19, అక్టోబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..24

       మా పెళ్ళైన రెండు నెలలకు మా మామయ్యకు కూతురు పుట్టింది. రాఘవేంద్ర వాళ్ళ అక్కకు యాక్టివా మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. చెయ్యి నొప్పి చేసింది. చూడటానికి మా పిన్ని వచ్చింది. అంతకు ముందే స్కూల్ లో నా సీనియర్ మా మేనత్త కూతురు రాణి సూసైడ్ చేసుకుంది. చూడటానికి నేను, మా ఆడపడుచుతో కలిసి వెళ్ళాను. అమ్మా వాళ్ళందరు కూడా వచ్చారు. రాణి చాలా ఆత్మాభిమానం గల ఆడపిల్ల. తన పెళ్ళికి కూడ వెళ్ళాను. అత్తవారింట్లో మెుదట్లో కాస్త కోపతాపాలున్నా తర్వాత తను చాలా అడ్జస్ట్ అయ్యింది. ఓసారి పిన్ని వాళ్ళింటికి వెళితే, నన్ను చూడటానికి కూడా వచ్చింది. అత్తింటి వారు అందరు ఒకటై ఆ అమ్మాయిని ఒంటరిని చేసేసారు. తను చాలా ఇండివిడ్యువాలిటి ఉన్న మనిషి.తనని బాగా క్రిటిసైజ్ చేసారు అందరు. అయినా సరిపెట్టుకుని ఉంది. ఒంటికి, ఆరోగ్యానికి మంచిదంటే ఏ చిట్కా అయినా చేసేది. అలాంటి మనిషి ఒళ్ళు కాల్చుకుని చనిపోయిందంటే నాకు ఇప్పటికి అది నమ్మశక్యం కాని విషయమే. ఏం జరిగిందన్నది భగవంతునికి తెలియాలంతే. కల్లాకపటం తెలియదు, తన మనసులో ఏముంటే అదే మాట్లాడేది. ఇప్పటికి నా మనసు బాధ పడే సంఘటన అది. తనకి ఏ రకంగానూ మెారల్ సపోర్ట్ దొరకలేదు అన్నది నాకు అర్థం అయిన విషయం. ఆ సమయంలో మరో మాట ఎప్పుడు వినాల్సి వస్తుందేమెానని అన్న మా ఆడపడుచు మాట నాకు అర్థం కాలేదప్పుడు. నేను ఎంత సున్నిత మనస్కురాలినైనా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కునే శక్తి నాకుందని ఆవిడకు తెలియదనుకుంటా. 
         ఆడపిల్లకు కష్టం వస్తే ఆదుకునే పుట్టిల్లు ఉండటం ఎంతైనా అవసరం. లోకం ఏమనుకుంటోందోనని ఆలోచిస్తే ఆ ఆడపిల్ల ఎంత వేదన పడుతుందో ఎవరికీ తెలియదు. ఆడపిల్లకు మంచికి, చెడుకి అక్కరకు రాని పుట్టినింటి వారు ఉన్నా లేనట్లే. ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపేస్తే మన బాధ్యత తీరిపోదు. కష్టం వచ్చినప్పుడు గుండెల్లో దాచుకుంటేనే ఆడపిల్ల బతకగలుగుతుంది. నీకు మేమున్నామన్న భరోసా ఇవ్వగలగాలి. ఈరోజుల్లో పుట్టింటివారికి ఆడపిల్ల బాధ్యతను గుర్తు చేసినా కూడా పట్టించుకోని వారెందరో. కష్టం వచ్చిన ఆడపిల్లను సంప్రదాయం ప్రకారం పుట్టింటికి తీసుకువెళ్ళి నిద్ర చేయించడం కూడా మరచి  తప్పించుకు తిరుగుతున్న ఎందరో పుణ్యాత్ములు ఈనాడు తారస పడుతున్నా నోరు మెదిపి ఏమి అనలేని దుస్థితి. ఇలాంటి కష్టం మాత్రం ఏ ఆడపిల్లకు రాకూడదని భగవంతుని కోరుకుంటున్నా. 
       మా మామయ్య కూతురు ప్రియకు అన్నం కాకాని లో పెట్టినప్పుడు నన్ను అమ్మ వచ్చి తీసుకువెళ్ళింది. ఈయనకు ముందే ఫోన్ చేసి చెప్పారు. ఫంక్షన్ కి వెళ్ళి వచ్చాకా మా ఆడబిడ్డ గారు పద్ధతి గురించి ఓ పెద్ద క్లాస్ తీసుకున్నారు. అలా ఓ ఆరు నెలలు వాళ్ళింట్లో ఉన్నాను. మధ్య మధ్య హైదరాబాదు వెళ్ళి వస్తూ. రాఘవేంద్ర వాళ్ళ బావగారు హైదరాబాదు వెళ్ళిరావడానికి డబ్బులిచ్చేవారు. రాఘవేంద్ర రొయ్యల చెరువులు కౌలుకి వేయడానికి వాళ్ళ అక్కని డబ్బులడిగితే ఇవ్వలేదు. బావగారేమెా పెళ్ళి చేయగానే బాధ్యత అయిపోయిందా! మంచి చెడు చూడాలి కదా అన్న మాటయినా అన్నారు. మా ఊరి పసి అక్క పాతికవేలు రాఘవేంద్రకు ఇచ్చే ముందు, ఇలా కావాలని అడిగాడు, అని చెప్తే తనే చూసుకుంటాడులే అని చెప్పాను. ఏ గొడవలయినా డబ్బులతోనే వస్తాయి అక్కా అని చెప్పాను. తర్వాత తను డబ్బులు రాఘవేంద్రకు ఇచ్చానని చెప్పింది. 
  నాకు మద్రాస్ లో జాబ్ నాన్న చూసారు. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర. మా జయపురం చిన్న  బాబాయ్ అక్కడే ఉంటారు. నన్ను చిన్నప్పుడు బాగా ఎత్తుకునేవారు. ఆఫీస్ ఓపెనింగ్ కి నేను, రాఘవేంద్ర మద్రాస్ వెళ్ళాము. తర్వాత మద్రాస్ హాస్టల్ లో ఆఫీస్ కి కాస్త దగ్గరలో ఉన్నాను. ఆఫీస్ తైనంపేటలో. మా హాస్టల్ టీ నగర్ లో. AS/400 ట్రైనింగ్ సెంటర్ అది. అలైడ్ ఇన్ఫర్మాటిక్స్. పూర్ణచంద్రరావు అని నాన్న ఫ్రెండ్ చూసుకునేవారు. వాళ్ళ అల్లుడు క్రిష్ అమెరికాలో Allied Informatics కంపెనీ CEO. మా రాధ పెదనాన్నకి చుట్టాలు. నన్ను  AS/400  నేర్చుకోమన్న పెద్దమనిషీయన. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
       


            
        
          

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner