17, మార్చి 2025, సోమవారం
మరోసారి బాల్యాన్ని పలుకరిద్దామా...!!
మూడు పదుల దూరాన్ని
క్షణాల్లో మాయం చేసే
కాలానిదెంత చతురతో కదా
మన వయసెంత పైబడినా
బాల్యానిదో ప్రత్యేకతే ఎప్పుడూ
ఎందుకంటే ఆ జ్ఞాపకాలలాంటివి మరి
ఇష్టం లేకున్నా అమ్మ చీర చెంగునొదిలి
పలకా బలపం పట్టి పోనంటూ మారాము చేస్తూ
బడి బాట పట్టిన మధుర క్షణాలవి
కాకెంగిలి తాయిలాల రుచినెరిగి
గిల్లికజ్జాల అల్లరి ఆటలలో అలకలన్ని మరచి
ఆనందపు హరివిల్లులను నింగి కెగరేసిన పసితనమది
పసి వయసు పోకడలతో తిన్న బెత్తం దెబ్బలు
చిన్నతనపు చేష్టలతో చేసిన చిలిపి పనులు
కంఠతా పట్టిన పద్యాలు పాటలు ఇప్పటికీ తేనేచినుకులే
ఇష్టాలకు ప్రేమలకు కారణం తెలియని వయసది
అయినా అంతరాలనెరుగని ఆత్మీయతతో
దగ్గరైన చిన్ననాటి చెలిమి చిరునామా ఇది
ఇలా చెప్పుకుంటూ పోతే ముగింపు దొరకని
మధుర కావ్యమే మన బాల్యమూ కౌమారమూ
అందుకే ఆ అరమరికలు లేని అప్పటి నెయ్యాన్ని
మరోసారి మనందరం ఆత్మీయంగా హత్తుకోవడానికే
ఈ అపురూప కలయిక...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి