నేస్తం,
యాదృచ్ఛికంగా ఒకే విషయం వేరు వేరు సంఘటనల్లో కనబడటం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ వుంటుంది. మంచి చెడు అనేది మన మనసు స్వీకరించేదాన్ని బట్టి వుంటుందని మనకూ తెలుసు.
ఓ పెద్దాయన తాను రాసిన అ ఆ ఇ ఈ అన్న కవితకు మరో పెద్దాయన చెప్పిన సారాన్ని వివరిస్తూ ఆ సమాచారాన్ని నాకు పంపారు. మొదటి పేరా చదువుతున్నప్పుడు నా మనసులోని మాటలే రెండవ పేరాలో కనిపించాయి.
ఆ మాటలు ఇక్కడ మీ అందరి కోసం..
”అ
ఆ
ఇ
ఈ
అని నాలుగు అక్షరాలు నాలుగు పాదాలలో రాసి కవితగా కొంతమందితో పంచుకున్నాను. ఒక మిత్రుడు ఈ “కవిత” కి వ్యాఖ్యానం రాసి నా మనసు దోచుకున్నాడు.
“ ‘అ’ అంటే అమ్మకి ప్రతీక. ‘ఆ’ అంటే ఆలయానికి ప్రతీక. ‘ఇ’ అంటే ఇంటికి ప్రతిరూపం. ‘ఈ’ ఈశ్వరుని బీజాక్షరం. “ఇంటిని ఆలయంలా తీర్చిదిద్దే అమ్మ ఈశ్వరి. ఇంత గొప్ప కవిత రాసిన మీకు మా సంస్థ ద్వారా ‘మహాకవి’ బిరుదు తో సత్కారం చేయిస్తాను” అని రాశాడు ఆ ‘సహృదయ’ మూర్తి. అక్షరాలు అడ్డంగా రాస్తే వర్ణక్రమం అయింది, నిలువుగా రాస్తే మహా కవిత అయింది. నేను కేవలం అక్షరాలే రాసి పంచుకున్నాను, కవితా దృష్టితో కాదు.
మనం రాసినదానిని స్వీకరించే వారిని బట్టి, అందులోనూ ‘విమర్శకులు’ చూసే కోణం బట్టి మన రాత కి విలువ వస్తుంది. మనం రాసినదానిలో రంధ్రాలు ఉన్నా అది మహోద్గ్రంధం అని కొనియాడబడవచ్చు. మనం గొప్ప కావ్యం రాసామని భావిస్తే విమర్శకులు బహు రంధ్ర దర్శనం చేయవచ్చు. అందం చూసేవారి దృష్టిలో ఉంటుంది. అందం, సత్యం, ధర్మం అందరికీ ఒకేలా కనపడవు. కావ్యం రాయాలంటే ఋషి తత్వం తో నిందా స్తుతులను ఒకేలా స్వీకరించాలి”
అంతకు ముందు నేను “చామంతి” సీరియల్ వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే చాలా గొప్ప మాటలు వినిపించాయి. అష్టకష్టాలు పడిన రాముడు, కృష్ణుడు దేవుళ్లు కాకుండా పోయారా..అంటూ ఉదహరిస్తూ..
“కష్టపడుతున్నావంటే నీ జాతకం బాగోలేక కాదు. నువ్వు గొప్ప స్థాయికి వెళుతున్నావని అర్థం. కష్టమనే మెట్ల మీద దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెట్ట బోతున్నాడని అర్థం”.
సాధారణంగా మనం ఎదుటివారిలో లోపాలు వెదకడానికే ఎక్కువగా ఇష్టపడతాం.అక్కడికి మనమేదో మహా నికార్సయిన మహానుభావులమన్నట్టు. మంచిని చూడలేని మనకు లోపాలను ఎత్తిచూపే హక్కు ఎలా వుంటుందని అస్సలు ఆలోచించం కదా! ఎంతయినా మనిషి నైజం ఇంతేనని మనమూ మనుష్యులమేగా అని సరిపెట్టేసుకుంటూ లోపాల లెక్కలు తేల్చుకుందాం పదండి ముందుకు..పదండి తోసుకు..పదండి పైపైకి అందలాలు అధిరోహించేంత వరకు అలుపెరగక సాగండి మునుముందుకు..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి