17, మార్చి 2025, సోమవారం
ముందు మాటలు మనుమసిద్ధి సాహిత్య సంస్థ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మనుమసిద్ధి సాహిత్య కవన వేదిక నిర్వహించిన " చెడును చెరిపేద్దాం " కవితల పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా అభినందనలు. పోటి అన్న తర్వాత గెలుపోటములు సహజం. ఓటమి విజయానికి తొలి మెట్టు.
సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలపై కవితా పోటీలు నిర్వహిస్తూ, సమాజాన్ని ఆలోచింపజేస్తున్న వ్యవస్థలు, వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులలో దుప్పటి రమేష్ గారు ముఖ్యులు. అనాదిగా స్త్రీలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై అక్షర పోటానికి తెర తీయడమే కాకుండా, ఆ అక్షర కవనాలను సంకలనంగా తేవాలన్న తలంపుకి, ఈ అక్షర యజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.
అమ్మ కడుపులో పిండంగా రూపు గుద్దుకున్నారు క్షణం నుండి ఆడపిల్ల భయాన్ని వినిపిస్తూ, ఆ భయాన్ని చెరిపేసే అభయ హస్తాన్ని ఇవ్వడమెలాగో చెప్పారు రవి. అమానుషం చేసే మగవాడిపై తన కలాన్ని ఖడ్గంగా ఝుళిపించారు దుర్గా మహాలక్ష్మీ.
ఆడదే ఆధారం ఈ సమస్త సృష్టికి అంటూ, అవమానం జరిగితే అపరకాళిగా మారమంటూ పిలుపునిచ్చారు సీతాలక్ష్మి గారు. మగవాడి మృగత్వాన్ని ఉరి తీసి అణచమంటారు శివకృష్ణప్రసాద్. అమ్మతనం విలువను చెప్తూ, కణాన్ని పిండంగా మార్చి, ఓ బిడ్డకు ఊపిరందించి, పసితనం నుండి లాలించి, పాలించిన మాతృత్వపు గొప్పదనాన్ని గుర్తుజేస్తూ, వారి వరుసలు తప్పిన నీచ నైజాలపై అపర కాళికగా మారక తప్పదని హెచ్చరించిన దాలినాయుడు గారి అక్షర కవనం ఆద్యంతమూ అద్భుతంగా సాగింది. కవితా వస్తువు ఒకటే అయినా రాసిన ప్రతి ఒక్కరి శైలి విభిన్నంగా ఉంది. చక్కని సందేశాత్మక కవితలనందించిన అందరికి అభినందనలు.
ఒకే అంశాన్ని కవితా వస్తువుగా తీసుకుని రాసిన ప్రతి కవితలోని చక్కని సందేశం సమాజానికి చేరాలన్న ఆలోచనతో మన అందరి ముందుకు వస్తున్న ఈ కవితా సంకలనానికి శుభాభినందనలు. ఈ మహా యజ్ఞంలో నాకు నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చిన మనుమసిద్ధి కవి వేదికకు, ఈ మాటలు రాయడానికి కారణమైన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.
మంజు యనమదల
విజయవాడ
వర్గము
ముందు మాటలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి