికి సరికొత్త వెలుగు రవ్వలు సాగర వచనాలు "
రచనలు చాలామంది చేస్తారు, కాని కొందరి రచనలు మాత్రమే సాహితీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి. విలక్షణమైన విషయాలను లక్షణంగా పాఠకులకు అందించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో సాగర్ శ్రీరామ కవచం ఒకరు. సాగర్ గారి రచనల శైలి విభిన్నంగా ఉంటుంది. ఎవరు తీసుకోని సరికొత్త వస్తువులతో నవలలు, సాహితీ వ్యాసాలు రాయడంలో అందె వేసిన చేయి. ఇంగ్లీషు సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని అవపోశన పట్టిన విజ్ఞానగని. ఓ రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్ని సాగర్ గారిలో నిండుగా మెండుగా ఉన్నాయి. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం ఆయా పాత్రల్లో లీనమైపోతామనడంలో ఎట్టి సందేహము లేదు. ఇది మన కథేనా అన్న మీమాంస రాక మానదు. యాతన నవల చదివినప్పుడు...ఆ నవల ప్రభావం నుండి బయటకు రావడానికి చాలా సమయమే పట్టింది నాకు. మా నాన్నగారు యాతన చదువుతూ తన మనోభావాలనే రాశారని చెప్పడమే ఇందుకు సాక్ష్యం. వీరి రచనలు చదివిన పాఠకుడు ఎంతగా పాత్రలో లీనమైపోతాడో తెలియడానికి ఇదో ఉదాహరణ. దహనం, అవస్థ, యాతన వంటి సామాజిక, మనో వైజ్ఞానిక నవలలు అందించిన ఆ చేతి నుండి సాహిత్యం గురించి, రచన, రచయిత, భాష, విమర్శ వంటి విషయాలతో పాటుగా ఇప్పటి వరకు ఎవరు చెప్పడానికి సాహసించని సరికొత్త కోణంలో వస్తువు, శిల్పము, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సోదాహరణముగా వివరించిన వ్యాసాల సమాహారమే ఈ " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకం. నిజమైన ప్రతిభకు పట్టం కట్టే రోజులు వస్తే ఈ పుస్తకం తెలుగు సాహితీ చరిత్రలో సముచిత స్థానాన్ని అందుకుంటుంది. తెలుగు సాహిత్యంలో ఓ నూతనాధ్యాయానికి నాంది పలుకుతుంది.
మూడు భాగాలుగా ఈ వ్యాస పరంపర కొనసాగుతుంది. మెుదటి భాగములో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి వివరణాత్మక విశ్లేషణ చేసారు. సాహిత్యంలో ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి శిల్పశోభితము ఉంటుందన్న సిద్ధాంతం ఉంది. కాని " ఒక వస్తువుని అనుసరించి మరో వస్తువు దానిని అనుసరించి సాగే శిల్పంతో సమాశ్రియంగా మరో ప్రచ్ఛన్న శిల్పం ఉంటుందని " ప్రతిపాదించి దానిని సోదాహరణముగా వివరించిన మొదటి వ్యక్తి సాగర్ శ్రీరామ కవచం గారు. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయిత పరిణితి మూలంగా , రచయితకు తెలియకుండానే కథలో కాని, కవిత్వంలో కాని మధ్యలో పుట్టి ముగింపుకి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంటాయి. సాధారణ రాయిని ఉలితో నేర్పుగా, ఓర్పుగా చెక్కితే నలుగురు మెచ్చే అందమై శిల్పం ఎలా ఏర్పడుతుందో మనందరికి తెలిసిన విషయమే. దీనినే ఉదాహరణగా తీసుకుని కథలో, నవలలో,కవిత్వంలో వస్తుశిల్పాల ప్రాముఖ్యత, వాటి నుండి ప్రచ్ఛన వస్తుశిల్పాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది, కవిత్వంపై ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది తదితర అంశాలను సవివరంగా ప్రచ్ఛన వస్తుశిల్పాలు వ్యాసాలలో వివరించారు. నాణేనికి బొమ్మా బొరుసు ఎలా ఉంటాయెా అలాగే రచనకు వస్తుశిల్పాలని, వస్తువుకి నీడ ఉన్నట్టుగా, శిల్పానికి ఛాయ ఉంటుందని అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలని సోదాహరణముగా తన వ్యాసాలలో వివరించారు. సాహిత్యంలో వస్తువు, శిల్పము మిధ్య కాదని చెప్తూ, అవి కనబడవు, తారసిల్లుతాయంటారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి అనుగుణంగా రచన చేయాలంటే రచయిత ఒకానొక తపోస్థితికి చేరుకుని తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర అనుభవమౌతుంది. వస్తు శిల్పాల సాధనలో రచయితలో పొడజూపే భావతీవ్రతే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల విస్పోటనానికి కారణమౌతుంది. ప్రతి అద్భుత రచనలోనూ ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు రచయితకు తెలియకుండానే ప్రవేశించి ఆ రచనను పతాకస్థాయికి తీసుకువెళ్తాయి అని కన్యాశుల్కం, త్రిపుర భగవంతం కథలోనూ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను మనం గమనించవచ్చంటారు సాగర్ గారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలపై విస్తృత పరిశోధనలు జరగడానికి విమర్శకుల సహకారం ఎంతైనా అవసరం ఉందంటారు.
రచనలో ప్రధాన వస్తుశిల్పాల పాత్ర బలహీనపడి, ఆ క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలు ఏర్పడి, వాటి పాత్రని క్రియాశీలకంగా నిర్వహించి, రచనకు అత్యుత్తమ స్థాయిని కలిగిస్తాయి. రచనాక్రమంలోప్రచ్ఛన్న వస్తుశిల్పాల శకలాలన్ని ఒకే రకంగా ఉండవు. బలమైనవి, బలహీనంగానూ, బలహీనమైనవి బలంగానూ, శైథిల్యావస్థలోనున్నవి కొన్ని బలపడి రచనను ముందుకు తీసుకుపోతే, మరికొన్ని కనబడకుండా పోతాయి. ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర రచయిత భావజాలానికి కేంద్రంగా పని చేస్తుంది.
రాయడానికి తీసుకున్న వస్తువుకి, వ్యక్తీకరించే శిల్పానికి మధ్యన శూన్యత ఏర్పడి ఆ రచనను ముందుకి సాగనివ్వదు. బలవంతంగా రాయాలని ప్రయత్నిస్తే సహజత్వం ఉండదు. ఈ స్థితి చాలామంది రచయితలకు అనుభవమే అయివుంటుంది. అలాంటి సమయంలో ఓ ఆలోచనా మెరుపుతో తిరిగి మెుదలైన రచనలో అంతకు ముందున్న వస్తుశిల్పాల స్థితిగతులు మారతాయి. దానికి కారణం రచయితకు తెలియకుండా ప్రవేశించే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు. రచయిత చేతిలో కీలుబొమ్మలుగా మారకుండా, మెాతాదుకు తగినట్టుగా ఈ ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఉంటే మనకు రచన మాత్రమే కనబడుతుంది. రచయిత ఆ రచనలో కనిపించడు. అదే రచన తనంతట తానుగా వచ్చి రాయించుకుంటే, నేరుగా ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు ఆ రచయితను ఆవహించి తమ పాత్రకు న్యాయం చేసి వెళిపోతాయి. ఈ స్థితి రచయితకు, ఆ రచనకు అత్యుత్తమం.
" వస్తువు శకలాలుగాను, శిల్పం శకలాలుగాను కేంద్ర స్థానం నుండి తప్పుకుని ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర పోషిస్తాయని " సాగర్ గారు చెప్తున్న సూత్రీకరణపై రాబోయే కాలంలో చర్చలు జరగడం అవసరం కూడాను.
రచన పరిపుష్టిలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రను వివరిస్తూ " వస్తువు రూపము, స్వభావముతో పాటుగా భౌతిక, రసాయన నియమాలననుసరించి అస్తిత్వం ఉంటుందని, ఒక రూపం నుండి మరో రూపానికి మారుతుందని చెప్తూ, పరిణామం చెందడం ద్వారా వస్తువు తన స్థితిని మార్చుకుంటూ లక్షణాలను కూడా మార్చుకుంటుందని నీరు గడ్డ కట్టడం, బాగా వేడి చేసినప్పుడు ఆవిరిగా మారడం ఉదాహణగా చెప్తూ, వస్తువు పరిమాణాత్మక స్థితి నుండి గుణాత్మక స్థితికి చేరుకుంటుందని వివరిస్తారు. వస్తువుకుండే సంకేతాలను, ఆ సంకేతాలు వివిధ భాషలలో వివిధ రకాలుగా ఉంటాయని, వాటికి లిఖితపూర్వక గుర్తింపు, ఉఛ్ఛారణలో పదాలుగా మారడాన్ని సాంకేతికాలు అంటరాని, సాంకేతికాలు సాంకేతీకరణాలు కావడాన్నికూడా తన వ్యాసాలలో వివరించారు. నిజానికి భాషలో వస్తువులుండవట. వస్తువుకి సంబంధించిన భావనలు మాత్రమే ఉంటాయంటారు. వస్తు జ్ఞానం భాషపై ఆధారపడి ఉంటుందని, సమాజ అభివృద్ధికి అనుగుణంగా వస్తువు రూపొందిన్చబడిందని, రచయిత ఒక వస్తువును ఎంచుకునే క్రమంలో ఆ వస్తువుకుండే ద్వంద్వ స్వభావాన్ని గుర్తెరిగి రచన చేయాలని, ప్రతి రచనా సమాజహితానికే అయివుండాలని ఓ హెచ్చరిక కూడా చేస్తారు. భాష బతికి బట్ట కట్టాలంటే ఎన్నో అవసరాలు, సంఘర్షణలు తప్పవంటారు.
" వస్తువు నాశనం అవడం వలన గాని, రూపాంతరం చెందడం వలన గాని భాష ఉనికి ప్రశార్థకమౌతోందని, అందువలన సాహితీకారులు తమ సాహిత్యం ద్వారా వస్తువు ఉనికిని కాపాడాలని చెప్పారు. ఒకే వస్తువుని తీసుకుని పలువురు కవిత్వం చెప్పడం మూలంగా వస్తువు అసలు స్వభావం పోతుందని చెప్పడం గమనార్హం.
సరికొత్త వస్తువునెంచుకుని, దాని స్వభావాన్ని గమనించి కవిత్వం చెప్పడం ద్వారానే కవి ప్రతిభ బయట పడుతుందని, వస్తువు ముడి సరుకు మాత్రమేనని, దానితో పాటుగా అనేక ఇతర వస్తువుల సహాయ సహకారాలు అవసరమని చెప్తూ, కేవలం వస్తువుని ఎంచుకోవడంతోనే సరైన కవిత్వం ఎవరు రాయలేరని చెప్పారు. విస్తృత వస్తువు రచనాక్రమంలో శకలాలుగా విడిపోయి, వాటి నుండి ప్రచ్ఛన్న వస్తువులు ఏర్పడి, రచన నిర్మాణంలో ప్రధాన వస్తువుని మించిపోయి, రచనను సంపూర్ణంగా ఆక్రమిస్తాయి. దీని మూలంగా రచన అద్భుతస్థాయిని చేరుకుంటుంది. అది రచయితకు తెలియకుండా జరిగిపోతుందంటారు.
ఒక వస్తువుని ఆవిష్కరించే ఆలోచన క్రమాభివృద్దే శిల్పం. వస్తువుకి ప్రాణం పోసేది శిల్పం. కవిత ఆరంభంలోనే ఆయువుపట్టుగా మారుతుంది శిల్పం. సక్రమ శిల్ప నిర్మాణం లేని కవితలో జీవముండదు. ఇక్కడ శిల్పానికి, వ్యక్తీకరణకి భాష ప్రధానం. భాష నుండే సరైన శైలి సాధ్యమని, సాహిత్యంలో సమాజ హితానికి భాషను సక్రమంగా వాడాలని, రచన చేసే ముందు రచయితకు సమాజ స్థితిగతుల పట్ల సరైన అవగాహన అవసరమని, సాహిత్యంలో భాషకు భావం కూడా ముఖ్యమేనని ఇలా చాలా విషయాలు తన వ్యాసాలలో చర్చించారు. సాహితీకారులకు తగు సూచనలు కూడా చేసారు. శిల్ప సాధన కోసం పేరున్న కవులను అనుకరించవద్దని, వేరే వారి రచనలు తమ రచనలుగా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ రచనలు ఎక్కువ రోజులు మనలేవని కూడా చెప్పారు. శిల్ప సాధనకు అభ్యాసం ముఖ్యమని, శిల్పమంటే అవగాహన అని, కవిత్వం ప్రయత్నించి రాయడం కాకుండా, తనంతట తానుగా వచ్చి రాయించుకునే కవిత్వం, చక్కని శిల్పంతో శోభిల్లే కవిత నాలుగు కాలాలు నిలబడుతుందని, దీనికి కవికి నిజాయితీ ముఖ్యమని అంటారు. ఎక్కువ పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలు తెలుకోవచ్చని చెప్పారు. నిజమే కదా అది.
వస్తు సాకారమంటేనే ప్రచ్ఛన్న వస్తుశిల్ప సౌందర్యం, దీనిని గురించి విమర్శకుడు రచయితకు సరైన అవగాహన కల్పిస్తే ఆ రచన చక్కగా పండుతుందంటారు సాగర్. వస్తువు స్వభావాన్ని, ప్రవృత్తిని, నిర్మాణ, పునర్నిర్మాణాన్ని, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సాధనలో అంతర్వాణి పాత్రను, మేధస్సును కూలంకషంగా చర్చిస్తారు.
ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి చర్చించేటప్పుడు వస్తువు బాహ్యముఖీనం. శిల్పం అంతర్ముఖీనమని మరువకూడదని, బంగారం నగగా రూపాంతరం చెందే క్రమంలో జరిగే విధానమే రచనలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని, వస్తువుకి పాజిటివ్, నెగెటివ్ ఛాయలే కాకుండా తటస్థ ఛాయలుంటాయని, రచయిత పదాల దానకర్ణుడంటూ, ఆ పదాల కూర్పుతో కావ్యముగా మలిచే క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు కనబడకుండా తమ పని తాము చేసుకుపోతాయి. రచన పూర్తయ్యాక అది చూసి రచయితే ఆశ్చర్యానికి గురౌతాడు. రాయించేది రామభద్రుడట అన్న చందాన. ఇప్పటి సాహిత్యానికి ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని అధ్యయనం చేయడం కనీసావసరమని సాగర్ ఘంటాపథంగా చెప్తున్నారు.
రెండవ భాగమైన సాగర వచనంలో రచన ఎలా ఉండాలి, రచయిత లక్షణాలేంటి, రచనలను పాఠకులకు అందిచడంలో పత్రికల పాత్ర తదితర అంశాలను సవివరంగా వివరిస్తారు. రచనను ఓ క్రియాశీలక సృజనాత్మక కార్యాచరణగా అభివర్ణిస్తారు. విమర్శకుల కోణంలో కవిత్వం రెండు పార్శ్వాలుగానే ఉందని చెప్తూ, బాహ్యముఖీన,అంతర్ముఖీన కవిత్వమే కాకుండా, మూడో పార్శ్వమైన రహస్యముఖీన తత్వాన్ని తెలివైన పాఠకుడు ఆస్వాదిస్తాడంటారు. అనుసరణకు, అనుకరణకు తేడా వివరిస్తారు. అనుకరణ తప్పని చెప్పకపోవడం సాహిత్య దోషమని నొక్కి వక్కాణించారు. మహిళా ఉద్యమాలు, స్త్రీ ఉద్యమాల ఆవశ్యకత గురించి, మహిళకు, స్త్రీ కి గల చిన్న తేడాని చూపిస్తారు. మంచి సాహిత్యం మాత్రమే భాషని బతికిస్తుందని, అంతరించిపోతున్న భాషను రాత ద్వారా కూడా బతికించుకోవాలని, సాహిత్యం లేని భాష సజీవభాషగా మనలేదని, సాహిత్యము, విమర్శ వేరు వేరు కాదని, గొప్పదనం రచనదే కాని రచయితది కాదని, అలా కాకుండా ఆ రచన గొప్పదనాన్ని రచయిత ఆపాదించుకుంటే, ఆ కీర్తి కిరీటంతో అక్కడే ఆగిపోతాడన్న హెచ్చరిక కూడా ఉంటుంది.
" అనుభూతి యెుక్క తీవ్రస్ధాయిా బేధాలే కవిత్వం " అని అంటూ శక్తి రూపాలను గుర్తు చేస్తూ, సాహిత్యంలో భౌతికశాస్త్ర నియమాన్ని E =mc² ను కవిత్వ వస్తు శక్తిగా వివరించడం, రచయితలు, పత్రికలు ఏ కాలంలోనూ ఓడిపోలేదని, సాహిత్యంలో గురుశిష్యుల అనుబంధాన్ని, వాస్తవాలను పాఠకులకు చేరవేయడంలో రచయిత అనుసరించాల్సిన పద్ధతులు, విమర్శనకారుల రూపంలో ప్రవచనకారులు సమాజంపై చిమ్మే విషాన్ని అరికట్టాలంటారు. అపసవ్య మార్గంలో పోతున్న సమాజానికి సద్విమర్శ మేలు చేస్తుందంటూ, ఈనాడు తప్పు దారిలో అభ్యుదయవాదులమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఫండ్స్ బోలెడుమంది నొక్కేస్తున్నారన్న బాధను వ్యక్తపరిచారు. కవి కాని, కవిత్వం కాని సమాజాన్ని మారుస్తాయన్న ఆశాభావం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది.
విభిన్న అంశాలతో మూడవ భాగంలో అస్తిత్వవాదం గురించి, వర్తమాన విమర్శ గురించి, వస్తు శిల్పాల గురించి, పోస్ట్ మెాడ్నరిజం సిద్ధాంతం గురించి, విమర్శ లేకుండా పాఠకుడు ఉండడు, రచయితా - విమర్శ వేరు కాదని చెప్తూ, సాహిత్యానికి విమర్శ అవసరాన్ని వివరిస్తారు.
ఓ నిజమైన సాహితీకారుడు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఈ వ్యాసాల నిండా ఉన్నాయి. నా వరకు నాకు ఇవన్ని చాలా అమూల్యమైన అక్షర సంపదే. ఎందుకంటే ఏ సాహితి లక్షణాలు తెలియకుండా రాసే నాకు ఓ రచన వెనుక ఇంత యుద్ధం చేయాలా అని ఆశ్చర్యం వేసింది. ఓ రచన ఎలా ఉండాలి, ఆ రచన చేయడానికి కావాల్సిన ముడి సరుకు, అలంకారాలు, రచయితకు ఉండాల్సిన లక్షణాలు, వస్తువు పై అవగాహన, భాషపై పట్టు, సమాజం పట్ల అంకితభావం, సాహిత్యాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలతో కలిపి తాత్విక లక్షణాలను రచయితలు ఎలా ఆపాదించుకుంటారో, సంపూర్ణ రచన ఎలా వెలువడుతుందో మెుదలైన విషయాలన్నింటిని " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " వ్యాసాలలో వివరించారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి వివరణలు, విశ్లేషణలు రాబోయే సాహితీ తరాలకు ఎంతయినా అవసరం. ఈ ప్రతిపాదనలను అంగీకరించడం, వీటి మీద విస్తృతమైన పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత మన తెలుగు సాహితీకారులకు ఉంది.
ఈ పుస్తకం గురించి నాదైన మాటలో చెప్పాలంటే..
" కవిత్వానికి వస్తువు జ్ఞానమైతే శిల్పం ఆత్మ వంటిది."
తెలుగు సాహిత్యానికి ఏం కావాలో తెలియజెప్పిన అక్షర మణిహారం " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకాన్ని అందించిన సాగర్ శ్రీరామ కవచంకి హృదయపూర్వక అభినందనలు..
పుస్తకం కావాల్సిన వారు సంప్రదించాల్సిన నెంబరు
9885473934
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి