17, మార్చి 2025, సోమవారం
నీరాజనం
" అక్షర నీరాజనం "
తన మనసులోని భావాలను అతి సరళమైన పదాలతో తెలుపుతూ చక్కని వచన కవిత్వాన్ని " నీరాజనం " కవితా సంపుటిగా తీసుకువచ్చిన నీరజ చంద్రన్ చౌటపల్లికి హృదయపూర్వక శుభాభినందనలు.
వచన కవిత్వం ఫలానా రకంగానే ఉండాలన్న నిబంధనలేం లేవు. మనసుకు నచ్చిన అంశాన్ని నలుగురు మెచ్చే విధంగా చెప్పగలిగితే ఆ కవిత్వానికి సార్థకత దక్కినట్లే. నీరజ కవిత్వం కూడా అలాంటిదే. చెప్పాలనుకున్న భావాన్ని అలతి పదాలతో అందంగా మనతో మాట్లాడినట్టుగా చెప్పడం ఈమె నేర్పు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులను అక్షరాలతో అలంకరించి, ఈ జీవితాన్ని అందంగా మలిచిన దైవాన్ని గుర్తు చేసుకోవడం అభినందించదగ్గ విషయం. ఒక నువ్వులో వేరు వేరు భావాలతో పలికించిన మధుర మనసు భావనలు, ప్రేమను, స్నేహాన్ని, జ్ఞాపకాలను, చిన్నతనాన్ని, అందాన్ని, ఆరాధనను, దూరాన్ని, దారులు, పువ్వులను , చెట్టును, చుట్టాలను ఇలా ప్రతి మానవ సంబంధాలను, వాటి మధ్యన ప్రేమ పాశాలను చక్కని కవితలుగా రాశారు. ఎన్నో మానవ సంబంధాలలోని లోతుపాతులను తన కవితలలో చర్చించారు. వరాలను, శాపాలను వ్యక్తీకరిస్తూ, పంచభూతాలను ఉదహరించారు. స్త్రీ విలువతో పాటుగా, ఆమె మీద జరుగుతున్న అకృత్యాలను తన పదునైన మాటలతో ఖండించారు. తెల్ల కాగితం, కన్నీటి స్వరం, వృద్ధుల శరణాలయం కవితలు జీవితపు విలువలను తెలుపుతాయి. రైతు గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గురించి తనదైన స్వరంతో చక్కని భావాలు అందించారు. జీవిత కథలను, ఆత్మఘోషను ఆర్తిగా వినిపించారు. జీవిత పుస్తకపు సారాన్ని, మానవజన్మ ఆవశ్యకతను, మరెన్నో జీవిత నిత్యసత్యాలను తాత్విక తత్వంతో " నీరాజనం" గా అందించిన నీరజ చంద్రన్ చౌటపల్లికి మనసారా అభినందనలు తెలుపుతూ, ఈ చక్కని నీరాజనానికి నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.
మరిన్ని అక్షర నీరాజనాలు తెలుగు సాహితీ లోకానికి అందించాలని కోరుకుంటూ శుభాభినందనలు.
మంజు యనమదల
విజయవాడ.
వర్గము
ముందు మాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి