17, మార్చి 2025, సోమవారం
ముందు మాట... శస్త్రాలు
అక్షర హారతుల నుండి జ్వలించిన అగ్నికణాలు ఈ " శస్త్రాలు "
దైవానికి నివేదనగా అందమైన గంగా హారతులే కాకుండా మనసులను, మనుష్యులను చైతన్యపరిచే కవితాత్మక గీతాలను, దేశభక్తి, విప్లవ గేయాలను రచించి, వాటిని అక్షరాస్త్రాలుగా సాహితీ లోకానికి అందించిన రంగిశెట్టి రమేష్ (గంగాశ్రీ) గారి గేయ కవితా సంపుటి " శస్త్రాలు " కి హృదయపూర్వక అభినందనలు.
సమాజంలోని పలు అంశాలపై గంగాశ్రీ గారు తమ స్పందనను పాటల రూపంలో అందించారు ఈ పుస్తకంలో. గూడు చెదిరిన గవ్వ గురించి రాసినా, గుండె మంటను అగ్నికణంగా మార్చి అక్షరంగా ప్రయెాగించినా అది చదువరుల మదిని తాకే విధంగా రాయగల నేర్పు వీరి సొంతం. జాతీయతను, దేశభక్తిని అద్భుతంగా చాటిన గీతాలెన్నో ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. వందేమాతరం గీతం నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాయబడింది. విప్లవ గీతాలు చదువుతుంటే మనసు ఉరకలెత్తే ఆవేశంతో పరుగులు పెడుతుందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పలు గీతాలు రచించారు. కరోనాను వదలిపొమ్మని వేడుకోలు గీతాలు రాశారు. పల్లె పదాలతో పల్లె జీవితాలను, రైతుల గోడును కనుల ముందుంచారు.
నేను అంటూ తన గురించి చెప్పుకోవడమూ, అంతరంగపు ఆవిష్కరణ, సేవామూర్తుల గురించి, సాహితీ సౌరభాల గురించి, నవ్యాంధ్ర రచయిత సంఘం గురించి రాసిన కవితా గీతాలు అక్షర పారిజాతాలు. వ్యవస్థలోని లోపాలను, రాజకీయ అసమానతలను ఎత్తిచూపిన గీతాలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి. అలతి పదాలతో అగ్నిజ్వాలలను వెదజల్లిన అక్షరాలివి. ప్రతి గీతమూ ఓ అక్షరశరమై మనసున్న ప్రతి మనిషిని తాకుతుందని ఘంటాపథంగా చెప్పగలను.
ఈ శస్త్రాలు గేయ కవితా సంపుటికి నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చిన రంగిశెట్టి రమేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..
వీరి నుండి మరిన్ని రచనలు సాహితీ లోకానికి చేరాలని ఆకాంక్షిస్తూ...అభినందనలతో..
మంజు యనమదల
విజయవాడ
వర్గము
ముందుమాట
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి