31, జులై 2021, శనివారం

సంతోషం...!!

  ఈమధ్యే అనుకున్నా. ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఫోన్ లు మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా ఫ్రీ. అయినా మాటలు తగ్గిపోయాయి. అలాంటి సమయంలో, ఓపిక లేకున్నా బోలెడు సంతోషం. చాలా సంవత్సరాల తరువాత ఝాన్సీ, వసంత, విజ్జీ అమెరికా నుండి వీడియోకాల్ చేసి బోలెడుసేపు మాట్లాడటం. ఎప్పుడో చదివి మర్చిపోయిన ఇంజనీరింగ్. వాళ్ళు ఇంత కాలమైనా మర్చిపోకుండా గుర్తుంచుకుని, కాస్త సమయాన్ని నాకు కేటాయించడం చాలా చాలా ఆనందాన్నిచ్చింది. థాంక్యూ సోమచ్ ముగ్గురికి. 

27, జులై 2021, మంగళవారం

అతివ నాదం..!!

పిండంగా మారిన క్షణాల నుండే
వివక్షతో చిదిమేయాలన్న 
హీనుల చేతుల నుండి 
బయట పడటానికి
యుద్ధం ఆరంభం

పుడమితల్లి పురుడోసిన
పుత్తడిబొమ్మలకు
పూలపానుపు కాలేదిక్కడ
అమ్మ కొంగు చాటు పసితనానికి
ఆంక్షల పర్వం మెుదలైంది 

పాపాయితో మెుదలుకుని
పండు ముదుసలిలో కూడా
నగ్న దేహాలను కాంక్షించే 
నరాధములున్నంత వరకు
ఏ ఇంటి ఇంతి కాబోదు పూబంతి

బాధ్యతల నడుమ బందీగా మారినా
కుటుంబ శ్రేయస్సే తన ఊపిరిగా చేసుకుని
నిత్య అగ్నిహోత్రిగా తానుంటూ
ప్రేమాభిమానాలను పంచే 
జీవితకాలం జీతం బత్తెం లేని ఉద్యోగిని

కాల యంత్రపు మాయలోని
తడబాటును తట్టుకుని
కలికి చిలుకల్లా 
కిలకిలమనాలనుకునే
రాచిలుకల రెక్కల చప్పుడిది

విధాత చేతిలో
విరిచి వేయబడ్డ బొమ్మలై
విఫణి వీధిలో
విలాస వస్తువులుగా మారిన
జీవశ్చవాలు కొన్ని 

దశాబ్దాలుగా అడుగులు
ముందుకు పడుతున్నా
శతాబ్దాల చరిత్రను 
తిరగ రాయలేని 
నిస్సహాయత ఇది..!!

26, జులై 2021, సోమవారం

కాలం వెంబడి కలం..64


       ఇక ఆఫీస్ విషయాలంటారా! ఇంతకు ముందే చెప్పాను కదా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి ఇండియా వచ్చారని. నన్ను పిలిచి అడిగారు. USA వెళతారా అని. ఇప్పుడే వెళ్ళనండి ఓ వన్ ఇయర్ తర్వాత చూద్దాం. అదీనూ L1 వీసా చేయించండి అని చెప్పాను. అప్పటికి సరేనన్నారు. ఇండియాలో కంపెనీని బాగా ఎస్టాబ్లిష్ చేద్దామనుకుంటున్నాను. మీ హెల్ప్ కూడా కావాలన్నారు. నేనేం చేయాలో చెప్పండి చేస్తానన్నాను. ముందు నైట్ షిప్ట్ అనుకున్న జాబ్ డే షిప్ట్ లోనే కంటిన్యూ అయిపోయింది. 
          చక్రధర్ గారు ఏవో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ప్రోగ్రెస్ కనుక్కోమన్నారు. ఆఫర్ లెటర్ లో నాకు ఇచ్చిన పొజిషన్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాత్రమే. ISO డాక్యుమెంట్స్, క్వాలిటి మానేజ్మెంట్ వివరాలన్ని అనూరాధ చూసేవారు. అవన్నీ నాకు అప్పజెప్పమన్నారు. ఆవిడ ఆ డాక్యుమెంట్స్ తెచ్చి కాస్త కాస్త ఎక్స్ ప్లెయిన్ చేసారు. పూర్తిగా చెప్పేస్తే ఆవిడకి సేఫ్  ఉండదనుకున్నారనుకుంటా. అరి కేసరేమెా సుబ్బరాజు తన చుట్టాలను కూడా నమ్మరని, తన మాటకే విలువనిస్తారని, నాకు చెప్పడం ఎందుకో నాకు అర్థం కాలేదప్పుడు. మా హింది టీచర్ గారి చుట్టాలబ్బాయి జాబ్ అడిగితే రెజ్యూమ్ హెచ్ ఆర్ మానేజర్ మిలీకి ఇచ్చాను. ముందు వరప్రసాద్ గారికి చెప్పాను. ఇంటర్వ్యూ చేసారు. వరప్రసాద్ ఎంత తెలివిగా చెప్పారంటే తన రెజ్యూమ్ నాకు తిరిగి ఇచ్చేస్తూ, మీ దగ్గరనే ఉండనివ్వండి మేడం- మనకు ఆ ప్రాజెక్టు వచ్చాక తనని తీసుకుందాం అని చెప్తే అప్పట్లో అది నిజమని నమ్మాను. తర్వాత అర్థమయ్యింది ఎవరి ఆట ఏమిటన్నది. 
           నేను ఆఫీస్ లో జాయిన్ అయిన మూడు నెలలకు ఆఫీస్ అంతా కాస్త సిస్టమాటిక్ గా అయ్యింది. అంతకు ముందు ఎవరిష్టం వారిది అన్నట్టుగా ఉంది. అందరు ఏదోక రికమండేషన్ తో జాయిన్ అయిన వారే. అందరు బాగా  అలవాటయ్యారు. కొందరేమెా నా వెనుక జోకులు వేసుకునే వారు. పని చేయాలంటే కష్టమే కదా ఎవరికైనా. అప్రైజల్ కోసం చక్రధర్ గారు ఒక్కొక్కరిని పిలిచి వివరాలు అడగడం మెుదలుపెట్టాక, మధ్యలో నన్ను పిలిచి, అక్కడ ఉండమన్నారు. అందరివి అయ్యాక నన్ను ఏం చేస్తున్నారు అని, అప్పటికే నేను మార్చిన రిజిస్టర్ లో సంతకాల గురించి పాయింట్ అవుట్ చేసారు. మనవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు కదా. ఐడి కార్డ్ ఒకరిదొకరు స్వైప్ చేసేవారు. కొందరు ఆఫీస్ కి రాకున్నా మరొకరితో చేయించేవారు. వాటికి చెక్ పెట్టించాను. మరి ఈయనకెందుకో నామీద కోపం నాకు తెలియలేదు. అలా చాలాసేపు తిట్టినట్టు తెలియకుండా నన్ను తిట్టారు. నేనేం పట్టించుకోలేదప్పుడు కూడా. పని చేయడం, ఏం చేసానన్నది డైలీ వర్క్ షీట్ సబ్మిట్ చేయడం జరుగుతోంది కదా. నేనేం చేస్తున్నానన్నది తెలిసి కూడా ఇలా ఎందుకు అడుగుతున్నారన్నది అర్థం కాలేదు. కాని ఆ సాయంత్రమే అరి కేసరి మీటింగ్ పెట్టి, చక్రధర్ నన్ను అడిగిన ప్రతిదానికి ఈయన సమాధానం చెప్పారు. కాని నేను అప్పటికి అరి కేసరికి జరిగిన విషయం ఏమి చెప్పలేదు. 
      ఆ రాత్రి అంతా నిద్ర పోలేదు. ఆలోచిస్తే బాధ అనిపించింది. చాలాసేపు ఏడ్చేసాను, నా తప్పేం లేకుండా నన్ను ఎందుకు ఇన్ని మాటలన్నారని. పోని నాకేమన్నా అప్రైజల్ ఇస్తారా అంటే అదీ లేదాయే. మరుసటి రోజు అరి కేసరితో ఇదే మాట చెప్పాను. చక్రధర్ నన్ను అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పేసారు. నామీద ఆయనకెందుకంత కోపమెా నాకు తెలియదు అని. నేను చెప్పానండి మీతో వారికి సంబంధం లేదని. మరెందుకిలా చేసారో నేను చూసుకుంటాలెండి అని అరి కేసరి చెప్పారు. చక్రధర్, వరప్రసాద్ ఇద్దరూ ఓ రూమ్ లోనే ఉండేవారు. నన్ను తిట్టినవన్నీ వరప్రసాద్ నవ్వుకుంటూ విన్నారు. మధ్య మధ్యలో జోక్స్ కూడానూ. అప్పటి నుండి ఆఫీస్ రాజకీయాలను అర్థం చేసుకోవడం మెుదలుబెట్టాను. అప్పటికి పై వారి నుండి ఈ బాబులకు కాస్త అక్షంతలు పడ్డాయని తెలిసింది. ఇన్నాళ్ల నుండి మీరు చేయలేనిది ఆడపిల్ల చేసిందని అన్నారని తెలిసింది. ఆ కోపం ఇలా నామీద చూపించారన్న మాట. ఏ రోజు వర్క్ ప్రోగ్రెస్ ఆ రోజు ఈవెనింగ్ కంతా అందరు రిపోర్ట్ చేయాలన్న నియమం పెట్టి వర్క్ షీట్ పంపండం, అటెండెన్స్ అబ్జర్వ్ చేయడం, ఫోన్ మాట్లాడటం కంట్రోల్ చేయడం వగైరా పనులన్నీ అందరికి నచ్చవు కదా మరి. అదీ కాకుండా మెుత్తం ఎంప్లాయీస్ డేటా అంతా నా దగ్గర ఉండేది. హెచ్ ఆర్ వాళ్ళు కూడా వివరాలు నన్ను అడుగుతుండేవారు తర్వాత తర్వాత. అలా మనకి ఆఫీస్ లో మిత్రులతో పాటుగా శత్రువులూ పెరిగాన్న మాట. 

" రానిది నేర్చుకోవడంలో తప్పులేదు. కాని ఎదుటివారి నాశనం కోరుకుంటే మన వినాశనం తప్పించుకోలేం. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

24, జులై 2021, శనివారం

ఏక్ తారలు..!!

1.   గుర్తు చేసుకోవడానికి నువ్వేమన్నా జ్ఞాపకానివా_జీవితమైతేనూ..!!
2.  భాషణం భూషణమైంది_మౌనం మనసైనదైనప్పుడు..!!
3.  నీ నా తారతమ్యమెందుకు_మౌనాక్షరాలు మన మధ్య బంధమైనప్పుడు..!!
4.  ఆత్మీయతలున్న చోట అస్తిత్వమెందుకు?_మనమన్న మమతలు చాలుగా...!!
5.   దాచినా దాగదు మనసు_అక్షరాల్లో గతాన్ని వల్లెవేస్తూ...!!
6.   కాలానికి మనతో పని లేదు_బాధల గాథలను వెంటేసుకు పోతుందంతే...!!
7.   వినాలి గాని కలత కబురులెన్నో చెబుతుంది_మనసు తెలిసిన మార్మిక నేస్తమై...!!
8.   అద్భుతమే నాకెప్పుడూ_అనంత శూన్యాన్ని అక్షరాలకెలా అందిస్తారా అని..!!
9.   విప్పి చెప్పలేని వ్యధలు కొన్ని_మనసుని గదమాయిస్తూ...!!
10.  మానసిక ధైర్యం అవసరమే_మౌనం వీడి మాటలతో సమాధానం చెప్పాలంటే..!!
11.  మనసు కన్నీళ్ళవి_అక్షర జలపాతాలై అవిష్క్రతమౌతూ..!!
12.   మాటను దాచేసింది మౌనం_అక్షరాల్లో మనసును కనబడనీయక...!!
13.  పన్నీరుగా మారాలన్న ఆకాంక్ష చెలిమిది_కన్నీటి మూల్యమెరిగినది కనుక...!!
14.  కొన్ని కన్నీళ్ళంతే_మనసు భారాన్ని కడిగేస్తూ..!!
15.   వాస్తవమెుక నిజమే_భవిష్యత్తుకు జాగురూకత నేర్పుతూ..!!
16.  ఇవ్వద్దనుకుంటూనే ఇచ్చేసా_తిరిగి ఇవ్వలేవని తెలిసీ..!!
17.   సిరా చుక్క ఒలికింది_మనసు కన్నీళ్ళు తనలో కలిసాయని..!!
18.   అక్షరాలోచనకు అంకురార్పణ జరిగింది_ఓరిమి వహించిన మనసులో..!!
19.   నీకనే ఇచ్చాను_మరచిపోతావని తెలియక..!!
20.   శాపమూ వరమైందిలా_కలల చుక్కలకు కల'వరమై..!!
21.   బలహీనత మనసుదే_కాలం నేర్పిన విద్యను గ్రహించలేక..!!
22.   అలుపెరగని పయనమే ఇది_అక్షరాలకు అంకితమయ్యాక..!!
23.   మనసులోని మౌనానికెప్పుడూ మాటలే_నీకు వినబడాలన్నంత ఆరాటంతో..!!
24.   మాటల అల్లరి నీతోనే ఉందిగా_మౌనలిపితో పనేముందిక..!!
25.   జీవితపు ఆటుపోట్లు తప్పనిసరి_కాలమాగినట్లు మనకనిపించినా..!!
26.   ఓటమి చప్పుడు వింటున్నా_గెలుపు పిలుపుని ఆహ్వానించడానికి..!!
27.   శిథిలాలు సాక్ష్యాలుగా కనబడుతూనే ఉన్నాయి_మనసు కార్చిన మౌనకన్నీటికి...!!
28.   మనసు చెమ్మ మౌనం వీడింది_గాయాల గురుతులతో అక్షరాలను అలంకరిస్తూ..!!
29.  ఎగిసిపడే అలలెన్నో_తీరం చేరని జీవితాల్లా..!!
30.  ఎగిరే ఆశలే అన్నీ_పెనుగాలికి చెల్లాచెదురౌతూ..!!

23, జులై 2021, శుక్రవారం

రెక్కలు

1.   గాయాలు
బోలెడు
జ్ఞాపకాలు
స్వల్పమే

ఏదేమైనా
కాలం దాటేసిన గతమది..!!

2.  అలలకు
ఆరాటం
తీరమేదో
తెలియదు

సముద్రం లోతైనది
మనసులానే..!!

3.  మార్చలేని
తలరాత
మార్పులేని
మనసు రాత

అర్థం కాని
విధాత రాతలివి..!!

4.  అపనిందల
ఆర్భాటాలు
అహంకారపు
పెద్దరికాలు

నిస్సహాయతలో
అనుబంధపు అగచాట్లు..!!

5.  హాలాహలమూ
అమృతమూ
రెండూ
పాలసముద్రం నుండి పుట్టినవే

వ్యత్యాసం 
వాటి సహజ లక్షణం..!!

6.   మనసు
గాయమది 
మరుపు
తెలియదు

కలత పడుతూ
కన్నీటి కావ్యాలౌతున్నాయి మనసాక్షరాలు..!!

7.  అమ్మ నేర్పిన
అక్షరమే
ఓదార్పుగా మారి
ఊతమయ్యింది

ఒడిదుడుకులను
దాటే నేర్పునిచ్చింది..!!

8.  ఆత్మీయత పంచేది
అమ్మవొడి
ఆలంబనగా మారింది
అక్షరం

పరమార్థం
పరమాత్మకు ఎరుక..!!

9.  అనుబంధాలకు
వారధి
సన్నిహితాలకు
చేరిక

పుట్టుక పరమావధి
అర్థం అంతరార్థమిది..!!

10.   ఏ ఇంపైనా
అక్షరానిదే
క్రమం
తెలియాలంతే

సాహిత్యానికి రాహిత్యానికి
సన్నిహితం భావమైనప్పుడు..!!

11.   విన్యాసం
విలక్షణమైనది
సన్యాసం
కొందరికే సాధ్యం

సదూపదేశం 
గురువు అనుగ్రహం..!!

12.   నెయ్యమైనా 
కయ్యమైనా 
మనసుకు 
అనిపించాలి

అక్షరం
పరబ్రహ్మ స్వరూపం..!!

13.   మాటైనా
మౌనమైనా
తప్పుకు
ఒప్పుకు సమానమే

విలువ
వాడకాన్ని బట్టి ఉంటుంది..!!

14.   అనుకోని
సంఘటనలు
అనాలోచిత
నిర్ణయాలు

అస్తవ్యస్థ 
జీవితాలు..!!

15.   వాదించడం
అస్సలు రాదు
వేదించడం
బాగా తెలుసు

మూర్ఖుని
నైజమంతే...!!

16.   అడుగులు
ఆచితూచి వేయకపోతే
జీవిత కాలం
మూల్యం చెల్లించాల్సిందే

నేర్చుకున్న
పాఠాలు వ్యర్థమే..!!

17.  పడినా
లేవడం అనివార్యం
గాయాలు
సర్వసాధారణం 

అక్షర సంచారం
ఆత్మానంద కారకం..!!

18.   నిబద్ధత 
నిజాయితీది
అసహనం
అబద్ధానిది

దాయాలన్నా 
దాగని జీవితాలు కొన్ని..!!

19.   గతాన్ని
జ్ఞాపకాలను
జీవితానికి 
ఊయలగా వేసింది కాలం

దిగులుకూడు
తినక తప్పదు మరి..!!

20.   వీడిపోవు 
గురుతులు
వాడిపోవు
ఆస్వాదనలు

కాలం చెప్పని కథే
మనసు నేర్వని మరుపు..!!

21.   మనసు
లేకపోయినా
మనిషిగా
మిగలకపోయినా 

గాయమైన జ్ఞాపకానికి
మరుపునివ్వలేదు కాలం..!!

22.   పరిచయం
పాతదే
జ్ఞాపకాలు
కొందరికే

గతాన్ని 
వెంటేసుకున్న కాలం..!!

23.  కాలిపోతున్న
కలలు
రాలి పడుతున్న
చుక్కలు

అందని ఆకాశం
కొన్ని ఆశలు...!!

24.  విలువ తెలియాల్సినది
మనిషికి
చేజార్చుకున్న క్షణాలు
తిరిగిరావు

కాలమెప్పుడూ 
వెనుదిరగదు..!!

25.   బంధం
ఓ బాధ్యత 
అవసరం
క్షణకాలం కోరిక

సంద్రానికి కట్టడి వేయడం
సాధ్యం కాదు..!!

26.   కోల్పోయిందేది అన్నది
కాదు ముఖ్యం
వెళ్ళాల్సిన చోటు
తెలుసుకోవడం అవసరం

గమ్యానికి తగినట్టుగా
గమనముండాలన్నది సత్యం...!!

27.   చెదిరిపోవడం
చక్కబడటం
కాలానుగుణంగా
జరుగుతుంది

ఎవరి గమ్యమేమిటన్నది
నిర్దేశించిన లక్ష్యమే..!!

28.   అనుకోని
అవాంతరాలు
భారమైనా
తప్పని పయనం

కాలం విసిరెళ్ళిన
జ్ఞాపకాలతో...!!

29.  కాలానికి
దేనితోనూ పని లేదు
మనిషికి
అన్ని కావాలి

యెాగం
అందరికి దక్కని యాగఫలం..!!

30.  ఆసరా
అవసరమే
అమ్మకైనా
అమ్మకానికైనా

ఏకాకి జీవితాలకు
అర్థం కాని సత్యమిది..!!

ద్విపదలు..!!

1.  ఏ అలంకారామూ తెలియదు
అనుభవాలను అక్షరాలకప్పగించడం తప్ప..!!
2.  తలపుల నిండా నువ్వున్నందుకేమెా
ప్రతి పదమూ నీ అక్షరార్చనలోనే  తరిస్తోంది ఆరాధనతో..!!
3.   అనుభవాలను అవపోసన పట్టిన జీవితమది
ఆత్మాభిమానమే విలువైన సంపదగా తలచి..!!
4.  ఆగిపోయానక్కడే అదేంటో
గతాన్ని వీడని జ్ఞాపకం నువ్వనేమెా..!!
5.   మనసుది తీరని బాధేమో
అక్షరాలకు బదిలీ చేస్తూనేవుంది..!!
6.  ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం పోయేదేముంది
గుప్పెడు అక్షరాల్ని గుమ్మరించిపోతుంది కలం కాలంతో కలిసెళుతూ…!!

22, జులై 2021, గురువారం

యెాగరేఖలు పుస్తక సమీక్ష

" అద్వైతంలో ఆత్మానందం ఈ యెాగరేఖలు "

       రాయడం అనేది ఓ ప్రత్యేకమైన కళ. అదీ సాహిత్యంలో విభిన్న ప్రక్రియలలో పలు అంశాలను చదువరులు మెచ్చే విధంగా రాయగలగడం పూర్వజన్మ సుకృతం. చదువులో డాక్టరేట్ పట్టా పొందిన డా. పి విజయలక్ష్మి పండిట్ గారిది తెలుగు సాహితీ రంగంలో ఓ ప్రత్యేకమైన శైలి. కథలు, కవితలు, దీర్ఘ కవితలు, అనువాద రచనలే కాకుండా తెలుగులో గజళ్లు రాయడంలో కూడా పలువురి ప్రశంసలు అందుకున్నారు. దానికి సాక్ష్యంగా వీరు వెలువరించిన " యెాగరేఖలు " విశ్వపుత్రిక గజళ్లుగా మన ముందున్నాయి. 
     " విశ్వపుత్రికకు సుఖదుఃఖాలు ఎన్ని ఎదురైనా
       నా ఆత్మజ్ఞానాన్ని ఇలలో పండించుకుంటాను!! "
అన్న ఈ రెండు పాదాలలో ఈ " యెాగరేఖలు " పుస్తకంలో ఏముందో మనకు అర్థమైపోతుంది. భక్తునికి, భగవంతునికి మధ్యన అనుసంధానం భగవంతుని ధ్యానంలో తాదాత్మ్యమైన మనస్సు. మనసు నిశ్చలమై భగవధ్యానంలో ఉన్నప్పుడు కలిగే ప్రతి అనుభూతి మనకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అది ప్రేమ, విరహం, నిరీక్షణ, నివేదన, బాధ, సంతోషం, మైమరపు, కోరిక ఇలా ఏదైనా కావచ్చు. పరమాత్మలో ఆత్మను దర్శించే అపురూప భావాలను అక్షర రూపంలో అందంగా, హృద్యంగా అందించారు. మేఘాల మెరుపులను, చినుకుల సవ్వడిని, ధనుర్మాసపు దైవ కార్యాలను, విరహపు తాపాలను, అంతులేని ఆరాధనను ప్రేమగా అక్షరాలకు పంచేసి, తనతో పాటుగా మనల్ని కూడా ఆ ప్రేమ పారవశ్యములో ముంచేసారు. 
  " నన్ను నేను కోల్పోయి నీ చైతన్యమైన వేళ 
    అద్వైత సిద్ధి అనుభవమై తరించాను ప్రభు!! "
అంటూ తనలోని తాత్వికను సంతృప్తి పరుచుకుంటారు. 
  " పరమాత్మా నీవే విశ్వపుత్రిక అంతిమ మజిలీవి 
    నన్ను కోల్పోయి నీవయిపోవడం నాకానందం!! " 
అని తన ఆత్మానందాన్ని పంచుకున్నా
" నాలో నిండిన ప్రకృతి శక్తి నీవే కదా
  ఏమివ్వగలను ఆ పరాశక్తికి కానుకగా!! " అన్న భావనను తనలోని భక్తికి పరాకాష్టగా మనం చూడవచ్చు. ఇలాంటి భక్తి పారవశ్యపు భావాలు గల గజళ్లు ఈ పుస్తకంలో కోకొల్లలు. 
  " నీకై తపించే సత్యాన్వేషణే కదా నా నిజమైన విద్య
    నిను తెలియని విశ్వపుత్రిక జ్ఞానమెందులకు ప్రభూ!! " ఎంత పరిణితి కలిగిన భావనలో చూడండి.
ఇలాంటి ఎన్నో అద్భుతమైన భావనలు ఈ యెాగరేఖలు మనకు అందిస్తాయి. 
           చక్కని తెలుగు పదాలతో, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ పై భక్తిని, అనురక్తిని, అపారమైన ప్రేమామృతాన్ని, అలౌకికానుబంధాన్ని తెలపడంలో మీరాబాయిని తలపించారు. రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలిని " అపూర్వగానం " పేరుతో తెలుగులోనికి అనువదించారు. యెాగరేఖలు పై ఆ ప్రభావం చాలా ఉంది. ఈ పుస్తకం ఆసాంతం చదివిన మనకు ఓ అవ్యక్తానుభూతి కలుగుతుందని మాత్రం చెప్పగలను. అందమైన ఆధ్యాత్మిక భావాలను " యెాగరేఖలు " గా అందించిన డా పి విజయలక్ష్మి పండిట్ గారికి హృదయపూర్వక అభినందనలు. 

యెాగరేఖలు | Gotelugu.com

యెాగరేఖలు | Gotelugu.com: యెాగరేఖలు

19, జులై 2021, సోమవారం

కాలం వెంబడి కలం..63

      జనవరి 23న మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ అనుకున్నాము. మా నరశింహాపురం ఊరిలో పూర్వం అందరూ బాగా చదువుకున్న వారే ఉండేవారు. నాన్న అందరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పట్లో మా ఊరు అంటే బయట చాలా విలువ కూడా ఉండేది. ఏ గొడవలు వచ్చినా ఊరి పెద్దలు పరిష్కరించేవారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన దాఖలాలు లేవు. రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా ఊరంతా ఓ మాట మీద ఉండేవారు. ఇప్పుడంటారా రోజూ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతూనే ఉంటారు దేనికోదానికి. పక్కవాడి బాగు చూడలేని అసూయాద్వేషాలు, పనికిమాలిన సంబంధాలు, ఏలిముద్రల పెద్దరికాలు, పెళ్ళాలున్నా పరాయిదాని కోసం వెంపర్లాటలు, అది ఇది అని లేకుండా దిక్కుమాలిన తిరుగుళ్ళు, ఎయిడ్స్ రోగులు ఇది ఇప్పటి పరిస్థితి. 
                  మండలి బుద్ధప్రసాద్ గారు, మంతెన నరసరాజు గారు, రేపల్లె దేవినేని మల్లికార్జునరావు గారు, అప్పటి కృష్టాజిల్లా కలక్టర్ నవీన్ మిట్టల్ గారు ఇంకా మా కోడూరు మండలం రాజకీయ నాయకులు, మా ఊరి పెద్దలు అందరిని పిలిచారు. నేను నా నేస్తాలను పిలిచాను. ఆఫీస్ లో కూడా అరి కేసరిని, చక్రధర్, వరప్రసాద్, కృష్ణకాంత్ సర్ వరకునే పిలిచాను. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి ఇండియా వస్తే తనని కూడా పిలిచాను. అరి కేసరి అన్నారప్పుడు సుబ్బరాజుతో కూడా ఫండ్ ఇప్పిస్తాను అని. నేను అవసరం లేదండి. ప్రస్తుతానికి బయటివారి నుండి ఏమి తీసుకోవడం లేదండి. ఊరికి సంబంధించిన వారి నుండినే అని చెప్పాను. విజయనగరం నుండి నా చిన్ననాటి నేస్తం వాసు మాత్రమే వచ్చాడు. చాలామంది చుట్టపక్కల ఊళ్ళవారు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రోబ్లంతో నవీన్ మిట్టల్ గారు రాలేదు. 
                ఆలూరి లక్ష్మీనారాయణ పెదనాన్న ఆ రోజు ప్రొద్దుట ఇంటి దగ్గర నన్ను పలకరించడానికి వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ, ఈ ట్రస్ట్ అసలు ఎందుకు, ఏమిటన్నది వివరంగా అన్ని చెప్పాను. అమ్మానాన్న లేని, ఆర్థిక స్థోమత లేని పిల్లలు చదువుకోవడానికి మా వంతుగా చేసే పని అని.  ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి, వాళ్ళ అబ్బాయితో మాట్లాడి లక్ష రూపాయలు ఇస్తానని అప్పటికప్పుడు చెప్పారు. ఉప్పల శ్రీను, తన ఫ్రెండ్స్ కలిపి మూడు లక్షలు, యాభైవేలే అనుకున్న మేమూ ఓ లక్ష, మా గోపాలరావు అన్నయ్య పాతికవేలు, లైబ్రరీ ప్రసాద్ గారు ముప్పైవేలు, ముమ్మనేని ప్రకాశరావు గారు పాతికవేలు, మా రాజా అన్నయ్య కూడా అప్పట్లో ఓ పాతికవేలు ఇస్తానన్నట్టు గుర్తు. అలా అంతా కలిపి ఏడు లక్షల చిల్లర వచ్చింది. దానిలో ఆ సంవత్సరానికి కొందరు పిల్లలకు ఇచ్చి, ఓ ఐదు లక్షలు డిపాజిట్ చేసాము. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. కొంత కాలంగా మాట్లాడని పసి అక్కని ఫంక్షన్ కి వచ్చినప్పుడు నేనే పలకరించాను. ఫంక్షన్ కి వచ్చిన అందరు చాలా బాగా మాట్లాడారు.నరసరాజు అంకుల్, మా రాధ పెదనాన్న, లక్ష్మీనారాయణ పెదనాన్న, ఇంకా పెద్దలు అందరు చక్కగా మాట్లాడారు. బుద్ధప్రసాద్ గారు ఫంక్షన్ అయ్యాక వెళిపోతూ, నా దగ్గరకు వచ్చి ఎప్పుడు నీకేం కావాలన్నా అడుగమ్మా, చేసి పెడతాను అని చెప్పి వెళ్ళారు. చేసిన పొరపాటు ఏంటంటే మా కోటేశ్వరరావు మామయ్యని స్టేజ్ మీదకు పిలవక పోవడం. ఆయన డాక్టర్ గా మా పక్క ఊరు కోడూరులోనే హాస్పిటల్ పెట్టి అందరికి అందుబాటులో వైద్యం చేస్తున్నారు. మా మామయ్య తనని స్టేజ్ పైకి పిలవలేదని కూడా పట్టించుకోలేదు. అది ఆయన మంచి మనసు. మా ఊరిలో అందరు టీచర్లుగా, ఇతరత్రా ఉద్యోగాల్లో బాగానే స్థిరపడ్డారు కాని, దాతృత్వగుణం కాస్త తక్కువే. అప్పటికే నేను, నావాళ్ళు అన్న స్వార్థం బలంగా వేళ్ళూరుకుంది. మేమదే అనుకున్నాం పిలిచామని దూర ప్రాంతాల నుండి కూడా కొందరు వచ్చారు, అదే సంతోషమనుకున్నాం. ఈ ఫంక్షన్ అంతా చూసి మా వాసు చాలా సంతోషపడిపోయాడు. అలా 2008 లో మెుదలైన మా ట్రస్ట్ కార్యకలాపాలు ఇప్పటి వరకు నిర్విఘ్నంగా  జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ట్రస్ట్ రిజిస్ట్రేషన్, సంవత్సరం అయ్యాక మరోసారి అందరం అలా కలిసాము. ప్రతి సంవత్సరం మా వంతుగా చేయడం మాత్రం మానలేదు. కరోనా కారణంగా క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఇవ్వలేదు. 

" పొరపాటు మానవ సహజం. అది తెలుసుకున్న వారు సమాజానికి మంచిని పంచినట్లే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

17, జులై 2021, శనివారం

కొన్ని నైజాలు..!!

నేస్తం, 
         మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో ప్రతి పరిచయం మనకు ఏదోకటి నేర్పుతూనే ఉంటుంది. కొందరు మన సహనాన్ని, ఓర్పుని పరీక్షిస్తారు. మరి కొందరు మనల్ని వారి స్వార్థం కోసం కోసం వాడుకుంటారు. చాలా తక్కువ మంది నిస్వార్థంగా మనల్ని అభిమానించి ప్రేమిస్తారు. ఎక్కువ శాతం మంది మనకు ప్రతి క్షణం ఏదోక పాఠాన్ని నేర్పుతూనే ఉంటారు. కనీసం ఒక్కరయినా మన జీవితంలో నిజాయితీగా మన కోసమే అని అనుకోవడానికి దొరికితే ఎంత బావుంటుందో! అదే మన జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయం అవుతుంది కూడా. ఇవన్నీ అందరు చెప్తుంటే మనం విన్న విషయాలే. 
          ఈరోజుల్లో రక్త సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాలు, పిల్లలు, స్నేహితులు వగైరా మానవ సంబంధాలన్నీ ఆర్థికానుబంధాలుగానే మారిపోయాయి. అవసరానికి రంగులు మార్చుకునే ముఖాలే మనకు ప్రతి చోటా తారస పడుతున్నాయి. ఊసరవెల్లి తనను తాను రక్షించుకోవడానికి రంగులు మార్చుకుంటుంది. ఈ మానవ నైజాలు వారి అసలు రంగు బయట పడకుండా చాలా నేర్పుగా మాటలతో, తమ చేతలతో ఎదుటివారిని నమ్మించి మెాసం చేస్తారు. 
                అనుక్షణం వారితో వారు నటిస్తూనే బతుకుతూ, అదే నీతి నిజాయితీలు గల బతుకన్న భ్రమలో ఉంటారు. అనుబంధాలను కూడా అంగడి సరుకులుగా చూడటం వీరి సహజ లక్షణం. క్షణం తీరికా ఉండదు. దమ్మెడు ఆదాయమూ ఉండదన్నటుగానే ఉంటుంది వీరి బతుకు. బాధ్యతా రాహిత్యానికి సాక్ష్యాలుగా బతికేస్తుంటారు. పావలాలో పావు భాగం కష్టపడి అదే అతి పెద్ద విజయమన్న భ్రమలో తాము బతుకుతూ, తమ చుట్టూ ఉన్న భజనపరుల్ని కూడా ఆ మాయలోనే ఉంచేస్తారు. తన అవసరాలకు అప్పులు చేయడాన్నే తమ సంపాదనగా భావిస్తూ, అదో పెద్ద ఘనకార్యంలా అనుకుంటూ, అహంకారంతో బతికేస్తుంటారు. కుటుంబాన్ని బద్ద శత్రువులుగా భావించే కొందరు, బయటివారికి ఇచ్చే విలువలో క్షణంలో వెయ్యెా వంతు కూడా ఇంటి వారికి ఇవ్వరు. జనాలకి చెప్పే సూక్తిసుధలు మాత్రం కోటలు దాటేస్తుంటాయి. అన్నం పెట్టిన చేతిని కాటేసే విషపు సంస్కారం నేర్పిన పెంపకానిది తప్పో, ఇలాంటి నీచ నైజాలను కన్న అమ్మాబాబులది తప్పో ఆ భగవంతునికే తెలియాలి. 
     " నిన్ను మనిషిగా నిలబెట్టిన కుటుంబానికి నువ్వు ఇచ్చే విలువ మీద నీ సంస్కారం ఆధారపడి ఉంటుంది. "

కొంతదూరం వచ్చాక సమీక్ష

" సహజత్వానికి సున్నితత్వానికి మధ్యన.. "

    "శూన్యంలో 
     నిలిచిన
     నిశ్శబ్ద శిలలు

      గత చరిత్ర సాక్ష్యాలు.." 

    నిజమే ఈ మాట. గతం లేని చరిత్రా లేదు, వర్తమానం వెంటబడుతూ, భవిష్యత్తు పై ఆశతోనే మనిషి మనుగడ, జీవనం ముడిబడి ఉన్నాయన్నది అక్షర సత్యం. చాలా సందర్భాల్లో ఆ సందిగ్ధాల నుండి జనించినదే కవిత్వం కావచ్చు. 
      అక్షరాలను పేర్చుకుంటూ పోతే అది రచన అవుతుందేమెా కాని నలుగురిని చదివించే రచన అవదు. రాయడం ఏముంది చాలా తేలిక అనుకుంటారందరు. కాని ఆ రాతల వెనుక ఎంత అంతర్మధనం ఉంటుందో రచయితకు మాత్రమే తెలుస్తుంది. గుండె భారాన్ని దింపుకోవడానికో, మనసును మరలించే ప్రయత్నంలోనో మంచి రచనలు వెలువడతాయన్నది మన పెద్దలు చెప్పిన సత్యవాక్కులు. అది అక్షరాల నిజమని లక్ష్మీ కందిమళ్ళ నిరూపించారు తన రెండు కవిత్వ సంపుటాల ద్వారా. రెప్పచాటు రాగంలో పలికించిన సున్నితత్వాన్ని దాటి పోనివ్వకుండా, అదే శైలిని కొంతదూరం వచ్చాక కవిత్వ సంపుటిలోనూ అనుసరించారు. ఏదో అలా నాలుగు కవితలు చదివి తర్వాత తీరికగా చదువుదామనుకున్న నా చేత ఆపకుండా చదివించడమే కాకుండా, మరో రెండు మూడు సార్లు తిరగవేసేలా చేసింది. అందుకు లక్ష్మికి హృదయపూర్వక అభినందనలు. 
           తనలోని అక్షర తృష్ణను అద్యంతమూ అద్భుతంగా "" కొంతదూరం వచ్చాక " వెనక్కి తిరిగి వెళ్ళలేక ఊపిరాడని అలజడిని అంతా శూన్యాకాశంలోకి బట్వాడా చేసినట్లుగా మనసు ఘర్షణలను, సంఘర్షణలను అక్షరాల్లోనికి అతి లాఘవంగా చేయి తిరిగిన రచయిత్రిలా ఒంపేసారు. బాధలను, వేదనలను, సంవేదనలను, నిరీక్షణలను, సహజ దృశ్యాలను, తన దృక్పథాలను, కోరికలను, కలలను, కల'వరాలను, రహస్యాలను,మసుగులను ఇలా ప్రతి చిన్న అనుభూతిని తన మనసు స్పందించినట్లుగా అక్షరీకరించారు. 
        ఖాళీ అవుతున్న వర్తమానాన్ని తన అక్షర భావాలతో పూరించాలన్న ప్రయత్నంలో 
" ఒక 
   కొత్త వాక్యం
    కావాలిప్పుడు" అంటూ 
" కాలం 
  మనిషిని మింగేస్తూ ఉంటుంది...
  ...
  అయినా
  శతాబ్దాల నిరీక్షణ
  ఆ నీలి సముద్రంది 
  నీ కోసం..!! "
నీలి సముద్రం కవితలో ఈ పాదాలు ఎంత బాగా ఉన్నాయెా చూడండి. ఇలాంటి ఎన్నో పద బంధాలు, చిన్న చిన్న వాక్యాలు బోలెడు ఈ కవితా సంపుటిలో ఉన్నాయి. 
         ఆమె/ఆమే
" ఆమె పిచ్చిదే మరి
  వసంతంకై వంటి చూస్తూనే ఉంటుంది
  ఎండిన మాను కూడా చిగురిస్తుందన్న ఆశతో

 సహజమైన పరిమళంకై 
పాదు తీసి నీరు పోస్తూనే ఉంటుంది
ప్రతిరోజూ... "

ఈ చిన్న కవితలో వివరించి చెప్పడానికి ఏమి లేకుండా తేటతెల్లంగా సరళమైన భాషలోనే స్పష్టంగా చెప్పేసారు. 
       ఎక్కువగా నదులతోనే తన భావాలన్ని పలికించారు. రైతుబిడ్డ మూలాలను మరిచిపోకుండా ఆ భావాలను పలికించారు. అమ్మ దూరమైన క్షణాలను బోసిబోయిన వాకిట్లో ముగ్గు లేదని చెప్పడం, నాన్న, నాన్నమ్మ ప్రేమలను, స్నేహాన్ని, అనుబంధాలను, అభిమానాలను, ఆరాధనా, నిరీక్షలను చూపడమే కాకుండా మరణాన్ని, బూడిదకు, విభూదికి తేడా ఏంటని ప్రశ్నించడం వంటి తాత్వికతను కూడా తన కవితల్లో స్పృశించారు. 
" కాలం విశ్రాంతి తీసుకోదట, మనల్నే విశ్రాంతి గదికి పంపుతుందట.. "ఎంత బాగా చెప్పారో చూసారా. 
        ముగింపు తెలియని కథలకి ముగింపు వాక్యాలుండవన్నట్లుగా,
" వాక్యం 
వవలసబుుతువైంది
మబ్బులనెత్తుకుని  పోతూ.. " అంటారో చోట. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు భావాలున్నాయి ఈ పుస్తకం నిండా. 
           రచనకు క్లిష్టమైన పదాలు, అర్థం కాని సమాసాలు, అలంకారాలు అవసరం లేదని లక్ష్మీ కందిమళ్ళ రెండు కవిత్వ సంపుటులు నిరూపించాయి. వాడుక పదాలతో, సరళమైన భావాలను సున్నితంగా చెప్పడం, తనదైన ప్రత్యేక శైలితో చిన్న చిన్న కవితల్లోనే శూన్యాన్ని, ఆకాశాన్ని మనకందించే ప్రయత్నం చేయడం అభినందించదగ్గ విషయం. మనసుని చదివే ప్రయత్నం మనమందరం తప్పకుండా చేయాలి. చక్కని కవిత్వాన్ని "కొంతదూరం  వచ్చాక.. " ద్వారా అందించిన లక్ష్మీ కందిమళ్ళ కు హృదయపూర్వక శుభాభినందనలు.

మంజు యనమదల 
విజయవాడ. 

15, జులై 2021, గురువారం

కొంతదూరం వచ్చాక | Gotelugu.com

కొంతదూరం వచ్చాక | Gotelugu.com: కొంతదూరం వచ్చాక

12, జులై 2021, సోమవారం

మనకో న్యాయం...!!

పుట్టుక ఏదైనా
మరణం అనివార్యం

జన్మతః కులమన్నది సంక్రమించడం పరిపాటి
మతమన్నది మన ఇష్టం

మాట జారితే తీసుకోలేము
రాత తప్పు పడినా మార్చలేము

పరమత సంప్రదాయాలను గౌరవించడం సంస్కారం
ఆచార వ్యవహారాలను కించ పరచడం కుసంస్కారం

మన అవసరానికి నోటి మాటలు చేతి రాతలు
అదుపు తప్పితే పర్యవసానమేమిటన్నది తెలియాలి

రాజకీయ ప్రాపగాండా కోసమెా
గొప్పల కోసం వెంపర్లాడితే ఫలితమింతే

మార్చుకోలేని మన జన్మమిదన్న
ఏడుపు అన్ని వేళలా మంచిది కాదు

ప్రశ్నించడం మనకు తెలిస్తే
సమాధాన పరచడం పైవాడికి తెలుసు

హేళన చేయడం మనకు తెలిస్తే
అవహేళన చేయడం ఎదుటివాడికి రాదా! 

అడుగు తడబడితే పర్వాలేదు
మేధావే తప్పుటడుగు వేస్తే ఎలా? 



కాలం వెంబడి కలం... 62


   హైదరాబాదు బసవతారకంలో రంగ వదినకు ఆపరేషన్ కోసం ఓవారం రోజులు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. తర్వాత మళ్లీ చెకప్ కోసం డిసెంబర్ లో అన్నయ్యా వదిన వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళతో హైదరాబాదు వచ్చాను. AMSOL లో జాయిన్ అవడానికి. ఆఫీస్ చూపిద్దామని జ్యోతి అన్నయ్య స్పెండర్ బైక్ మీద తీసుకువెళ్ళాడు. పనిలో పనిగా హాస్టల్ కూడా వెదుకుదామని వెళ్ళాము. ఆఫీస్ సందు ముందుకు కొద్ది దూరంలోనే నాకెందుకో బైక్ మీద నుండి పడిపోతాననిపించింది. గట్టిగానే పట్టుకున్నా. కాని పడిపోయా. పడినా నేను బైక్ వదల్లేదు. అన్నయ్యకు నేను పడిపోయింది తెలియదుగా, తను మాట్లాడుతూ ముందుకు వెళిపోయాడు. కొద్ది దూరం బైక్ తో వెళ్ళాక నా వల్ల కాక బైక్ వదిలేసాను. అప్పుడు తల రోడ్డుకి కొట్టుకుంది. చెయ్యి కొట్టుకుపోయింది బాగా. పడిన వెంటనే నేనే లేచేసాను కూడా. కళ్ళజోడు పడిపోతే అది వెదుకుతున్నా. ఈలోపల అన్నయ్య వచ్చి వెదికి ఇచ్చాడు. తను బాగా కంగారు పడిపోతున్నాడు. ఏం కాలేదని చెప్పాను. చేతి మీద దెబ్బ చూసి బాగా కంగారు పడ్డాడు. అదృష్టమెా, దురదృష్టమెా కాని ఆరోజు ఆదివారం కావడంతో ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండే ఆ రోడ్డు చాలా ఖాళీగా ఉంది. నేను పడటం చూసిన ఇద్దరు ముగ్గురు దగ్గరకి వచ్చారు. అన్నయ్యను కంగారు పడవద్దని చెప్పి, దారిలో మెడికల్ షాప్ దగ్గర కాస్త బాండేజ్ తీసుకుని, వదిన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. చూసిన వెంటనే వదిన గొడవ. ఆ సాయంత్రం వదిన బసవతారకంలో చెకప్ కోసం జాయిన్ అయితే, అక్కడి సిస్టర్ నా దెబ్బ క్లీన్ చేసి, కాస్త పెద్దగానే బాండేజ్ వేసింది. 
       దెబ్బ తగిలిందని మా ఇంట్లో చెప్పలేదు. మరురోజు ఆఫీస్ కి వెళ్ళాను. దెబ్బ కనిపించకుండా చీర కప్పేసాను. తర్డ్ ఫ్లోర్ లో మెయిన్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ రిసెప్షన్ లో నా వివరాలు చెప్పాను. కాసేపటికి హెచ్ ఆర్ మానేజర్ మిలి అసిస్టెంట్ జయ వచ్చి వివరాలు అడిగితే ఇచ్చాను. హెచ్ ఆర్ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, జయ వేరే అతనితో అనడం నాకు వినబడింది. ఈవిడ నిజంగానే అమెరికా నుండి వచ్చారా అని. నేను ఆ మాటలు వింటూ నవ్వుకున్నాను. ఎవరైనా మనిషి హావభావాలను, వేసుకున్న దుస్తులు, నగలను బట్టి ఆ మనిషిని అంచనా వేస్తారని మరోసారి బుుజువైందనుకున్నా. తర్వాత ఎప్పటికో తీరికగా అరి కేసరి గారు వచ్చారు. ఆరో ఫ్లోర్ కి వెళ్లి కలిసాను. నైట్ షిఫ్ట్ కి సాయంత్రం రమ్మని చెప్పారు ముందు. తర్వాత నాకు ఇంకా రూమ్ దొరకలేదు, నైట్ షిఫ్ట్ కాకుండా కొన్ని రోజులు డే షిఫ్ట్ కి వస్తానంటే సరేనన్నారు. అప్పటికే నేను అన్నయ్యా హాస్టల్ చూసాము. ఇంతలో నా చేతి దెబ్బ చూసారు అరి కేసరి. ఏమైందంటే జరిగింది చెప్పాను. అప్పటికే చాలా మెడ నొప్పిగా ఉంది. విజయవాడ వెళ్లి వస్తానని చెప్పి, అన్నయ్యను మా రంగ వదినకు తెలిసిన గోపాళం శ్రీమన్నారాయణ గారికి ఫోన్ చేసి చెప్పమన్నాను. ఇంటికి ఫోన్ చేసి కాస్త మెడ నొప్పి ఎక్కువగా ఉంది. చూపించుకోవడానికి వస్తున్నానని చెప్పాను. అప్పటికే అన్నయ్య వాళ్ళు విజయవాడ వెళిపోయారు. 
          పొద్దుటే బస్ దిగి ఇంటికి రాగానే చేతి దెబ్బ చూసి ఏమైందంటే, మెట్ల మీద నుండి జారి పడ్డానని చెప్పాను. విపరీతమైన తలనొప్పి. డాక్టర్ దగ్గరకి వెళితే వెంటనే అక్కడే చూపించుకోవాలి కదా. ఎందుకు లేట్ చేసావు అని, వివరాలు కనుక్కుని టాబ్లెట్స్ ఇచ్చారు. ఆల్ర్టాసెట్ అప్పుడు భలే పని చేసింది. పది నిమిషాల్లో తలనొప్పి చేత్తో తీసేసినట్టుగా పోయింది. ఎప్పుడైనా నొప్పి అనిపిస్తే వేసుకోమన్నారు. ఆ తర్వాతెప్పుడూ అది నాకు పని చేయలేదు. ఆరోజు మధ్యాహ్నం మా వదిన వచ్చి అమ్మావాళ్ళకు నిజం చెప్పేసింది. తర్వాత ఓ వారం ఆగి హైదరాబాదు వెళ్ళాను. ఈయన ఫ్రెండ్ వాళ్ళింట్లో నాలుగు రోజులుండి హాస్టల్ కి మారిపోయాను. అప్పటికే నేను కారం అస్సలు తినలేను. అందుకని ముందే చెప్పాను, కాస్త కారం వేయకుండా కూరలు పక్కకు తీసి పెట్టమని. ఓ నెల కూడా లేనేమెా, ఆ హాస్టల్ లో ఉండటం నచ్చక ఆఫీస్ కి దగ్గరలో ఓ చిన్న రూమ్ తీసుకున్నా. నాతోపాటు హాస్టల్ పిల్లలు ఇద్దరు కొన్ని రోజులుండి వాళ్ళు వేరే రూమ్ చూసుకున్నారు. తమిళ్ అమ్మాయి హేమ బాగా క్లోజ్ గా ఉండేది. వాళ్ళిద్దరూ ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ లో చేసేవారు. కనీసం మా రూమ్ లో ఫాన్ కూడా లేదప్పుడు. చలికాలమని నేను కాస్త పట్టించుకోలేదు. ఓ మూడు నెలల తర్వాత మా విశాల్ ఫాన్ తెచ్చి ఫిట్ చేసాడు.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 

11, జులై 2021, ఆదివారం

నిశ్శబ్ద లయలు సమీక్ష...!!

      " నిశ్శబ్దాన్ని వినిపించే అక్షర లయలు "

        కొన్ని భావాలను నలుగురికి పంచాలంటే అక్షరాల అమరిక బాగా తెలియాలి. పదాలు పొందికగా, అందంగా అమర్చడంలోనే భావ కవితల సౌందర్యం తేటతెల్లమౌతుంది. శిరీషా శ్రీభాష్యం తనలోని కళాతృష్ణకు పరాకాష్టగా మలిచిన కవితా కావ్యమే ఈ నిశ్శబ్ధ లయలు. వినే మనసుండాలే కాని దీనిలోని ప్రతి పదమూ మనకో సవ్వడిని లయబద్దంగా వినిపిస్తుంది. సంగీత, నాట్య కళలలో రాణించిన శిరీష భావ కవిత్వాన్ని కూడా భలే అందంగా రాసేసారు. 
        నాలో నేను నాతో నేను అంటూ తన మనసులోని ముచ్చట్లను, ఆశలను, కోరికలను అక్షరాలతో పంచేసుకోవడంలో నేర్పును చూపించేసారు. బుుతువులతో, ప్రకృతితో మమేకమైన మనసును, వేదనను, విరహాన్ని, ప్రేమను, ఆర్ద్రతను, జ్ఞాపకాలను, బాల్యాన్ని,అనుబంధాన్ని..ఇలా జీవితంలోని అన్ని పార్శ్వాలను తడిమి, చక్కని భావకవితలను ఈ నిశ్శబ్ద లయలు లో నిక్షిప్తం చేసారు. 
  
        "జీవిత పయనం!
          విరిసీవిరియని వసంతం
          రాలీరాలని శిశిరం... " అంటూ సున్నితంగా చెప్పినా.. 

"జీవితమంతా... 
నా మనసును దాటని నీ భావం
నీ మనసుని చేరని నా మౌనం...." అని ఎంత చిన్న పదాలతో అద్భుతంగా చెప్పారో. 

ఇలాంటి బోలెడు సుకుమారమైన భావాలు అలవోకగా, అలతి పదాలతో అద్భుతంగా రాసేసారు.

 " నీ  జాడ అందనంత దూరంలో
   నిస్సహాయంగా చూస్తున్నప్పుడు
   నేనిక్కడ జారిన కాలాన్ని
   అపురూపంగా చూసుకుంటాను
   అపుడిక అంతా అసంపూర్ణ వాక్యమే! " అంటారు అసంపూర్ణ వాక్యం కవితలో. ఎక్కడా క్లిష్టమైన పదాలు లేవు, చెప్పాలనుకున్న లోతైన విషయాన్ని ఎంత సుళువుగా చెప్పేసారో, అదీ ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా. 
       కవిత్వాన్ని, జీవితాన్ని, జీవితపు నడవడులను, అమ్మానాన్నలను, స్నేహాన్ని, ఆర్తిని, ఇలా మనసు స్పందించిన ప్రతి చిన్న విషయాన్ని తన కళాత్మక దృష్టితో సొగసైన భావ కవిత్వాన్ని అందించిన శిరీషా శ్రీభాష్యం " నిశ్శబ్ద లయలు " అక్షర మువ్వల సవ్వడి నలుగురికీ చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మరిన్ని భావ కవిత్వ సంపదలు తెలుగు సాహిత్యానికి చేర్చాలని కోరుకుంటూ... హృదయపూర్వక అభినందనలు.     

5, జులై 2021, సోమవారం

కాలం వెంబడి కలం...61

         విజయనగరం జ్ఞాపకాలు వెంటేసుకుని విజయవాడ వచ్చాక మిగతా పనులన్నీ చాలా తొందరగానే జరిగిపోయాయి. మధ్యలో రెండు మూడు సార్లు హైదరాబాదులోని అమెరికన్ సొల్యుషన్స్ అజమాయిషీ చేసే మా ఇంజనీరింగ్ కాలేజ్ అతను, మాకు జూనియర్ అయిన అరి కేసరితో మాట్లాడాను. మా ఆయన కూడా నేను వచ్చిన మూడు నెలలకు ఇండియా వచ్చాడు. వచ్చే ముందు తమ్ముడి దగ్గరకు వెళ్ళి, మా కార్ ఇచ్చి, ఇంకేం ఇచ్చాడో మాకు తెలియదు, అంతకు ముందే తన క్రెడిట్ కార్డ్ కూడా ఇచ్చేశాడు. ఓ ఆరువేలో, ఏడువేలో డాలర్లు మాత్రం తెచ్చాడు. ఆయన వస్తున్నాడని మా స్కార్పియెా కార్ వేసుకుని అమ్మమ్మ తాతయ్య తప్ప మిగిలిన మా కుటుంబం అంతా హైదరాబాదు వెళ్ళాము. 
             అమెరికా నుండి నేను వచ్చే ముందు కూడా నాతో గొడవే కదా. వేరే వండుకు తినడం, లేదా నాలుగు రోజులు ఇంట్లో తినడం మానేయడం ఇలాంటివి వారికి మామూలే. పెరిగిన వాతావరణం, పెంపకం అలాంటిది మరి. అందరిని బాగా బాధ్యతతో పెంచింది అక్క. అవసరానికి అవసరమైనట్లు నటించే రకాలు వారందరు. నాకు తెలిసి ఇప్పటి వరకు కనీసం ఓసారి కూడా ఆవిడ అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరితో కలిసి ఉన్నది లేదు. విభజించి పాలించడమే ఆవిడకు తెలిసింది. చేసింది ఉపాధ్యాయురాలిగా. మరి ఇలాంటి వారందరు పిల్లలకు ఏం విలువలు నేర్పారో నాకైతే తెలియదు. ఏ అమ్మానాన్న అయినా కడుపున పుట్టిన పిల్లలు ఓ వేళ తప్పు చేసినా వదులుకోరు కదా. అందరు బావుండాలి, కలిసుండాలి అనుకుంటారు. ఈవిడలో ఆ ఆలోచన నేనెప్పుడూ చూడలేదు. ఎవరు ఏమైనా తమ అహాన్ని సంతృప్తి పరుచుకోవడమే వీరికి తెలిసిన విద్య. మా ఆయనకు కూడా అన్నీ ఆ అక్క బుద్దులే ఏం తేడా లేకుండా. 
                 ఇది ఎందుకు చెప్పానంటే..
మేము హైదరాబాదు వెళ్ళాం కదా ఈయన కోసం. హోటల్ లో బాగా మర్యాదలు చేసాడు మాకు అందుకు చెప్పాను. అరి కేసరి కి కాల్ చేస్తే, ఆఫీస్ కి వచ్చి కలవమన్నారు. సరేనని నేను, నాన్న ఆ రాత్రిపూట తొమ్మిదింటికి రోడ్ నెంబర్ 2, బంజారాహిల్స్ లోని AMSOL ఆఫీస్ కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అరి కేసరి లేరు. తర్వాత ఓ గంటకి వచ్చారు. రావడమే మా స్కార్పియెా నెంబర్ గురించి అడిగారు. ఆ బిల్డింగ్ ఓనర్ వి కూడా అవే నెంబర్లట. తర్వాత పరిచయాలు, మాటలు అయ్యాక, నేనేం చేయాలో చెప్పమని అడిగాను. నాన్న కూడా మాట్లాడారు. అప్పటికి తనకి ఏ వెహికల్ ఉందో నాకు తెలియదు. మనకి అలాంటివేం పట్టవు కదా. మనిషిని చూస్తాను కాని వారి స్టేటస్ చూడను. అలా స్టేటస్ చూసేవారికి దూరంగా ఉంటాను. డిసెంబర్ లో జాబ్ లో జాయిన్ అవుతానని చెప్పాను. తర్వాత మేం అందరం విజయవాడ వచ్చేసాము. అందరికి కార్ ఎలాగూ సరిపోదు కదాని మౌర్య, ఈయన ఫ్లైట్ లో విజయవాడ వచ్చారు. 
        దీపావళికి అందరం మా ఊరు నరశింహాపురం వెళ్ళాము. పండగ బాగా జరిగింది. పిల్లలు బోలెడు టపాకాయలు, బాంబులు కాల్చారు. చిన్న అపశృతి ఏంటంటే...పిల్లల సంతోషాన్ని దూరం నుండే కామ్ కాడర్ లో రికార్డ్ చేస్తున్న నాపైకి ఓ టపాసు దారి తప్పి దూసుకువచ్చి కాస్త చెయ్యి కాలింది. అయినా కామ్ ని పడవేయలేదులెండి. 
           నేను అమెరికాలో ఉన్నప్పుడే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం మా ట్రస్ట్. నాన్నకి చెప్పానప్పుడే అమ్మానాన్న లేని పిల్లల్లో  కనీసం ఒకరినయినా చదివిద్దామని. దానికి ఆయన తిరిగి తిరిగి అప్పటి కలక్టర్ నవీన్ మిట్టల్ ని కలిసి ఇలా డబ్బులు ఇద్దామనుకుంటున్నాం అని చెప్తే, ఆయన ఇలా ఇస్తే సరిగా ఉపయెాగపడవు. మీరే ఓ ట్రస్ట్ ఓపెన్ చేయండి అని సలహా ఇచ్చారట. అది నాన్న తన ఫ్రెండ్స్ కొందరికి చెప్పారు. అలా చిన్నప్పటి నుండి నేను దేవుడున్నాడని, లేడని నాతో వాదించే కమ్యూనిష్ట్, నాస్తికుడైన ప్రసాద్ అంకుల్, మా నాన్నతో రొయ్యల వ్యాపారం కొన్నాళ్ళు చేసిన ప్రకాశరావు గారు ఇలా కొందరు ఈ మంచి పనిలో భాగస్వాములయ్యారు. ఎక్కడెక్కడో ఉన్న మా ఊరి వారిని మెుత్తం అందరిని దీని ఓపెనింగ్ కి పిలుద్దామని నాన్న ప్లాన్. ఆయన ఆ పనిలో ఉన్నారు. ఇంతలో మా ఊరి అతను శ్రీనివాస్ ఉప్పల తను కూడా ఈ మంచి పనిలో భాగస్వామి అవుతానని, కాకపోతే అనుకోకుండా చనిపోయిన తన భార్య పేరు ట్రస్ట్ కి పెట్టమని అడిగాడు. మనకి పేరు ముఖ్యం కాదు, సాయం చేయడం ముఖ్యం. అందుకని పేరు పెడదామని చెప్పడం, తను, తన ఫ్రెండ్స్ కూడా ముందుకు రావడం జరిగింది. నేనేమెా నా పేరు బయటికి రాకుండా అంతా మీరే చూసుకోండి అని చెప్పాను. దానికి శ్రీను ఒప్పుకోలేదు. దీనంతటకి కారణం నువ్వు అక్కా. నువ్వు లేకుండా కుదరదు అని నన్ను కూడా ఒప్పించేసాడు. జనవరి 23న భారీ ఓపెనింగ్ కి ప్లాన్ చేసారు.
     

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 

3, జులై 2021, శనివారం

జీవన 'మంజూ'ష(జులై)

నేస్తం, 
       మనమెప్పుడూ అనుకుంటూ ఉంటాం. ఈ ప్రపంచంలో చాలామంది సరిగ్గా లేరని. కారణాలు అనేకం ఉండవచ్చు కాని మెుదటిగా చెప్పాల్సిన కారణం పెంపకం. సమాజానికి మంచయినా, చెడయినా మన పెంపకం ఫలితమే. ఈ పెంపకం పదం చానాళ్ళుగా నా వెంట పడుతోంది. ఎందుకో మరి? 
        ఏ పసిబిడ్డైనా జన్మించేది అమ్మ కడుపు నుండే. అమాయకత్వానికి, స్వచ్ఛతకు మారు పేరు పసిబిడ్డ. బిడ్డ పెరుగుతూ, తన చుట్టూ ఉన్న పరిసరాల నుండి, వ్యక్తుల నుండి తన అలవాట్లను, నడవడిని నేర్చుకుంటాడు. జన్మతః కొన్ని బుద్ధులు సంక్రమించినా, తాను పెరిగిన వాతావరణం ప్రభావం నుండి ఎక్కువగా ప్రభావితమౌతాడు. తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునే క్రమంలో. తన చుట్టూ తిరిగే అమ్మానాన్నలను చూస్తూ, ఎక్కువగా వారినే అనుకరించడం చేస్తుంటాడు. 
       తల్లిదండ్రులయినా, మరే ఇతర అనుబంధాలయినా పిల్లల బాధ్యతలు తీసుకున్నప్పుడు వారిని సక్రమంగా పెంచడం ప్రధాన కర్తవ్యం. ఒక్క బిడ్డ సరైన పెంపకంలో పెరగక పోయినా, ఆ బిడ్డ వలన తరువాత ఎందరో బాధ పడతారు. సాధారణంగా ఏ తల్లిదండ్రులయినా బిడ్డలు సక్రమంగా పెరగాలనే కోరుకుంటారు. మరి అలాంటప్పుడు మన సమాజంలో ఇన్ని ఘోరాలు, నేరాలు ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానం సహజంగానే మనలో రావాలి కూడా. 
     పెంపకం బాధ్యత ఇష్టంగా తీసుకోవాలి కాని పేరు కోసమెా, నలుగురూ ఏమైనా అనుకుంటారన్న మెుక్కుబడి కోసమెా కూడదు. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు కోప్పడటం, మరల బుజ్జగించడం సర్వసాధారణమైన విషయం. కాని కొందరు లేని పెద్దరికాన్ని భుజాన వేసుకుని, తమ పొరపాట్లకు పిల్లలను బలి చేస్తుంటారు. ఆ పసి మనసులు ఎంత గాయపడతాయెా వీరికి అనవసరం. తమ అహం నెగ్గాలనుకుంటారు తప్ప పెంపకంలో జరిగిన లోపాలను ఒప్పుకోలేరు. 
          పిల్లలని పెంచాము, పెద్దవాళ్లని చేసామని మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. మన పెంపకం ఎంత బావుందో మన పిల్లలకు వచ్చినవారు, ఆ పిల్లల కాపురాలు చూసిన నలుగురు చెప్పుకోవాలి. దిక్కుమాలిన పెంపకమని మనల్ని రోజూ తిట్టుకోకూడదు. మంచి నడత, నడవడి అనేవి పెంపకంలో రావాలి. అప్పుడే అది సరైన పెంపకమౌతుంది. మనకు మంచి పేరు రావడం కోసం పెద్దరికాన్ని కూడా మరిచి రక్త సంబంధాల గురించి చెడుగా మాట్లాడటం, చిల్లర రాజకీయాలు చేయడం తగదు. పిల్లలు తప్పు చేసినా క్షమించే మంచి గుణం అమ్మానాన్నలది. అంతే కాని పిల్లల మీద చెడు ప్రచారాలు చేయడం, పిల్లలను గాలికి వదిలేయడం, తమ మాటే నెగ్గాలన్న పంతం అమ్మానాన్నలకు ఉండదు. బిడ్డలు తమను పట్టించుకోక పోయినా బిడ్డ బాగు కోసమే పరితపిస్తారు కాని బిడ్డలను విడగొట్టి కపట ప్రేమలు కురిపించరు. 
            వ్యక్తి బావుంటే ఆ వ్యక్తి కుటుంబం బావుంటుంది. తన చుట్టూ ఉన్నవారు బావుంటారు. తద్వారా సమాజం, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇలా అందరూ బావుంటారు. తరతరాలు మంచినే పంచుతాయి. చివరాఖరికి ఓ మాట చెప్తాను. ప్రతి మనిషికి కావాల్సినది నైతికత. మనం బయటికి ఎంత మంచివారిగా నటించినా మన మనస్సాక్షికి తెలుసు కదా మనమేంటో. ఎవరి పెంపకం ఫలితం ఎలా ఉందోఎవరికి వారు ఓసారి నిజాయితీగా తరచి చూసుకుంటే సమాధానం దొరికేస్తుంది కదా. 
       

2, జులై 2021, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.  తెర తీయడంలో నేర్పు చూపించాలి_మౌనం మనం వహించినా..!!
2.  మనసు నుండి తప్పించలేనివి కొన్ని_కాలంతో పని లేకుండా మన వెంట పడుతూ..!!
3.  కోయడమే తెలుసు కొందరికి_పూయించడం చేతకాక...!!
4.   మనసు అక్షరంతో సహవాసం చేస్తోందిప్పుడు_అలుపును భావాలకు పంచేస్తూ...!!
5.   కొందరంతే సంబర పడుతుంటారు_ముక్కలుగా విరిచేసి ఘనకార్యమనుకుంటూ..!!
6.  చివరికి మిగిలేది ఆత్మ ప్రయాణమే_అది తెలియకే ఈ వెంపర్లాటలు...!!
7.  తప్పును ఒప్పుకోలేని వారికి ఏం చెప్పగలం_వివరణైనా విశ్లేషణైనా..!!
8.   తడబాటు తప్పిదం కానే కాదు_గ్రహపాటుగా మారితేనే సమస్యంతానూ...!!
9.   మనసెప్పుడూ సున్నితమే_రాతి మనిషి రానంత వరకు..!!
10.   మ(న)దిలో స్థిరపడిపోదామనేమెా_జ్ఞాపకాల గాలివాటునిలా అ(క)లలుగా ఆస్వాదిస్తూ...!!
11.   మౌనంతో మాటాడిద్దామనే కదా_అక్షరాల ఈ ప్రయత్నమంతా..!!
12.   ఒంటరి రాగమే ఎప్పటికి_జంటతనంలోని మాధుర్యమెరుగని ప్రాణులకు...!! 
13.   కొందరి నైజమది_అమ్మ పాలలో కూడా కల్తీని చూపిద్దామనుకుంటూ..!!
14.  నిశ్శబ్ద నిధి అవసరమే అప్పుడప్పుడూ_ఏ దారుల్లో మన పయనమున్నా..!!
15.  సహవాసానికి అమెాదమే_సవాళ్ళకు సమాధానమివ్వడానికి..!!
16.   ఎన్ని ఓటములు ఎదురుచూస్తున్నాయెా_ఓ గెలుపుతో సమాధానం చెప్పాలని..!!
17.   కుదింపుల కాలాన్ని ఊరడించడం తెలుసు_కదిలించడం తెలిసిన అక్షరానికి...!!
18.  అసత్యమే సత్యమిప్పుడు_మనమని మురిసిపోతూ అనుకున్నంతగా..!!
19.   ఊసులాడుతానంటోంది ఓ మౌనం_ఏ జన్మ బంధాన్నో గుర్తు చేస్తూ..!!
20.   వదిలి పోనంటోందో గతం_కాలం లక్షణం తనది కాదంటూ...!!
21.  చీకటెప్పుడూ చుట్టమే నాకు_వెలుతురు వివరించిన పాఠాలను ఒప్పజెప్తూ..!!
22.   అక్షరమే ఆయువుపట్టు_ఏ భావానికయినా...!!
23.   భారమంతా రెప్పలదే_కలల వరాలు మాత్రం కన్నులదేనంటూ...!!
24.  మౌనంలో శబ్దమది_మనసులో తిష్ట వేస్తూ...!!
25.  అల్లిక అక్షరాలదే_మనసు కదలికలను క్రమబద్ధం చేస్తూ..!!
26.   పరిచయం పాతదే_ఆ అనుబంధాన్ని అక్షరాలిలా గుర్తు చేస్తున్నాయంతే..!!
27.   ఏ ఆనందమైనా అక్షరాలతోనే_వేదనలతో వాదం పెంచుకున్నా..!!
30.   అక్షరాల అనుబంధమిది_రాహిత్యాన్ని దూరం చేసే సాహిత్య చెలిమిగా... !!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner