17, నవంబర్ 2020, మంగళవారం
కాలం వెంబడి కలం..28
ఓ పది రోజులున్నాము మా పెద్దాడపడుచు ఇంట్లో. ఆ పది రోజుల్లో పిల్లాడికి నీళ్ళు అమ్మ పోస్తుంటే, ఇష్టమైతే చేతి మీద నీళ్ళు పోసేది, లేకపోతే నేనే పోసేదాన్ని అమ్మకు సాయంగా. రాఘవేంద్రేమెా ఓ పది రోజులు ఓపిక పెట్టండి. మనం హైదరాబాదు వెళిపోదాం అన్నాడు. పిల్లాడికి మా నాన్న పోలికలని ఆమె చుట్టాలతో ఎద్దేవగా మాట్లాడటం విన్నా కూడా విననట్టుగా ఊరుకున్నాం. నా ఫ్రెండ్ ఉష బాబుని చూడటానికి వచ్చి, ఓ రోజుండి వెళిపోయింది. తను వెళ్ళగానే ఈవిడ గదిలోకి వచ్చి ఏంటేంటో అని వెళిపోయింది. రాఘవేంద్ర కూడా అక్కడే ఉన్నాడు. నేనప్పుడు అన్నాను.. నేనేమైనా చేసి ఉంటే నాకు లేకపోతే ఆవిడకే అంతా అని. మరుసటి రోజు ఆవిడకు బాలేదు. ఆవిడకి నా అన్న వాళ్ళెవరు రావడం ఇష్టం లేదని అర్థం అయ్యింది.నాకెంతో చేసిన పసి అక్క కూడా రావడం తగ్గించేసింది అందుకే.
ఆవిడకి రెండు రోజులకి తగ్గిన వెంటనే పొద్దు పోద్దున్నే బట్టలు సర్దుకుని బయలుదేరింది ఇంట్లో నుండి వెళిపోవడానికి. నేను పడుకుని ఉండే అమ్మ వచ్చి చెప్పింది. ఏంటో బట్టలు సర్దుకుంటోంది అని. మనకెందుకులేమ్మా ఆవిడ గురించి ఏదడినా పెడర్థాలు తీస్తుంది. ఏ ఊరైనా వెళుతుందేమెాలే అని అన్నాను. వాళ్ళాయన మిల్ దగ్గర నుండి వచ్చారు. మరి ఈవిడే ఫోన్ చేసిందో, లేక రాఘవేంద్ర చెప్పాడో మాకు తెలియదు. తర్వాత కార్ పిలిపించుకుని బయలుదేరితే ఈయన వద్దని తోసేసినట్టున్నాడు. వెంటనే రాఘవేంద్ర వాళ్ళ బావ మమ్మల్ని ఇంట్లో నుండి వెళిపొమ్మన్నారు. అప్పటికప్పుడు బట్టలు సర్దుకుని, పదకొండు రోజుల పసిపిల్లాడితో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. నా డెలివరీకని మామయ్య మద్రాస్ వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా, ఆయన బయట తెచ్చారని అంటే తిరిగి ఇచ్చేసాను. తర్వాత ఆయన నన్ను ఎందుకు ఇచ్చేసావు నాకు చెప్పకుండా అని అన్నారు.
రాఘవేంద్ర వాళ్ళ బావగారి మిల్ ఓనర్ గారి అబ్బాయిని అడిగి కార్ తీసుకువచ్చాడు. అంతకు రెండు మూడు రోజుల ముందే మిల్ ఓనర్ గారు తేనెటీగలు కుట్టి చనిపోయారు. బాబు పుట్టక ముందు మా పిన్ని వాళ్ళింట్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి కూడా వచ్చారాయన. బాబుని చూడటానికి కూడా వద్దామని బాబుకి డ్రెస్ కూడా తీసుకున్నారట. సడన్ గా ఆయనకు ఇలా జరిగింది.మేం కార్ లో బయలుదేరాం. ఎక్కడికి వెళుతున్నామెా మాకు తెలియదు. మెాపిదేవి సెంటర్ లో కార్ అవనిగడ్డ వైపు తిప్పితే నరశింహాపురం అనుకున్నాం. ఎక్కడికి వెళదాం సాంబక్కా అని రాఘవేంద్ర అమ్మని అడిగితే, నీ ఇష్టమంది. మా నాన్న వాళ్ళింటికి వెళదామంటే సరేనని ఏం మాట్లాడలేదు. నాన్న అంటే రాఘవేంద్ర నరశింహాపురంలో వాళ్ళ పెదన్నాన్న ఇంట్లో ఉండేవాడు కొన్నాళ్ళు. ఆయనని నాన్నే అంటాడు. ఏవో గొడవలు జరిగి తర్వాత బయటికి వచ్చేసాడు. కార్ మా ఇంటికి దగ్గరలోని పసి అక్క వాళ్ళింటి దగ్గర ఆపి దిగమంటే అప్పుడు అర్థం అయ్యింది. పసి అక్క వాళ్ళింటికి తీసుకు వచ్చాడని.
ఓ ఇరవై రోజులు పసి అక్క వాళ్ళింట్లో ఉన్నాము. పసి అక్క వాళ్ళమ్మ నాంచారమ్మామ్మ బోలెడు వెన్నపూస రాసి మౌర్యకు స్నానం చేయించేది. మా అమ్మమ్మ పాల కోసం వచ్చి బాబుని చూసి వెళుతుండేది. మా తాతయ్య కూడ వస్తుండేవాడు. ఊర్లో వాళ్ళు బాబుని చూడటానికి వచ్చేవారు. పసి అక్క, బావగారు వాళ్ళందరు ఆ ఇరవై రోజులు చాలా బాగా చూసుకున్నారు. ఆ టైమ్ లోనే సోదమ్మ వస్తే అమ్మ మళ్ళీ సోది అడిగింది. మా నాయనమ్మ వచ్చి బాబుకి తన పేరు పెట్టమని అడిగితే, నాకుంది కదా ఇంకా నీ పేరు పెట్టమంటావేంటి, పెట్టను అని అంటే కనీసం ఓ అక్షరమైనా కలిసేటట్లు పెట్టమంది. అప్పటికే మేము పేరు మౌర్య చంద్ర అని పెడదామని అనుకున్నాం. మా రెండో ఆడపడుచు ఆ పేరెందుకు పాత పేరు అని అంటే కూడా నేను అదే పెడతానని చెప్పాను. ఆ రోజు సాయంత్రం పిల్లాడు కారణం లేకుండా గుక్కపట్టి ఒకటే ఏడుపు. మాకెవరికి అర్థం కాలేదు ఎందుకేడుస్తున్నాడో. సడన్ గా గుర్తు వచ్చిందప్పుడు. నాయనమ్మ పేరు పెట్టమంటే పెట్టనని చెప్పానని. అయినా అంత కోపం రావాలా నాయనమ్మకు, పెడదామనే అనుకున్నాం కదా, అర్థం చేసుకోకుండా పిల్లాడిని ఏడిపిస్తోందని నాకు కోపం కూడా వచ్చింది. మనసులో అనుకున్నా ఈ మాటలే. అప్పటి వరకు ఆపకుండా ఏడుస్తున్న పిల్లాడు చటుక్కున ఏడుపు ఆపేసాడు. భలే నవ్వు వచ్చింది అక్కడున్న అందరికి. ఆవిడకు భ్రమత తీరలేదింకా అని అనుకున్నాం.
జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన రీజన్ కి అందవు. అలాగే మన నమ్మకాలు కూడా అంతే. నమ్మడంలో ఆనందం ఉంటే నమ్మేయడమే. అవి దేవుడా, దెయ్యమా, జ్యోతిష్యమా వంటివే కాకుండా సోది వంటివి కూడా. మనసుకి సంతోషం కలిగించే ఏ నమ్మకమైనా మంచిదే మరి.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Thanks madam for penning your experiences.
I can't imagine such hardships and pain that you have undergone.
I have learnt something new today and learned about a new word (భ్రమత ) today.
All the best .
ధన్యవాదాలు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి