7, అక్టోబర్ 2020, బుధవారం
గొప్ప రచయిత / రచయిత్రి
నేస్తం,
నా రాతలు నేను నా మనసుకు నచ్చినట్టుగా రాసుకుంటాను. అందరికి నచ్చాలనేం లేదు. తెలుగు భాష మీద ఇష్టం పెంచుకోవడం, మా చిన్న తెలుగు, పెద్ద తెలుగు మాస్టార్ల మీద పంతంతో కావచ్చు. కారణమేదైనా కాని నాలుగు అక్షరం ముక్కలు రాయడం నేర్చుకున్నానంటే అది గురువుల వలనే. రాస్తున్నా కదాని ఓ నాకు బాగా రాయడం వచ్చని కాదు. నేను రాసేవన్నీ కవితలని, కథనాలని చెప్పను. మనం రాసేది నలుగురికి కాకపోయినా కనీసం ఒక్కరికయినా చేరితే చాలన్న కోరిక. అది తీరిందో లేదో ఆ పరమాత్మకెరుక.
మనం ఏది రాసినా మనకు నచ్చేస్తుంది. అది సహజం. దానికి ఎవరిని ఎవరూ తప్పు పట్టరు. కాని ఎదుటివారి రాతల గురించి విమర్శించే ముందు మన రాతలేంటన్నది ఓపాలి చూసుకుంటే పోలా. మన రాతలే గొప్ప రాతలనే అహం మనకుంటే ఎదుటివారి రాతలెప్పుడూ నచ్చవు. అన్ని లోపాలే కనబడతాయి. మనమేదో బాగా రాసేస్తామని మనల్ని సమీక్షలు, ముందు మాటలు రాయమని అడగరు. మన మీద అభిమానంతో, ఇష్టంతో అడిగినప్పుడు ఆ రాతలకు, వారికి విలువనివ్వడం మన సంస్కారం.
నాకు చిన్నప్పటి నుండి చదువులో ఏదైనా విషయం గురించి అడిగితే రాదని చెప్పడం తెలిసేది కాదు. నేను అమెరికాలో నేర్చుకున్న మంచి విషయమేంటంటే ఎదుటివారి పనిలో లోపాలను చూడకుండా, వారి పనిలో మంచిని చూడటం. నేను సమీక్షలు చాలానే రాశాను. పుస్తకం గురించి రాసేటప్పుడు పుస్తకంలో విషయాన్ని నాకు అనిపించినట్టుగా చెప్పడమే నాకు తెలుసు. ముందు మాటలు రాసేటప్పుడు ఆ వ్యక్తి గురించి, పుస్తకంలోని విషయాన్ని సంక్షిప్తంగా రాయడమే నాకు తెలుసు. ఇవన్నీ ఒకొక్కరు ఒకోలా రాస్తారు. దీనిలో ఆక్షేపణలేం లేవు. అలానే కవిత్వం, కథలు, కథానికలు, నాటకాలు ఇలా సాహిత్యం బోలెడు రకాలు. రాసే విధానాలు పలురకాలు. ఎవరు ఎలా రాసారన్న దానికన్నా ఏం రాశారన్నది ముఖ్యం. వారు రాయలనుకున్న సంకల్పానికి మన చేయూత ఉండాలి కాని, రాయాలన్న కోరిక నశింపజేయకూడదు మన మాటలతో, చేష్టలతో. ఏదో మనం నాలుగు పుస్తకాలు వేసేసామని మనకేదో బాగా రాయడమెుచ్చని ఫీల్ అయిపోతే మనకన్నా మూర్ఖులు మరొకరుండరు. ఇక అవార్డులు, సన్మానాలు, సత్కారాలంటారా అవి ఎలా, ఏమిటి, ఎందుకు అన్నది జగమెరిగిన సత్యం. ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారన్నట్టు నిజమైన ప్రతిభను గుర్తించాలంటే మనలో కూడా ఆ ప్రతిభను గుర్తించే ఆనవాళ్ళుండాలి కదా.
రాయడమనేది భగవదనుగ్రహం. మీకు వీలుంటే రాతలను ప్రోత్సహించండి కాని మీ మాటలతో, చేష్టలతో రాయాలన్న ఉత్సాహాన్ని చంపేయకండి మీరెంత గొప్ప రచయిత/రచయిత్రి అయినా సరే. మనందరి రాత రాసే ఆ భగవంతుడే అందరికన్నా గొప్ప రచయిత. ఇది నామాట.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి