12, అక్టోబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం.. 23

          పెళ్ళైన మూడో రోజో, నాలుగో రోజో నాకు సరిగా గుర్తు లేదు కాని.. రాఘవేంద్ర బావగారు ఓ పుస్తకం నా చేతికిచ్చి రాఘవేంద్రకి ఇమ్మన్నారు. ఏముందా అని చూసాను. వాళ్ళు మా పెళ్ళికి ముందే ఈ ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు బాగు చేయించడానికి, కరంట్ బల్బులు, రంగులు వగైరా ఖర్చులు అన్నీ ఉన్నాయి దానిలో. నాకెందుకని రాఘవేంద్రకు చూపించాను. ఏంటివి అంటే తనేం మాట్లాడలేదు. నాకెందుకులే అని నేనూ వదిలేసాను ఆ విషయాన్ని. 
            నాకు అప్పటి వరకు ఒకే మనిషి రెండు రకాలుగా ప్రవర్తిస్తారని తెలియదు. మనం మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనతో బావుంటూనే, మన ముందో మాటా, వెనుకో మాటా మాట్లాడతారని అస్సలు అనుకోం కదా. పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు. పెళ్ళైన తర్వాత అంతా మారిపోయింది. అంతకు ముందెప్పుడూ ఇంట్లో కాని, చదువుకునేటప్పుడు హాస్టల్ లో కాని ఎక్కడా ఒక్కదాన్నే ఉండలేదు. నేను అమ్మానాన్నలకు ఒక్కదాన్నైనా ఎప్పుడూ ఒంటరినని ఫీల్ కాలేదు. అందరి మధ్యలో పెరిగాను. వీళ్ళు అందరు ఉన్నా ఎవరికి వారే. రాఘవేంద్ర వాళ్ళ బావగారు పొద్దున్నే రైస్ మిల్ కి వెళిపోయేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. కాసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేవారు. అక్క చల్లపల్లి లో టీచర్. వంట చేసి బాక్స్ తీసుకుని వెళిపోయేది. మా ఆయన పొద్దున వెళితే ఏ అర్ధరాత్రో రావడం. అప్పుడప్పుడూ ఇంట్లో ఉండటం. నాకేమెా కాస్త ఇంటి పని, అప్పుడప్పుడూ వంట చేయడం మెుదలయ్యింది. వంట అసలు రాదు. కాఫీ మాత్రం పెట్టేదాన్ని. పసి అక్క బావగారితో వినాయక చవితికి పిండి వంటలు, నాకు, రాఘవేంద్రకి బట్టలు పంపించింది. పసి అక్క ఎక్కువగా రావడం మా ఆడపడుచు కి ఇష్టం ఉండేది కాదు. అమ్మ పసి అక్కతో నా చీరలన్నీ, రెండు బంగారు గాజులు, నేను దాచిన చిల్లర బాక్స్ ఇచ్చి పంపింది. 
        మా ఎదురింటి బేబమ్మ పరిచయమైంది. ఆవిడకు మెుదట్లో నేను నచ్చలేదట. ఎందుకీ0పిల్ల ఇలా పెళ్ళి చేసుకుంది అని. తర్వాత తర్వాత నా మాటలు నచ్చి, బాగా దగ్గరైంది. ఆ ఊరిలో నాకెవరు తెలియదు. మా మేనత్తది కూడా ఆ ఊరే కాని ఆ టైమ్ లో వాళ్ళు లేరు. పిల్లలు మా పక్కింటి ఉమక్క వాళ్ళింటికి వచ్చినా నన్ను పలకరించేవాళ్ళు కాదు. మమ్మల్ని చిన్నప్పుడు జయపురం నుండి పచ్చ వాన్ లో స్కూల్ కి తీసుకెళ్లిన సుబ్బారావు మా చిన్నప్పటి పరిచయాన్ని మర్చిపోకుండా నన్ను చూడటానికి ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడి వెళిపోయారు. చిన్నప్పటి ఫ్రెండ్ లాల్ కిషోర్ కూడా వచ్చి వెళ్ళాడు. మా రాణి అక్క, నాగభూషణం మామయ్య వాళ్ళకు ఎవరో నా పెళ్ళి గురించి చెప్పారట. నేనిలా పెళ్ళి చేసుకున్నానని నమ్మలేక పోయారట. నరశింహాపురం ఇంటికి వెళ్ళి నాన్నతో మాట్లాడి, మంజు దగ్గరకి వెళ్తామంటే సరేనన్నారట. నా దగ్గరకి వచ్చినప్పుడు మా పెద్దాడపడుచు ఇంట్లోనే ఉంది. ఏంటమ్మాయ్ ఇలా చేసావు? నువ్విలా చేసావంటే నమ్మలేకపోతున్నామన్నారు. పరిస్థితులు అలా వచ్చాయక్కా అని చెప్పాను. నాగాయలంక సుబ్బారావు అంకుల్, ఆంటీ కూడా వచ్చి ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళారు. 
              అమ్మతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేదాన్ని ఫోన్ లో. చల్లపల్లి టెలీఫోన్ బూత్ లక్ష్మణ, వాళ్ళ ఓనర్ గారు ఈ విషయంలో అమ్మకు, నాకు బాగా హెల్ప్ చేసారు. అప్పట్లో డైరెక్ట్ STD   ఉండేది కాదు. వీళ్ళకు ఫోన్ చేస్తే కలిపేవారు. నాన్న ఫోన్ బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు అమ్మ బిల్ చెప్పమంటే చెప్పలేదు. నాకు తెలుసు చెప్పండి ఎంత అయ్యిందో అన్నా కూడా వాళ్ళు బిల్ తీసుకోలేదు. నా పెన్ ఫ్రెండ్ లలితను కలవడానికి రాఘవేంద్ర నన్ను విజయవాడ తీసుకు వెళ్ళినప్పుడు రాణి అక్క వాళ్ళింటికి కూడా వెళ్ళాను. నాకు బాగా గుర్తు అప్పుడు రాణి అక్క వద్దన్నా వినకుండా తన మారేజ్ డే కి కొనుక్కున్న చీర నాకు పెట్టింది. పరిచయం కొద్ది రోజులే అయినా ఇంటి ఆడపిల్లలా చూసేవారు. తర్వాత నాగాయలంక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అమ్మ, పసి అక్క అక్కడికి వచ్చారు. అదే అమ్మని అన్ని రోజుల తర్వాత చూడటం. ఎంత సంతోషమనిపించిందో. అమ్మ బాగా చిక్కిపోయింది అప్పటికి. ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం. 
         నేను పెళ్ళికి ముందు గజపతినగరంలో లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేసాను. అది ఇంటర్వ్యూ కార్డ్ ఇంటికి వస్తే, మా లక్ష్మి అక్క వాళ్ళ అబ్బాయి రమణకు ఇచ్చి మా ఆడపడుచు వాళ్ళింటికి పంపించారు.  ఆ టైమ్ లో నేను హైదరాబాదు వెళ్ళాను. అమ్మకు ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పింది. వెంటనే మా ఆడపడుచుకు ఫోన్ చేసి,కార్డ్ పంపారట కదా, చెప్పలేదేంటి? ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడిగితే రేపే ఇంటర్వ్యూ. అయినా నువ్వు లెక్చరర్ పోస్ట్ కి పనికిరావని చెప్పలేదు అంది. అది నేను ఇష్టపడి అప్లై చేసుకున్న జాబ్, కనీసం చెప్పలేదు మీరు అని ఊరుకున్నాను. జీవిత పాఠాలు నేర్చుకుంటూ, మనుష్యుల నైజాలు అర్థం చేసుకోవడం మెుదలుపెట్టాను. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 




            


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner