2, ఏప్రిల్ 2025, బుధవారం

సంతోషం..!!

 61 సమీక్షకులలో నేనూ ఒకరిగా వున్నందుకు చాలా సంతోషం. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ ప్రభాకర్ జైనీగారికి హృదయపూర్వక శుభాభినందనలు. సమీక్షకులందరికి అభినందనలు.


31, మార్చి 2025, సోమవారం

సంస్కారం..!!

 నేస్తాలు,

               కొందరు పెద్దలకు, పిన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలపై చాలా తేలిక భావన వున్నట్లు వుంది. చాలా సంస్కారంగా పోస్టులు పెట్టారు. అవే ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్పిందో నిజాయితీగా వినండి చాలు. 

      ఏ పోటీలకయినా మనం పేరు ఇవ్వకుండా పాల్గొనలేం కదా! అలాంటప్పుడు వీటికి మీకు ఇంత ఆక్షేపణలెందుకు? మీకు నచ్చితే పురస్కారాలకు అప్లికేషన్ పెట్టండి. లేదంటే వదిలేయండి. దీనిలో ఎవరికి ఇబ్బంది లేదు కదా! ఏం సినిమాలకు అవార్డులు నామినేషన్ కి పంపకుండానే ఇస్తున్నారా! పుస్తకాలకు ఇచ్చే ఏ పురస్కారమయినా రెండు లేదా నాలుగు పుస్తకాలు పంపకుండానే ఇస్తున్నారా! ఎంతమందికి ఏ పురస్కారమయినా ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చింది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. మనకి వస్తే నిజాయితీగా ఇచ్చినట్టు, మరొకరికి వస్తే అపాత్రదానమన్నట్టు కాదండి. ఎవరికి ఏది రాసి పెట్టి వుంటే అలా జరుగుతుందని మనకి తెలుసు కదా..ఎద్దేవా చేయడం మానేసి మన పని మనం చేసుకుంటే బావుంటుంది.

30, మార్చి 2025, ఆదివారం

కొన్ని సంతోషాలు..!!

 















      ఆంగ్ల నూతన సంవత్సరం 2025 జనవరిలో శ్రీ శ్రీ కళావేదిక వారి పురస్కారం అందుకోవడం, తర్వాత వారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మరో పురస్కారాన్ని డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి నుండి అందుకోవడం జరిగింది. 

      తెలుగు కొత్త సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాన్ని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం, శ్రీ కందుల దుర్గేష్ గారిచే సత్కరింబడటం చాలా సంతోషంగా వుంది. 

      ఈ సంతోషానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారికి, కందుల దుర్గేష్ గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

       నా ఆత్మీయులు కలిమిశ్రీగారికి, తాతినేని వనజగారికి, సాగర్ శ్రీరామ్ కవచం గారికి, విజయశ్రీగారికి, మా తమ్ముడు మాస్టారు గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి,   కత్తిమండ ప్రతాప్ గారికి కృతజ్ఞతలు.

23, మార్చి 2025, ఆదివారం

మనిషితనం...!!

       ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలయినా నా మనస్సు నుండి చెరిగిపోలేదింకా. మాకు నాలుగిళ్ల అవతల ఉండే మూడు పోర్షన్ల ఇంట్లో మామయ్య వాళ్ళు కింద పోర్షన్ లో అద్దెకుండేవారు. బయట పక్క ఓ బాత్ రూమ్ స్టోర్ రూమ్ లా ఉండేది. దానిలోకి ఎప్పుడు తెచ్చిపెట్టిందో మేమెవరమూ చూడలేదు కాని నాలుగైదు బుల్లి బుల్లి పిల్లలను చక్కగా అట్టపెట్టెల మధ్యన దాచేసింది తల్లి పిల్లి. 
      బయట ఊరకుక్కలు రోజూ తిరుగుతూనే ఉంటాయి. ఈ తల్లి పిల్లి వాటిని కాపాడుకుంటూనే ఉంది వాటి నుండి. మా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే గేట్ లు వేసి వీటికి రక్షణ బానే కల్పించారు. ఎలా జరిగిందో తెలియదు కాని ఓ రోజు పొద్దున్నే పిల్లి తల్లి బాగా అరుస్తోంది. ఏంటా అని చూస్తే, ఏ రాత్రి మీద ఈ ఊరకుక్కలు దాడి చేసాయెా తెలియదు. పాపం పిల్లలు చనిపోయాయి. దాని ఏడుపు హృదయ విదారకం. 
        ఏ తల్లైనా తన బిడ్డలను కాపాడుకోవడానికి తన సర్వశక్తులు వొడ్డుతుంది. అది మనిషి, జంతువా అని ఉండదు. బాధ కూడా అంతే ఉంటుంది. దైవం మీద బోలెడు కోపం వచ్చిందప్పుడు. అమ్మ బొజ్జ నుండి పుడితే ఆ బొజ్జ విలువ దేవుడికి తెలిసేది. పురిటి నెప్పుల కష్టం ఏంటో కనబడేది అనిపించింది. బిడ్డను పోగొట్టుకున్న ఏ తల్లి మనసుకైనా బాధ ఒకటే కదా అనిపించింది. 
       బలవంతులదే రాజ్యమని మరోసారి బుుజువైందని అనిపించింది. ఈ సంఘటనే మన మానవ సమాజంలో కూడా రోజూ నిత్యకృత్యమే. ఎన్నో ఘోరాలు, నేరాలు రోజూ మన చుట్టూనే జరుగుతూ ఉన్నా మనకేమీ పట్టనట్టుగా, మనకు కాదు కదా అన్యాయం జరిగిందని సరిపెట్టుకుంటూ, మన మనస్సాక్షిని నిద్ర పుచ్చేస్తూ, యాంత్రికంగా బతికేస్తున్న మనవి ఓ బతుకులేనా? అన్యాయాన్ని ప్రళ్నించలేని మనకి ఈ సమాజంలో మనిషిగా స్థానం కావాలనుకోవడం ఎంత వరకు సమంజసం? ఒకరు ప్రశ్నిస్తే అడ్డుకుంటారు బలవంతులు. అదే పదిమంది, వందల మంది, వేలమంది ఏకమైతే ఏం చేయగలరు? వ్యవస్థ మారాలంటే వ్యక్తి ఆలోచన మారాలి. నేను అన్న దాని నుండి మేము, మనం అనుకుంటే ప్రపంచమే శాంతి సౌఖ్యాల మయం. 
  ఇది సందేశం కాదు ఓ మంచి మార్పుకి శ్రీకారం కావాలన్న చిన్న ఆశ అంతే.  

సినిమా కథ2

సినిమా కథ2...!!

    అతి పెద్దదైన సూపర్ స్పెషాలిటి న్యూరాలజీ ఓపి దగ్గర చాలా బిజీగా ఉంది. అవుట్ పేషెంట్స్ ని చూసే జూనియర్ డాక్టర్ చంద్ర చాలా ఓపికగా వచ్చిన పేషంట్స్ ని చూస్తూ, వారి దగ్గర నుండి వివరాలు కనుక్కుంటూ, తగిన సలహాలు, సూచనలు ఇస్తూ, అవసరమైన వారికి టెస్ట్ లు రాస్తూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు. 
      ఇంతలో నమస్తే డాక్టర్ అన్న కోమల స్వరానికి అదాటున తల ఎత్తి చూసి, అందంగా, అమాయకంగా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ ఓ నిమిషం మాటలు మర్చిపోయి అలా ఉండిపోతాడు. హలో డాక్టర్ అన్న పిలుపుకి ఉలిక్కిపడి, సారి కూర్చోండి. ఏంటి ప్రోబ్లం? అని అడుగుతూ తన ముందున్న పేషెంట్ ఫైల్ లోకి చూస్తాడు. వివరాల కోసం ముఖ్యంగా ఆ అమ్మాయి పేరు కోసం. శ్రద్ద పేరు చూసి బావుంది అమ్మాయిలానే అనుకుంటాడు. 
       ఏంటండి మీ కంప్లయింట్ చెప్పండి అంటాడు. చాలా చిన్నదే డాక్టర్, కాని బాగా విసిగిస్తోంది ఈ తలనొప్పి. ఇది తప్ప వేరే కంప్లయింట్స్ ఏం లేవు నాకు అంటుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? ఎన్ని రోజుల నుండి ఇలా ఉంది? వామిటింగ్ సెన్సేషన్ కాని, మరే ఇతర సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా అంటూ సాధారణ వివరాలు అడుగుతూ కేస్ షీట్ లో తనకు కావాల్సిన వివరాలు రాసుకుంటాడు. 
          స్ట్రెస్ తో వచ్చే జనరల్ తలనొప్పి అని చెప్తూ, మీరు ఇంతకు ముందు ఏమైనా టాబ్లెట్స్ వాడారా దీనికి అని అడుగుతాడు. లేదండి అనగానే  తలనొప్పి తగ్గడానికి, వైటమిన్ టాబ్లెట్స్ రాసి ఓ 10 రోజులకు మళ్లీ రండి అని పంపేస్తాడు.కాని ఎందుకో ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. ఫామిలీ వివరాలేం అడగలేదు. నా పర్సనల్ డిటెయిల్సు వీడికెందుకు అనుకుంటుందని. కాని మనసులో తిష్ట వేసుకుపోయిందేంటిలా అని నవ్వుకుంటాడు. ఈసారి వచ్చినప్పుడు మరిన్ని వివరాలు కనుక్కోవాలనుకుంటూ తన పనిలో పడిపోతాడు.
        తర్వాత కన్సల్టింగ్ కి వచ్చినప్పుడు అస్సలు తలనొప్పి తగ్గడం లేదు. చాలా సివియర్ గా వస్తోంది. కొన్నిసార్లు నా ముందున్నది కూడా ఏమి కనబడటం లేదు అని చెప్తుంది. అప్పుడు అనుకుంటాడు ఇది నార్మల్ తలనొప్పి కేస్ కాదు. నా రిసెర్చ్ కి పని బడిందని అనుకుని కేస్ డీప్ స్టడీ కోసం.. ఆ అమ్మాయి నుండి ఫామిలీ వివరాలతో పాటుగా, చాలా వివరాలు, తన మెంటల్, ఫిజికల్ కండిషన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తాడు. రకరకాల స్కాన్ లు, MRI I లు, బ్లడ్ టెస్ట్ లు, బ్రెయిన్ ఫంక్షన్ గురించి వివిధ రకాలైన టెస్ట్ లు అన్ని చేయిస్తాడు. ఆ అమ్మాయికి మాత్రం నార్మల్ చెకప్ లే ఇవన్నీ అని చెప్తాడు. అప్పటికే ఆ అమ్మాయివి బాగా ఇష్టపడతాడు. 
        పైకి చాలా నార్మల్ గా ఉన్న అమ్మాయికి ఈ తలనొప్పి తగ్గని  విషయం కనుక్కోవడానికి ఎన్నో టెస్ట్ లు, ఎందరో సీనియర్ డాక్టర్ లతో  మాట్లాడుతూ, బోలెడు మెడికల్ జర్నల్స్ రిఫర్ చేయడం, గూగుల్ లో సిమిలర్ కేస్ లు ఏమైనా ఉన్నాయా అని వెదకడం ఏమైనా సరే ఈ కేస్ విషయం తేల్చాలన్న పట్టుదలతో ప్రయత్నం చేస్తుంటాడు. 
             అంతలో ఇతనికి ఓ విషయం అనుకోకుండా తెలుస్తుంది. ఈ అమ్మాయి ఇద్దరినో, ముగ్గురినో చంపేసిందని. చాలా షాక్ కి గురౌతాడు ఆ విషయం తెలిసి. ఇక అప్పుడు మూలాలను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఆ అమ్మాయికి తను హత్యలు చేసిన విషయం తెలియదు. పోలీసులు హత్యలు చేసిన వారి కోసం వెదుకుతుంటారు. ఈ డాక్టర్ ఈ అమ్మాయిని దాచేసి, తన పేషంట్ కండిషన్ బాలేదని, కనబడటం లేదని పోలీస్ కంప్లయింట్ కూడా ఇస్తాడు. తనకు ట్రీట్మెంట్ ఎవరికి తెలియకుండా చేస్తుంటాడు. 
              ఆ అమ్మాయికి ఉన్న డిసీజ్ కోట్ల మందిలో ఒకరికి చాలా రేర్ గా వస్తుంది. ఎందుకు, ఏమిటి అన్న కారణాలు ఎవరికి తెలియదు. తనను పుట్టించిన భగవంతునికి కూడా దాన్ని నయం చేసే అవకాశం లేదు అప్పటికి. బ్రతకాలంటే హై డోస్ స్టెరాయిడ్ తప్పదు. బ్రెయిన్ లో కొన్ని రసాయనాలు(కెమికల్స్) సరిగా ఉత్పత్తి అవని కారణంగా కొన్ని గంటలు మెలకువలోనే ఉన్నట్లు ఉంటుంది ఆ అమ్మాయి చూసే వారందరికి. కాని ఆ రెండు  మూడు గంటలు ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు. ఆటో ఇమ్యూనిటి డిసీడ్ లలో  లూపస్ లో SLE లో ఇదో రకమైన రేర్ డిసీజ్. యాంటిబాడీస్ రివర్స్ లో పని చేయడం వలన ఆ వ్యక్తి శరీరంలో బాగా వీక్ గా ఉన్న సిస్టమ్ పై పని చేసి వాటిని పాడు చేస్తాయి. ఈ డిసీజ్ లో సాధారణంగా కిడ్నీ, హార్ట్, లివర్ ఫంక్షన్స్ మెల్లగా డామేజ్ జరుగుతూ ఉంటాయి. యాంటిబాడీస్ రివర్స్ లో నెర్వస్ సిస్టమ్ మీద పని చేయడం వలన బ్రెయిన్ ఫంక్షన్ సరిగా పని చేయక బ్రెయిన్ డెడ్ అయిన స్థితిలో నుండి కూడా బయటికి వచ్చినా, వారి జీవితంలో ఆ కోల్పోయిన మూడు, నాలుగు గంటలు వారేం చేసారో వారికి తెలియదు. 
               తనని ఆ హత్య కేస్ ల నుండి కాపాడటానికి, తన ప్రేమను గెలిపించుకోవడానికి, ఆ అమ్మాయిని ఆ డిసీజ్ నుండి బయట పడేసి మామూలు మనిషిని చేయడానికి ఓ న్యూరో మెడిసిన్ సూపర్ స్పెషాలిటి జూనియర్ డాక్టర్ చేసిన ప్రయత్నమే ఇది. 

17, మార్చి 2025, సోమవారం

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు

 " తెలుగు సాహితీ లోకానికి వెలుగు రవ్వలు సాగర వచనాలు "

      రచనలు చాలామంది చేస్తారు, కాని కొందరి రచనలు మాత్రమే సాహితీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయి. ఆ కొందరిలో సాగర్ శ్రీరామ కవచం ఒకరు. సాగర్ గారి రచనల శైలి విభిన్నంగా ఉంటుంది. ఆయన రచనలు చదువుతున్నప్పుడు మనం ఆయా పాత్రల్లో లీనమైపోతామనడంలో ఎట్టి సందేహము లేదు. ఇది మన కథేనా అన్న మీమాంస రాక మానదు. దహనం, అవస్థ, యాతన వంటి సామాజిక, మనో వైజ్ఞానిక నవలలు అందించిన ఆ చేతి నుండి సాహిత్యం గురించి, రచన, రచయిత, భాష, విమర్శ వంటి విషయాలతో పాటుగా వస్తువు, శిల్పము, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల తీరుతెన్నుల గురించి సోదాహరణముగా వివరించిన వ్యాసాల సమాహారమే ఈ " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకం.
   మూడు భాగాలుగా ఈ వ్యాస పరంపర కొనసాగుతుంది. మెుదటి భాగములో ప్రచ్ఛన్న 
వస్తుశిల్పాల గురించి వివరణాత్మక విశ్లేషణ చేసారు. 
సాధారణ రాయిని ఉలితో నేర్పుగా, ఓర్పుగా చెక్కితే నలుగురు మెచ్చే అందమై శిల్పం ఎలా ఏర్పడుతుందో మనందరికి తెలిసిన విషయమే. దీనినే ఉదాహరణగా తీసుకుని కథలో, నవలలో,కవిత్వంలో వస్తుశిల్పాల ప్రాముఖ్యత, వాటి నుండి ప్రచ్ఛన వస్తుశిల్పాల ఆవిర్భావం ఎలా జరుగుతుంది, కవిత్వంపై ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది తదితర అంశాలను సవివరంగా ప్రచ్ఛన వస్తుశిల్పాలు వ్యాసాలలో వివరించారు. నాణేనికి బొమ్మా బొరుసు ఎలా ఉంటాయెా అలాగే రచనకు వస్తుశిల్పాలని, వస్తువుకి నీడ ఉన్నట్టుగా, శిల్పానికి ఛాయ ఉంటుందని అవే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలని సోదాహరణముగా తన వ్యాసాలలో వివరించారు. సాహిత్యంలో వస్తువు, శిల్పము మిధ్య కాదని చెప్తూ, అవి కనబడవు, తారసిల్లుతాయంటారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి అనుగుణంగా రచన చేయాలంటే రచయిత ఒకానొక తపోస్థితికి చేరుకుని తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర అనుభవమౌతుంది. వస్తు సాకారమంటేనే ప్రచ్ఛన్న వస్తుశిల్ప సౌందర్యం, దీనిని గురించి విమర్శకుడు రచయితకు సరైన అవగాహన కల్పిస్తే ఆ రచన చక్కగా పండుతుందంటారు సాగర్ గారు. వస్తువు స్వభావాన్ని, ప్రవృత్తిని, నిర్మాణ, పునర్నిర్మాణాన్ని, ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సాధనలో అంతర్వాణి పాత్రను, మేధస్సును కూలంకషంగా చర్చిస్తారు. 
           ప్రచ్ఛన్న వస్తుశిల్పాల గురించి చర్చించేటప్పుడు వస్తువు బాహ్యముఖీనం. శిల్పం అంతర్ముఖీనమని మరువకూడదని, బంగారం నగగా రూపాంతరం చెందే క్రమంలో జరిగే విధానమే రచనలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని, వస్తువుకి పాజిటివ్, నెగెటివ్ ఛాయలే కాకుండా తటస్థ ఛాయలుంటాయని, రచయిత పదాల దానకర్ణుడంటూ, ఆ పదాల కూర్పుతో కావ్యముగా మలిచే క్రమంలో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు కనబడకుండా తమ పని తాము చేసుకుపోతాయి. రచన పూర్తయ్యాక అది చూసి రచయితే ఆశ్చర్యానికి గురౌతాడు. రాయించేది రామభద్రుడట అన్న చందాన. ఇప్పటి సాహిత్యానికి ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రని అధ్యయనం చేయడం కనీసావసరమని సాగర్ గారు ఘంటాపథంగా చెప్తున్నారు. 
   రెండవ భాగమైన సాగర వచనంలో రచన ఎలా ఉండాలి, రచయిత లక్షణాలేంటి, రచనలను పాఠకులకు అందిచడంలో పత్రికల పాత్ర తదితర అంశాలను సవివరంగా వివరిస్తారు. రచనను ఓ క్రియాశీలక సృజనాత్మక కార్యాచరణగా అభివర్ణిస్తారు. విమర్శకుల కోణంలో కవిత్వం రెండు పార్శ్వాలుగానే ఉందని చెప్తూ, బాహ్యముఖీన,అంతర్ముఖీన కవిత్వమే కాకుండా, మూడో పార్శ్వమైన రహస్యముఖీన తత్వాన్ని తెలివైన పాఠకుడు ఆస్వాదిస్తాడంటారు. అనుసరణకు, అనుకరణకు తేడా వివరిస్తారు. అనుకరణ తప్పని చెప్పకపోవడం సాహిత్య దోషమని నొక్కి వక్కాణించారు. మహిళా ఉద్యమాలు, స్త్రీ ఉద్యమాల ఆవశ్యకత గురించి, మహిళకు, స్త్రీ కి గల చిన్న తేడాని చూపిస్తారు. మంచి సాహిత్యం మాత్రమే భాషని బతికిస్తుందని, అంతరించిపోతున్న భాషను రాత ద్వారా కూడా బతికించుకోవాలని, సాహిత్యం లేని భాష సజీవభాషగా మనలేదని, సాహిత్యము, విమర్శ వేరు వేరు కాదని, గొప్పదనం రచనదే కాని రచయితది కాదని, అలా కాకుండా ఆ రచన గొప్పదనాన్ని రచయిత ఆపాదించుకుంటే, ఆ కీర్తి కిరీటంతో అక్కడే ఆగిపోతాడన్న హెచ్చరిక కూడా ఉంటుంది. 
          " అనుభూతి యెుక్క తీవ్రస్ధాయిా బేధాలే కవిత్వం " అని అంటూ శక్తి రూపాలను గుర్తు చేస్తూ, సాహిత్యంలో భౌతికశాస్త్ర నియమాన్ని E =mc² ను కవిత్వ వస్తు శక్తిగా వివరించడం, రచయితలు, పత్రికలు ఏ కాలంలోనూ ఓడిపోలేదని, సాహిత్యంలో గురుశిష్యుల అనుబంధాన్ని, వాస్తవాలను పాఠకులకు చేరవేయడంలో రచయిత అనుసరించాల్సిన పద్ధతులు, విమర్శనకారుల రూపంలో ప్రవచనకారులు సమాజంపై చిమ్మే విషాన్ని అరికట్టాలంటారు. అపసవ్య మార్గంలో పోతున్న సమాజానికి సద్విమర్శ మేలు చేస్తుందంటూ, ఈనాడు తప్పు దారిలో అభ్యుదయవాదులమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఫండ్స్ బోలెడుమంది నొక్కేస్తున్నారన్న బాధను వ్యక్తపరిచారు. కవి కాని, కవిత్వం కాని సమాజాన్ని మారుస్తాయన్న ఆశాభావం వీరి వ్యాసాల్లో కనిపిస్తుంది. 
               
               విభిన్న అంశాలతో మూడవ భాగంలో  అస్తిత్వవాదం గురించి, వర్తమాన విమర్శ గురించి, వస్తు శిల్పాల గురించి, పోస్ట్ మెాడ్నరిజం సిద్ధాంతం గురించి, విమర్శ లేకుండా పాఠకుడు ఉండడు, రచయితా - విమర్శ వేరు కాదని చెప్తూ, సాహిత్యానికి విమర్శ అవసరాన్ని వివరిస్తారు. 
            ఓ రచన ఎలా ఉండాలి, ఆ రచన చేయడానికి కావాల్సిన ముడి సరుకు, అలకారాలు, రచయితకు ఉండాల్సిన లక్షణాలు ఇలా సాహిత్యాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలతో కలిపి తాత్విక లక్షణాలను రచయితలు ఎలా ఆపాదించుకుంటారో, సంపూర్ణ రచన ఎలా వెలువడుతుందో మెుదలైన విషయాలన్నింటిని  " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " వ్యాసాలలో వివరించి, నాలుగు మాటలు నేను రాసే అవకాశాన్ని కల్పించిన సాగర్ అంకుల్ కి ధన్యవాదాలు.
              తెలుగు సాహిత్యానికి ఏం కావాలో తెలియజెప్పిన " ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు " పుస్తకాన్ని అందిస్తున్న సాగర్ శ్రీరామ కవచం గారికి హృదయపూర్వక అభినందనలు.. 

మంజు యనమదల
విజయవాడ
         

       

ముందు మాట... శస్త్రాలు


 
   అక్షర హారతుల నుండి జ్వలించిన అగ్నికణాలు ఈ  " శస్త్రాలు "

        దైవానికి నివేదనగా అందమైన గంగా హారతులే కాకుండా మనసులను, మనుష్యులను చైతన్యపరిచే కవితాత్మక గీతాలను, దేశభక్తి, విప్లవ గేయాలను రచించి, వాటిని అక్షరాస్త్రాలుగా సాహితీ లోకానికి అందించిన రంగిశెట్టి రమేష్ (గంగాశ్రీ) గారి గేయ కవితా సంపుటి " శస్త్రాలు " కి హృదయపూర్వక అభినందనలు.
        సమాజంలోని పలు అంశాలపై గంగాశ్రీ గారు తమ స్పందనను పాటల రూపంలో అందించారు ఈ పుస్తకంలో. గూడు చెదిరిన గవ్వ గురించి రాసినా, గుండె మంటను అగ్నికణంగా మార్చి అక్షరంగా ప్రయెాగించినా అది చదువరుల మదిని తాకే విధంగా రాయగల నేర్పు వీరి సొంతం. జాతీయతను, దేశభక్తిని అద్భుతంగా చాటిన గీతాలెన్నో ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. వందేమాతరం గీతం నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాయబడింది. విప్లవ గీతాలు చదువుతుంటే మనసు ఉరకలెత్తే ఆవేశంతో పరుగులు పెడుతుందనడంలో  సందేహమే లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పలు గీతాలు రచించారు. కరోనాను వదలిపొమ్మని వేడుకోలు గీతాలు రాశారు. పల్లె పదాలతో పల్లె జీవితాలను, రైతుల గోడును కనుల ముందుంచారు. 
        నేను అంటూ తన గురించి చెప్పుకోవడమూ, అంతరంగపు ఆవిష్కరణ,  సేవామూర్తుల గురించి, సాహితీ సౌరభాల గురించి, నవ్యాంధ్ర రచయిత సంఘం గురించి రాసిన కవితా గీతాలు అక్షర పారిజాతాలు. వ్యవస్థలోని లోపాలను, రాజకీయ అసమానతలను ఎత్తిచూపిన గీతాలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. అలతి పదాలతో అగ్నిజ్వాలలను వెదజల్లిన అక్షరాలివి. ప్రతి గీతమూ ఓ అక్షరశరమై మనసున్న ప్రతి మనిషిని తాకుతుందని ఘంటాపథంగా చెప్పగలను. 
    ఈ శస్త్రాలు గేయ కవితా సంపుటికి నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చిన రంగిశెట్టి రమేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..
వీరి నుండి మరిన్ని రచనలు సాహితీ లోకానికి చేరాలని ఆకాంక్షిస్తూ...అభినందనలతో.. 
మంజు యనమదల 
విజయవాడ

ముందు మాటలు మనుమసిద్ధి సాహిత్య సంస్థ

       శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మనుమసిద్ధి సాహిత్య కవన వేదిక నిర్వహించిన " చెడును చెరిపేద్దాం " కవితల పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా అభినందనలు. పోటి అన్న తర్వాత గెలుపోటములు సహజం. ఓటమి విజయానికి తొలి మెట్టు. 
     సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలపై కవితా పోటీలు నిర్వహిస్తూ, సమాజాన్ని ఆలోచింపజేస్తున్న వ్యవస్థలు, వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులలో దుప్పటి రమేష్ గారు ముఖ్యులు. అనాదిగా స్త్రీలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై అక్షర పోటానికి తెర తీయడమే కాకుండా, ఆ అక్షర కవనాలను సంకలనంగా తేవాలన్న తలంపుకి, ఈ అక్షర యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. 
      అమ్మ కడుపులో పిండంగా రూపు గుద్దుకున్నారు క్షణం నుండి ఆడపిల్ల భయాన్ని వినిపిస్తూ, ఆ భయాన్ని చెరిపేసే అభయ హస్తాన్ని ఇవ్వడమెలాగో చెప్పారు రవి. అమానుషం చేసే మగవాడిపై తన కలాన్ని ఖడ్గంగా ఝుళిపించారు దుర్గా మహాలక్ష్మీ.
ఆడదే ఆధారం ఈ సమస్త సృష్టికి అంటూ, అవమానం జరిగితే అపరకాళిగా మారమంటూ పిలుపునిచ్చారు సీతాలక్ష్మి గారు. మగవాడి మృగత్వాన్ని ఉరి తీసి అణచమంటారు శివకృష్ణప్రసాద్. అమ్మతనం విలువను చెప్తూ, కణాన్ని పిండంగా మార్చి, ఓ బిడ్డకు ఊపిరందించి, పసితనం నుండి లాలించి, పాలించిన మాతృత్వపు గొప్పదనాన్ని గుర్తుజేస్తూ, వారి వరుసలు తప్పిన నీచ నైజాలపై అపర కాళికగా మారక తప్పదని హెచ్చరించిన దాలినాయుడు గారి అక్షర కవనం ఆద్యంతమూ అద్భుతంగా సాగింది. కవితా వస్తువు ఒకటే అయినా రాసిన ప్రతి ఒక్కరి శైలి విభిన్నంగా ఉంది. చక్కని సందేశాత్మక కవితలనందించిన అందరికి అభినందనలు. 
   ఒకే అంశాన్ని కవితా వస్తువుగా తీసుకుని రాసిన ప్రతి కవితలోని చక్కని సందేశం సమాజానికి చేరాలన్న ఆలోచనతో మన అందరి ముందుకు వస్తున్న ఈ కవితా సంకలనానికి శుభాభినందనలు. ఈ మహా యజ్ఞంలో నాకు నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చిన మనుమసిద్ధి కవి వేదికకు, ఈ మాటలు రాయడానికి కారణమైన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. 

మంజు యనమదల
విజయవాడ 

మరోసారి బాల్యాన్ని పలుకరిద్దామా...!!

మూడు పదుల దూరాన్ని 
క్షణాల్లో మాయం చేసే 
కాలానిదెంత చతురతో కదా

మన వయసెంత పైబడినా 
బాల్యానిదో ప్రత్యేకతే ఎప్పుడూ 
ఎందుకంటే ఆ జ్ఞాపకాలలాంటివి మరి

ఇష్టం లేకున్నా అమ్మ చీర చెంగునొదిలి 
పలకా బలపం పట్టి పోనంటూ మారాము చేస్తూ
బడి బాట పట్టిన మధుర క్షణాలవి

కాకెంగిలి తాయిలాల రుచినెరిగి
గిల్లికజ్జాల అల్లరి ఆటలలో అలకలన్ని మరచి
ఆనందపు హరివిల్లులను నింగి కెగరేసిన పసితనమది

పసి వయసు పోకడలతో తిన్న బెత్తం దెబ్బలు
చిన్నతనపు చేష్టలతో చేసిన చిలిపి పనులు
కంఠతా పట్టిన పద్యాలు పాటలు ఇప్పటికీ తేనేచినుకులే

ఇష్టాలకు ప్రేమలకు కారణం తెలియని వయసది
అయినా అంతరాలనెరుగని ఆత్మీయతతో 
దగ్గరైన చిన్ననాటి చెలిమి చిరునామా ఇది

ఇలా చెప్పుకుంటూ పోతే ముగింపు దొరకని 
మధుర కావ్యమే మన బాల్యమూ కౌమారమూ
అందుకే ఆ అరమరికలు లేని అప్పటి నెయ్యాన్ని
మరోసారి మనందరం ఆత్మీయంగా హత్తుకోవడానికే 
ఈ అపురూప కలయిక...!! 



 

నీరాజనం

                " అక్షర నీరాజనం "
       తన మనసులోని భావాలను అతి సరళమైన పదాలతో తెలుపుతూ చక్కని వచన కవిత్వాన్ని " నీరాజనం " కవితా సంపుటిగా తీసుకువచ్చిన నీరజ చంద్రన్ చౌటపల్లికి హృదయపూర్వక శుభాభినందనలు. 
      వచన కవిత్వం ఫలానా రకంగానే ఉండాలన్న నిబంధనలేం లేవు. మనసుకు నచ్చిన అంశాన్ని  నలుగురు మెచ్చే విధంగా చెప్పగలిగితే ఆ కవిత్వానికి సార్థకత దక్కినట్లే. నీరజ కవిత్వం కూడా అలాంటిదే. చెప్పాలనుకున్న భావాన్ని అలతి పదాలతో అందంగా మనతో మాట్లాడినట్టుగా చెప్పడం ఈమె నేర్పు. 
     జన్మనిచ్చిన తల్లిదండ్రులను అక్షరాలతో అలంకరించి, ఈ జీవితాన్ని అందంగా మలిచిన దైవాన్ని గుర్తు చేసుకోవడం అభినందించదగ్గ విషయం. ఒక నువ్వులో వేరు వేరు భావాలతో పలికించిన మధుర మనసు భావనలు, ప్రేమను, స్నేహాన్ని, జ్ఞాపకాలను, చిన్నతనాన్ని, అందాన్ని, ఆరాధనను, దూరాన్ని, దారులు, పువ్వులను , చెట్టును, చుట్టాలను ఇలా ప్రతి మానవ సంబంధాలను, వాటి మధ్యన ప్రేమ పాశాలను చక్కని కవితలుగా రాశారు. ఎన్నో మానవ సంబంధాలలోని లోతుపాతులను తన కవితలలో చర్చించారు. వరాలను, శాపాలను వ్యక్తీకరిస్తూ, పంచభూతాలను ఉదహరించారు. స్త్రీ విలువతో పాటుగా, ఆమె మీద జరుగుతున్న అకృత్యాలను తన పదునైన మాటలతో ఖండించారు. తెల్ల కాగితం, కన్నీటి స్వరం, వృద్ధుల శరణాలయం కవితలు జీవితపు విలువలను తెలుపుతాయి. రైతు గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గురించి తనదైన స్వరంతో చక్కని భావాలు అందించారు. జీవిత కథలను, ఆత్మఘోషను ఆర్తిగా వినిపించారు. జీవిత పుస్తకపు సారాన్ని, మానవజన్మ ఆవశ్యకతను, మరెన్నో జీవిత నిత్యసత్యాలను తాత్విక తత్వంతో " నీరాజనం" గా అందించిన నీరజ చంద్రన్ చౌటపల్లికి మనసారా అభినందనలు తెలుపుతూ, ఈ చక్కని నీరాజనానికి నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

మరిన్ని అక్షర నీరాజనాలు తెలుగు సాహితీ లోకానికి అందించాలని కోరుకుంటూ శుభాభినందనలు. 

మంజు యనమదల 
విజయవాడ. 

16, మార్చి 2025, ఆదివారం

కావడి

కావడి
పార్ట్ 1

"  ప్రేమంటే ఇచ్చి పుచ్చుకునే వస్తువు కాదు. గుప్పెడు జ్ఞాపకాలను గుంభనంగా గుభాళింపజేసే పరిమళం. "

నాంది.. 
       ఎన్నో ప్రేమ కతలను చూసిన గోదారికి ఈ ప్రేమ కథ కొత్తగా తోచిందనుకుంటా. అందుకే వెన్నెల్లోనే కాకుండా చీకటిలోనూ భలే తళుకులీనుతూ నక్షత్రాల మెరుపులతో అల్లరిగా కదులుతోంది. వరద గోదారి ఒద్దికగా.. ఆరుబయట వెన్నెల్లో ఓ తాత తన మంచం చుట్టూ చేరిన పిల్లలకు చెప్తున్న కమ్మని కతకు ఊ.. కొడుతోంది. మరి మనమూ వినేద్దామా..!
        ఎప్పుడూ పిల్లలు అడగకుండానే బోలెడు కథలు చెప్పే రాజన్న తాత ఆ రోజెందుకో కాస్త బడలికగా ఉన్నాడు. దానికి కారణం ఆరోజు పొద్దున ఊరిలో జరిగిన విషయం అనుకుంటా. తాత ఇంటికి నాలుగిళ్ళ అవతల ఓ బామ్మా మనుమరాలు మధ్యన జరిగిన గొడవ గురించి. 
       తల్లీదండ్రీ లేని పిల్లను అన్నీ తానై ఎంతో ప్రేమగా పెంచింది బామ్మ. తాముండేది పల్లెటూరైనా ఎన్నో కష్టాలకోర్చి పిల్లను డిగ్రీ చదివించింది. ఇప్పటి కొందరు ఆడపిల్లలానే ఆ పిల్లా ప్రేమలో పడింది. ఆ విషయం తెలిసి బామ్మ, మనుమరాలి దగ్గర మాట తీసుకుంది. మాట ఇచ్చిన మనుమరాలు మాటను గాలికి వదిలేసి, ఇంట్లోనుండి పారిపోదామని ప్రయత్నించి బామ్మకు దొరికిపోయింది. ఆ విషయం నలుగురికి తెలిసి పిల్లను మందలించారందరు. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ప్రేమ మత్తులో అయినవాళ్ళను మోసం చేసి, పారిపోవడం సరైనది కాదు. నీ మీదే ప్రాణం పెట్టుకు బతుకున్న ముసలిదాన్ని వదిలేసి నీ మానాన నువ్వు వెళిపోవడం ఎంత వరకు సబబు? నువ్వే ఆలోచించుకో అని పిల్లకు చెప్పి, పిల్లకు పెళ్లి చేయడం నీ బాధ్యత. పంతాలకు పోకుండా పిల్ల ఇష్టాన్ని, మంచిచెడులను ఆలోచించి పిల్లకు నచ్చజెప్పమని బామ్మకు చెప్పారు. అప్పట్లో పల్లెటూర్లలో ఓ ఇంటి సమస్య అంటే ఊరందరి సమస్యగా భావించేవారు. అనుబంధాలను కలుపుకోవడానికి రక్త సంబంధమో, చుట్టరికమో ఉండాలన్న నిబంధనలు లేని రోజులవి.
                  
           

కావడి పార్ట్2
        కథ చెప్పు రాజన్నా అన్న పిల్లల కేకలతో ఈ లోకంలోనికి వచ్చాడు రాజన్న. ఉండండిరా మీకో
 మంచి కథ చెబుతాను అల్లరి చేయకుండా వినండి అంటూ కథ మెుదలెట్టాడు.   
        చిన్నప్పుడు ఆరుబయట వెన్నెల్లో అమ్మ పక్కన పడుకుని, అమ్మ చెప్పే కథలు వింటూ నిద్దరోవడం రాజన్నకు భలే ఇష్టం. అలా అమ్మ చెప్పిన కథలన్నింటికి మరికొంత కొత్తదనం చేర్చి స్కూల్లో స్నేహితులకు చెప్పడం రాజన్నకు అలవాటైపోయింది. పెద్దవాడైనా కథలు చెప్పే అలవాటు మాత్రం పోలేదు. కాని ఇప్పుడు చెప్పే కథను, ఇలా చెప్పాల్సిన రోజు వస్తుందని రాజన్న ఏనాడు ఊహించలేదు. మనం అనుకోనివి జరగడమే జీవితమని ఓ బరువైన నిట్టూర్పుతో కథ మెుదలెడతాడు.  
      
   ఓ ఊరిలో తండ్రీ కొడుకులుంటారు. తండ్రి పెరట్లో పని చేసుకుంటూ, ఇంట్లోకి కొడుకు వచ్చిన చప్పుడు విని, కొడుకుని పిలుస్తాడిలా. 
        ఒరేయ్ అబ్బాయ్ నీకేదో ఉత్తరమెుచ్చింది చూడరా అన్న నాన్న కేక, పెరటిలో నుండి విన్న రాజా అవునా నాన్నా ఎక్కడ ఉత్తరం అంటాడు. హాల్లో టేబుల్ మీద పెట్టాను చూసుకో అన్న నాన్న మాట విని, సరే నాన్నా అంటూ ఉత్తరాన్ని చేత్తో పట్టుకుని, అటూ ఇటూ తిప్పి చూసాడు. ఎవరి దగ్గర నుండి వచ్చిందో తెలియలేదు. ఇంత ఆలోచించడం ఎందుకు ఓపెన్ చేసి చూద్దామని, నెమ్మదిగా ఓ పక్క నుండి కట్ చేసాడు. ఎన్వలప్ లోనుండి లేత గులాబి పేపర్ చేతికి వచ్చింది. అందమైన లేత గులాబి రంగు లెటర్ పాడ్ కి  పైనా కిందా లేత పసుపురంగు చిన్న చిన్న జంట గులాబీలు. భలే అందంగా ఉంది చూడగానే. ఇంత అందమైన ఉత్తరం పంపింది ఎవరా అని ఆత్రంగా కింద పేరు ఉందేమోనని చూస్తే పేరు లేదు. సరేనని ఉత్తరం చదవడం మెుదలుపెడితే లెటర్ హెడ్ అంత అందమైన అక్షరాలు కనిపించాయి.
ప్రియమైన నీకు, 
                        ఏంటోయ్ ఎవరీ ఉత్తరాల రాక్షసి అనుకుంటున్నావా! అంతగా ఆలోచించకు చదువులబ్బాయ్. నువ్వు నాకు బాగా తెలుసులే.  ఎంతసేపు పుస్తకాలే లోకం కాదబ్బాయ్. కాసింత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించు. నువ్వు పుస్తకాలను ప్రేమించినంతగా నన్ను కూడా ప్రేమించాలన్న ఆకాశమంత ఆశ నాది. ఎప్పటికి తీరుతుందో ఏమో. అమ్మ చాటు ఆడపిల్లని కదా. నేనెవరో చెప్పలేను నీకు. నువ్వెప్పటికి నన్ను కనుక్కుంటావో చూద్దాం. చివరగా ఓ చిన్న మాట. 
" ప్రేమ కన్నా ఆరాధన గొప్పది. "
ఆ ఆరాధన మనసంతా నీ కోసం నింపుకుని ఎదురుచూస్తున్న ..
                                నీ
                          ప్రేమారాధన.
ఉత్తరం చదివిన రాజాకి మనసంతా ఏదోలా అయిపోయింది. ఈ ఆరాధకురాలెవరో కనిపెట్టాలి అని అనుకుంటూ అంతకన్నా ముందు కాలేజ్ కి వెళ్ళాలి. ఈ ఉత్తరం సంగతి తర్వాత చూద్దామనుకుంటాడు. ఈలోపల నాన్న లోపలికి వస్తూ ఏరా రాజా ఎక్కడినుండి ఉత్తరం? ఎవరు రాశార్రా? అంటే.. నా ఫ్రెండ్ రాశాడు నాన్నా. కాలేజ్ గురించి కనుక్కోమని అని కాస్త తడబడుతూ చెప్తాడు. వీడేంటో వీడి కంగారేంటో, ఎలా బతుకుతాడో ఏంటో! చదువు తప్ప మరో లోకం తెలియదు వెర్రినాగన్న.   అనుకుంటాడు రాజా నాన్న. 

తర్వాత పక్క ఊరిలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో కాలేజ్ ముచ్చట్లు, 

    చుట్టుపక్కల నాలుగైదూళ్ళకు కలిపి ఒక్కటే ఇంజనీరింగ్ కాలేజ్. ఆ పక్కనే డిగ్రీ కాలేజ్. అప్పట్లో ఇంజనీరింగ్ లో సీట్ రావడం అంటే చాలా కష్టం. మధ్యతరగతి వాళ్ళకు ఓ గొప్ప కల ఇంజనీరింగ్ చదవడమంటే. 
    రాజా చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. అలా అని చదువులోనే కాకుండా ఆటలు, అల్లరి, కథలు చెప్పడం, బొమ్మలేయడం ఇలా అన్నింట్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఊరందరికి ఇష్టుడే. కొందరు కథలు బాగా రాస్తారు. ఇక్కడ రాజా కథలు కొత్తదనంతో ఉంటాయి. ఆసువుగా అప్పటికప్పుడు చెప్పేయడం రాజా ప్రత్యేకత. 
         ఇంజనీరింగ్ కాలేజ్ సైకిల్ స్టాండ్ లో కూర్చుని అల్లరి రాగింగే కాకుండా, కథలు కూడా చెప్పేస్తూ తన చుట్టూ ఉండే స్నేహితులను నవ్విస్తూ ఉండేవాడు. ఆ కథలు వింటూ స్నేహితులు, ఒరేయ్ రాజా ఈ కథల్ని పుస్తకంలో రాసి పెట్టరా. బోలెడు సినిమాలకు పనికివస్తాయి అనేవారు. ఎవరూ చెప్పని కథతో ఓ మంచి సినిమా తీయాలిరా నువ్వు ఎప్పటికైనా అని అనేవారు. రాజా నవ్వేసి నా చదువు నన్ను చదువుకోనివ్వండిరా, ఈ సినిమాగోలలోకి నన్ను లాగబాకండి అనేవాడు.
    కెమిస్ట్రీ లాబ్ లో లాఫింగ్ గాస్ తో లెక్చరర్ ని ఆట పట్టించడము, బ్యూరెట్, పిపెట్ లతో సరదాలు, సివిల్ ఫీల్డ్ వర్క్ లో జామకాయలు తింటూ, వచ్చే పోయేవారిని ఆట పట్టించడం,  కాలేజ్ కాంటిన్ లో మిరపకాయ బజ్జీలు తింటూ జోకులు, ఎలక్ట్రికల్ లాబ్ లో లెక్చరర్ చెప్పినట్టు కాకుండా అటువిటు ఇటువటు వైర్లు కలిపి షార్ట్ సర్కూట్ చేసి అందరిని భయపెట్టడం, లెక్చరర్స్ వీళ్ళ గోల పడలేక ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేయడం, వీళ్ళని ఓ వారంపాటు క్లాసులు నుండి సస్పెండ్ చేయడం, తర్వాత అపాలజీ లెటర్ రాసివ్వడం జరుగుతాయి.
         
           అప్పట్లో కంప్యూటర్స్ అపురూపం. ఎవరికి ఏమీ పెద్దగా తెలియదు. ఆ టైంలోనే రాజా తనకున్న కథల,బొమ్మల క్రియేటివిటితో యానిమేషన్ లో సరికొత్తగా కాలేజ్ డే కి తోలుబొమ్మలాటను ఓ తల్లీబిడ్డల ప్రేమ కథగా రూపొందిస్తాడు. 
             పాపాయి పిండంగా తల్లి బొజ్జలో చేరింది మెుదలు, ఆ తల్లి పాపాయికి చెప్పిన ఊసులు, పుట్టిన పాపాయికి అన్నీ తానైన అమ్మ, పసిబిడ్డకు చెప్పిన లాలికబుర్లు, జోలపాటలు, తను మరణిస్తానని తెలిసినప్పుడు పాపాయికి చెప్పిన అప్పగింతలు ఇలా అన్నీ చూపెడుతూ, ఆరుబయట వెన్నెల్లో అమ్మ పక్కన పాపాయి నిదుర పోతుంటే ఆ తల్లి తన చీర చెంగు పాపాయికి రక్షణగా కప్పి, తను ప్రాణం వదిలేయడం, పాపాయి నిదురలేచి పాల కోసం తడుముకోవడం, ఇదంతా చాలా హృద్యంగా తీస్తాడు.
           అది చూసిన అందరు అప్పటి వరకు రాజాలో అల్లరి వెనుక ఎంత ఆలోచన, సున్నితత్వం ఉందో తెలుసుకుంటారు. తర్వాత ఆ చుట్టుపక్కల కాలేజ్ లలో కూడా రాజా పేరు మారుమోగి పోతుంది.. అలా పక్కన డిగ్రీ కాలేజ్ హితతో పరిచయం, అది స్నేహంగా మారడం జరుగుతుంది. 
   రాజా తనకు వచ్చిన లెటర్ గురించి  హితకు చెప్తాడు. హిత ఆట పట్టిస్తుంది. 

  రాజాకు కాలేజ్ లో హితతో పాటు శ్వేత కూడా మంచి ఫ్రెండ్. హిత, శ్వేత చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్ కూడాను. ఓ రోజు శ్వేతని ఎవరో కామెంట్ చేసారని రాజా వాళ్లకు బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అది మనసులో పెట్టుకుని వాళ్ళు రాజా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. వీళ్ళ ముగ్గురు స్నేహం గురించి చెత్తగా కామెంట్లు చేస్తుంటారు. అవి హిత వాళ్ళ పోలీసు అన్నయ్య కూడా వింటాడు. హితను రాజాతో ఫ్రెండ్షిప్ మానేయమని చెప్పాడు. హిత పట్టించుకోదు. 

రాజాకు వచ్చిన లెటర్ సంగతి తెలిసి హిత, శ్వేత కూడా ఆ ఆరాధకురాలిని వెదకడంలో రాజాకు హెల్ప్ చేస్తామని మాట ఇచ్చి, మాట నిలబెట్టకపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కాని ఫలితం ఉండదు. 

ఓరోజు కాలేజ్ లో కాంటిన్లో ఇద్దరి మధ్యన మాటా మాటా పెరిగి పెద్ద గొడవ అవుతుంది. ప్రిన్సిపాల్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న హిత వాళ్ళ పోలీసు అన్నయ్య ఆ గొడవ టైమ్ లో అక్కడే ఉన్న రాజాని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళతాడు. తనకు ఆ గొడవకు సంబంధం లేదని రాజా ఎంత చెప్పినా వినడు. స్టేషన్ లో తన ప్రతాపమంతా రాజాపై చూపిస్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ వచ్చి సర్దిచెప్పి అందరిని విడిపిస్తాడు.

ఈ విషయం జరిగిన తర్వాత రాజా కాస్త మూడిగా ఉంటాడు హితతో. హిత బాధ చూడలేక శ్వేత ఎంత నచ్చజెప్పినా కాస్త దూరంగానే ఉంటూ ఉంటాడు. తర్వాత శ్వేతకు పెళ్లి కుదురుతుంది. హితకు వాళ్ళ పోలీసు అన్నయ్య సంబంధాలు చూస్తున్నాడని రాజాకు చెబుతుంది శ్వేత. మంచిదే కదా చూడని అంటాడు రాజా. ఆ మాటకు హితకు బాగా కోపం వచ్చి ఇంక నీకు కనబడనులే అని వెళిపోతుంది. అలా శ్వేత, హిత ఇద్దరూ దూరమైపోతారు రాజా చదువు అయ్యేసరికి. ఎవరి ఇబ్బందులు వాళ్లవని సరిపెట్టుకుంటాడు రాజా. 

చిన్నప్పుడే దూరమైన అమ్మ ప్రేమను ఆకాశరామన్న ఉత్తరంలో అందుకున్న రాజా ఆ ప్రేమికురాలిని వెదకి పట్టుకోవడంలో ఓడిపోయానని అనుకుని, అన్ని తానై చూసుకున్న నాన్నను ఒంటరిగా వదలలేక నాన్నతోనే ఉండిపోతాడు.

   కలిసుండాలంటే కారణాలు వెదకాలి కాని విడిపోవడానికి చిన్న అపార్థం చాలన్నట్టుగా రాజా, హిత, శ్వేత అలా విడిపోతారు. వీరి ఎడబాటుకు కారణమైన హిత పోలీసు అన్నయ్య మాత్రం ఈ విషయంలో తన ప్రమేయముందని హితకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. బయట అందరికి హితని ప్రేమగా చూసుకునే అన్నలా బిల్డప్ ఇచ్చే ఈ పోలీస్ అన్న అసలు అన్న కాదు. మారుటి తల్లి కొడుకు. హిత వాళ్ళ మీద చిన్నప్పటినుంచి పెంచుకున్న కోపమే వీటన్నింటికి కారణం. ఇవేమీ హితకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. రాజాకి అంతా తెలుసు. కాని హితకు చెప్పడు. 

ఇంజనీరింగ్ చదివినా నాన్న మీద ప్రేమతో రాజా ఊరిలోనే ఉండిపోతాడు వ్యవసాయం చేసుకుంటూ,  పిల్లలకు ట్యూషన్ లు చెప్తూ. 

ఈ కథంతా విన్న పిల్లలు భలే బావుంది తాతయ్యా కథ అంటూ, మరి రాజా హితలు అసలు కలవలేదా తర్వాత అని అడుగుతారు. 
అంతలో కథ వింటున్న ఓ ఇద్దరు పిల్లలు గట్టిగా కలవరు..కలవరంటే కలవరు అంటారు. రాజన్న ఆశ్చర్యంతో మీకెలా తెలుసర్రా కలవరని అంటాడు. మా అమ్మ బోలెడుసార్లు చెప్పింది తాతా ఈ కథ. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ కలవలేదు వాళ్ళిద్దరు. ఇక కలవరు అని చెప్తారు. అవునర్రా వీళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళిద్దరు కలవలేదర్రా అని చెప్తాడు రాజన్న. పిల్లలు అందరు వెళిపోతారు. 

    ఈ ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా అక్కడే ఉంటారు. ఎవరర్రా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా. ఎప్పుడు చూడలేదిక్కడ అంటాడు. అవును తాతయ్యా మా జేజి వాళ్ళింటికి వచ్చాము. ఈ కథ మాకు చాలా బాగా తెలుసు అని చెప్పగానే, ఆశ్చర్యంగా మీకెవరు చెప్పారీ కథ అని అడుగుతాడు. అమ్మ చెప్పింది తాతయ్యా అని పిల్లలు చెప్తారు. మీ అమ్మెవరు, మీదేవూరు అని అడిగితే పలానా ఊరని చెప్తారు పిల్లలు. తీరా ఆరా తీస్తే శ్వేత వాళ్ళమ్మని తెలిసి వాళ్ళింటికి వెళ్తాడు రాజన్న.
        అప్పటికే ఆరోగ్యం బాలేని శ్వేత రాజాని చూసి కన్ను మూస్తుంది, హిత గురించి వివరాలేం చెప్పకుండానే. పిల్లలు రాజాకు శ్వేత డైరీ తెచ్చి ఇస్తారు. ఇది అమ్మ ఎవరిని ఇప్పటి వరకు ముట్టుకోనీయలేదు. దానిలో ఏముందో ఎవరికి తెలియదు అని చెప్తారు. ఆ డైరీతో పాటు ఓ లెటర్ హెడ్ కూడా ఉంటుంది. అది చూడగానే రాజాకి ఓ క్షణం ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ వెంటనే తన దగ్గరున్న లెటర్ హెడ్. ఇది ఒకటేనని గుర్తు పడతాడు. ఓ క్షణం అయోమయాన్కి గురౌతాడు శ్వేతేనా ఆ ఆరాధకురాలు అని. ఇక ఆలస్యం చేయకుండా డైరీ చదువుతాడు. దానిలో ఉన్న విషయం చదివి దిగ్భ్రాంతికి లోనౌతాడు. చాలా ఆవేదనగా పిల్లలను దగ్గరకి తీసుకుంటాడు. మీకు నేనున్నానంటూ వారికి ధైర్యం చెబుతాడు. 

శ్వేత డైరీలో రాసిన విషయాలు రాజా కళ్ళ ముందు కదలాడుతుంటాయి. హితే ఆ ఆరాధకురాలని, ఇద్దరు కలిసి రాజాని ఆట పట్టించారని ఇలా అన్ని విషయాలు ఆ డైరీలో ఉంటాయి. రాజా దూరమైయ్యాక హిత తన పోలీసన్నతో గొడవ పడి పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయిందని కూడా ఉంటుంది. డైరీలో ఉన్న అడ్రస్‌ పట్టుకుని హితను కలుసుకుంటాడు రాజన్న. ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతారలాగే ఒకరినొకరు చూసుకుంటూ. 
  ఇన్నేళ్ళ నిరీక్షణకు ఫలితంగా తమను కలిపిన శ్వేత పిల్లలను దత్తత తీసుకుని, శ్వేత డైరీలో రాసిన ఆస్తుల వివరాల ప్రకారం  పిల్లలకు అండగా ఉండి, ఆస్తి మెుత్తం వాళ్ళకు దక్కేటట్లు చేస్తాడు. 
ప్రేమంటే కలిసి బతకడం మాత్రమే కాదు. కలకాలం ఆ జ్ఞాపకాలతో గుండెను నింపుకోవడం. చరిత్రలో  ప్రేమకథలన్నీ విషాదాలే కాని ఈ రాజా హితల ప్రేమకథ ప్రేమారాధనకు అసలైన అర్థం చెప్పిన కథ. అదే ఈ కావడి(హృదయం)లో నిండిన అసలైన ఆత్మానందం.

ప్రేమకు, ఆరాధనకు అర్థం తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ కథ అంకితం. 

                       

10, మార్చి 2025, సోమవారం

ఆనందాలు..!!

 ఏ పరిచయం ఎందుకో మనకి తెలియదు కాని కొన్ని పరిచయాలు ఆత్మీయబంధాలుగా మారి ఇలా వుండిపోతాయి చివరి వరకూ..😍❤️💕లవ్యూ స్వాతి

అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలోఆత్మీయంగా అందించిన సత్కారానికి శ్రీ శ్రీ కళావేదిక వ్యవస్థాపకులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి, నిర్వాహకులు రమావతి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..

మరో కార్యక్రమంలో నా ఆత్మీయ సోదరి సత్యాస్వాతి అందించిన సత్కారానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు

















నైజం..!!

నేస్తం,

         యాదృచ్ఛికంగా ఒకే విషయం వేరు వేరు సంఘటనల్లో కనబడటం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ వుంటుంది. మంచి చెడు అనేది మన మనసు స్వీకరించేదాన్ని బట్టి వుంటుందని మనకూ తెలుసు

           పెద్దాయన తాను రాసిన అన్న కవితకు మరో పెద్దాయన చెప్పిన సారాన్ని వివరిస్తూ సమాచారాన్ని నాకు పంపారు. మొదటి పేరా చదువుతున్నప్పుడు నా మనసులోని మాటలే రెండవ పేరాలో కనిపించాయి.

  మాటలు ఇక్కడ మీ అందరి కోసం..

 

  

 

అని నాలుగు అక్షరాలు నాలుగు పాదాలలో రాసి కవితగా కొంతమందితో పంచుకున్నానుఒక మిత్రుడు కవితకి వ్యాఖ్యానం రాసి నా మనసు  దోచుకున్నాడు

“ ‘’  అంటే అమ్మకి ప్రతీక. ‘అంటే ఆలయానికి ప్రతీక. ‘అంటే ఇంటికి ప్రతిరూపం. ‘ఈశ్వరుని బీజాక్షరం.  “ఇంటిని ఆలయంలా  తీర్చిదిద్దే అమ్మ ఈశ్వరిఇంత గొప్ప కవిత రాసిన మీకు మా సంస్థ ద్వారా  ‘మహాకవిబిరుదు తో సత్కారం చేయిస్తానుఅని రాశాడు సహృదయమూర్తిఅక్షరాలు అడ్డంగా రాస్తే వర్ణక్రమం అయింది, నిలువుగా రాస్తే మహా కవిత అయింది. నేను కేవలం అక్షరాలే రాసి పంచుకున్నాను, కవితా దృష్టితో కాదు


మనం రాసినదానిని స్వీకరించే వారిని బట్టి, అందులోనూవిమర్శకులుచూసే కోణం బట్టి మన రాత కి విలువ వస్తుంది. మనం రాసినదానిలో రంధ్రాలు ఉన్నా అది మహోద్గ్రంధం అని కొనియాడబడవచ్చు. మనం గొప్ప కావ్యం రాసామని భావిస్తే విమర్శకులు బహు రంధ్ర దర్శనం చేయవచ్చు. అందం చూసేవారి దృష్టిలో ఉంటుంది. అందం, సత్యం, ధర్మం అందరికీ ఒకేలా కనపడవు.   కావ్యం రాయాలంటే ఋషి తత్వం తో నిందా స్తుతులను ఒకేలా స్వీకరించాలి


           అంతకు ముందు నేనుచామంతిసీరియల్ వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే చాలా గొప్ప మాటలు వినిపించాయి. అష్టకష్టాలు పడిన రాముడు, కృష్ణుడు దేవుళ్లు కాకుండా పోయారా..అంటూ ఉదహరిస్తూ..

   “కష్టపడుతున్నావంటే నీ జాతకం బాగోలేక కాదు. నువ్వు గొప్ప స్థాయికి వెళుతున్నావని అర్థం. కష్టమనే మెట్ల మీద దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెట్ట బోతున్నాడని అర్థం”. 

     సాధారణంగా మనం ఎదుటివారిలో లోపాలు వెదకడానికే ఎక్కువగా ఇష్టపడతాం.అక్కడికి మనమేదో మహా నికార్సయిన మహానుభావులమన్నట్టు. మంచిని చూడలేని మనకు లోపాలను ఎత్తిచూపే హక్కు ఎలా వుంటుందని అస్సలు ఆలోచించం కదా! ఎంతయినా మనిషి నైజం ఇంతేనని మనమూ మనుష్యులమేగా అని సరిపెట్టేసుకుంటూ లోపాల లెక్కలు తేల్చుకుందాం పదండి ముందుకు..పదండి తోసుకు..పదండి పైపైకి అందలాలు అధిరోహించేంత వరకు అలుపెరగక సాగండి మునుముందుకు..!!

    


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner